ప్రపంచపటంలో తెలంగాణను సగౌరవంగా నిలుపుతున్న నిరంతర చైతన్యశీలి కేసిఆర్ గారి మార్గనిర్దేశనం, మనలో స్ఫూర్తిని నింపి, మనను నడిపించే ప్రగతిబాట కావాలి.
కరీంనగర్‌లోని 30వ డివిజన్‌లో 2017 ఏప్రిల్ 2న ఏర్పాటుచేసిన ఒక సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత నేను ఆ రశీదును ఉద్వేగంతో కళ్ళకద్దుకున్నాను. దీన్ని గమనించిన ఒక విలేకరి ఎందుకు భక్తిభావంతో ఆ రశీదును కళ్ళకద్దుకున్నారని అడిగాడు. అందుకు నేను వెంటనే ఆయనకు సమాధానం చెప్పాను. టీఆర్‌ఎస్ పార్టీ ద్వారా, సీఎం కేసీఆర్‌చే ఎమ్మెల్సీ పదవిని పొందినందుకో, లేక ఇంకేదో వ్యక్తిగత లబ్ధి కలిగినందు కో సంతోషంలోంచి పెల్లుబుకింది కాదు ఆ స్పందన. 16 ఏండ్లకు ముందు ఒక చారిత్రక ఆవశ్యకతగా ఏర్పడిన ఒక ప్రజాస్వామిక రాజకీయ పార్టీ, వేనవేల బలిదానాలకు సిద్ధపడి, పోరాటమే ఊపిరిగా, త్యాగమే ఆదర్శంగా, ప్రజాబలమే తనశక్తిగా చేసుకొని, సుదీర్ఘ శాంతియుత పోరాటం నెత్తురు చుక్క నేల రాలకుండా సాధించిన విజయంతో ఉద్యమాల చరిత్రలోనే కొత్త చరిత్రను లిఖించింది. నేడు ప్రజల జీవన స్థితిగతుల్ని పూర్తిగా మార్చివేసి, ఒక నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టిస్తున్న మహాసముద్రం వంటి పార్టీలో నేను ఓ నీటి బిందువుగా మారుతున్న అవకాశానికి, ఆనందంతో ఉప్పొంగిన ఉద్వేగభరిత సన్నివేశ స్పందన అది.
రాజ్యాంగ పరిధిలో ఏర్పడిన ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీ అధినేత దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న వ్యవస్థలోని మలినాన్ని సమూలంగా కడిగేసి, మూడేళ్ళలోనే ప్రపంచం నివ్వెరపోయే ప్రయోగాత్మక పథకాలతో ప్రగతికి బాటలు వేసిన ఘనత, పార్టీగా టీఆర్‌ఎస్‌ది. అధినేతగా కేసీఆర్ ది. రాజ్యం ఎంత శక్తివంతమైందో రాజకీయ విశ్లేషకులందరికీ తెలుసు. అది రెండువైపులా పదునున్న ఆయుధం. అది నెత్తుటి ప్రవాహాల్ని పారించగలదు. శాంతి కపోతాల్ని ఎగురేయగలదు. ప్రభువులై పల్లకీలో ఊరేగే శక్తీ దానిదే. ప్రజల పాదాల చెంత మోకరిల్లే సంస్కారమూ దానిదే! దాని అధికారంతో ప్రజలను అభివృద్ధి అందలాలెక్కించినా, అధఃపాతాళానికి తొక్కేసినా రాజ్యానికి దఖలు పడిన అధికార బలం అత్యంత శక్తివంతమైనది. రాజ్యాధికారాన్ని చలాయించే ప్రభువుల నీతీ, నిజాయితీ, అనుభవమూ,అంకితభావమూ, త్యాగమూ,అహం, స్వార్థం, అవినీతి, బంధుప్రీతి మొదలగు అనేక వ్యక్తిగత లక్షణాలు, వైఖరులు వారివారి దార్శనికతలపై ఆధారపడి, వాటికనుగుణంగా తీసుకొనే ప్రతి నిర్ణయమూ మంచీ చెడులుగా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయి.
అరవై ఏళ్ళకు పైగా ఇదే వ్యవస్థ, ఇవే రాజకీయపార్టీలు, వీళ్ళే నేతలు. ఇదే భూమి, ఇవే వనరులు, ఇవే పన్నులు. కానీ, అధికారం ఎవరి చేతుల్లోంచి ఎవరి చేతుల్లోకి మారినా, ఏ పార్టీ గద్దెదిగి, ఏ పార్టీ గద్దెనెక్కినా, ఎన్ని దశాబ్దాలు గడిచిపోయినా, ప్రజల జీవితాల్లో అవే కష్టాలు, కన్నీళ్ళు. కారణం ఒక్కటే. అత్యంత శక్తివంతమైన రాజకీయ అధికారాన్ని ప్రభువు లు తమ ప్రయోజనాలకు వాడుకొని, తాము వేల కోట్లకు పడగలెత్తి, ప్రజలను నిత్య దరిద్రంలోకి నెట్టివేశారు. తూతూమంత్రపు సంక్షేమ పథకాల ను అమలుపరచి శాశ్వత ప్రగతిని విస్మరించారు. ప్రజలను అధికారాన్ని కట్టబెట్టే ఓటర్లుగానే చూశారు కానీ, సంపదకు, అభివృద్ధికి వారిని హక్కుదారులుగా ఏనాడు భావించలేదు. అధికార మత్తులో తూలిపోతూ, ప్రజ ల అవసరాలేంటి, వారిని దరిద్రంలోకి నెట్టివేస్తున్న కారణాలేంటి అని ఆలోచించలేదు. ప్రజల ఆత్మహత్యలు, ఆకలిచావులు, వలసలు మొదలైన తీవ్రమైన పరిణామాలకు పరిష్కారాలేంటి? అన్న సోయికూడా లేకుండా ఐదేళ్ళ కాలాన్ని ఆటవిడుపుగా గడిపారే కానీ, వారిచ్చిన అధికారంతో ఎన్ని మౌలిక మార్పులు తీసుకురావచ్చో ఒక విజన్ అంటూ లేకుండా పరిపాలన కొనసాగించారు.
చేతగాని నాయకుల, చేవచచ్చిన పార్టీల ఆలోచనలను, ఆచరణను బద్ద లుకొడుతూ ఒక పార్టీ ఆవిర్భవించింది. అదే టీఆర్‌ఎస్ పార్టీ. వెయ్యేళ్ళ చారిత్రక అనుభవాన్ని ఆకళింపు చేసుకొని, వందేళ్ళ ముందుచూపును ఆలోచనల్లో రంగరించుకొని, ప్రజల కష్టాలు, కన్నీళ్ళ నివారణే కార్యాచరణగా రూపొందించుకొని, పల్లెల ప్రగతియే బంగారు తెలంగాణకు బాస ట అని మదిన నిలుపుకొని, పోరాటం, పరిపాలనాదక్షత ఉచ్చ్వాసనిశ్వాసాలుగా కదిలిపోతున్న నాయకుడొకడు ఆవిర్భవించాడు. అతడే కేసీఆర్. టీఆర్‌ఎస్ పార్టీ పుట్టుకే ఒక ఉద్యమాన్ని కలగంటూ పుట్టింది. ఆ కలను సాకారం చేసే పోరాటంలో అడుగులు కదుపుతూ ఆఖరి విజయాన్ని అం దుకొని, ప్రజల ఆశీస్సులతో అధికారాన్నీ అందిపుచ్చుకున్నది. ఇప్పుడీ పార్టీ లక్ష్యం తెలంగాణ పునర్నిర్మాణం! పునర్నిర్మాణమంటే ఊహామాత్రపు నినాదం కాదు. ఊకదంపుడు ఉపన్యాసమూ కాదు. నాయకుడి నుంచి మొదలుకొని, కార్యకర్త వరకు ఈ భావనను మదినిండా నింపుకొని, పార్టీ జెండా నీడలో నిరంతరం పరిశ్రమించినపుడే అది సాధ్యమవుతుంది. అందుకు అందరికీ ఆదర్శం అధినేత కేసీఆరే!
63 ఏండ్ల వయస్సులోనూ, 18 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తూ, ప్రతి సమస్యకో పరిష్కారాన్ని, ప్రతి అవసరానికి ఒక పథకాన్ని రూపకల్పన చేస్తూ, ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే వినియోగిస్తూ, ప్రజలిచ్చిన డబ్బు ను ప్రజల కోసమే ఖర్చుపెడు తూ, ఒక మానవ కంప్యూటర్ గా, సూక్ష్మాతీసూక్ష్మ విషయాల ను అధ్యయనం చేస్తూ, ఆచరణను రూపొందిస్తున్నారు. కేసీఆర్ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకుపోయే యంత్రాంగం టీఆర్‌ఎస్ పార్టీ! కాబట్టి టీఆర్‌ఎస్ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సభ విజయవంతమైంది. రాజకీయ శ్రేణులకు పార్టీ తల్లిలాంటిది. అధినేత ఆలోచనలను ప్రజల్లోకి తీసుకుపోయి విస్తృత ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త ది. అసత్య ప్రచారాలతో, అభూత కల్పనలతో ప్రజలను గందరగోళపరిచే ప్రతికూలశక్తుల ప్రయత్నాలను తిప్పికొట్టి ప్రజలకు పార్టీ విధానాలను, ప్రభుత్వం చేపట్టిన పథకాలను తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరిదీ.
టీఆర్‌ఎస్‌కు ఇతర రాజకీయ పార్టీలకు లక్ష్యాత్మకంగా కానీ, ఆచరణాత్మకంగా కానీ ఎంతో వ్యత్యాసమున్నది. పదవుల కోసమే మిగతా పార్టీల నాయకుల నుంచి కార్యకర్తలదాకా పనిచేయ డం మనం చూస్తున్నాం. కానీ, సీమాంధ్రుల సంకెళ్ళ నుంచి తెలంగాణ తల్లిని విముక్తం చేసి న చారిత్రక పోరాటంలో భాగస్వాములు మన టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు. ఎన్నో త్యాగాలు చేసి, పార్టీ జెండాను మోసి, ఇప్పటి ఈ స్థితికి కారకులైన ప్రతి ఒక్కరూ వ్యక్తిగతం కంటే, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్న విషయాన్ని ఎప్పుడూ మరువరాదు. తెలంగాణ బతుకుచిత్రాన్ని మార్చేందుకు బాసటగా కలకాలం టీఆర్‌ఎస్ పార్టీ నిలువాలన్న అధినేత ఆశయానికి మనమంతా కట్టుబడి ఉన్నప్పుడే పార్టీ పదికాలాలు పచ్చగా ఉంటుంది.
గుండె గుండెలో గులాబీ జెండా ఆశయాలు గుబాళిస్తుండాలి. నిన్న విముక్తి లక్ష్యంతో నాటిన చిన్నమొక్క టీఆర్‌ఎస్ పార్టీ, నేడు విశ్వవ్యాప్త కీర్తిని గడించి, మహావృక్షమై విస్తరించింది. మన ప్రతి అడుగులో అమరుల త్యాగాలు గుర్తుకురావాలి. ప్రతి ఆలోచనలో జనం గుండెసడి వినపడుతూ ఉండాలి. ప్రతి ఆచరణలో తెలంగాణ తల్లి ఆత్మ ప్రతిఫలిస్తుండాలి. ప్రపంచపటంలో తెలంగాణను సగౌరవంగా నిలుపుతున్న నిరంతర చైతన్యశీలి కేసీఆర్ గారి మార్గనిర్దేశనం, మనలో స్ఫూర్తిని నింపి, మనను నడిపించే ప్రగతిబాట కావాలి. -(వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు)