-భూసేకరణ బిల్లుపై చర్చలో సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివరణ – తెలంగాణ పచ్చబడాలె -భూ నిర్వాసితుల బాధేందో నాకు స్వయంగా తెలుసు -అప్పర్ మానేరులో భూములు పోయి చాలా దెబ్బతిన్నం -2013 చట్టం కంటే ఎక్కువ పరిహారం కోసమే ఈ భూసేకరణ బిల్లు -ఆరేడు రాష్ర్టాలు భూసేకరణ చట్టాలను తీసుకొచ్చాయి -మల్లన్నసాగర్‌లో దీనిని అమలు చేద్దామని కుట్ర పన్నారు -ప్రాజెక్టులను ప్రతిపక్షాలు అడ్డుకున్నా..కట్టి తీరుతాం -2018 జూన్‌లో గోదావరి దుంకాలె… ఉత్తర తెలంగాణ తడువాలె -బిల్లుకు సభ ఆమోదం

దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూసిన తెలంగాణ భూములకు సత్వరం నీళ్లను అందించటం కోసమే భూసేకరణ బిల్లును తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రతిపక్షాలు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోకుండా ముందుకురావాలని… ఒకవేళ రభస చేస్తామని మొండికేసినా కూడా ప్రాజెక్టులను ఆపేది లేదని సీఎం స్పష్టం చేశారు. భూసేకరణ బిల్లు-2016 బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో భాగంగా సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లాడారు. బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
నిర్వాసితులు తమకు నచ్చినప్రాంతంలో స్థిరపడవచ్చు 2013 భూసేకరణ చట్టంలో నిర్వాసితులకు ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) ఇండ్లను ఇయ్యాలని ఉంది. దానికెంత అయితది… లక్ష రూపాయిలు. జాగకు రూ.15-20 వేలు. మొత్తం రూ.1.2 లక్షల వరకు అయితది. మౌలిక వసతులకు మరో రూ.30-40 వేలు కావొచ్చు. కానీ జీవో 123లో మాత్రం డబుల్ బెడ్ రూం ఇల్లును ఎక్కడైనా కట్టుకోవచ్చని చెప్తూ రూ.5.04 లక్షలు ఇస్తున్నం. 2013 చట్టంలో భూమి రిజిస్ట్రేషన్ విలువ కంటే మూడు రెట్లు ఇయ్యాలని ఉంది. కానీ జీవో 123 ద్వారా అంతకంటే 10.75 రెట్లు అధికంగా రూ.6.50 లక్షలు ఇస్తున్నం. ఐఏవై ఇల్లు కట్టియ్యడం వల్ల నిర్వాసితులు తమకు నచ్చిన ప్రాంతానికి వెళ్లకుండా మెడకు గుదిబండ వేసినట్లయితది. అందుకే మేం… నిర్వాసితులు వాళ్ల ఇష్టమున్న దగ్గర ఇల్లు కట్టుకునేటట్లు వెసులుబాటు కల్పించినం.
సర్కార్‌కు సంపూర్ణమైన అధికారముంది
భూసేకరణ బిల్లు-2016ను తీసుకొచ్చేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్-254 ప్రకారం తెలంగాణ ప్రభుత్వానికి సంపూర్ణమైన అధికారం ఉంది. మనమేకాదు… గుజరాత్, రాజస్థాన్‌తో సహా దేశంలోని ఏడెనిమిది రాష్ర్టాలు ఈ మేరకు సవరణలు చేసుకున్నయి.
సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ పచ్చబడాలంటే, భూములకు నీళ్లు లేక వలసబాట పట్టిన రైతుల కష్టాలు ఆగిపోవాలంటే, కొత్తరాష్ట్రం తెలంగాణ అభివృద్ధిలో దూసుకువెళ్లాలంటే… సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధన కోసమే కొత్త భూసేకరణ చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిన అధికారాన్ని ఉపయోగించుకొని ఈ చట్టాన్ని తీసుకొచ్చామని… ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తమవైన చట్టాలను రూపొందించుకున్నాయని గుర్తు చేశారు. కొత్త చట్టం ప్రకారం రైతులకు అత్యంత మెరుగైన పరిహారాన్ని చెల్లించటమేగాక, వారు కోరుకున్న చోట స్థిరపడే విధం గా నిబంధనలను రూపొందించామని వెల్లడించారు.
భూ నిర్వాసితుల బాధ ఏమిటో తనకు, తన కుటుంబానికి స్వయంగా తెలుసునని… నిజాం కాలంలో చేపట్టిన అప్పర్ మానేరు ప్రాజెక్టు కింద తాము భూములను పెద్ద ఎత్తున కోల్పోయామని తెలిపారు. శాసనసభలో బుధవారం మధ్యాహ్నం భూసేకరణ బిల్లు-2016 బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్న తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన… ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలని ఆయా పార్టీలకు సూచించారు. లేనిపక్షంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకొని ముందుకుపోతుందే తప్ప… రైతులకు శాశ్వతంగా సాగునీరు అందించే ప్రాజెక్టులను ఆపే ప్రసక్తే ఉండబోదని హెచ్చరించారు. రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు భూసేకరణ బిల్లు-2016ను సభలో ప్రవేశ పెట్టారు. అనంతరం ఈ అంశంపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.
ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన పలు అంశాలకు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు సంబంధించిన బిల్లును తీసుకువస్తున్నామని, ఇది సవరణ బిల్లు కాదని చెప్పారు. అనంతరం బిల్లుకు అసెంబ్లీ సంపూర్ణ ఆమోదం తెలిపింది. సభ్యుల హర్షధ్వానాల మధ్య అసెంబ్లీ స్పీకర్ మధూసూదనాచారి భూ సేకరణ బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా సీఎం పలు అంశాలపై వివరంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే…
భూసేకరణ బిల్లు-2016ను తీసుకొచ్చేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్-254 ప్రకారం తెలంగాణ ప్రభుత్వానికి సంపూర్ణమైన అధికారం ఉంది. మనమేకాదు… గుజరాత్, రాజస్థాన్‌తోసహా దేశంలోని ఏడెనిమిది రాష్ర్టాలు ఈ మేరకు సవరణలు చేసుకున్నయి. 2013లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూసేకరణ చట్టం-2013ను తాడూబొంగరం లేనోళ్లు రూపొందించినరు. చట్టాన్ని తయారుచేసేవాళ్లు అన్ని పక్షాల, ప్రజల ఇబ్బందులను పరిగణలోనికి తీసుకొని రూపొందించాలి. కానీ నాడు అలా జరుగలేదు. ప్రస్తుతం మేం అన్ని అంశాలను పరిశీలించి బిల్లును తయారుచేశాం. బిల్లుపై రాత్రి 12 గంటల దాకా చర్చిద్దాం. మాకు మందబలం ఉంది కాబట్టి ప్రతిపక్షాలను పట్టించుకోకుండా బుల్డోజ్ చేసుకుంటూ పోతమని చెప్పం. సభలో కావలిసినంతసేపూ చర్చిద్దాం. బిల్లును ఆమోదించుకుందాం.
భూసేకరణ లేకుండా ప్రాజెక్టులను కడుతరా? నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ ప్రాజెక్టులను భూసేకరణ చేయనిదే నిర్మించినరా? ప్రపంచంలో ఎక్కడైనా భూసేకరణ లేకుండా ప్రాజెక్టులు కడుతరా? 35 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు చైనా ప్రభుత్వం నిర్మించిన త్రీ గోర్జెస్ డ్యాం ప్రాజెక్టు వల్ల 12 లక్షల కుటుంబాలు ఆశ్రయాన్ని కోల్పోయాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో నిరాశ్రయులను చేసిన ప్రాజెక్టు ఇది. ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా చేపట్టే ప్రాజెక్టుల కారణంగా కొంతమందికి ఇబ్బందులు తప్పవు. కాకపోతే నిరాశ్రయులైన వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి చెప్పినట్లుగా… ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపం. ఎందుకంటే తెలంగాణ కొత్త రాష్ట్రం. సుదీర్ఘ పోరాటంతో తెచ్చుకున్న రాష్ట్రంలో సత్వరంగా ప్రాజెక్టులు పూర్తి కావాలి.
తెలంగాణ ఉద్యమం జరిగిందే… నిధులు, నీళ్లు, నియామకాల కోసం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ బతుకులు దుబాయి, బొంబాయి, బొగ్గుబాయిగా మారాయి. ఇప్పుడు స్వరాష్ట్రంలో రైతుల బతుకులు బాగుపడాలంటే ప్రాజెక్టులు సత్వరం పూర్తి కావాలె. అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకింత ఆలస్యమైతయని అధికారులను పిలిచి నేను మాట్లాడిన. దీంట్లో తెలిసిందేమిటంటే… డిజైన్లను ఇంజినీర్లు ఓ పట్టాన ఒప్పుకోరు. అంత అయిపోయి, టెండర్లయినంక… సైట్ మీదకు పోతే కొందరు జెండాలు పట్టుకొని భూసేకరణ కాకుండా అడ్డుపడతరు. ధర్నాలు చేస్తరు. అంతా గందరగోళం. ఆ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకునే… ఇరిగేషన్‌కు ఏటా రూ.25 వేల కోట్లు కేటాయించినం. అన్నమో రామచంద్రా అంటున్న రైతులకు నీళ్లియ్యాలనే ఆతృతతో జీవో 123 తీసుకువచ్చినం. చరిత్రలో ఎన్నడూ లేనంత నష్టపరిహారం, 2013 భూసేకరణ చట్టంలో చెప్పినదానికన్నా పది రెట్లు అధికంగా పరిహారాన్ని ఇస్తున్నం. మరి రైతుల మీద మీకు (ప్రతిపక్షాలు) ప్రేముందా? మాకుందా?
భూమిని కోల్పోయిన బాధ నాకు తెలుసు
భూమిని కోల్పోయినోళ్లకు ఎంత బాధ ఉంటదో నాకు తెలుసు. మా కుటుంబం ఆ బాధను అనుభవించింది. అప్పర్ మానేరు డ్యాం కట్టినపుడు వందల ఎకరాల భూమిని కోల్పోయినం. అది నిజాం కాలం. 1943-44లో కట్టిన ఆ ప్రాజెక్టులో భూమిని కోల్పోయినందుకు రూ.1.7 లక్షల పరిహారం ఇచ్చినరు. అబ్దుల్ బారి అనే న్యాయవాదితో హైకోర్టులో మా తండ్రి కేసు వేయిస్తే… రాజు అయినప్పటికీ నిజాం హైకోర్టు ఆదేశాల్ని అమలు చేసినరు. అదనంగా రూ.70 వేలు ఇచ్చినరు. భూమిని కోల్పోవడం వల్ల మేం చాలా దెబ్బతిన్నం.
ఎక్కడైనా ఇల్లు కట్టుకునేలా అవకాశం ప్రాజెక్టులు కట్టినపుడు కొన్ని ఊర్లు పాక్షికంగా, కొన్ని పూర్తిగా మునిగిపోతయి. పండినా, పండకున్నా భూమిని కోల్పోయిన బాధ ఉంటది. కొడుకులు, బిడ్డలు అమెరికాకు, హైదరాబాద్‌కు పోయి సెటిలైనా ఊర్ల కొంత భూమి ఉండాలనుకుంటరు. దానిని పట్టుకొనే కొందరు రైతులు ఉంటరు. భూములు పూర్తిగా మునిగిపోతే ఆ వృద్ధులు టౌన్లకు పోయి ఇండ్లు కట్టుకుంటరు. మా మరదలి కొడుకు సంతోష్‌కుమార్ వాళ్ల భూమి మిడ్ మానేరు ప్రాజెక్టుల పోయింది. వచ్చిన పైసలతోటి ఏం చేస్తవని అడిగితే… కరీంనగర్‌లో రెండు అంతస్తుల ఇండ్లు కట్టి కిరాయిలకిస్తం అని చెప్పినరు.
వాళ్లకు పక్కనే ఉన్న నాంపల్లి గుట్ట దగ్గర 200 గజాల ప్లాటు ఇచ్చినరు. ఏం చేస్తరు? అమ్ముకుంటమని చెప్పినరు. ఇట్ల నిరుపయోగం కావొద్దు. 2013 భూసేకరణ చట్టంలో వజ్రాలు, బంగారం, ప్లాటినం ఏమీ లేవు. నిర్వాసితులకు ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) ఇండ్లను ఇయ్యాలని ఆ చట్టంలో ఉంది. దానికెంత అయితది… లక్ష రూపాయిలు. జాగకు రూ.15-20 వేలు. మొత్తం రూ.1.2 లక్షల వరకు అయితది. మౌలిక వసతులకు మరో రూ.30-40 వేలు కావొచ్చు. కానీ జీవో 123లో మాత్రం డబుల్ బెడ్ రూం ఇల్లును ఎక్కడైనా కట్టుకోవచ్చని చెబుతూ రూ.5.04 లక్షలు ఇస్తున్నం. 2013 చట్టంలో భూమి రిజిస్ట్రేషన్ విలువ కంటే మూడు రెట్లు ఇయ్యాలని ఉంది. కానీ జీవో 123 ద్వారా అంతకంటే 10.75 రెట్లు అధికంగా రూ.6.50 లక్షలు ఇస్తున్నం. ఐఏవై ఇల్లు కట్టియ్యడం వల్ల నిర్వాసితులు తమకు నచ్చిన ప్రాంతానికి వెళ్లకుండా మెడకు గుదిబండ వేసినట్లయితది. అందుకే మేం… నిర్వాసితులు వాళ్ల ఇష్టమున్న దగ్గర ఇల్లు కట్టుకునేటట్లు వెసులుబాటు కల్పించినం. ఇవే విషయాల్ని హైకోర్టులో ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో చెప్పినం. ప్రజలకు, రైతులకు ఎట్ల మేలు చేయాలని ప్రభుత్వం చూస్తది. నిన్న ఇదే సభలో రూ.4 వేల కోట్ల ఇండ్ల రుణాలు మాఫీ చేసినం. అది ప్రజల కోసమే కదా.
ఇతర రాష్ట్రాలలోనుఇదే విధంగా చట్టం కొన్ని రాజకీయ పార్టీలు ప్రాజెక్టును ఎట్ల ఆపాలా అని చూస్తున్నయి. కాలికి, మెడకి వేసి… హైకోర్టులో, గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేసి రాక్షసానందం పొందుతున్నయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ప్రతిపక్షాలు ఇచ్చే కంట్రిబ్యూషన్ ఇదీ. భూములకు నీళ్లు లేక వలసలు పోయే రైతులకు నీళ్లిద్దామని చూస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నరు? ఇన్ని వివాదాలా? ఈ పార్టీల వైఖరి చూసే మేం కేంద్రాన్ని సంప్రదించినం. 2013 చట్టాన్ని చాలా బాధ్యతారాహిత్యంగా చేసిండ్రని కేంద్రంలోని వారే చెప్పినరు. అందుకే ప్రధానమంత్రిని ఏం చేయాలని అడిగినపుడు… రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు వంటి ఆరేడు రాష్ట్రాలు ప్రత్యేకంగా చట్టాలు చేసుకున్నయి… భూమి రాష్ట్ర పరిధిలోని అంశమైనందున మీరు కూడా చట్టం చేసుకోండి… మేం సానుకూలంగా ఉంటమని చెప్పినరు. అందుకే మన అధికారులను కూర్చోబెట్టి న్యాయపరమైన అంశాలన్నీ పరిశీలించిన తర్వాతే ఈ బిల్లును రూపొందించినం.
రైతుల నష్టానికి మీరే బాధ్యులు నా నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద ఉండే వేములఘాట్, మల్లన్నసాగర్‌లో ప్రతిపక్షాలు సృష్టించిన రభస అంతా ఇంతా కాదు. రచనారెడ్డి అనే ఒక అడ్వకేట్ ఉన్నరు. కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిల్ల బ్యారేజీ దగ్గర భూములు పోతున్న రైతుల దగ్గరికి కూడా ఇదే ముఠా పోతున్నది. అక్కడి గోలివాడగానీ, పాములపర్తిగానీ, మల్లన్నసాగర్‌గానీ ఇవే పార్టీలు, ఈ అడ్వకేట్లే పోయి రైతులకు పచ్చి అబద్ధాలు చెప్తున్నరు. 2013 చట్టంతో ఏదో వస్తది అంటూ మభ్యపెడుతున్నరు. పాములపర్తి రిజర్వాయర్ కింద తానేదార్‌పల్లి, మామిడ్యాల, బహిలంపూర్ గ్రామాలు మునుగుతున్నయి. అక్కడ భూసేకరణకు నోటీసు ఇచ్చినం. 2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేపడుతున్నం. కానీ జీవో 123 కిందనైతే రైతులకు ఎక్కువ పరిహారం వచ్చేది. మరి ఇప్పుడు ఆ రైతులు నష్టపోవాల్సి వస్తది. దానికి ఎవరు బాధ్యత వహిస్తరు? నష్టపోతున్న రైతులకు ఈ రాజకీయ పార్టీలు, ఈ అడ్వకేట్లు ఏం చెప్తరు? వీళ్లే బదనాం మోయాలి. ఎవరి శ్రేయస్సు కోరి ఇదంత చేస్తున్నరు?
హెలికాప్టర్లతో తిరిగి అధ్యయనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిలో 950 టీఎంసీల నీటిని కేటాయించినరు. అందుల కనాకష్టంగా 30-35 శాతం కంటే ఎక్కువ వాడుకుంటలేం. దీనిపై ఎనిమిది, తొమ్మిది నెలలు సమగ్రంగా అధ్యయనం చేసినం. ఉద్యమంలో మాకు గైడెన్స్ ఇచ్చిన రిటైర్డ్ ఇంజినీర్లు శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులు 20-25 మందిని మూడు హెలికాప్టర్లు ఇచ్చి అధ్యయనం చేయమంటే వాళ్లు కష్టపడి 10-15 రోజులు స్టడీ చేసినరు. సర్వీసులో ఉన్న ఇంజినీర్లతో కూడ అధ్యయనం చేయించినం. అనంతరం… పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకునే విధంగ డిజైన్ చేసినరు. ఆ డిజైన్ ప్రకారం 64 గ్రామాలు ముంపునకు గురవుతయి. బాధాకరమేందంటే… సమైక్య రాష్ట్రంలో మనం మంత్రులుగ ఉన్నా కూడా మౌనంగ ఉండాల్సి వచ్చింది. జూరాలకు కేటాయింపు 17-18 టీఎంసీలైతే, దాని సామర్థ్యం పదకొండు టీఎంసీలు. పూడిక తర్వాత దాని లైవ్ స్టోరేజీ 8.5 టీఎంసీలైతే వాడుకునేందుకు గ్రావిటీగానీ, లిఫ్టు ద్వారాగానీ గుంజుకునేది ఆరున్నర, ఏడు టీఎంసీలే. ఇప్పటికే జూరాలకు ఒకవైపు నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు లింకు పెట్టినరు.
జూరాల కింద 1.10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మంచినీళ్ల ప్రాజెక్టులు కూడా దానికే. అందుకే మనం జాగ్రత్తలు తీసుకోకపోతే… భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల రైతులు కొడవళ్లు పట్టుకొని కొట్టుకునే ప్రమాదమొచ్చేది. సమైక్య పాలకుల పాపాల కారణంగా మనకు సరిపోను ప్రాజెక్టులు లేవు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 4.63 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంటే ఒక్క రిజర్వాయర్ ఉందా? ఆ రోజుల్లో మంత్రులుగ ఉన్నవాళ్లు కూడా ఎందుకు మౌనంగా ఉన్నరో తెల్వదు. అప్పట్లో ఏ రావు, రెడ్డి మాటలు సాగలె. మనమేం చెప్పినా సమైక్య పాలకులు వినలె. నేను నిలబడ్డ చోటనే ఇంత పొడవున్న కిరణ్‌కుమార్‌రెడ్డి నిలబడి… ఎక్కువ, తక్కువ మాట్లాడితె మీకు నయాపైస ఇయ్యం ఏం చేస్కుంటరో చేసుకోండని అహంకారపూరితంగ మాట్లాడినరు. అయినా ఏం చేసినం? అందుకే ఇప్పుడు కట్టుకోవాలి.
ఆ డబ్బు వృథా కావొద్దనే… మంచికో చెడుకో వైఎస్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు మొదలుపెట్టినరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చూస్తే రూ.8 వేల కోట్లు ఖర్చు చేసి సొరంగాలు, కాల్వలు తవ్వి పెట్టినరు. ఆ పైసలు వృథా కావొద్దని కొత్త ప్రతిపాదన కోసం చూసినం. వాటర్ సోర్స్‌ను తమ్మిడిహట్టి నుంచి బ్రహ్మాండంగా నీటి లభ్యత ఉన్న మేడిగడ్డకు మార్చినం. మాకు తెలివిలేక మార్చినమా? దూరదృష్టితోనే ఈ నిర్ణయం తీసుకున్నం. ఎస్సారెస్పీ దాటిన తర్వాత గోదావరిలో మంచి నీటి లభ్యత ఉన్నదంటే అది ప్రాణహిత, ఇంద్రావతి కలిసిన తర్వాతనే. ఈ రెండు దాటిన తర్వాత కింద శబరి తప్ప అంత లభ్యత ఉన్నవి లేవు. సుమారు 3200 టీఎంసీల నీటి లభ్యత. దేవాదుల నీటి లభ్యత కోసం కూడా బ్యారేజీ కడుతున్నం. ఎందుకంటే… తర్వాత తరం వాళ్లయినా ఇంద్రావతి నీళ్లు వాడుకుంటరు. అవన్నీ చూసి సైట్‌ను నిర్ణయిస్తే దానిపై పీటముడి. సమస్యల్ని అధిగమించేందుకు జీవో 123ను తెస్తే దానిపై కోర్టులో సవాల్ చేస్తరు. ప్రజల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రయత్నిస్తరు.
ఉభయ గోదావరి జిల్లాల్లా వరంగల్, కరీంనగర్ ఎంతో కష్టపడి, నష్టపడి తెలంగాణను తెచ్చుకున్నం. తెలంగాణ రాష్ట్రం పచ్చబడాలంటే ప్రాజెక్టులు సత్వరం పూర్తి కావాలె. ఇప్పటికైనా ప్రతిపక్షాలు వైఖరి మార్చుకోవాలె. లేదంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకుంటది. కానీ రభస చేస్తం… అడ్డుకుని తీరుతమంటే ప్రాజెక్టులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపం. ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతం. 2017 డిసెంబరు నాటికి కాళేశ్వరం పూర్తి కావాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నం. నాలుగైదు నెలలు అటు ఇటు అయినా… 2018 జూన్‌కు గోదావరి జలాలు దుంకాల్సిందే… ఉత్తర తెలంగాణ తడిసి… వరంగల్, కరీంనగర్ జిల్లాలు రెండు పంటలు పండించుకొని ఉభయ గోదావరి జిల్లాల లెక్క మారాల్సిందే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
మల్లన్నసాగర్‌తో బహుముఖ ప్రయోజనం
పాత మెదక్ జిల్లాకు నీళ్లు లేవు. ఉన్న ఘన్‌పూర్ ఎండిపోయింది. మరి మెదక్‌కు నీళ్లు రావాలన్నా, గత ఏడాది ఎండిపోయిన నిజాంసాగర్, ఎస్సారెస్పీకి నీళ్లు రావాలన్నా, హైదరాబాద్ తాగునీళ్ల కోసం శామీర్‌పేట దగ్గర 20 టీఎంసీల రిజర్వాయర్‌కు నీళ్లు కావాలన్నా, ఇప్పుడు మూడు జిల్లాలు… మెదక్, సిద్దిపేట, సంగారెడ్డితో పాటు అన్నమో రామచంద్రా అంటున్న దుబ్బాక, స్టేషన్ ఘన్‌పూర్, చేర్యాల, ఆలేరు, భువనగిరి ఇలాంటి ఎన్నో ప్రాంతాలకు నీళ్లు రావాలన్నా మల్లన్నసాగర్ ద్వారానే సాధ్యమయితది. మంచి హైలెవల్ పాయింట్‌లో ఉన్నది. అందుకే ఇంజినీర్లు 50 టీఎంసీల సామర్థ్యంతో దానిని ప్రతిపాదించినరు.
గోదావరిజలాల్ని సద్వినియోగం చేసుకునేందుకు నిపుణులతో పరిశోధనలు చేయించి మేం సైట్ సెలక్ట్ చేసినం. డీపీఆర్ లేదంటరు… అసలు డీపీఆర్ లేకుండ ప్రాజెక్టు కడతరా? టెండర్లు పిలుస్తరా? మల్లన్నసాగర్ రిజర్వాయర్ కడితే మా ఇంట్లకు నీళ్లు రావు. కేసీఆర్ ఒక్కడే 50 టీఎంసీల నీళ్లు తాగడు. మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ మీద హల్దీ వాగులోకి నీళ్లు పోస్తే నయా పైసా ఖర్చు లేకుండ ఎస్సారెస్పీకి నీళ్లు పోతయి. మల్లన్నసాగర్ వల్ల బహుముఖంగా లాభముందని ప్రతిపాదించినం. అయినా దానిని అడ్డుకోవాలని చూస్తరు. ఇది ధర్మమా?
ఆ ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవాలని రెవెన్యూ, ఇరిగేషన్ కార్యదర్శులతో ఒకరోజు సమావేశమైన. అసలు మన ప్రాజెక్టులు కట్టాలంటే ఎంతయితదో చెప్పమంటే.. రూ.1.3 లక్షల కోట్ల నుంచి 1.4 లక్షల కోట్ల వరకు అవుతుందని చెప్పినరు. తెలంగాణ ప్రజలు కలలుగన్న కాళేశ్వరం పథకం వస్తే పాత ఐదు జిల్లాలున్న ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయితది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వస్తే మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి సస్యశ్యామలం అయితయి.
మిషన్ భగీరథ ద్వారా 60-70 టీఎంసీల మంచినీళ్లు వస్తయి. ఇవన్నీ వస్తే సాగు, తాగునీటికి శాశ్వత పరిష్కారం దొరుకుతదని అనుకున్నం. మరి ప్రాజెక్టులకు ఇంత ఖర్చు పెడుతున్నపుడు భూసేకరణకు రూ.10-14 వేల కోట్లు పోతే పోనీయండి… ఇబ్బంది లేకుండా రైతులకు నష్టపరిహారం ఇయ్యండని చెప్పినం. ఆ బాధ్యత మా మీద ఉంది. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఏ ప్రాజెక్టులో ఇయ్యని విధంగా రైతులకు నష్టపరిహారం ఇస్తున్నం. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన తపాసుపల్లి రిజర్వాయర్… కుడివైపు రాజీవ్ రహదారి ఉంటే, ఎడమ వైపు మల్లన్నసాగర్ ప్రాంతం ఉంటది. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రిజర్వాయర్‌లో భూమిని కోల్పోయిన వారికి రూ.80 వేల నుంచి లక్ష రూపాయలే ఇచ్చింది. ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నియోజకవర్గంలోని కొడినాల దగ్గర పైప్‌లైన్ కోసం సేకరించిన భూమికి ఎంత పరిహారం ఇచ్చినరు? కానీ మీరిచ్చిన దాని కంటే మేం ఆరున్నర రెట్లు ఎక్కువ ఇస్తున్నం.
అపోహలు వద్దు భూసేకరణ బిల్లు-2016 అనేది రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడానికి కాదు. ఇది ఒక చట్టం. సమస్యల్ని అధిగమించి… ఇకముందు కోర్టులు, ట్రిబ్యునల్స్ అడ్డు చెప్పకుండా ఉండేందుకు ఒక ఫ్రేం వర్క్‌తో, న్యాయపరమైన అంశాలు చూసుకున్న తర్వాత రూపొందించినది. దీనిపై అపోహలు వద్దు. ఇది శాశ్వతంగా ప్రజలకు, రైతులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో, రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షతో రూపొందించినది. 2013 చట్టంలోని కొన్ని సెక్షన్లు అభివృద్ధి నిరోధంగా ఉన్నాయి. వాటిని తొలగిస్తూ కొత్త బిల్లును తీసుకొచ్చాం. రాజ్యాంగబద్ధంగానే భూ సేకరణ బిల్లును తీసుకువస్తున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం, రాష్ట్రపతి అనుమతి తీసుకుంటాం. అప్పడే ఆ చట్టం వర్తిస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.