Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాళేశ్వరం అద్భుత వరం

-భారీ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తిచేయడం కార్యదీక్షకు నిదర్శనం
-మిషన్ భగీరథ పథకం అద్భుతం
-ఇది తెలంగాణ సర్కారుకే సాధ్యం
-15వ ఆర్థిక సంఘం సభ్యుల కితాబు
-మేడిగడ్డ బరాజ్, ఆరో ప్యాకేజీ పనుల పరిశీలన
-అగ్రహారంలోని మిషన్ భగీరథ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటు సందర్శన

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అద్భుతమైన వరమని 15వ ఆర్థికసంఘం సభ్యులు కితాబిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ఒక అద్భుతమైన నిర్మాణమని కొనియాడారు. అతి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద ప్రాజెక్టు పూర్తిచేయడం కార్యదీక్షకు నిదర్శనమని ప్రశంసించారు. మిషన్ భగీరథ పథకం కూడా అద్భుతమని, ఇది తెలంగాణ సర్కారుకే సాధ్యమయిందని అభినందించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 15వ ఆర్థికసంఘం సభ్యులు ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నందిమేడారం వద్ద నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీ పనులను పరిశీలించారు. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారంలోని మిషన్ భగీరథ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటును సందర్శించారు. తొలుత హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు చేరినవారికి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు.

అనంతరం నిర్మాణపనులను వ్యూ పాయింట్ నుంచి చూపిస్తూ వివరించారు. ఫొటో ఎగ్జిబిషన్, ప్రాజెక్టు మ్యాప్ ద్వారా వివరాలు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణపనులు ప్రస్తుతం 80 శాతం పూర్తయ్యాయని, మేడిగడ్డ బరాజ్‌లో 18 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడాల్సి ఉండగా ఇప్పటికి 16 లక్షల క్యూబిక్ మీటర్లు వాడామని, 85 గేట్లకుగాను ఇప్పటికే 20 గేట్లు పూర్తిగా అమర్చినట్లు చెప్పారు. మిగతా పనులను ఏప్రిల్ నెల చివరిలోగా పూర్తిచేసి వచ్చే వ ర్షాకాలం నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా ప్రతి రోజు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం లో 37.08 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కేవలం రెండున్నర సంవత్సరాల కాలంలోనే ప్రాజెక్టును పూర్తిచేయగలిగామని వి వరించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రా జెక్టుకు ఆర్థికసంఘం తోడ్పాటునందించాలని సీఎస్ ఎస్కే జోషి కోరారు. ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడుతూ అతితక్కువ సమయం లో ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరుగడం ఆశ్చర్యంగా ఉన్నదన్నారు. ఇది రాష్ట్ర రైతాంగానికి అద్భుత వరమని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ సహకారముటుందన్నారు. ఈ ప్రాజెక్టు పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఉన్నాయన్నారు.

మత్స్య, టూరిజం అభివృద్ధి
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నందిమేడారం వద్ద నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీ పనులపై ఆర్థికసంఘం సభ్యులు సంతృప్తి వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైన నిర్మాణమని, అతి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద ప్రాజెక్టు పూర్తిచేయడం కార్యదీక్షకు నిదర్శనమని అభినందించారు. సాగునీటితోపాటు మత్స్యరంగం, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతాయని అన్నారు. కాళేశ్వరం ఆరో ప్యాకేజీ పనులను పరిశీలించేందుకు ఆదివారం ప్రత్యేక హెలికాప్టర్‌లో జిల్లాకు వచ్చినవారికి కలెక్టర్ శ్రీదేవసేన స్వాగతం పలికారు. సీఎస్ ఎస్కే జోషి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి ఆర్థికసంఘం సభ్యులు 6వ ప్యాకేజీ అండర్‌టన్నెల్‌లోకి వెళ్లారు. వారికి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కలిగే లాభాలు, ప్రాజెక్టు పనుల తీరును అధికారులు సమగ్రంగా వివరించారు. గోదావరి నదిలో రాష్ర్టానికి ఉన్న కేటాయింపుల నుంచి రోజూ రెండు టీఎంసీల చొప్పున ఏడాదికి 180 టీఎంసీల నీటిని ఎత్తిపోసి, 18.5 లక్షల ఎకరాల నూతన ఆయకట్టు, 18లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించడంతోపాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలు, రాష్ట్ర పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నదని వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రూ.5,046 కోట్ల వ్యయంతో ఆరో ప్యాకేజీ పనులను ప్రారంభించి 95 శాతం వరకు పూర్తిచేశామని, జూన్ నాటికి వంద శాతం పూర్తిచేసేలా పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఆరో ప్యాకేజీలో భాగంగా అప్రోచ్ చానల్ ఎక్స్‌కవేషన్ గ్రావిటీ కాలువల లైనింగ్ పనులు, టన్నెల్ లైనింగ్, సర్జ్‌పూల్ పనులు, డ్రాఫ్ట్ ట్యూబ్స్ పనులు, ట్రాన్స్‌ఫార్మర్లు, డెలివరీ చానళ్ల పను లు పూర్తిచేశామని, కాంక్రీట్ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. జూన్ నాటికి పనులన్నీ పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా మూడు షిప్టుల్లో 24 గంటల పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరు జలాశయం వరకు నీటిని తరలించే లింక్-2 పనుల పురోగతిని కూడా వివరించారు.

నీటి శుద్ధి విధానం భేష్
ప్రజలకు శుద్ధనీటిని అందజేయాలనే మహదాశయంతో రూపొందించిన మిషన్ భగీరథ పథ కం అద్భుతమని ఆర్థిక సంఘం సభ్యులు అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారంలోని మిషన్‌భగీరథ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటును వారు సందర్శించారు. ఆపరేషన్, కంట్రోల్ విభా గం, ఇన్‌టేక్‌వెల్ నుంచి నీరు వచ్చే విధానం, శుద్ధిప్రక్రియల పనితీరును పరిశీలించారు. భగీరథ పనులకు సంబంధించిన ఫొటోలు, మ్యాపులు, ఛాయాచిత్రాలను తిలకించారు. ట్రీట్‌మెంట్ ప్లాంటుకు చేరిన రా వాటర్‌ను శుద్ధిచేసే ప్రక్రియను ఆర్థికసంఘం సభ్యులకు ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి వివరించారు. పథకానికి ఇప్పటివరకు రూ 44,979 కోట్లు వెచ్చించామని, కృష్ణ, గోదావరి నదులతోపాటు ఇతర జలాశయాలను కలిపి 1.30 లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్ ఏర్పాటుచేశామని, 23,968 గ్రామా లు, 118 పట్టణాల్లోని ప్రతీ ఇంటికి నల్లాను ఏర్పాటు చేసి సురక్షిత మంచినీటిని అందిస్తున్నామని వెల్లడించారు.

అగ్రహారం పరిధిలో రూ.1085 కోట్లతో 351 గ్రామాలకు నీరు అందిస్తున్నామన్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా పనులు పూర్తికావడంతోపాటు ట్రయల్న్ చేపట్టామని స్పష్టం చేశారు. అనంతరం 15వ ఆర్థికసంఘం సభ్యులు మాట్లాడుతూ మిషన్‌భగీరథ పథకం అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఇది ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమైయిందని ప్రశంసించారు. పనులు తుదిదశకు చేరుకోవడంపై సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం అగ్రహారం ట్రీట్‌మెంట్ ప్లాంటు ఆవరణలో మొక్కలను నాటారు. ఆదివారం మధ్యాహ్నం హెలికాప్టర్‌లో నంది కమాన్ వద్దకు వచ్చిన ఆర్థికసంఘం సభ్యులకు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ రాహుల్‌హెగ్డే స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి కారులో అగ్రహారంలోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటుకు చేరుకుని పరిశీలించారు. పర్యటన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేయడంతోపాటు కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఆర్థికసంఘం సభ్యులు అరవింద్ మెహతా, రవి కోటా, అంటోని సిరియాక్, రీటాలహరి, అశోక్‌లాహిరి ఈ పర్యటనలో పాల్గొన్నారు. వారివెంట సీఎస్ ఎస్కే జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్, పర్యవేక్షక ఇంజినీర్ ప్రకాశ్‌రావు, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, కార్యనిర్వాహక ఇంజినీర్ సురేశ్ పాల్గొన్నారు.

నేడు ఆర్థికసంఘం చైర్మన్ రాక
-స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ
-రేపు జూబ్లీహాల్‌లో ముఖ్యమంత్రితో సమావేశం
-రాష్ట్రంలో పర్యటించిన ఆర్థికసంఘం సభ్యులు

ఆర్థికసంఘం చైర్మన్ నందకిశోర్‌సింగ్‌తోపాటు సభ్యులు డాక్టర్ అనూప్‌సింగ్, రమేశ్‌చంద్ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. చైర్మన్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌లో ప్రత్యే క సమావేశం జరుగనున్నది. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి నివేదికలు సమర్పిస్తారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చెందిన ప్రజాప్రతినిధులు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, అందవలసిన ఆర్థిక సహకారంపై విజ్ఞాపన పత్రాలను అందజేస్తారు. ఇతర పార్టీల నాయకులు కూడా భేటీ అవుతారు. మంగళవారం ఉదయం ఆర్థికసంఘం సభ్యులు హైదరాబాద్‌లో పర్యటించి ఈ- సేవా కేంద్రాలను సందర్శిస్తారని సమాచారం. మధ్యాహ్నం జూబ్లీహాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్థికసంఘం సమావేశం ఉంటుంది. సీఎం కేసీఆర్ రాష్ట్ర పరిస్థితులను ఆర్థిక సంఘానికి వివరిస్తారు. కేంద్రం నుంచి రాష్ట్రం ఏమి కోరుకుంటుందో సమగ్ర నివేదిక సమర్పిస్తారు. ఆర్థికసంఘం చైర్మన్ ఎన్‌కే సింగ్ సమావేశంలో మాట్లాడుతారు. అనంతరం మీడియా సమావేశం ఉంటుంది. మరోవైపు 15వఆర్థికసంఘం సభ్యులు ఐదుగురు ఆదివారం రాష్ట్రంలో పర్యటించారు. కాళేశ్వరం ప్రాజె క్టు, మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆర్థికసంఘం కార్యదర్శి అరవింద్ మెహతా, సంయుక్త కార్యదర్శి రవి కోటా, సభ్యులు అంటోని సిరియాక్, కందర్ప్ వీ పాటిల్, రీటాలహరి, అశోక్‌లాహిరి తదితరులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, సీఎస్ ఎస్కే జోషి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం వారు క్షేత్రస్థాయి పర్యటన చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.