Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆకుపచ్చ తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ పిలుపు

– ఆకుపచ్చ తెలంగాణ కోసం రాజకీయాలకతీతంగా రండి…… – భవిష్యత్తు తరాలకు బతుకగలిగే అవకాశాన్ని వారసత్వంగా ఇద్దాం – పల్చబడ్డ అడవులు చిగురిస్తేనే కోతులు వాపసు పోతాయి – ప్రతి నియోజకవర్గంలో ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయండి – దివంగత బంధువుల పేరిట మొక్కలు పెంచే అవకాశమివ్వండి – సీఎం కన్నా సర్పంచులు పూనుకుంటే అద్భుతమైన ఫలితాలు – లక్ష మొక్కల్లో సగం బతికినా గ్రామాల్లో అద్భుతమైన పచ్చదనం – రెండున్నర ఏండ్లలోనే 47.98 కోట్ల మొక్కలు నాటాం – ట్యాంకర్లతో నీళ్లు పోసి రక్షిస్తున్నాం – త్వరలో స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం – తెలంగాణకు హరితహారంపై శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాలకు ఆస్తిపాస్తులను కాకుండా బతికే అవకాశాన్ని అందించాలని కోరారు. విధ్వంసంనుంచి పునర్నిర్మాణం దిశగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నాన్ని ప్రభుత్వం చేపట్టిందని,ఈ యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని కేసీఆర్ శాసనసభ వేదికగా ప్రజలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు.

kcr

తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు వైతాళికులు కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద మానవ ప్రయత్నంలో రాజకీయాలకు అతీతంగా అంతా భుజం కలుపాలని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు ఇలా ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పంచుకోవాలని అన్నారు. ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరి పాత్రా ముఖ్యమేనని చెప్పిన కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి కన్నా గ్రామ సర్పంచు పూనుకుంటే ఇలాంటి కార్యక్రమాన్ని అద్భుతంగా చేయగలుగుతారని అభిప్రాయపడ్డారు. సమైక్యపాలనలో అడవుల ప్రాధాన్యాన్ని విస్మరించటంతో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్షపాతం కనిష్ఠస్థాయి దిగువకు పడిపోతున్నదని అన్నారు.

విచక్షణారహితంగా వనాలను విధ్వంసం చేసిన కారణంగా కోల్పోయిన పచ్చదనాన్ని తిరిగి తీసుకురావాలని, భవిష్యత్తు తరాలకు ఆస్తిపాస్తుల కన్నా ముందుగా బతుకగలిగే అవకాశాన్ని వారసత్వంగా అందించాలని కోరారు. ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలోనూ స్మృతి వనాలు ఏర్పాటు చేయాలని, అందులో దివంగతులైన బంధువుల పేరిట మొక్కలు పెంచుకునే అవకాశాన్ని ప్రజలకు ఇవ్వాలని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో 30 శాతం అడవుల పెంపకం లక్ష్యంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద మానవ ప్రయత్నాన్ని ప్రభుత్వం చేపట్టిందని, దీనికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, సంస్థలు కలిసి రావాలని కేసీఆర్ చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంపై మరిన్ని సూచనలు, సలహాలను స్వీకరించడానికి శాసనసభ సమావేశాలు ముగిసేలోపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకుందామని అన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై గురువారం శాసనసభలో జరిగిన స్వల్పకాల చర్చలో ముఖ్యమంత్రి ఉద్వేగభరింతంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఇది స్వయం విధ్వంసం..

మనిషి వైజ్ఞానికంగా ఎంత ప్రగతిని సాధించినా, ప్రకృతి ధర్మానికి అతీతంగా జీవించడం అసాధ్యం. ఈ సత్యం మరిచి తన మనుగడకు ఆధారమైన ప్రకృతిని తానే నాశనం చేస్తున్నాడు. ఫలితంగా భూకంపాలు, జలప్రళయాలు, తీవ్ర ఉష్ణోగ్రతలు సంభవిస్తున్నాయి. ఈ దుష్పరిణామాలను అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు గుర్తిస్తున్నాయి. ైక్లెమెట్ రియాలిటీ ప్రాజెక్ట్‌అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా చేసిన సర్వే ప్రకారం.. భూమిమీద ప్రతి మనిషికి సగటున 422 చెట్లున్నాయి. మనదేశంలో 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. మన రాష్ట్రంలో 26,903 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీభూమి ఉంది. ఒకప్పుడు ఇందులో 25శాతం దట్టమైన అడవి. ఇప్పు డు 1.06 శాతం మాత్రమే దట్టమైన అడవి మిగిలింది. ఇదీ మన పరిస్థితి..

గత 34 ఏండ్లలో తెలంగాణలో నాటిన మొక్కల సంఖ్య 35.3 కోట్లు . ఇదే సమయంలో 2.94 లక్షల హెక్టార్ల అటవీ భూమి అన్యాక్రాంతమైంది. ఈ పరిణామం వల్ల ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలోని కొంత ప్రాంతం మినహా మిగతా తెలంగాణ అంతటా ప్రతి ఏటా తీవ్ర వర్షాభావం నెలకొంటున్నది. అడవి ఎక్కువగా ఉన్న భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్ తదితర జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం ఉన్నది. మిగిలిన జిల్లాల్లో సగటుకంటే కనిష్ఠంగా ఉంటున్నది. పదిశాతం కూడా అడవి లేని కరీంనగర్, గద్వాల, హైదరాబాద్, జనగామ, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, సూర్యపేట, యాదాద్రి, వనపర్తి, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్, నల్లగొండ, జిల్లాల్లో పరిస్థితి విషమంగా ఉంది. రానున్న రోజుల్లో ఈ జిల్లాల్లో ఎడారి వాతావరణం ఏర్పడే ముప్పు పొంచి ఉంది. మరోవైపు విచక్షణారహితంగా వనాలను విధ్వంసం చేయడంతో అడవే ఆవాసంగా బతికే జంతుజాలం జనావాసాలపై పడుతున్నాయి. ఇవాళ వ్యవసాయ రంగాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో కోతుల బెడద ఒకటి. పూర్తిగా ఇది మానవ తప్పిదమే. ఈ నేపథ్యాన్నంతా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తెలంగాణకు హరితహారం అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈకార్యక్రమాన్ని యాంత్రికంగా జరిగే ప్రభుత్వ కార్యక్రమం వలె కాకుండా ప్రజా ఉద్యమంగా చేపట్టాం. వానలు వాపసు రావాలి……కోతులు వాపసు పోవాలి అని ఇచ్చిన నినాదం జనసామాన్యం గుండెలను తాకి అబాలగోపాలం ఉత్సాహంతో మొక్కలు నాటారు.

విధ్వంసం నుంచి పునరుద్ధరణ దిశగా.. పచ్చదనాన్ని పెంచేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన గొప్ప ప్రయత్నాల్లో తెలంగాణకు హరితహారం మూడవ అతిపెద్ద మానవ ప్రయత్నం. మొదటి ప్రయత్నం చైనాలో గోబీ ఎడారి విస్తరణ నిలిపేందుకు 4.500 కిలోమీటర్ల గ్రీన్ వాల్ ఆఫ్ చైనాను నిర్మించారు. రెండవది బ్రెజిల్ అమెజాన్ నదీతీరంలో వన్ బిలియన్ ట్రీస్ ఫర్ అమెజాన్ కింద వంద కోట్ల మొక్కలు నాటారు. ఈ రెండింటినీ మించిన ప్రయత్నం తెలంగాణలో చేస్తున్నాం. రాష్ట్రంలో పచ్చదనాన్ని 33శాతానికి పెంచటం కోసం 230కోట్ల మొక్కలను నాటుతున్నాం. 2015 జులై 3న ప్రారంభించి మొదటి ఏడాది 15.86కోట్ల మొక్కలు, ఈ ఏడాది 31.67కోట్ల మొక్కలు నాటాం. వచ్చే ఏడాది మరో 40కోట్ల మొక్కలను నాటే ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి గ్రామంలో సగటున 40వేల మొక్కలు, శాసన సభ నియోజకవర్గంలో 40లక్షల మొక్కలను నాటే కార్యక్రమం అమలవుతున్నది. కల్లుగీత వృత్తిని కాపాడేందుకు 5 కోట్ల ఈత మొక్కలను చెరువు గట్లమీద నాటే కార్యక్రమం కొనసాగుతున్నది. నాటిన మొక్కలకు రక్షించడానికి 34.200 ట్యాంకర్లతో నీరు పోస్తున్నాం.

cm

 

 

అటవీశాఖ బలోపేతం… స్వరాష్ట్రం ఏర్పాటుకు ముందు 15సంవత్సరాల్లో 35కోట్ల మొక్కలు నాటితే.. గత రెండున్నర ఏండ్లలోనే 47.98కోట్ల మొక్కలను నాటాం. 4వేల నర్సరీలను అభివృద్ధి చేశాం. అటవీశాఖను పునర్వ్యవస్థీకరించాం. 28జిల్లా అటవీ అధికారులను నియమించాం. 28ఫారెస్ట్ డివిజన్‌లను 37కు పెంచాం. 106 రేంజ్‌లను 185కు పెంచాం. 469సెక్షన్ ఆఫీస్‌లను 831కి, బీట్ల సంఖ్య 1428నుంచి 3132కు పెంచాం. 2058పోస్టులు భర్తీ చేస్తున్నాం. 67రేంజ్ ఆఫీసర్‌లు, 90సెక్షన్ ఆఫీసర్‌లు, 1857బీట్ ఆఫీసర్ పోస్టులతో పాటు 44ఇతర పోస్టులను మంజూరు చేశాం.అడవిలో గస్తీ తిరిగేందుకు 2,143వాహనాలు కొత్తగా సమకూర్చాం . హరితహారంలో ఉత్సాహంగా పాల్గొంటున్న వారికి 38 అవార్డులు ఇచ్చాం. ఉత్తమ నియోజకవకర్గంగా పెద్దపల్లి ఎంపికైంది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని అభినందిస్తున్నాను. ఉత్తమ మున్సిపాలిటీగా సిద్దిపేట, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా అవార్డు తీసుకున్నారు. గట్టు మండలం అలూరు సర్పంచు అంజమ్మకు అవార్డు ఇచ్చాం. ఆమెకుఅభినందనలు .

ఆర్‌ఓఎఫ్‌ఆర్ అంటే సర్వహక్కులు కావు అడవిమీద ఆధారపడి జీవించే ప్రజలకుండే ఆర్‌ఓఎఫ్‌ఆర్ హక్కుకు సంబంధించి కొంత స్పష్టతను ఇవ్వదలుచుకున్నాను. ఆర్‌వోఎఫ్‌ఆర్ కిందఇచ్చిన భూముల్లో ఏమైనా చేసుకోవచ్చనే భావనలో కొందరున్నారు. కొన్ని పార్టీలు వివాదాలు చేస్తున్నాయి. ఆర్‌వోఎఫ్‌ఆర్ ఇచ్చింది కేవలం ఆ భూమిపై వచ్చే ఫలసాయాన్ని అనుభవించడానికి మాత్రమే. సిమెంట్ నిర్మాణాలు చేస్తామనడం.. ఆ భూమి మాదే అనడం సరికాదు. అటవీప్రాంత వాసులు అటవీ ఉత్పత్తులను సేకరించుకుని జీవనం గడిపే హక్కు తప్ప, అడవిని చదును చేసే హక్కు కాదు. ఇది అటవీ భూమి మీద హక్కుగా పొరబడవద్దని ఈ సభ ద్వారా కోరుతున్నాను.

సామాజిక ఉద్యమంగా సాగాలి.. మొక్కల పెంపకం సామాజిక ఉద్యమంలాగా సాగాలి. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు నర్సరీలను సందర్శించాలి. అటవీ శాఖ అధికారులను పిలిపించుకొని ప్రణాళిక సిద్ధం చేయాలి. ఎమ్మెల్యే నిధుల్లో కొంత ఇస్తామని చెప్పండి. వారంతా సంతోష పడుతారు. మనకు మంచి పీసీసీఎఫ్ ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో బీఆర్ మీనా ఉన్నారు. నా కార్యాలయంలో భూపాల్ రెడ్డి రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి, మరొకరు ప్రియాంక వర్గీస్. మీకు 24 గంటలు అందుబాటులో ఉంటారు.

సర్పంచులు తులచుకుంటే … సర్పంచు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు మెంబర్లు తలుచుకుంటే గ్రామాన్ని పచ్చగా చేయగలుగుతరు. సీఎం కంటే సర్పంచులే ఎక్కువగా చేయగలుగుతరు. ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటాలి. ఒక్కో గ్రామం లో లక్ష మొక్కలు కూడానాటొచ్చు. 50 శాతం బతికినా అద్భుతమైన పచ్చదనంగా మారుతుంది. జవదేకర్‌గారికి కృతజ్ఞతలు. కంపా నిధులు విడుదల చేశారు. రాష్ట్రంలో 18.40కోట్ల మొక్కలకు జియో ట్యాగింగ్ పూర్తి చేశాం. HTTP://TGFMIS.COM వెబ్ సైట్‌లో వివరాలు చూసుకొవచ్చు.

అఖిలపక్ష సమావేశం… శాసనసభాపతికి నాదొక విన్నపం. ఈ సమావేశాలు ముగిసేలోగా మీ సమక్షంలో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి. అందరి సలహాలు స్వీకరిస్తాం. (ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని స్పీకర్ సభలో ప్రకటించారు.) సాయిరెడ్డిని స్పూర్తిగా తీసుకోవాలి..

నిజామాబాద్ జిల్లాలో ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి హరితహారం కన్నా ముందే పాఠశాలను అడవిలాగా మార్చారు. ఈ సభ ద్వారా ఆయనకు చేతులెత్తి అభివాదం చేస్తున్నాను. ఆయనను స్పూర్తిగా తీసుకుని మిగిలిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు నడవాలి. రేపటి తరానికి ఆస్తి, కల్చర్ ట్రాన్‌ఫర్ చేస్తాం. అదే సమయంలో బతకడానికి అవకాశాలను కూడా మనమే ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంది. చైనా దేశం బీజింగ్‌లో చలి ఎక్కువ. చెట్లు బతకడం కష్టం. అక్కడ మొక్కలకు కవర్లు, నాలుగు కర్రలు పెట్టి వాటిని పెంచుతున్నారు. మన దగ్గర కిరణజన్య సంయోగ క్రియ ఎక్కువ, సోలార్ ఇన్‌డెంట్ అద్భుతంగా ఉంటది. నోట్ల రద్దు వల్ల మంచే జరుగుతుంది..

మొరార్జీ దేశాయ్ బొంబాయి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఒకటి రెండు ప్రమాదాల్లో ప్రజలు చనిపోతే క్యూ లైన్ విధానాన్ని తీసుకొచ్చారు. వ్యతిరేకించిన వారిని జైల్లో పెట్టించారు. అప్పట్లో వ్యతిరేకత వచ్చింది.. ఇపుడు ఆయనను తలుచుకుంటున్నారు. ఇలానే నోట్ల రద్దు ఉంటుంది. మంచి ఫలితాలు వస్తాయని ప్రధానమంత్రి చెప్తున్నారు. చూద్దాం. స్మృతి వనాలు ఏర్పాటు చేయండి..

ఎమ్మెల్యేలు తమ నియోజవర్గానికి కనీసం ఒకటైనా స్మృతి వనం ఏర్పాటు చేయండి. చనిపోయిన వారి పేరిట మొక్కలు పెంచి వారిని స్మరించే అవకాశం కల్పించండి..మన సంప్రదాయం ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి పేరు మీదుగా ప్రతి సంవత్సరం బియ్యం ఇస్తాం. గుర్తు చేసుకుంటాం. ఇప్పుడు ఆ కుటుంబాల వారు వారి జ్ఞాపకార్ధం కొంత డబ్బు ఇస్తే స్మృతివనాల్లో ఒక మొక్కను నాటుదాం. చనిపోయిన వారి పేరును ఆ మొక్కకు పెడుదాం. బియ్యం ఇచ్చే రోజు ఆ కుటుంబం వారు వచ్చి ఆ చెట్టు కింద కూర్చోని తమ వారిని స్మరించుకుంటారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.