Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అంగన్‌వాడీలకు వరాలు

-భారీగా వేతనాల పెంపు -కార్యకర్త హోదాను టీచర్‌గా మార్చుతూ జీవో.. అర్హతల మేరకు సూపర్‌వైజర్లుగా పదోన్నతి -డబుల్ ఇండ్లలో టీచర్లకు ప్రాధాన్యం.. టీచర్లు, హెల్పర్లకు బీమా సౌకర్యం -అంగన్‌వాడీల్లో ఇకపై సన్నబియ్యంతో అన్నం -గ్రాముల లెక్కలు వద్దు.. తిన్నంత పెట్టాలి -వేసవిలో లబ్ధిదారుల ఇంటికే పోషకాహారం -మాతా, శిశు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నాం -ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించండి -అంగన్‌వాడీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు -జనహితలో అంగన్‌వాడీ ప్రతినిధులతో ముఖాముఖి -సీఎం నిర్ణయాలపై అంగన్‌వాడీల హర్షాతిరేకాలు

గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్య రక్షణకు కృషిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా భరోసా కల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంగన్‌వాడీలకు ఒక దఫా వేతనాలు పెంచిన సీఎం.. మరోసారి వారికి తీపి కబురు అందించారు. ప్రస్తుతం అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.7వేలు వేతనం అందుతుండగా.. దానిని రూ.10,500కు పెంచారు. హెల్పర్లకు ప్రస్తుతం ఇస్తున్న రూ.4500 వేతనాన్ని రూ.6000కు పెంచారు. వచ్చే ఏడాది మరోసారి వేతనాలు పెంచుతామని కూడా సీఎం హామీ ఇచ్చారు. అంగన్‌వాడీ కార్యకర్తల హోదాను అంగన్‌వాడీ టీచర్లుగా మార్చారు. సీఎం ఆదేశాలతో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి ఎం జగదీశ్వర్ వెంటనే ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేశారు. ఇకపై అంగన్‌వాడీ కార్యకర్తలను అంగన్‌వాడీ టీచర్లుగా పిలుస్తారు. జనహిత కార్యక్రమంలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అంగన్‌వాడీలతో ముఖాముఖి మాట్లాడి.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీచర్లు, హెల్పర్లకు బీమా సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్య రక్షణకు కృషిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం ప్రకటించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నదని, భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తుందని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ విజయవంతంచేసే బాధ్యత అంగన్‌వాడీ టీచర్లు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

                         అంగన్‌వాడీలు      హెల్పర్లు ప్రస్తుత వేతనం         7,000              4500 పెంపుదల                3,500              1500 పెంచిన తర్వాత       10,500             6000

మాతా, శిశు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం తెలంగాణ రాష్ట్రంలో మాతాశిశు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, వారి ఆరోగ్యాన్ని అన్ని విధాలా కాపాడుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. పేద గర్భిణులు ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గర్భిణిగా ఉండి కూడా కుటుంబం గడవడంకోసం కూలి పనులకు వెళ్లడం అత్యంత బాధ కలిగించే విషయం. అందుకే ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత తల్లీ బిడ్డల బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని భావిస్తున్నా. గర్భిణులు, బాలింతలు, శిశువులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్య లక్ష్మి పథకంతో పోషకాహారం, పాలు, గుడ్లు, అందిస్తాం. గర్భిణులు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. తెలంగాణ తల్లులకు జన్మించిన పిల్లలు రేపటి తెలంగాణ సంపద. వారు బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది. అందుకే వారికి మంచిపోషణ కావాలని ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం అమలు చేస్తున్నాం అని సీఎం చెప్పారు.

ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలకు ప్రోత్సాహకం ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. శిశు మరణాలు తగ్గించేందుకు అంతా కలిసి కృషి చేయాలని కోరారు. ప్రైవేటు హాస్పిటళ్లలో కొందరు వైద్యులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని, అవసరం లేనప్పటికీ ఆపరేషన్ చేయడం, గర్భసంచిని తీసివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు ఎక్కువగా వచ్చే ప్రభుత్వ దవాఖానలను అభివృద్ధి చేస్తున్నాం. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవం అయ్యే గర్భిణులకు రూ.12 వేల సాయాన్ని మూడు విడతలుగా అందించాలని నిర్ణయించుకున్నాం. అమ్మాయి పుడితే తెలంగాణ ఆడబిడ్డకు ప్రోత్సాహకంగా మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తాం. ఏప్రిల్ 1 నుంచే ఈ కార్యక్రమం అమలవుతుంది. అప్పుడే పుట్టిన పిల్లలకు కావాల్సిన సామాన్లతో రూ.2వేల వ్యయంతో ఓ కిట్ (ఈ పేరును కేసీఆర్ కిట్‌గా పిలవాలని వినతి వచ్చింది)ను ప్రభుత్వం బహుమానంగా ఇస్తుంది. గర్భిణులుగా ఉండి కూడా పేద మహిళలు కూలి పనికి పోకుండా వారి కూలి డబ్బులను ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించుకున్నందున ఈ పథకం ప్రవేశపెడుతున్నాం. దీన్ని పేద మహిళలు ఉపయోగించుకోవాలి. గర్భిణిగా ఉన్పప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ దవాఖానలోనే ప్రసవం చేయించుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. అందుకోసమే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నది. అంగన్‌వాడీ టీచర్లు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలి అని సీఎం పిలుపునిచ్చారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో సన్నబియ్యంతో అన్నం అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులు, పిల్లల భోజనానికి ఇకపై సన్న బియ్యం ఉపయోగించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మార్చి నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. పిల్లల ఆరోగ్యం విషయంలో రాజీ పడొద్దని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు గతంలో మాదిరిగా గ్రాముల లెక్కన ఆహారం పెట్టవద్దని, తిన్నంత ఆహారం పెట్టాలని ఆదేశించారు. మే నెలలో గర్భిణులు, బాలింతలు, పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాలకు రావడం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక.. ఆ నెల పోషకాహారాన్ని నేరుగా లబ్ధిదారుల ఇండ్లకే పంపుతామని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, సీఎంవో అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి, కార్యదర్శి స్మితా సబర్వాల్, కార్యదర్శి ఎం జగదీశ్వర్, డైరెక్టర్ విజయేంద్ర బోయి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

టీచర్లు, హెల్పర్లకు భారీగా వేతన పెంపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అంగన్‌వాడీ టీచర్ల జీతం రూ.4200, మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, అంగన్‌వాడీల్లో పనిచేస్తున్న హెల్పర్ల జీతం రూ.2,200గా ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 ఫిబ్రవరి 28న సచివాలయంలో సమావేశమైనప్పుడు అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.7000, సహాయకులకు రూ.4,500కు వేతనాలను పెంచారు. ఇప్పుడు తాజాగా అంగన్‌వాడీ టీచర్ల వేతనాలను రూ.10,500కు, సహాయకులకు రూ.6000లకు పెంచారు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి అంగన్‌వాడీ టీచర్ల వేతనాలు 150%, సహాయకుల వేతనాలు 172% పెరిగాయి. సీఎం నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 35,700 కేంద్రాల్లో పనిచేస్తున్న 67,411 మంది అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులకు ప్రయోజనం కలుగనుంది.

సీఎం కేసీఆర్ మనసున్న మారాజు: అంగన్‌వాడీలు వేతన పెంపుదల, ఇతర నిర్ణయాలపై రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. పలుచోట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి అంగన్‌వాడీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మనసున్న మహరాజని అన్నారు. జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటామని చెప్పారు. ఏ ప్రభుత్వాలూ చేయనటువంటి అభివృద్ధి పనులను సీఎం చేస్తున్నారని కొనియాడారు. బంగారు తెలంగాణ సాధనకు తామంతా కృషి చేస్తామని చెప్పారు. మమ్మల్ని పిలిచి మరీ మా సమస్యలు పరిష్కరించారు. దీంతో సీఎం మహిళా పక్షపాతి అని మరోసారి నిరూపితమైంది అని వారు చెప్పారు. మహిళల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆశించిన దానికంటే ఎక్కువనే జాతాలు పెంచారని సంతోషం వ్యక్తం చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.