Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

క‘న్నీళ్ల’పై కనికరం లేదా?

తమకంటూ ఫలానా ప్రాజెక్టు నిర్మాణమై, సాగు నీళ్లొస్తే గొప్పగా బతుకుతామనే భావన తెలంగాణ ప్రజల్లో అనాదిగా ఉన్నది. కానీ ఆ భావన ప్రజలను ఏలే పాలకులకు లేకపోతే అది ఎన్నటికీ సాధ్యపడదు. తెలంగాణ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో కలిసినప్పటి నుంచి మొన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదాకా ఉన్న స్థితి ఇటువంటిదే.

ఒక పద్ధతి ప్రకారంగా తెలంగాణ ప్రాజెక్టులకు ఆటంకాలు కల్పించేటువంటి చర్యలకు పాల్పడటం అత్యంత దుర్మార్గం, గర్హణీయం. ఎంత త్వరగా ప్రాజెక్టులు పూర్తయితే అంత త్వరగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి, ఆదాయం పెరుగడంతో పాటు ప్రజల జీవన స్థితిగతులలో పురోగతి ఉంటుంది. ప్రాజెక్టులను ఆహ్వానించి శరవేగంగా పూర్తికావడానికి తోడ్పడటమే నేటి అభ్యుదయ వాదుల కర్తవ్యం. అయితే అంతిమంగా అన్నింటికి జవాబు ప్రజాక్షేత్రమే.

వివిధ వర్గాల ప్రజలు తమ ఆకాంక్షలను పాలకులు పట్టించుకొని నెరవేరుస్తారేమోనని ఆశించి భంగపడి, కాలగమనంలో చైతన్యవంతులై, సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఇది పరాయి పాలకులు చేసే పనికాదు, మాది మేమే చేసుకోవాలె అనే సోయిలోకి రావడాన్ని తెలంగాణ ఉద్యమ చైతన్యంతో మనం చూసినం. అందుకే సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ అస్థిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని చాటిచెప్పిన కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. ప్రజలు ఒక సమగ్ర నిర్ణయానికి, అంచనాకు రావడానికి దోహదపడిన అనేక పరిస్థితులు, పరిణామాలు టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో, కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానం లో చోటుచేసుకున్నవే. మనిషి జీవించడానికి శరీరంలో రక్తం ఎంత ముఖ్యమో, సమాజం జీవించడానికి కూడా తాగు, సాగు నీరు కూడా అంతే ముఖ్యం. అందుకే సీఎం కేసీఆర్ నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అంటున్నారు. ఆరు నూరైనా ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెబుతున్నారు. అందుకే తెలంగాణలోని అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసి వాటిని వీలైనంత తొందరగా పూర్తి చేయాలన్న దృఢ సంకల్పం తో ముందుకువెళ్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రభు త్వ చిత్తశుద్ధిని చాటిచెప్పిన ప్రాజెక్టు ఇటీవల ప్రారంభించిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకం.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లివ్వాలన్న నీతి పాలకులకు ఉం డేది కాదు. అది వైఎస్ పాలనైనా, చంద్రబాబు పాలనైనా.. తెలంగాణ ఉద్యమ దాటిని తట్టుకోవడానికి తెలంగాణలో ఉన్న తమ శ్రేణుల మొహాలు చెల్లుబాటు కావడానికి, తెలంగాణ ప్రజలను ఏమార్చడానికి ప్రాజెక్టులు మొదలుపెట్టారు. కానీ.. అవి పూర్తిచేయాలన్న సంకల్పం, చిత్తశుద్ధి వారికి ఏనాడు లేదు. అలాంటి సంకల్పమే ఉండి ఉంటే ఒకే సమయంలో ప్రారంభించినటువంటి తెలంగాణ ప్రాజెక్టులు, ఆంధ్రా ప్రాజెక్టులు మన కళ్లముందు ఉన్నాయి. ముప్పయ్యేండ్ల కిందటి నుంచి గత పదిహేనేండ్ల కిందటి వరకు మొదలుపెట్టిన కోయిల్‌సాగర్, కల్వకు ర్తి, భీమా, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ, ప్రాణహిత చేవెళ్ల తదితర ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండిపోయాయి. అదే సమయంలో మొదలుపెట్టి న తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బీసీ, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, గాలేరు నగరి, వెలిగొండ, ముచ్చుమర్రి, పులిచింతల లాంటి ఆంధ్రా ప్రాంతపు ప్రాజెక్టులు పగలు, రాత్రీ వెంటపడి పనిచేయించి ఎలాంటి హక్కులేని, నదీ పరీవాహక ప్రాంతంలో లేని ప్రాంతాలకు నీళ్లు తరలించుకు పోయిండ్రు.

2016, ఫిబ్రవరి 16న శంకుస్థాపన చేసి కేవలం పదకొండు నెలల్లో 335 కోట్ల రూపాయలతో ఈ ఎత్తిపోతల పథకాన్ని విజయవంతంగా పూర్తిచేసి రైతాంగానికి 60 వేల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. 60 ఏండ్ల కాలంపాటు రెండు తరాల ప్రజలు జీవితాలు కోల్పోయి మూడో తరం సమకాలీన గమనంలో ఈ దఫా తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వాన ప్రారంభమై విజయ తీరాలకు చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని సవరించడానికి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నిధుల కేటాయింపులో వివక్ష, నీటి ప్రాజెక్టులు కట్టడంలో వివ క్ష, ఉద్యోగాల్లో దోపిడీ. కానీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తూనే నియామకాలను చేపడుతూ తెలంగా ణ వాటా అయిన నీటిని పూర్తి మొత్తంగా వాడుకునేందుకు ప్రాజెక్టుల కు రూపకల్పన చేసింది. సాగునీటి రంగంలో ప్రత్యేకంగా ఇంత నష్టపోయిన ఈ ప్రాంతం ప్రజలు తమకు శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగాలని, తమ బీడు భూములకు నీళ్లు రావాలని అహరహం ఎదురుచూస్తూ, పరితపిస్తూ క్షణమొక యుగంలా గడుపుతున్నారు.

ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వం చిత్తశుద్ధితో తెలంగాణ ప్రాజెక్టులను రీ డిజై న్ చేసుకొని శరవేగంగా నీళ్లిచ్చి ప్రజల ఈతి బాధలు తీర్చడంతో పాటు ప్రజల ఆర్థిక, సాంఘిక జీవనంలో పెను మార్పులు చోటుచేసుకునేలా, ఉన్నతమైన ప్రమాణాలతో జీవించే ఒక సమాజ నిర్మాణం జరుగాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ప్రాజెక్టుల నిర్మాణం కోసం అవసరమైన నిధుల సమీకరణ చేసుకొని బడ్జెట్‌లోనే అత్యధిక ప్రాధాన్యాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేటాయించింది. సంప్రదాయ పద్ధతుల్లో జరిగే భూ సేకరణ వల్ల జాప్యంతో పాటు ప్రజలకు సత్వర న్యాయం జరుగదని భావించి రైతాంగం, ప్రజల శ్రేయస్సు కోరి 123 జీవోను తెచ్చిన విషయం తెలిసిందే. కానీ తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు సకాలంలో, వీలయితే అనుకున్న కాలానికి ముందే కావాలని ప్రభుత్వం పట్టుదల తో ఉన్నది. అయితే ప్రాజెక్టులు పూర్తిచేయడానికి ఏ ఒక్క పనికొచ్చే సూచన ఇవ్వకుండా విపక్ష పార్టీలు, కొందరు మేధావులు కేవలం తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే ఏకైక లక్ష్యంతో, కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత అక్కసుతో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి నేతలు ఈ ప్రాంత ప్రజలకు పట్టిన శాపం. ఆంధ్రా ప్రాంత ప్రాజెక్టుల విషయంలో సహకరించే దోరణి. అది అక్రమమై నా కనీసం నివారించని వైనం.

కానీ న్యాయబద్ధమైన తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం విపరీతమైన వ్యతిరేక దోరణి. ఈ వైఖరులన్నింటిని రాష్ట్ర ప్రజలందరూ గ్రహిస్తూనే ఉన్నారు. ఉమ్మడి హైకోర్టును వేదికగా చేసుకొని సాంకేతిక కారణాలంటూ న్యాయపరమైన చిక్కులు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణా నీళ్లను ఇప్పటికే ఆంధ్రా ప్రభు త్వం అక్రమంగా తరలిస్తున్నది. దానిని అరికట్టేందుకు కేంద్రానికి ఫిర్యాదు చేస్తే కేంద్రం నియమించిన కృష్ణా యాజమాన్య బోర్డు టెలీమెట్రీలు ఏర్పాటుచేసి ఎవరెంత నీటిని వాడుకుంటున్నది తేల్చాలని నిర్ణయించింది. అయి తే కృష్ణానదికి ఇరువైపుల ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, కాలువల వద్ద 18 టెలీమెట్రీ లు పెట్టాలని నిర్ణయిస్తే 14 తెలంగాణ వైపు, నాలుగు ఆంధ్రవైపు పెట్టాలని నిర్ణయించడం గమనార్హం. ఆంధ్రా నుంచి నీళ్ల విడుదల గురించి, నీటి కేటాయింపులో వివక్ష గురించి కానీ తెలంగాణలోని ఏ మేధావి.. ఏ పార్టీ ప్రశ్నించడం లేదు. నోరెత్తడం లేదు. కేవలం తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడమే లక్ష్యంగా ఒకేతాటి మీదకు వచ్చి పని చేస్తుండటం విశేషం. అయితే అత్యధిక ప్రజల అవసరాలు, మనోభావాలు పరిగణనలోకి తీసుకొని వారి శ్రేయస్సు కోసమే ఉద్దేశించిన ప్రాజెక్టులు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయా ప్రాజెక్టులను నిర్దిష్ట గడువులో పూర్తిచేయడానికే ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.

తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి, తెలంగాణ బిడ్డల బలిదానాల ను విస్మరించి చివరి క్షణం వరకు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు సైతం విభజన వద్దని వాదించిన నాయకులు తెలంగాణలో పాదయాత్రలు చేసినా మరే రూపంలో వారు విషప్రచారం చేసినా అది తెలంగాణ ప్రభుత్వ ఆత్మ ైస్థెర్యాన్ని దెబ్బ తీయవద్దు. నిరాధారమైన ఆరోపణలతో ప్రాజెక్టుల వల్ల ఒనగూరే మంచిని ఎవరూ చెరిపేయలేరు. ఈ దేశంలోని వివిధ రాష్ర్టా ల్లో ఇప్పటివరకూ నిర్మాణమైన భారీ జలాశయాలు గానీ, ప్రాజెక్టులు గానీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టినవే. పరిహారం లేదా పునరావాసం లేదా ప్రజలకు ఒనగూరే మేలు తదితర అంశాలను గత 60 ఏండ్ల తీరును సమీక్షిస్తే ముమ్మాటికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత అభ్యుదయంగా ప్రజల కోణంలో ప్రజలకు మేలు జరుగడానికే జీవో 123 గానీ, మొన్నటి సవరణలతో కూడిన భూ సేకరణ చట్టం గానీ ముందుకు తీసుకువచ్చింది.

అంతకంటే మెరుగ్గా ఏం చేయవచ్చు? ఎట్లా చేయవచ్చో? నిర్దిష్టమై న సూచనలు, సలహాలు ఇస్తే అవి విషయ నిష్ణాతులైన ఇంజినీర్లు ఆమోదిస్తే ప్రభుత్వాని కి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ కోట్లాదిమంది ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో అత్యంత బాధ్యతాయుతంగా పనిచేసే ముఖ్యమంత్రి నుంచి నీటి పారుదల శాఖా మంత్రి, నీటి పారుదల అధికారుల అవగాహనను, పరిణతిని హేళన చేసేవిధంగా కేవలం, విమర్శలకు పరిమితమై.. ఒక పద్ధతి ప్రకారంగా తెలంగాణ ప్రాజెక్టులకు ఆటంకాలు కల్పించే టువంటి చర్యలకు పాల్పడటం అత్యంత దుర్మార్గం, గర్హణీయం. ఎంత త్వరగా ప్రాజెక్టులు పూర్తయితే అంత త్వరగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి, ఆదాయం పెరుగడంతో పాటు ప్రజల జీవన స్థితిగతులలో పురోగతి ఉంటుంది. ప్రాజెక్టులను ఆహ్వానించి శరవేగంగా పూర్తికావడానికి తోడ్పడటమే నేటి అభ్యుదయ వాదు ల కర్తవ్యం. అయితే అంతిమంగా అన్నింటికి జవాబు ప్రజాక్షేత్రమే. -(వ్యాసకర్త: రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.