-ముఖ్యమంత్రికి గవర్నర్ నరసింహన్ ప్రశంస
చీకటి నుంచి వెలుగులకు నడిపించిన నాయకుడు అంటూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావును రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ బ్రహ్మాండంగా ఉన్నాయని కొనియాడారు. అవినీతిరహిత సమాజ నిర్మాణంవైపు తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తున్నదని కొత్త సంవత్సరం వేడుకల్లో గవర్నర్ చెప్పారు. 2017 తెలంగాణకు కార్యసాధక సంవత్సరమని అభివర్ణించారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమర్థ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలుస్తుందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. చీకటినుంచి వెలుగులోకి నడిపించిన డైనమిక్ లీడర్ కేసీఆర్ అని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గ సహచరులు, అధికారులతో ఆదివారం రాజ్‌భవన్‌లో. గవర్నర్‌ను కలిసి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లో తాను గమనించిన ఉన్నతమైన లక్షణాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజలకు ఉపయోగపడుతుందంటే ఎలాంటి భేషజాలకు పోకుండా ఇతరుల సలహాలను కూడా సీఎం పరిగణనలోకి తీసుకుంటారన్నారు. ఇటువంటి సీఎం గురించి తానెక్కడా వినలేదని చెప్పారు. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.
ఆ తర్వాత పరిణామాలెలా ఉన్నా ఎదుర్కోవడానికి సిద్ధమవుతారు తప్ప వెనుకడుగు వేయరు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్రం అంధకారాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. కానీ తమసోమా జ్యోతిర్గమయ అన్నట్లు చీకటి నుంచి వెలుగులోకి నడిపిన నాయకుడిగా కేసీఆర్ నిలిచారు అని గవర్నర్ ప్రశంసించారు. కేసీఆర్ చీకటి అనే పదానికే కొత్త నిర్వచనమిచ్చారని అన్నారు. విద్యుత్‌రంగంలో అనూహ్యమైన రీతిలో సాధించిన ప్రగతి మహాద్భుత ఘట్టంగా ఆయన అభివర్ణించారు. డైనమిక్ లీడర్ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాలలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని అన్నారు. 2017 తెలంగాణకు కార్యసాధక సంవత్సరంగా ఉంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు. రాష్ట్రం ఏర్పడి 31 నెలలు గడిచిన క్రమంలో తెలంగాణ రాష్ట్రం నిర్దిష్టమైన లక్ష్యంతో సంక్షేమ, అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళుతున్నదని చెప్పారు. పక్కా ప్రణాళికతో వివిధ పథకాల అమలు తీరు భేష్ అని ప్రశంసించారు.
మిషన్ భగీరథ బృహత్తర కార్యక్రమం ప్రతి ఇంటికీ సురక్షితమైన నీటిని సరఫరా చేయడానికి ఉద్దేశించిన మిషన్ భగీరథ గురించి చెప్తూ.. జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ది హిల్ టు ఫెచ్ ఎ పేల్ ఆఫ్ వాటర్ అన్న ఇంగ్లిష్ కవితను ప్రస్తావించారు. బకెట్ నీళ్ల కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ప్రతీ పౌరునికీ నీటిని అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన మిషన్ భగీరథ బృహత్తర కార్యక్రమమని అభివర్ణించారు. మిషన్ కాకతీయ రెండు దశల పనులు పూర్తయిన క్రమంలో తెలంగాణ త్వరలో మంచి ఫలాలను అందుకోబోతున్నదన్నారు. మిషన్ కాకతీయకు వరుణుడి కరుణకూడా తోడుకావడంతో సాగుకు చాలినంత నీరు అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు.
ఐటీ రంగంలో సృజనాత్మక దూకుడు సమాచార, సాంకేతిక రంగంలో తెలంగాణ సృజనాత్మకమైన ఆలోచనలతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని గవర్నర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త కొత్త విధానాలతో మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. ఈ విషయంలో ఆయన ప్రత్యేకంగా మంత్రి కేటీ రామారావును ప్రశంసించారు. గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేవలం కొన్ని వర్గాలకే పరిమితమైనదని, కానీ ప్రభుత్వ కృషివల్ల అది సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నదని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన టీ-హబ్ అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, మంచి ఆలోచనలున్న ఔత్సాహికులకు ఒక వేదికగా మారిందని చెప్పారు. ఈ ఏడాదిలో టీ-హబ్ కేంద్రంగా కొందరు ప్రపంచం గర్వించదగ్గ రీతిలో కొత్త విధానాలను కనుగొంటారన్న విశ్వాసాన్ని గవర్నర్ వ్యక్తంచేశారు. తెలంగాణ పోలీసులు అంకితభావంతో పనిచేస్తూ శాంతిభద్రతలను కాపాడుతున్నారని ప్రశంసించారు. పోలీసులు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హైదరాబాద్ నగరాన్ని ఉద్రిక్తతల నుంచి విముక్తి (టెన్షన్ ఫ్రీ) కలిగించారని అన్నారు. టీఎస్-ఐపాస్, సులభ వాణిజ్య విధానాల (ఈజ్ ఆఫ్ డూయింగ్) వల్ల తెలంగాణకు భారీ మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. ఈ పెట్టుబడులు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయన్నారు.
టీమ్ స్పిరిట్‌తో పనిచేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మంచి టీమ్ స్పిరిట్‌తో పనిచేస్తున్నదని గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, అధికారులు, ఉద్యోగులు పైనుంచి కింది స్థాయివరకు ఒక కుటుంబంగా, కష్టపడి, సమన్వయంతో పనిచేస్తున్నారని విశ్లేషించారు. టీమ్ స్పిరిట్‌ను తీసుకురావడంలో కేసీఆర్ ప్రత్యేక కృషి జరిపారని తెలిపారు. సమాజంలో అన్ని స్థాయిల్లో అవినీతిని రూపుమాపాలని గవర్నర్ అభిలషించారు. అదే దారిలో ప్రభుత్వం కూడా నిర్దిష్టమైన చర్యలను తీసుకుంటున్నదన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల అవినీతి నిర్మూలన జరిగి సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు సకాలంలో పూర్తయి, త్వరలోనే ప్రజలకు పూర్తి ఫలాలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. అవినీతి లేని సమాజ నిర్మాణానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేయాలని సూచించారు. అధికారులకు ఏదైనా మంచి పని అనిపిస్తే దానిని అదే రోజు పూర్తి చేయాలి. అది దశాబ్దాల వరకు పునాదిగా ఉంటుంది. ఈ క్రమంలో అధికారులందరూ సహకరించి ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి సహకరించాలి అని గవర్నర్ కోరారు.
రాజ్‌భవన్‌లో సందడి రాజ్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులకు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సామాన్య ప్రజలు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ దంపతులు సామాన్య ప్రజలు, విద్యార్థుల సమక్షంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకొన్నారు. ప్రజలు ప్రభుత్వం కలిసి పనిచేస్తే అద్భుత ఫలితాలుంటాయని, తెలుగు రాష్ర్టాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని గవర్నర్ అన్నారు. ఈ ఏడాది ప్రజలు ఆయురారోగ్యాలతో, శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ చక్రపాణి, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు గవర్నర్ దంపతులను కలిసి పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎంజీ గోపాల్, డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రశాంత్‌కుమార్ ఝా తదితరులు పాల్గొన్నారు.