Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాళేశ్వరానికి జలసమ్మతి

-తుది ఆమోదం తెలిపిన కేంద్ర జలసంఘం టీఏసీ – ఏడాదిలో అన్ని అనుమతులు సాధించిన ఏకైక ప్రాజెక్టుగా రికార్డు -ఇక పెట్టుబడికి సంబంధించిన అనుమతి లాంఛనమే -మూడేండ్లలో గోదారమ్మకు కొత్త తోవ చూపిన తెలంగాణ సర్కారు -తాజా అనుమతిపై సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు హర్షం -కేంద్ర జలవనరులశాఖ మంత్రి గడ్కరీకి ప్రత్యేక కృతజ్ఞతలు

అద్భుత ప్రణాళికతో అందరి ప్రశంసలందుకుంటున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అన్ని అవరోధాలనూ అధిగమించింది. నియమ నిబంధనలన్నింటిని అనుసరిస్తూ.. తుది అనుమతిని సైతం సాధించింది. కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా మండలి (టీఏసీ) బుధవారం ఇచ్చిన అనుమతితో ఇక కాళేశ్వరానికి తిరుగులేదు. సకలసమ్మతులు పొంది జలకేతనం ఎగురవేయనుంది. అనుమతులపరంగా కూడా ఇది మరో రికార్డు. తెలంగాణ స్వీయ పాలనలో సుమారు మూడేండ్ల కిందట సూచనప్రాయంగా పురుడుపోసుకున్న ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. దాదాపు రెండేండ్ల కిందట పనులు మొదలుకాగా, ఏడాది కిందట కేంద్ర జల సంఘానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించారు. కేవలం సంవత్సరకాలంలోనే అన్నిరకాల అనుమతులు సాధించిన ప్రాజెక్టుగా దేశంలోనే రికార్డు సృష్టించింది. కేంద్రంలో కాంగ్రెస్.. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్.. పొరుగున మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ ఉన్నా పదేండ్ల కాలంలో ప్రాణహిత – చేవెళ్ల ఎత్తిపోతల పథకానికి కేంద్ర జలసంఘం నుంచి ఒక్కటంటే ఒక్క అనుమతి రాలేదు. దశాబ్దాల ప్రస్థానం ఉన్న పోలవరం ప్రాజెక్టుకు కూడా నేటికీ అన్ని రకాల అనుమతులు రాలేదు. కానీ.. కాళేశ్వరం మాత్రం రికార్డుస్థాయిలో అన్ని అనుమతులు సాధించి.. స్వరాష్ట్రంలో తెలంగాణ జలసిరులు కురిపించేందుకు సిద్ధమవుతున్నది. ఈ వర్షాకాలంలోనే గోదారమ్మ పరవళ్లతో బీడు భూములకు ఊపిరులూదేందుకు జలసంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు తాజాగా సీడబ్ల్యూసీ తుది అనుమతి పట్ల హర్షం ప్రకటించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

చకచకా అనుమతులు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మొత్తం తొమ్మిది కీలక అనుమతులు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు సాంకేతిక సలహా మండలి అనుమతులు లభించాయి. దీంతో ఈ ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం అన్ని అనుమతులు ఇచ్చినట్లయింది. ఢిల్లీలోని కేంద్ర జల సంఘం కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో సాంకేతిక సలహా మండలి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. జలవనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శి యూపీ సింగ్ అధ్యక్షత వహించిన సమావేశంలో కేంద్ర జల సంఘం చైర్మన్ మసూద్ హుస్సేన్, ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి, నీతిఆయోగ్ సలహాదారు, భూగర్భజలశాఖ కమిషనర్, వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి, గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు, కేంద్ర జలసంఘానికి చెందిన అన్ని విభాగాల సంచాలకులు, చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు, కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్ హరిరాం పాల్గొని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యాంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియకు సంబంధించిన లింక్- 1, 2, 3 పనుల పురోగతిని దృశ్యరూపకంగా ప్రదర్శించారు. అనంతరం సమావేశం ఏకగ్రీవంగా ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులను మంజూరుచేస్తూ తీర్మానించింది. ఈ మేరకు ఈఎన్సీ ముళీధర్‌రావు ఢిల్లీ నుంచి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు.

త్వరలో పెట్టుబడికి అనుమతి..అతి తక్కువ సమయంలో కేంద్ర జల సంఘం నుంచి ఇప్పటివరకు అన్ని రకాల అనుమతులు సాధించిన ప్రాజెక్టుగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రికార్డు సృష్టించింది. చివరగా కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ పెట్టుబడికి సంబంధించి లాంఛన అనుమతి ఇవ్వాల్సి ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంచనా వ్యయం వివరాలపై కేంద్ర జలసంఘంలోని అంచనా వ్యయ (ఇరిగేషన్)-2 డైరెక్టరేట్ ఈ ఏడాది మే నెలలోనే సంతృప్తి వ్యక్తంచేసింది. అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టులో భాగంగా చేపట్టే హెడ్‌వర్క్స్‌కు (బరాజ్‌లు, పంపుహౌస్ వంటి నిర్మాణాలకు) రూ.33,145.44 కోట్లు, నీటిసరఫరా వ్యవస్థకు (కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు) రూ.47,045.02 కోట్లు వ్యయం అవుతుందని.. మొత్తంగా ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80,190.46 కోట్లు (2015-16 ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం)గా పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ వరకు రూ.23,022.74 కోట్లు ఖర్చు చేయగా.. ఈ ఏడాదిలో మార్చివరకు మరో రూ.7630.98 కోట్లు అంటే 2018 మార్చి వరకు ప్రాజెక్టు అంచనా వ్యయంలో రూ.30,653.72 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వివరాలను సమర్పించారు. ప్రాజెక్టు కాస్ట్-బెనిఫిట్ రేషియో (బీసీ రేషియో)ను 1:1.5 గా సూచించారు. అంటే ఈ ప్రాజెక్టులో రూపాయి వెచ్చిస్తే రూపాయిన్నర ప్రయోజనముంటుందని స్పష్టంచేశారు. దీంతో సీడబ్ల్యూసీ నుంచి సంతృప్తి వ్యక్తమైన దరిమిలా కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ పెట్టుబడి అనుమతి సులువుగా వస్తుందని ఇంజినీరింగ్ నిపుణులు చెప్తున్నారు. ఈ అనుమతి త్వరలోనే రానుందని ఈఎన్సీ మురళీధర్‌రావు కూడా తెలిపారు.

ఏడాదిలోనే పరిపూర్ణంగోదావరి జలాల సద్వినియోగం.. సమైక్యపాలనలో తెలంగాణకు కించిత్తు ప్రయోజనంలేని సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్.. ఈ రెండు ప్రధాన లక్ష్యాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుపెట్టిన భగీరథయత్నంలో భాగంగా 2015 సెప్టెంబర్ నెలలో దేశంలోనే అరుదైన లైడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్) సర్వేను ప్రభుత్వం చేపట్టింది. ఆ తర్వాత నెలల తరబడి మేధోమథనంతో మేడిగడ్డ వద్ద ప్రధాన బరాజ్‌తో మూడు వరుస బరాజ్‌ల డిజైన్‌తో ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రూపొందించింది. అదే ఏడాది మే రెండో తేదీన సీఎం కేసీఆర్ మహదేవ్‌పూర్ పరిధిలోని మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నీటిపారుదలశాఖ వెనువెంటనే సాంకేతిక అంశాలన్నీ పూర్తిచేసుకొని, టెండర్లు.. ఆపై పనులకు రంగం సిద్ధం చేసుకుంది.

ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చేసిన కృషి ఫలితంగా 2016 ఆగస్టు 23న మహారాష్ట్ర – తెలంగాణ మధ్య చారిత్రాత్మక సాగునీటి ఒప్పందాలు జరుగడంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పట్టాలెక్కింది. అనంతరం ఒకవైపు శరవేగంగా పనులు సాగించడం, మరోవైపు అన్నిరకాల అనుమతులను సాధించడమనే బృహత్తర బాధ్యతలను చేపట్టిన ప్రభుత్వం అందులో సఫలీకృతమవుతున్నది. ఈ ఏడాది మార్చినాటికే దాదాపు 48 శాతానికిపైగా పనులు పూర్తిచేయడం.. అందులోనూ నిర్మాణరంగపరంగా రికార్డులను సృష్టించడం ఎప్పుడూ చూడని అనుభవాలు. ఒకవైపు పనులు కొనసాగుతుండగా మరోవైపు సత్వరం అనుమతులను సాధించడాన్ని ప్రభుత్వం సవాలుగా తీసుకుంది. ప్రధానంగా నీటిపారుదలశాఖ ఇంజినీర్లు మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో అహర్నిశలు కృషిచేయడంతో గత ఏడాది మార్చి నుంచి ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం నుంచి అనుమతుల పరంపర మొదలయింది. దాదాపు ఏడాది కాలంలోనే సీడబ్ల్యూసీలోని అన్ని డైరెక్టరేట్ల నుంచి అనుమతులు రాగా, తాజాగా సాంకేతిక సలహా మండలి నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. కొంత అటూఇటుగా ఏడాది సమయంలోనే అన్నిరకాల సాంకేతిక అనుమతులతో పరిపూర్ణం కావడమనేది దేశ సాగునీటిరంగ చరిత్రలో అరుదైన రికార్డు అని సాగునీటిరంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు.

అన్ని అనుమతులు సాధించిన తొలిప్రాజెక్టుకాళేశ్వరానికి టీఏసీ అనుమతిపై మంత్రి హర్షం.. కాంగ్రెస్‌కు చెంపపెట్టు అని వ్యాఖ్య

కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల శాఖ టీఏసీ (టెక్నికల్ అడ్వైజరీ కమిటీ) అనుమతి లభించడంపై భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హర్షం వ్యక్తంచేశారు. చిట్టచివరి అనుమతి కూడా లభించిందని, పూర్తిస్థాయిలో అన్ని రకాల అనుమతులు సాధించిన తొలి ప్రాజెక్టు కాళేశ్వరమేనని మంత్రి వెల్లడించారు. సీఎం కేసీఆర్ చేసిన రీడిజైన్‌ను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తే కేంద్రం నుంచి ఆమోదముద్ర లభించిందన్నారు. ఇప్పుడు తనకెంతో సంతోషంగా ఉన్నదని, ప్రాజెక్టును అడ్డుకోవడానికి కుట్రలు పన్నిన కాంగ్రెస్‌కు ఇది చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం తాలెల్మలో రూ.36.74 కోట్లతో చేపట్టనున్న రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకానికి మంత్రి హరీశ్‌రావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని పునరుద్ఘాటించారు. గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా అవి ఫలించలేదన్నారు. అటవీ, పర్యావరణ, వాటర్ రీసోర్స్, నీతి ఆయోగ్, ట్రైబల్.. ఇలా అన్నింటి అనుమతి రావడం శుభపరిణామన్నారు. ప్రాణహిత ప్రాజెక్టుకు అధికారంలో ఉన్న ఏడేండ్లలో కాంగ్రెస్ ఒక్క అనుమతినీ సాధించలేకపోయిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.