-ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవాలి -విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టండి -ఉమ్మడి ఖమ్మం నేతలతో మంత్రి కేటీఆర్

‘ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఐక్యం గా ఉండాలి. ఖమ్మం గుమ్మం మీద గులాబీజెండా రెపరెపలాడాలి’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. ప్రభు త్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. గురువారం ప్రగతిభవన్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. త్వరలో జరుగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తీరాలని, ఇందుకోసం కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతి లో అభివృద్ధి జరిగిందని, ప్రజలు టీఆర్ఎస్ ప్రభు త్వం వైపు ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇలాంటి తరుణంలో కొన్ని రాజకీయ శక్తులు పనిగట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలుచేస్తున్నాయని మండిపడ్డారు. వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంతోపాటు వాస్తవాలను ప్రజల ముందు చర్చకు పెట్టాలని సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. అందరినీ కలుపుకొనిపోయే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర సాధన తరువాత ఖమ్మం ముఖచిత్రమే మారిపోయిందనేది అందరికీ తెలిసినా, పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల్లో చర్చజరిగేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉన్నదని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తాచాటాలి ఖమ్మం జిల్లాలో మంత్రి, మాజీ మంత్రి, ఎంపీ, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ల నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతోపా టు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ విజయం సాధించాలనే పట్టుదలను అందరిలోనూ నింపాలని సూచించారు. సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నాయకుడు నామా నాగేశ్వర్రావు, రైతుబంధుసమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, రాములు, హరిప్రియానాయక్, ఉపేందర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్రా వు, సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎమ్మెల్యే చంద్రా వతి, జెడ్పీ చైర్మన్లు కమల్‌రాజ్, కనకయ్య, పార్టీ రాష్ట్ర ఫ్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తాతా మధు తదితర ముఖ్యనేతలు పాల్గొన్నారు.