జిల్లాల సంఖ్య పెరిగినప్పుడు పట్టణ ప్రాంతాల విస్తీర్ణత పెరుగుతుంది. సేవా రంగం అభివృద్ధి చెందుతుంది.
అన్ని ప్రాంతాల్లో విద్య, వైద్యం తదితర కీలక రంగాల్లో అవకాశాలు విస్తృతమవుతాయి. అలాగే వ్యవసాయ రంగంలో అభివృద్ధి చోటుచేసుకుంటుంది. జిల్లాల సంఖ్య పెరిగితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలై గ్రామీణాభివృద్ధికి దోహదపడుతుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ పథకాల ద్వారా లభించే రాయితీలు అందుబాటులోకి వస్తాయి. ఈ కారణాలరీత్యా తెలంగాణలో జిల్లాల సంఖ్య తక్షణం పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పాలనా సౌలభ్యం, ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు కావడం, ప్రాంతాల మధ్య అసమానతలు తగ్గిపోవడం, కీలక రంగాల్లో నూతన అవకాశాలు ఏర్పడటం, అభివృద్ధికి బాటలు పడటం, సేవా రంగం విస్తృతం కావడం తదితరమైనవి అన్నీ కొత్త జిల్లాల ద్వారా సాధ్యమవుతుంది.
చిన్న రాష్ట్రాల మాదిరే చిన్న జిల్లాలు ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది. దేశంలోని సగటు జిల్లా విస్తీర్ణాన్ని చూసినా, జనాభాను పోల్చుకున్నా తెలంగాణలోని జిల్లాలు పెద్దగా ఉన్నాయి. కొత్త జిల్లాలపై తగిన దృష్టి లేకపోవడం వలన ఉమ్మడి రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఇప్పటికే చాలా నష్టం జరిగింది. అన్ని రాష్ట్రాలూ కొత్త జిల్లాలను ఏర్పర్చుకున్నా ఇప్పటివరకు ఆ దిశగా దృష్టి సారించని రాష్ట్రాలూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ మాత్రమే. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం సమయానుకూలం మాత్రమే కాక సహేతుకమైనది, అనివార్యమైనది, అభివృద్ధికాముకమైనదీ.
అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైశాల్యపరంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల తర్వాతి స్థానంలో ఉన్నది. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం చూస్తే, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమబెంగాల్ తర్వాత ఐదవ స్థానంలో ఉంది. కానీ జిల్లాల వారీగా చూస్తే మాత్రం అనేక చిన్న రాష్ట్రాల కంటే కూడా వెనుక వరుసలో ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలోని జిల్లాల గణాంకాలను పరిశీలిస్తే, జిల్లాల జాతీయ సగటు విస్తీర్ణం కన్నా, జనాభాకన్నా పలు రెట్లు ఎక్కువగా ఉంది. జిల్లాల జాతీయ సగటు వైశాల్యం 5018 చ.కి.మీ.కాగా, ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి)లోని జిల్లాలది మాత్రం సగటున 11,958 చ.కి.మీ. దేశంలోని ఒక్కో జిల్లాలో సగటున 3.76 లక్షల కుటుంబాలు ఉంటే, ఇక్కడ మాత్రం 11.12 లక్షల కుటుంబాలు ఉన్నాయి. జనాభాపరంగా దేశంలోని జిల్లాల సగటు జనాభా 17.50 లక్షలు ఉంటే, ఇక్కడ మాత్రం 36.78 లక్ష లు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రెండు కొత్త రాష్ట్రాల్లోనూ విస్తీర్ణం, జనాభా ఎక్కువగానే ఉంది. పార్లమెంటు స్థానాలతో పోల్చుకుంటే కూడా జిల్లాల సంఖ్య చాలా తక్కువ.
తెలంగాణలోని జిల్లాల సగటు విస్తీర్ణం 11,480 చ.కి.మీ. దేశంలోని సగటు జిల్లా విస్తీర్ణం (4,834 చ.కి.మీ.)తో పోలిస్తే 237 శాతం అధికం. జనాభారీత్యా చూసుకుంటే దేశంలోని జిల్లాల్లో సగటున 17.50 లక్షలు ఉంటే తెలంగాణలో మాత్రం ఒక్కో జిల్లాకు సగటున 35.28 లక్షలుగా ఉన్నారు. రాజధాని నగరం హైదరాబాద్‌ను మినహాయించి మిగిలిన తొమ్మిది జిల్లాల విస్తీర్ణాన్ని పరిశీలిస్తే సగటున 12,733 చ.కి.మీ. ఉంది. మన దగ్గర ఒక రెవిన్యూ డివిజన్ విస్తీర్ణంకన్నా తక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (12,323 చ.కి.మీ.)తో పోలిస్తే తెలంగాణ జిల్లాల విస్తీర్ణమే ఎక్కువ. మనకంటే తక్కువ విస్తీర్ణం ఉన్న ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లలోనూ జిల్లాల సంఖ్య ఎక్కువగానే ఉంది. వివిధ రాష్ట్రాలలో జిల్లాల సంఖ్య చూస్తే- తమిళనాడులో 32, కర్నాటకలో 30, గుజరాత్‌లో 26, ఒడిషాలో 30, జార్ఖండ్‌లో 24, ఛత్తీస్‌గఢ్‌లో 27 ఉన్నాయి. ఈ రాష్ట్రాలన్నీ ఇటీవల జిల్లాల సంఖ్యను పెంచుకున్నాయి. చిన్న రాష్ట్రాలైన కేరళ, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, అస్సాం రాష్ట్రాల విస్తీర్ణం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకంటే అనేక రెట్లు తక్కువ. జనాభాలోనూ తక్కువే. ఈ రాష్ట్రాల్లోని జిల్లాల సగటు విస్తీర్ణం మూడు వేల చ.కి.మీ. కంటే తక్కువే. అయినా జిల్లాల సంఖ్య ఎక్కువ. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు జనాభా 3.56 కోట్లు ఉంటే 2012 నాటికి అది దాదాపు 8.50 కోట్లకు చేరుకుంది. అయినా ప్రకాశం, రంగారెడ్డి, విజయనగరం అనే మూడు జిల్లాలు మాత్రమే గడిచిన ఆరు దశాబ్దాల్లో ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే 2001 జనాభా లెక్కల తర్వాత వివిధ రాష్ట్రాల్లో 88 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ఈ రాష్ట్రాలన్నీ వాటి పాలనా సౌలభ్యం, అభివృద్ధి కోసం కొత్త జిల్లాలను ఏర్పర్చుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రం మాత్రం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. పట్టణాల సంఖ్యగానీ, మండలాల సంఖ్యగానీ పెరగలేదు.
ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని పట్టణ జనాభా, పట్టణాల (చిన్న, పెద్ద కలుపుకొని) సంఖ్య పొంతనలేని విధంగా ఉన్నది. పట్టణ జనాభా దామాషా (సగటు నిష్పత్తి) 33 శాతం మాత్రమే. జాతీయ సగటు 32 శాతం. 2011 జనాభా లెక్కల ప్రకారం వివిధ రాష్ట్రాల వివరాలను పరిశీలిస్తే- మహారాష్ట్రలో 46 శాతం, గుజరాత్ 43 శాతం, కర్నాటక 39 శాతం, తమిళనాడు 49 శాతం, పంజాబ్ 38 శాతం, కేరళ 48 శాతం ఉన్నట్లు స్పష్టమవుతున్నది. తెలంగాణలో పట్టణాల సంఖ్య కూడా చాలా తక్కువ. తమిళనాడులో 1097 పట్టణాలు, గుజరాత్‌లో 350, కర్నాటకలో 347, కేరళలో 520, ఉత్తరప్రదేశ్‌లో 915, పంజాబ్‌లో 217, పశ్చిమబెంగాల్‌లో 909 చొప్పున ఉన్నాయి. ఆ విధంగా మిగిలిన రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో జనాభా ఎక్కువ ఉన్నా జిల్లాల సంఖ్య, పట్టణాల సంఖ్య, పట్టణ జనాభా తక్కువే ఉన్నది. పై వివరాలన్నింటి ప్రకారం తెలంగాణ లో జిల్లాల సంఖ్య కనీసంగా 25 ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కువ జిల్లాలు ఉన్న రాష్ర్టాల్లో మానవ అభివృద్ధి సూచిక కూడా ఎక్కువగా ఉన్నది. తక్కువ జిల్లాలు కలిగిన మన రాష్ట్రంలో ఇది తక్కువగా ఉన్నది.
కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనందుకు తెలంగాణకు, ఏపీకి తీవ్ర నష్టం జరిగింది. ఉదాహరణకు ప్రతి జిల్లాకు కనీసం ఒక నవోదయ విద్యాలయాన్ని ఏర్పర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో దేశంలోని 680 జిల్లాల్లో సుమారు 900 నవోదయ విద్యాలయాలు ఏర్పడ్డాయి. తెలంగాణకు తొమ్మిది నవోదయ విద్యాలయాలు మాత్రమే లభించాయి.
కొత్త జిల్లాల వల్ల ప్రతి జిల్లాలకు ఇకపై అదనంగా ఇద్దరు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులు వస్తారు. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పకడ్బందీగా, సంతృప్తికరంగా అమలవుతుంది. ఇందుకోసం ఇప్పటికే ప్రధానికి, కేంద్ర హోం మంత్రికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి ఏ విధంగా సాధ్యమో ఎక్కువ జిల్లాలతో కూడా అభివృద్ధి అదేవిధంగా సాధ్యమవుతుంది. గ్రామాలకు, చిన్న-పెద్ద పట్టణాలకు మధ్య అంతరం తొలగిపోతుంది. పరిపాలనా ఫలాలు అన్ని ప్రాంతాలకు సమంగా అందుతాయి.
జిల్లాల సంఖ్య పెరిగినప్పుడు పట్టణ ప్రాంతాల విస్తీర్ణత పెరుగుతుంది. సేవా రంగం అభివృద్ధి చెందుతుంది. అన్ని ప్రాంతాల్లో విద్య, వైద్యం తదితర కీలక రంగాల్లో అవకాశాలు విస్తృతమవుతాయి. అలాగే వ్యవసాయ రంగంలో అభివృద్ధి చోటుచేసుకుంటుంది. జిల్లాల సంఖ్య పెరిగితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలై గ్రామీణాభివృద్ధికి దోహదపడుతుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ పథకాల ద్వారా లభించే రాయితీలు అందుబాటులోకి వస్తాయి. ఈ కారణాలరీత్యా తెలంగాణలో జిల్లాల సంఖ్య తక్షణం పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇందుకోసం సామాజిక శాస్త్రవేత్తలు, మేధావులు, రాజకీయ నాయకుల మొదలు సామాన్యుడి వరకు నైతికంగా మద్దతు ఇచ్చి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సి ఉంది.