రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా సాగుతున్నది.
ఊరూరా పార్టీ శ్రేణులు ఇంటింటికీ తిరుగుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ పార్టీ సభ్యత్వం స్వీకరించి అండగా నిలువాలని కోరుతున్నారు. గురువారం రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సభ్యత్వ నమోదులో పాల్గొంటున్నారు. వనపర్తి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వరంగల్, స్టేషన్‌ఘన్‌పూర్‌లలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎమ్మెల్సీలు మైనంపల్లి హన్మంతరావు, కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు చింతల కనకారెడ్డి, కేపీ వివేకానంద్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మేయర్ బొంతు రామ్మోహన్, జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ తదితరులు పాల్గొని సభ్యత్వాలు నమోదు చేయించారు.
ఏర్గట్లవాసులంతా టీఆర్ఎస్ వైపే నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల గ్రామస్థులంతా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకునేందుకు తీర్మానించుకున్నారు. ఈ మేరకు గురువారం గ్రామంలో సమావేశమై టీఆర్ఎస్కు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డికు మద్దతుగా నిలబడుతామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో 4,500 మంది ఓటర్లు ఉండగా, గురువారం 2 వేల మంది టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. మిగతావారి సభ్యత్వ నమోదు రేపటితో పూర్తవనున్నది.


గులాబీ పార్టీకే రెండు క్యాంపుల మద్దతు నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పాతవర్ని పంచాయతీ పరిధిలోని నెహ్రూనగర్ క్యాంపు, జలాల్పూర్ గ్రామంలోని వెంకటేశ్వర క్యాంపులో టీఆర్ఎస్ సభ్యత్వాల కోసం గురువారం ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు సభ్యత్వ నమోదు నియోజకవర్గ పరిశీలకుడు అంజిరెడ్డి, రాష్ట్ర యువజన సంఘం నేత పోచారం సురేందర్‌రెడ్డి సమక్షంలో రెండు క్యాంపులలోని ఓటర్లు టీఆర్ఎస్ సభ్యత్వాలు పొందారు. నెహ్రూనగర్‌లో 430 ఓటర్లు ఉండగా నూరు శాతం, వెంకటేశ్వర్ క్యాంపులో ఉన్న 100 మంది ఓటర్లు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు.