Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాంగ్రెస్ నేతలు అశక్తులు

-రాహుల్‌గాంధీ సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్
-పేగులు తెగేదాకా కొట్లాడే సత్తా టీఆర్‌ఎస్ ఎంపీలకే ఉన్నది
-16 స్థానాల్లో గెలిపిస్తే కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తాం
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు
-పార్టీలో చేరిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు

రాష్ట్రంలోని 16 లోక్‌సభ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఎర్రకోటపై జెండా ఎవరు ఎగురవేయాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తుందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అశక్తులని, వారిని గెలిపిస్తే రాహుల్‌గాంధీ సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్‌గా ప్రవర్తిస్తారని ఎద్దేవాచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పేగులు తెగేదాకా కొట్లాడే సత్తా టీఆర్‌ఎస్ ఎంపీలకు మాత్రమే ఉన్నదన్నారు. కొత్తగా పార్టీలోకి చేరుతున్న నాయకులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని భరోసా ఇచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని క్లాసిక్ కన్వెన్షన్‌లో ఏర్పాటుచేసిన సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి కుమారుడు, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, యువనేతలు కౌశిక్‌రెడ్డి, కళ్యాణ్‌రెడ్డితోపాటు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే సంజీవరావు, డీసీఎంఎస్ చైర్మన్ శ్రవణ్‌కుమార్‌గౌడ్, ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, మాజీ ఎంపీపీ ఏనుగు మురళీధర్‌రెడ్డి, మహేశ్వరం, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి 150కి మించి సీట్లు రావ ని, రాహుల్‌కు100-110 సీట్లు రావొచ్చని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో తెలంగాణ ఎంపీలే కీలకం కాబోతున్నారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌ను వ్యతిరేకించే పార్టీలు ఉన్నాయని, వారిని కలుపుకొని వెళ్తామని చెప్పారు.

పార్టీలు మారేవారిని చులకనగా చూడొద్దు
దేశంలో, రాష్ట్రంలో అనేకమంది నేతలు పార్టీలు మారుతున్న తరుణంలో వారిపట్ల చులకన భావంతో ఉండొద్దని కేటీఆర్ సూచించారు. టీఆర్‌ఎస్‌లోకి చేరేవారిని కాంగ్రెస్ నేతలు విమర్శించడం భావ్యం కాదన్నారు. కాంగ్రెస్ ఎంపీలు బీజేపీలోకి.. బీజేపీ ఎంపీలు కాంగ్రెస్‌లోకి మారొచ్చుగానీ, ఇతరులు పార్టీలు మారొద్దా.? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారని.. వారిని రాహుల్‌గాంధీ ఎంతకు కొన్నారని ప్రశ్నించారు. వారిని చేర్చుకున్నప్పుడు తాము విమర్శించలేదని, వారి ప్రతిష్ఠకు భంగం కలిగించలేదని గుర్తుచేశారు. మనం ఒక అడుగు వెనుకకు వేసైనా కొత్తగా వచ్చినవారిని కడుపులో పెట్టుకొని చూసుకోవాలని నాయకులకు సూచించారు.

మెడలు వంచైనా తెచ్చుకుంటాంv కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని మోదీని అడిగితే నవ్వి ఊరుకున్నారని కేటీఆర్ తెలిపారు. మన ఎంపీలు 16 మంది ఉంటే కేంద్రం మెడలు వంచి జాతీయ హోదా తెచ్చుకోగలుగుతామని చెప్పారు. చేవెళ్ల నియోజకవర్గం మినీ భారత్ వంటిదని.. ఇక్కడ అభివృద్ధి పను లు చేపట్టామని చెప్పారు. ఉస్మాన్‌సాగర్ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు మెట్రో రైలు రాబోతున్నదని చెప్పారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ దివాలా తీసిందని, బీజేపీ పువ్వు పూజకు పనికిరాకుండా పోయిందన్నారు. జిల్లా చరిత్రలోనే భారీ మెజార్టీతో మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ స్థానాలను గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమానంగా ఇద్దామని పిలుపునిచ్చా రు. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సార్..కారు…16.. డిల్లీలో సర్కారు మనదే కావాలన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి ఇంద్రారెడ్డి తెలంగాణ సాధనకు, అమ్మ సబితారెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి రెండు దశాబ్దాలకుపైగా చేసిన త్యాగాలు మరువలేనివన్నారు. భావితరాల కోసం తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు చెప్పారు. రాజకీయ భిక్ష పెట్టి, గుర్తింపు ఇచ్చిన టీఆర్‌ఎస్‌కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లో చేరిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీమార్పులపై మాట్లాడటం విడ్డూరం గా ఉన్నదన్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ తనకు రాజకీయ జన్మనిచ్చిన దివంగత ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం చాలా సంతోషంగా ఉన్నదని, తమ మధ్య విబేధాలు సమసిపోయాయన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ చేవెళ్ల పార్లమెంట్ ఇం చార్జి గట్టు రాంచందర్‌రావు, విద్యామౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ నాగేందర్‌గౌడ్, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, కొప్పుల మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, సంజీవరావు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.