Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కులవృత్తులకు ఊతం..

-గ్రామీణ ఆర్థికవ్యవస్థ పరిపుష్టం.. పదేండ్ల ముందుచూపుతో జిల్లాల అభివృద్ధికి మ్యాపింగ్ -బీసీల చేయూతకు ప్రత్యేక పథకాల రూపకల్పన -పర్యవేక్షణకు సీఎంవోలో ప్రత్యేకాధికారి -ప్రతి కుటుంబ జీవన స్థితిగతుల అధ్యయనం-పథకాల వర్తింపు -చెరువులు, బ్యారేజీలు, రిజర్వాయర్లలో భారీగా చేపల పెంపకం -గొర్రెల పెంపకం పథకానికి సిద్ధంగా జిల్లా యంత్రాంగం -జిల్లాల వారీగా ఎస్సీ, ఎస్టీ ప్లాన్ -అర్బన్, రూరల్, సెమీ అర్బన్ ప్రాతిపదికన దళితులకు ప్రణాళిక -గ్రామాల పర్యటనలో దళిత, గిరిజనవాడల సందర్శన -అసైన్డ్ భూముల పరిస్థితిపై తక్షణ సర్వే -క్లీన్ ది విలేజ్ కింద గ్రామాలకు కలెక్టర్ అవార్డు -ప్రతి గ్రామంలో శ్మశాన వాటిక -ఆసరా పింఛన్ కుటుంబాలకూ బీడీ కార్మిక భృతి -పదిరోజుల్లో కారుణ్య నియామకాలు -భార్యాభర్తలు ఒకేచోటికి బదిలీ -ప్రభుత్వ సంరక్షణలోనే అనాథ పిల్లలు -ప్రతి కలెక్టర్ వద్ద రూ 5 కోట్లు రిజర్వ్ -మళ్లీ మన ఊరు-మన ప్రణాళిక -కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్

కలెక్టర్లుగా మీకు వచ్చిన అవకాశం.. ప్రజలు ఓట్ల ద్వారా మాకిచ్చిన అధికారం అంతిమంగా ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడాలి. ఈ అవకాశం అందరికీ రాదు. మనం వెయ్యేండ్లు బతుకం. వచ్చిన అవకాశంతో కలకాలం నిలిచే విధంగా, ఉపయోగపడేలా పనులు చేయాలి. మీ జిల్లా కొరకు మీరు ప్రణాళిక తయారు చేయండి. వివిధ రంగాలకు సంబంధించిన పదేండ్ల ప్రణాళికను రూపొందించండి. ప్రస్తుతం ఎలా ఉంది.. పదేండ్ల తర్వాత ఎలా ఉంటుంది..అనే దానిపై రూట్ మ్యాప్ రూపొందించండి. దాని ప్రకారం మనం పనిచేద్దాం.. -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడమే లక్ష్యంగా నిర్దిష్టమైన ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కలెక్టర్లకు పిలుపునిచ్చారు. కులవృత్తులకు ఊతమిచ్చేందుకు, బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలలో ప్రతి కుటుంబ జీవన స్థితిగతులను అధ్యయనం చేసి పేదరికంలో ఉన్నవారి జీవితాలలో కొత్త వెలుగుకోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలని అన్నా రు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయడానికి మళ్లీ మన ఊరు-మన ప్రణాళికను రూపొందించాలని సూచించారు. రానున్న పదేండ్ల అభివృద్ధికి సంబంధించి జిల్లాల వారీగా మ్యాప్‌లను సిద్ధం చేయాలని ఆదేశించారు. పరిపాలనా వికేంద్రీకరణ, ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటైన కొత్త జిల్లాలలో ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలుకావాలని అన్నారు.

జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీ వర్గాలవారు కులవృత్తులకు ఆదరణ కరువై దీనస్థితిలో ఉన్నారని, ఆ వృత్తులకు పునరుజ్జీవం కల్పించి ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను చేపట్టిందని కేసీఆర్ చెప్పారు. ఇందులో భాగంగా దాదాపు 25 లక్షల జనాభా ఉన్న యాదవుల అభ్యున్నతికోసం గొర్రెల పెంపకంపై ప్రభుత్వం భారీ కార్యక్రమం తీసుకుంటున్నదని, ఈ మేరకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువులు, రిజర్వాయర్లు, బ్యారేజీల్లో చేపలు పెంచటం ద్వారా వాటి ని సమర్థంగా వాడుకోవాలన్నారు. సమాజం నుంచి దూరంగా ఉంచిన ఎస్సీలు, ఎస్టీలు, మహిళల వంటి మానవ వనరులను వినియోగించుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి జిల్లాల వారీగా సబ్‌ప్లాన్‌కు రూపకల్పన చేసి ప్రభుత్వానికి పంపించాలని నిర్దేశించారు. కారుణ్య నియామకాలను పదిరోజుల్లో చేపట్టాలని ఆదేశించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో జిల్లాల కలెక్టర్లతో సుమారు 8గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమైన సీఎం కేసీఆర్ ప్రొవైడింగ్ లీడర్‌షిప్, పీపుల్ కౌన్సెలింగ్, మ్యాప్ ది లోకల్ రిసోర్స్, ట్యాప్ ది వెల్త్ లక్ష్యాలుగా తీసుకొని పనిచేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

కలకాలం గుర్తుండిపోయేలా… కలెక్టర్లుగా పనిచేయడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని, కలకాలం ప్రజలకు గుర్తుండిపోయేలా మంచి కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చెప్పారు. కలెక్టర్లుగా మీకు వచ్చిన అవకాశం.. ప్రజలు ఓట్ల ద్వారా మాకిచ్చిన అధికారం అంతిమంగా ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడాలి. ఈ అవకాశం అందరికీ రాదు. మనం వె య్యేండ్లు బతుకం. వచ్చిన అవకాశంతో కలకాలం నిలిచే విధంగా, ఉపయోగపడేలా పనులు చే యాలి. మీ జిల్లా కొరకు మీరు ప్రణాళిక తయారు చేయండి. వివిధ రంగాలకు సంబంధించిన పదేండ్ల ప్రణాళికను రూపొందించండి. ప్రస్తుతం ఎలా ఉంది. పదేండ్ల తర్వాత ఎలా ఉంటుంది అనే దానిపై రూట్ మ్యాప్ రూపొందించండి. దాని ప్రకారం మనం పనిచేద్దాం అని సీఎం సూచించారు. అంకితభావంతో పనిచేస్తే అసాధ్యమనేది లేదన్న ముఖ్యమంత్రి తెలంగాణ సాధన, మిషన్ భగీరథ ప్రగతిని ఉదహరించారు.

పనితీరు బాగుంది.. ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఏర్పాటుచేసిన కొత్త జిల్లాల్లో కలెక్టర్లు బాగా పనిచేస్తున్నారని, వైద్యశాలలు, సంక్షేమ వసతి గృహాలను సందర్శిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని సీఎం ప్రశంసించారు. కలెక్టర్ల పనితీరు సంతోషాన్నిచ్చిందని, ఇదే స్ఫూర్తితో పనిచేస్తే నిర్దేశించుకున్న లక్ష్యాలను త్వరగా పూర్తిచేయగలుగుతామనే నమ్మకం కలుగుతున్నదని అన్నారు. అధికార యంత్రాంగం మరింత బాగా పనిచేసేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అద్భుతమైన మానవశక్తి ఉంది.. ఆ మానవవనరులను గుర్తించి ప్రోత్సహించాలని సీఎం అన్నారు. జనగామ, పెంబర్తిలో నగిషీ కళాకారులు, కరీంనగర్‌లో పిలిగ్రీ కళలో ప్రపంచ ప్రఖ్యాతి సాధించినవారున్నారని, ఇలా ప్రతి ప్రాంతంలోనూ కళా నైపుణ్యత ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించాలని చెప్పారు. 19.5శాతం వృద్ధిరేటుతో ఆర్థిక పురోగమనంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, టీఎస్-ఐపాస్ చట్టం, నిరంతర విద్యుత్ వంటి చర్యల వల్ల ఇది సాధ్యమైందని సీఎం విశ్లేషించారు. మెరుగవుతున్న ఆర్థిక స్థితిని మానవవనరుల అభివృద్ధికి ఉపయోగించాలని సూచించారు.

గొర్రెల పెంపకానికి ప్రత్యేక కార్యక్రమం….. గ్రామీణ ప్రాంతాల ఆర్థికాభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం చెప్పారు. రాష్ట్రంలో 25లక్షల మంది యాదవులున్నారని, వారికి గొర్రెల పెంపకంలో మంచి అనుభవం, నైపుణ్యం ఉండటం వల్ల ప్రత్యేక వృత్తి నైపుణ్య శిక్షణ అవసరంలేదని అన్నా రు. అందుకే గొర్రెల పెంపకాన్ని పెద్దఎత్తున చేపట్టాలని నిర్ణయించామని సీఎం వెల్లడించారు. రానున్న కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో గొర్రెల పెంపకం కోసం ప్రత్యేక కార్యక్రమం అమలు చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గొర్రెపిల్లలను పొరుగు రాష్ర్టాల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని, ఎట్టి పరిస్థితిలోనూ మన రాష్ట్రం లో కొనవద్దని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మాంసం అవసరాలకు ఇతర ప్రాంతాల నుంచి రోజూ 500 లారీల గొర్రెలను దిగుమతి చేసుకోవడం బాధాకరమని, ఈ పరిస్థితినుంచి మనమే ఎగుమతి చేసే పరిస్థితి రావాలని అన్నారు.

మిషన్ చేపల పెంపకం… రాష్ట్రంలో చేపల పెంపకం పెద్ద ఎత్తున జరుగాలని సీఎం అన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో జలకళ వుట్టిపడుతున్నది. ఇపుడు మిషన్ చేపల పెంపకం జరగాలి. గోదావరి, కృష్ణ, బేసిన్లలో భారీ, మధ్య తరహా నీటి ప్రాజెక్టులున్నాయి. కొత్తగా అనేక బ్యారేజీలు, రిజర్వాయర్లు కడుతున్నం. వాటన్నింటినీ చేపల పెంపకానికి ఉపయోగించాలి. ఇందుకు అనువైన కార్యాచరణ రూపొందించాలి. అనేక ఆధునిక పద్ధతులు వచ్చాయి. వాటిని అందిపుచ్చుకోవాలి అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ నిధుల క్యారీ ఫార్వర్డ్.. ఎస్సీ ఎస్టీ వర్గాల ఆర్థిక సామాజిక స్థితిలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. దళితులు, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు. బడ్జెట్‌లో కేటాయించి ఖర్చు కాని నిధులను వచ్చే సంవత్సరానికి క్యారీ ఫార్వర్ట్ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ శాఖలకే నేరుగా ఆ నిధులను కేటాయించి ఖర్చు చేస్తామన్నారు. జిల్లాల్లో అర్బన్, రూరల్, సెమీ అర్బన్ ప్రాతిపదికన దళితుల కోసం ఏం కార్యక్రమాలు చేపట్టాలి.. ఏ విధంగా అమలు చేయాలి.. అసలు దళితులకు ఏం కావాలి? అనే విషయాలపై అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. జిల్లాల వారీగా ఎస్సీ, ఎస్టీ ప్లాన్ రూపొందించి బడ్జెట్ ప్రవేశపెట్టేలోగా పంపాలని ఆదేశించారు. వ్యవసాయం, స్వయం ఉపాధి, పరిశ్రమలు ఇలా ఏ రంగంలో ఆసక్తి ఉన్న వారిని ఆ రంగంలో ప్రోత్సహించేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించాలని సూచించారు. అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైతే వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో అసైన్డ్ భూములు ఏ స్థితిలో ఉన్నాయి.. ఎవరి వద్ద ఉన్నాయి.. అనే వివరాలను సేకరించడానికి పది రోజుల్లో సర్వే పూర్తి చేయాలన్నారు. గ్రామాలకు వెళ్లినప్పుడు తప్పని సరిగా దళిత వాడలు, గిరిజన తండాలను సందర్శించాలని ఆదేశించారు.

మానవ వనరులు వృథాకారాదు.. రాష్ట్ర జనాభాలో 16నుంచి 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు , 50శాతం మంది మహిళలున్నారు, ఎస్సీలను ఊరికి దూరంగా ఉంచారు. ఎస్టీలను తాండాలు, గూడేలకు పరిమితం చేశారు. మహిళలను వంటింటికి పరిమితం చేశారు. 75శాతం మందిని ఉపయోగించుకోవడం లేదు. ఇంత పెద్ద మొత్తంలో మానవ వనరులను ఉపయోగించుకోని దేశం ప్రపంచంలో భారతదేశం ఒక్కటే. ఈ రుగ్మతను పోగొట్టాలి అన్నారు.

ఇండ్ల నిర్మాణం వేగం పెంచాలి.. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం వేగం పెరగాలని సీఎం నిర్దేశించారు. నిర్మాణానికి సంబంధించిన నిబంధనలను సరళీకృతం చేశామని, స్థానిక మేస్త్రీలను ప్రోత్సహించి ఇండ్ల నిర్మాణం జరిపించాలని సూచించారు. వచ్చే ఏడాదిలోగా అన్ని కొత్త జిల్లాల్లో పరిపాలనా భవనాలు, పోలీస్ కార్యాలయాల నిర్మాణాలను పూర్తిచేయాలని ఆదేశించారు.

మరోసారి మన ఊరు-మన ప్రణాళిక మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమం మరోసారి నిర్వహించి గ్రామాల్లో ప్రజల పరిస్థితిపై అధ్యయనం చేసి, దశలవారీగా అందరి అవసరాలను తీర్చేలా ప్రణాళిలను తయారు చేయాలని సీఎం ఆదేశించారు. సంక్షేమ పథకాల కింద లబ్ధిదారుల ఎంపికకు లాటరీ విధానాన్ని అనుసరించాలన్నారు. కుటుంబంలో ఒకరికి ఆసరా పెన్షన్ వచ్చినప్పటికీ అదే కుటుంబంలో బీడీ కార్మికులుంటే వారికి కూడా భృతిని ఇవ్వాలన్నారు. ఒంటరి మహిళలను గుర్తించి భృతిని కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామంలో శ్మశానవాటికను నిర్మించి వాటికి వైకుంఠధామం అనే పేరు పెట్టాలని సూచించారు. గ్రామాల్లో క్లీన్ ది విలేజ్ కార్యక్రమం చేపట్టాలని, పరిశుభ్రతను పాటించే గ్రామాలకు కలెక్టర్లు నగదు అవార్డులివ్వాలని సూచించారు. అలాగే గ్రామాల్లో కమతాల ఏకీకరణ జరగాలని, సాదా బైనామాల లావాదేవీలను రిజిస్ట్రేషన్ చేసి పట్టాలిచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అన్నారు. హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యమిచ్చి నర్సరీలను సందర్శించాలని సూచించారు.

కరీంనగర్ ఎల్‌ఎండీ వద్ద ఫిషరీస్ కాలేజీ ఏర్పాటు కోసం స్థలాన్ని సేకరించాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. వరంగల్ నగరాభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సూచించారు. జనగామలో ఆత్మరక్షణ కోసం మహిళలకు సామూహిక శిక్షణనిచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారని జనగామ ప్రజలను సీఎం అభినందించారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధానకార్యదర్శి ఎస్‌పీ సింగ్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కనకయ్య, వెంకటేశ్వర్లు , వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు సమావేశంలో పాల్గొన్నారు.

కులవృత్తుల కోసం సీఎంవోలో ప్రత్యేకాధికారులు.. సమాజంలో బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి అభివృద్ధి, కుల వృత్తులకు ప్రోత్సాహం అందించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం చెప్పారు. వీరి సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సీఎంఓలోనే ప్రత్యేకాధికారులను నియమిస్తామని వెల్లడించారు. అన్ని కులవృత్తుల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సెలూన్లు, లాండ్రీల ఏర్పాటు ఇంకా ఇతర కులవృత్తులకు సంబంధించి కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతున్నదన్నారు. గ్రామాల్లో చెట్లకింద, బండలమీద కూర్చోబెట్టి కటింగ్, గడ్డాలు చేసే పరిస్థితిపోవాలని, ఆరోగ్యకరమైన సెలూన్లు రావాలని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. సెలూన్లు, లాండ్రీలు నడిపే వారి గుర్తింపు ప్రారంభించాలని కలెక్టర్లకు సూచించారు.

ఐఏఎస్‌లకు మించి గొర్రెకాపరులకు నైపుణ్యం.. గొర్రె కాపరుల నైపుణ్యాన్ని వివరిస్తూ సీఎం కేసీఆర్ చెప్పిన ఉదాహరణలు కలెక్టర్ల సదస్సులో నవ్వులు పూయించాయి. మనకు గొర్రెలన్నీ ఒకే తీరుగ కనిపిస్తాయి.. కానీ గొర్రె కాపరులకు మందలో ఉన్న ప్రతి గొర్రెను గుర్తించే నైపుణ్యం ఉంటుంది. దేనికైనా జబ్బు చేసినా వారు వెంటనే గుర్తిస్తారు. గ్రామాలలో ఇతర కులస్థులు కూడా యాదవులకు గొర్రెలను పెంచమని ఇస్తరు.. పెరిగి పెద్దయ్యాక అది ఎవరిదో వారికి కచ్చితంగా ఇస్తారు.. అనుభవమే వారికి చదువు .. అంత నైపుణ్యత ఐఏఎస్ చదివిన వారికి కూడా ఉండదు అని కేసీఆర్ అనడంతో కలెక్టర్లు ముసిముసిగా నవ్వుకున్నారు.

పదిరోజుల్లో కారుణ్య నియామకాలు కారుణ్య నియామకాలను పదిరోజుల్లో చేపట్టాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు. ఉద్యోగుల్లో భార్యాభర్తలు ఒకేచోట పనిచేసేలా బదిలీలు చేయాలని సూచించారు. రిటైరైనరోజు ఉద్యోగులను గౌరవంగా ప్రభుత్వ వాహనంలో ఇంటి వద్ద దించాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సమర్థంగా వ్యవహరించే అధికారులను గుర్తించి బహుమానం ఇవ్వాలని చెప్పారు. ప్రతి కలెక్టర్ వద్ద రూ 5కోట్లను రిజర్వ్‌లో ఉంచుతామని, అవసరాన్ని బట్టి సమస్యల తక్షణ పరిష్కారం కోసం ఉపయోగించుకోవాలని చెప్పారు. అనాథ పిల్లల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వమే చేపట్టాలన్నారు. వారికి మంచి విద్య, వసతి కోసం చర్యలు చేపడుతామని ఇందులో భాగంగా ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.