Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఒక నది.. అనేక కుట్రలు!

కృష్ణా నది దేశంలోని నాలుగో అతి పెద్ద నది. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద పశ్చిమ కనుమలలో మొదలై, తర్వాత కర్ణాటక, తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్‌ మీదుగా 1400 కిలోమీటర్లు ప్రయాణించి చివరిగా హంసలదీవివద్ద సముద్రంలో కలుస్తుంది. దాదాపు 2,58, 948 చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతం ఉండగా అందులో తెలంగాణలో 58,004 (70%) చదరపు కిలోమీటర్లు కాగా, ఆంధ్రప్రదేశ్‌ పరీవాహక ప్రాంతం 24,832 (30%) చదరపు కిలోమీటర్లు మాత్రమే. నాలుగు రాష్ర్టాలలోని అన్ని ప్రాజెక్టుల్లో కలిపి 1054 టీఎంసీ నీటి నిల్వ ఉంది. కృష్ణ్ణా నది ప్రధాన ఉపనదులలో భీమా, డిండి, పాలేరు, మున్నేరు ప్రధానంగా తెలంగాణ నుంచి కలుస్తాయి. తుంగభద్ర కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలలో ప్రవహిస్తుంది.
ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నది జలాల వాడకంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం

 1. అంతర్జాతీయ నది పరీవాహక చట్టాలు, కె.జి. కమిషన్‌ ఆధారంగా నది పరీవాహక ప్రాంతం అవసరాలు తీరడం మొదటి హక్కు. వాటి అవసరాలు తీరిన తర్వాతే ఇతర ప్రాంతాలకు ఇవ్వవచ్చు. దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణా నది పరీవాహక ప్రాంతమైన ఉమ్మడి మహబూనగర్‌, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌లోని కొంత ప్రాంతం, ఇటు కృష్ణా డెల్టా ప్రధాన హక్కుదారులు. రాయలసీమలోని చాల కొద్ది భూభాగమే కృష్ణా పరీవాహకప్రాంతం.
 2. బచావత్‌ ట్రిబ్యునల్‌, బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు 811 టీఎంసీ కేటాయిస్తే, పరీవాహక ప్రాంత శాతం ప్రకారం 559 టీఎంసీల నీటికి తెలంగాణ హక్కుదారు. కానీ గత 75 ఏండ్లలో ఎప్పుడూ కృష్ణా నదిలో కనీసం 20 శాతాన్ని కూడా ఉపయోగించుకోలేదు.
 3. తెలంగాణను ఆంధ్రతో బలవంతంగా కలపటానికి కారణం కూడా ఈ నదుల మీద పెత్తనం కోసం చేసిన రాజకీయ కుయుక్తి. కానీ అప్పటి తెలంగాణ నాయకత్వం అంచనా వేయడంలో విఫలం అయింది. ఫలితం ఎగువన ఏలేశ్వరంలో నిర్మించవలసిన నాగార్జున సాగర్‌ ప్రాజెక్టును దిగువన నిర్మించి తెలంగాణకు శాశ్వత నష్టం కలగచేసారు.
 4. రాజోలి బండ డైవర్షన్‌ స్కీం: తుంగభద్ర మీద కట్టిన ఆనకట్ట కుడివైపు రాయలసీమ, ఎడమ వైపు తెలంగాణకు ఒక్కొక్కరికి 17.1 టీఎంసీ నీళ్ల కేటాయింపు చేయడం జరిగింది. కానీ రాయలసీమ నాయకులు బాంబులతో గేట్లు పగలగొట్టి నీళ్లు అధికంగా తీసుకపోవడం వలన తెలంగాణ 17 టీఎంసీల్లో 8 టీఎంసీల నీళ్ళుకూడా వాడుకోలేకపోయింది.
 5. కే సీ కెనాల్‌: తుంగభద్ర నది సుంకేశుల బ్యారేజ్‌ దగ్గర మొదలైన కేసీ కెనాల్‌కు కేవలం 10 టీఎంసీ నీళ్లు కేటాయించడం జరిగింది. కానీ కుట్రపూరితంగా పెంచుకుంటూ పోయారు. శ్రీశైలం నుండి చెన్నైకి పోవలసిన తెలుగు గంగ నుండి దాదాపు 40 టీఎంసీ నీళ్లు తీసుకుంటున్నారు. కొత్తగా ముచ్చమర్రి లిఫ్ట్‌ ద్వారా 798 అడుగుల నుండి లిఫ్ట్‌ చేసి కాల్వకు మళ్ళించారు. అలానే బనకచెర్ల హెడ్‌ రెగ్యులేటర్‌ నుండి కూడా కేసీ కెనాల్‌కు తరలింపు సాగుతున్నది. అదే కాకుండా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో కేసీకెనాల్‌ను పోచంపాడు ప్రాజెక్టుతో కలిపి, ఉమ్మడి ప్రాజెక్టుల మీద 1500 కోట్లు ప్రపంచ బ్యాంకు అప్పు తెచ్చి ఆ మొత్తాన్ని కేసీ కెనాల్‌ కెపాసిటీ పెంచటానికి వాడుకున్నారు.
 6. హంద్రీ నీవా సుజల స్రవంతి: పేరు హంద్రీ, నీవా నదులు. కానీ నీళ్లు మాత్రం శ్రీశైలం నుండి ముచ్చమర్రి దగ్గర నుంచి- మొదట 978 ఫీట్ల దగ్గర, తర్వాత 833 ఫీట్లు , ఇప్పుడు 798 ఫీట్ల దగ్గర నుండి రోజు 1/2 టీఎంసీ నీళ్లు తోడుతున్నారు.
 7. పోతిరెడ్డి పాడు:
  తెలంగాణకు కీడు:
  1976-77లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో మహారాష్ట్ర , కర్ణాటక, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ ఒక్కొక్కరు 5 టీఎంసీ వంతున మద్రాస్‌ నగరానికి 15 టీఎంసీ త్రాగు నీరు ఇవ్వటానికి అంగీకారం కుదిరింది.
 8. రాయలసీమ ఎత్తిపోతలు, రాయల్‌గా నది మళ్ళింపు:
  పోతిరెడ్డి పాడు గ్రావిటీతో ఆధారపడి ఉంది కనుక , జీవో 203 ద్వారా 800 ఫీట్ల లెవెల్‌ దగ్గర నుండి మొత్తం రోజుకు 3టీఎంసీ నీళ్లను కేవలం 50 ఫీట్ల లిఫ్ట్‌ ద్వారా పోతిరెడ్డి పాడు కెనాల్‌లో వేస్తే, శ్రీశైలం కుడికాల్వ, తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్‌ ఇలా రాయలసీమలోని అన్నిప్రాజెక్టులకు నీళ్లు మళ్లించవచ్చు అనే ప్లాన్‌ వేశారు.
  798 ఫీట్ల వరకు నీళ్లు తోడైతే ఇక శ్రీశైలం ప్రాజెక్టులో మిగిలే నీళ్లు కేవలం 28టీఎంసీలు మాత్రమే. రోజుకు 3 టీఎంసీలు లిఫ్ట్‌ ద్వారా, 845 ఫీట్లపైన నీళ్లు ఉన్నప్పుడు రోజుకు 4 టీఎంసీలు, ముచ్చమర్రి లిఫ్ట్‌ ద్వారా రోజుకు ఒక టీఎంసీ అంటే కాలం కలిసివస్తే రోజుకు 8 టీఎంసీ నీళ్లను మళ్లించవచ్చు అనే కుయుక్తి. శ్రీశైలం రిజర్వాయర్‌ కెపాసిటీ 216 టీఎంసీలు అంటే, కేవలం ఒక నెలలో మొత్తం శ్రీశైలం రిజర్వాయర్‌ను ఖాళీ చేయటానికి నాంది.
 9. తెలంగాణ ప్రాజెక్టులు, వాటి భవిషత్తు:
  పాలమూరు రంగారెడ్డి కోసం రోజుకు ఒకటిన్నర టీఎంసీలతో 803 దగ్గర నుండి 1781 ఫీట్లు , అంటే 989 ఫీట్లకు ఎత్తి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లో వేయాలి. అదే డిండికి రోజుకు అర టీఎంసీ, కల్వకుర్తికి రోజుకు పావు టీఎంసీ నీళ్లు మాత్రమే 789 ఫీట్లు ఎత్తి పోయాలి. కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం కేవలం 800 ఫీట్ల నుండి 845 ఫీట్లు ( పోతిరెడ్డిపాడు కాలువ), అంటే కేవలం 45 ఫీట్లు ఎత్తి పోస్తే చాలు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతానికి భౌగోళిక స్వరూపం కలిసివస్తుంది కనుక. సింపుల్‌గా చెప్పాలంటే రాయలసీమకు కేవలం 5 అంతస్తుల బంగ్లా అంత ఎత్తి పోస్తే చాలు. కానీ తెలంగాణ ప్రాంతానికి దుబాయ్‌లో ఉన్న ప్రపంచంలోని అత్యంత ఎత్తైన బుర్జ్‌ ఖలీఫా అంత ఎత్తు నీళ్లు ఎత్తిపోయాలి. శ్రీశైలంలో అటు రాయలసీమ ఎత్తి పోతలు, ఇటు పాలమూరు రంగారెడ్డి మోటర్లు స్టార్ట్‌ చేస్తే తెలంగాణ ప్రాంతానికి 20 టీఎంసీ నీళ్లు వచ్చేసరికి రాయలసీమకు 200 టీఎంసీ నీళ్లు ఎత్తుకు పోతారు. ఇలా చిన్నప్పుడు విన్నాం కదా, నక్క కొంగను భోజనానికి పిలిచి, పళ్లెంలో పాయసం వడ్డించి, కొంగ వంగే లోపే, నక్క నాలుకతో మొత్తం నాకినట్లు ఉంటది కదా!
 10. కుట్రపూరితంగా జీవోలు: శ్రీశైలం పూర్తి లెవెల్‌ 885 ఫీట్లు. మినిమం డ్రా లెవెల్‌ 834 ఉంటే, కేవలం పోతిరెడ్డిపాడు కొరకు 854కు మార్చారు . విద్యుదుత్పత్తి 803 ఫీట్ల వరకు చేయవచ్చు. ఎందుకంటే ఇది ప్రధానంగా హైడ్రోఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు గనుక. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతలు 800 వరకు పెట్టి, శ్రీశైలం అడుగునుండి నీళ్లను తోడాలని కుట్ర.
 11. కిమ్‌ కర్తవ్యమ్‌: మనం నక్కను భోజనానికి ఆహ్వానించి, కూజాలో పాయసం విందు ఇయ్యాలె. జోగులాంబ బ్యారేజి నిర్మించవలసిన అవసరం ఉంది. జూరాల కుడి , ఎడమల సామర్థ్యం పెంచి రిజర్వాయిర్ల ఏర్పాటు, నెట్టంపాడు, భీమా, కోయిల్‌ సాగర్‌ సామర్థ్యం పెంచి 40 – 60 టీఎంసీ అదనపు రిజర్వాయర్ల ఏర్పాటు, ఎస్‌ఎల్‌బీసీ తొందరగా ముగించి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకోవడం, అలానే వీలయితే ఎగువన ఇంకో డీప్‌ కట్‌ కాలువలో, గ్రావిటీతో నీళ్లు పోయే ఏర్పాటు చేయాలి.
 12. కేంద్ర ప్రభుత్వ బాధ్యత: గతంలో మూడు రాష్ట్రాలు ఉండేవి. ఇప్పుడు మహారాష్ట్ర , కర్ణాటక, తెలంగాణ, ఏపీ ఇలా నాలుగు రాష్ట్రాలు ఉన్నాయని గుర్తించాలి. పరీవాహక ప్రాంత ఆధారంగా తెలంగాణకు 559 టీఎంసీలు కేటాయించాలి. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఉండాలి. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు నాలుగు రాష్ట్రాలకు వర్తింపజేయాలి. అందరం యుక్తితో పనిచేస్తే అందరికీ లాభం. కుయుక్తి మా విధానం అనుకుంటే నీటి తగాదాలు అనివార్యం. తమ వాటా కోసం పోరాడటానికి తెలంగాణ ప్రజలు ఎప్పటికీ సిద్ధమే.

(వ్యాసకర్త: డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌, మాజీ ఎంపీ)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.