-ప్రాజెక్టులు రీ డిజైన్చేసి రెండేండ్లలో అందిస్తాం -డిజైన్ మార్పుతో తోటపల్లికి ముంపు తప్పింది -భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు -స్వగ్రామంలో మంత్రికి గ్రామస్థుల ఘనస్వాగతం

రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. బుధవారం కరీంనగర్ జిల్లా బెజ్జంకితోపాటు స్వగ్రామైన తోటపల్లిలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. రూ.30.36 కోట్లతో తోటపల్లి చెరువును రిజర్వాయర్‌గా మార్చే పనులకు, గోదాములు, ఐకేపీ ప్లాట్‌ఫాం నిర్మాణాలకు శంకుస్థానలు చేశారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ఐదు గ్రామాలను, మూడు వేల ఎకరాల ముంపును తప్పిస్తూ తోటపల్లి చెరువును రిజర్వాయర్‌గా మార్చేందుకు రీ డిజైన్ చేయించినట్లు చెప్పారు. పాత డిజైన్‌తో నిర్మాణం చేపడితే ఐదు గ్రామాలు, మూడు వేల ఎకరాలకు ముంపుతప్పేది కాదని, ఇంతచేసినా 45 వేల ఎకరాలకే సాగునీరు అందేదన్నారు. డిజైన్ మార్పుతో ముంపుతప్పడం తోపాటు 52 వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇదేమాదిరిగా రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో ఉన్నలోపాలను సవరించేందుకు రీడిజైన్ చేసి రెండేం డ్లలో ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల చొప్పున కోటి ఎకరాలకు సాగునీరు అందించబోతున్నామన్నారు.
వచ్చేఏడాది జూన్‌లో మధ్యమానేరు ప్రాజెక్టులో మూడు టీఎంసీల నీటిని ఆపుతామని, 2017లోగా అక్కడి నుంచి తోటపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తామని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తయితే కరీంనగర్ జిల్లా సస్యశ్యామలమవుతుందని, దీనికి రైతుల సహకారం చాలా అవసరమన్నారు. భూములు ఇచ్చిన 15 రోజుల్లో అధికారులు ఇంటికొచ్చి నష్టపహారం చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్థలం కేటాయిస్తే బెజ్జంకికి రైతు బజారు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హరీశ్‌రావు రాక సందర్భంగా ఆయన స్వగ్రామం తోటపల్లిలో టీఆర్ఎస్ శ్రేణులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమాల్లో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌రావు, ఎంపీ వినోద్‌కుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు తన్నీరు శరత్‌రావు తదితరులు పాల్గొన్నారు