Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠం కావాలి

మానవ వనరుల అభివృద్ధితో అద్భుతాలు: సీఎం కేసీఆర్

ఎన్నో ఏండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాజ్యంలో దుఃఖం అంతం కావాలని, పేదరికం పోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అకాంక్షించారు. సొంత రాబడులలో దేశంలో నంబర్ వన్‌గా నిలిచిన తెలంగాణలో గ్రామీణ ఆర్థిక వికాసానికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయంలో తన ఆలోచనలను ఆయన వివరించారు. సామాజిక చైతన్యంకోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి గత రెండు బడ్జెట్‌లలో రూ.పది కోట్ల చొప్పున ఇప్పటికే రూ.20 కోట్లు ఇచ్చామని, వచ్చే వార్షిక బడ్జెట్‌లో సంక్షేమ నిధికి మరో రూ.30 కోట్లను మంజూరు చేయనున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయంతోపాటు ఇండ్లను నిర్మించి ఇస్తామని, ఆడపిల్లల వివాహాలకు రూ.3 లక్షలు.

తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిలషించారు. దీనికోసం మానవ వనరులు అభివృద్ధి చెందాలని అన్నారు. మానవ వనరుల అభివృద్ధితో కులవృత్తులు సహా అన్ని రంగాల్లో గణనీయమైన ఫలితాలు వస్తాయని చెప్పారు. శుక్రవారం బేగంపేట సీఎం నివాస ప్రాంగణంలోని జనహిత భవనాన్ని జర్నలిస్టు కుటుంబాల సమావేశంతో సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజ అభివృద్ధికి తీసుకోబోయే చర్యలను ముఖ్యమంత్రి వివరించారు. ఉదాహరణకు గొర్రెల పెంపకందార్లను తీసుకుంటే వారికి ప్రభుత్వం ఇవ్వనున్న జీవాలతో వారి మొత్తం ఆర్థిక వ్యవస్థ రూ.25వేల కోట్ల వరకు ఉంటుందని అన్నారు. మత్స్యకారులు, ఇతర కులవృత్తులవారికీ ఇదే వర్తిస్తుందని చెప్పారు.

ముఖ్యమంత్రి ఏమన్నారో ఆయన మాటల్లోనే.. మీకో మంచి మాట చెప్పాలి. ప్రభుత్వం ఆలోచించే తీరు కూడా మీ అందరికీ తెలువాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసే దిశలో ఆలోచిస్తున్నాం. ప్రభుత్వాలు ఒక్కో విధంగా ఆలోచన చేస్తుంటాయి. తెలంగాణ బందీఖానా నుంచి బయటపడింది. 2014, జూన్‌దాకా బందీలమై ఉన్నాం. అప్పటివరకు మన గురించి, మన బతుకుల గురించి ఆలోచించిన వారు లేరు. మంచి చెడులను చెప్పుకునే పరిస్థితి లేదు. ఏమైనా అడిగినా వెటకారం! ఎగతాళి చేసే వారు. గతం గతః. ఇప్పుడు దుఃఖపడ్డా లాభంలేదు. ఒక సంతోషకరమైన వార్తను మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఉద్యమ సమయంలో చెప్పిన.. తెలంగాణ మంచి ఆర్థిక సౌష్టవం ఉన్న ప్రాంతమని. ఎలా నిధులు మళ్లుతున్నాయి.. మన నిధులను ఇతర ప్రాంతాలలో ఎలా వాడుతున్నారనే విషయాన్ని చాలా వేదికలపై లెక్కలతో సహా వివరించా. నమస్తే తెలంగాణ ఎడిటర్‌గా అల్లం నారాయణ కూడా పుంఖానుపుంఖాలుగా వార్తలు రాశారు. ఆనాడు రాసింది హండ్రెడ్ పర్సెంట్ నిజమైంది. తెలంగాణ తనకు తానుగా సంపాదించే ఆదాయంలో గణనీయమైన వృద్ధిని సాధించింది. సొంత రాబడులలో 19.5% వృద్ధి రేటు సాధించి ఇండియాలోనే మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్థిక పరిస్థితిపై చాలా అధ్యయనం చేశాం. ఆదాయం పెరుగుతుందా? తగ్గుతుందా? అని గమనించాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి పది నెలలు గడిచిపోయాయి. ఒక ఆర్థిక సంవత్సరం మార్చి నుంచి మరో ఆర్థిక సంవత్సరం మార్చి వరకు వేచిచూస్తే అసలు విషయం తెలుస్తుంది. రెండో ఏడాదిలో ఎంతో వృద్ధి కనిపించింది. ఈ ఏడాదిలో రెండు క్వార్టర్లలో 21% వృద్ధి రేటు పెరిగింది. మన రాష్ట్రంలో 95% అవినీతిని అరికట్టగలిగాం. అరాచకాలు లేవు. అద్భుతమైన గ్రోత్ 21% ఉంది. తెలంగాణ ఆదాయం ఏటా 10-15వేల కోట్ల రూపాయల వరకు పెరుగుతుంది. ఇంత డబ్బు ఉన్నది కాబట్టే ఇంత ధైర్యంగా పనులను చేపడుతున్నాం. మనది ధనిక రాష్ట్రం. మంచి రాష్ట్రం.

ఇదీ హ్యూమన్ రిసోర్స్ అంటే..

అసలు హెచ్‌ఆర్ అంటే ఏమిటి అనే నిర్వచనం చాలామంది అధికారులకు కూడా తెలియలేదు. మొట్టమొదట నేను మ్యాప్ యువర్ లోకల్ రిసోర్స్ చేసి ఇవ్వమని అధికారులకు చెప్పాను. వాళ్లకు అర్థంకాలేదు. అంటే ఏమిటి? హెచ్‌ఆర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్. హ్యుమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ అనే దృక్పథం ఉంది. అసలు లోకల్ రిసోర్స్ అంటే మంచినీటి వనరులా? లేక ప్రకృతి వనరులా? అనేది అర్థంకాక తికమక పడ్డారు. కానీ హెచ్‌ఆర్ అంటే స్థానికంగా ఉండే మానవ వనరులు. తెలంగాణలో దాదాపు 40లక్షల మంది మత్స్యకారులున్నారు. అందులో గంగపుత్రులు, ముదిరాజ్‌లు కూడా ఉన్నారు. చేపలను పైసలుగా మార్చి వారికి ఉపాధి కల్పించడమే హ్యూమన్ రిసోర్సెస్. నేను శాసనసభలో చేపల గురించి వివరంగా చెప్పాను. అసెంబ్లీలో నా ప్రసంగం విని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముత్తా గోపాలకృష్ణ పర్సనల్‌గా నా దగ్గరకు వచ్చి అభినందించారు. రాష్ట్రంలో దాదాపు 25లక్షల మంది గొర్రెల పెంపకందారులున్నారు. ఈ రోజు బాధాకరమైన విషయం ఏమిటంటే హైదరాబాద్‌కు రోజుకు 600లారీల గొర్రెలు దిగుమతి అవుతున్నాయి. రాంనగర్ చేపల మార్కెట్‌కు 35లక్షల చేపలు వేరే ప్రాంతాల నుంచి వస్తున్నాయి. అంటే మనం అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి చేయలేకపోతున్నాం. గత పాలకులు ఇప్పటివరకు ఈ వనరుల గురించి ఆలోచించలేదు. ఇప్పడు స్టార్ట్ అయింది. 25లక్షల మంది యాదవులను రత్నాలుగా మార్చే శిక్షణనిస్తాం. నాలుగు లక్షల కుటుంబాలకు 75% సబ్సిడీపై గొర్రెపిల్లలను ఇస్తాం. ఐదేండ్లలో నాలుగు కోట్ల గొర్రెపిల్లలు ఉత్పత్తవుతాయి. రూ.25కోట్ల సంపదకు వారు అధిపతులవుతారు. దిసీజ్ తెలంగాణ. ఒకనాడు నేను చెప్పిన.. ఆంధ్రప్రదేశ్‌లో ఢిల్లీకి వెళుతున్నా. కానీ తెలంగాణను సాధించే అడుగుపెడుతా అని. అది చేసి చూపిన. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణను తీర్చిదిద్దుతా. నేను బతికుంటే హండ్రెడ్ పర్సెంట్ సంపదను సృష్టించి చూపుతా అని ముఖ్యమంత్రి చెప్పారు.

పల్లెబాటలో ప్రగతి రథం.. పెట్టుబడులను పెంచేవిధంగా టీఎస్-ఐపాస్ పేరుతో నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చాం. గ్రామీణ వ్యవస్థను పటిష్ఠం చేసే దిశలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టాం. వాటి ఫలితాలు వస్తున్నాయి. ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మంచినీటి సమస్య శాశ్వతంగా దూరం కావాలి. 70% బీమారీలు నీటివల్లనే వస్తున్నయని వైద్య నిపుణులు చెప్తున్నారు. మిషన్ భగీరథతో ఆ సమస్య పరిష్కారమవుతుంది. గతంలో ఆంధ్రావాళ్లు మా అంత మేధావులు లేరన్నట్లు ఉండేవారు. తెలంగాణ వస్తే అంధకారమవుతుందని, కరెంట్ రాదని ఒకాయన కట్టెపెట్టి మరీ చెప్పాడు. కానీ ఈ రోజు కరెంట్ ఉంటే వార్త కాదు.. కరెంట్ పోతే వార్త. ఇక ఈ అభివృద్ధి తర్వాత ఇప్పుడు జరుగాల్సినది ఏమిటి? తెలంగాణ ఏ బాట పట్టాలి? తెలంగాణకు ఏం కావాలి? వనరులు ఏమిటి? తెలంగాణ ఏం చేస్తే ఏమైతది? అనేది మొదలైంది. నీరు అందితే రైతు బాగుపడుతడు. అది అందరికీ తెలిసిందే. వ్యవసాయరంగంతో పాటు తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి. మానవవనరులు పూర్తిగా ఉపయోగంలోకి రావాలి అని సీఎం చెప్పారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎర్రవల్లి ఓ ఉదాహరణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందనడానికి ఎర్రవల్లి ఒక ఉదాహరణ అని ముఖ్యమంత్రి చెప్పారు. నోట్ల రద్దు తర్వాత ఎర్రవల్లి గ్రామ ప్రజలు 75 లక్షల రూపాయలు బ్యాంకులో జమచేశారు. ఇదేమిటంటే మేము కేసీఆర్ ఇచ్చిన పింఛన్ డబ్బులను ఖర్చుపెట్టుకోలేదని, పొదుపు చేసుకున్నామని బ్యాంక్ అధికారులకు చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడితే సామూహిక శక్తి వస్తుంది. ఎలాంటి ఆపద లేదా విపత్కర పరిస్థితులెదురైనా తట్టుకోగలుగుతారు అని ఆయన అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.