Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జవాన్లకు సలాం

సైనిక వీరులకు దేశంలోనే అత్యధిక నగదు పురస్కారాలు

ప్రాణాలకు తెగించి సరిహద్దుల్లో దేశానికి కాపలా కాస్తున్న జవాన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ జయజయధ్వానాలు పలికారు. రాష్ట్రానికి చెందిన సైనికుల సంక్షేమానికి భారీగా వరాల వాన కురిపించారు. ఎన్నో కష్టాలకోర్చి దేశ సరిహద్దులో సైనికులు పహారా కాయడం వల్లనే పౌరులంతా భద్రంగా జీవిస్తున్నారన్న సీఎం కేసీఆర్.. అటువంటి సైనికులు, వారి కుటుంబాల క్షేమాన్ని సమాజం తన బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. అనేక వరాలు ప్రకటించారు.

kcr 600 సైనిక సంక్షేమంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలువాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. ఆ మేరకు వారి సంక్షేమానికి అనేక నిర్ణయాలను అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. రాష్ట్రంలోని సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలు సమాజం నుంచి గౌరవాభిమానాలు పొందుతూ, మెరుగైన జీవితం గడిపేలా సమగ్ర విధానాన్ని అమలులోకి తెస్తున్నట్టు వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల అనంతరం సైనిక సంక్షేమం-ప్రభుత్వ కార్యక్రమాలపై సీఎం ప్రకటన చేశారు. దేశంలోనే అత్యున్నతమైన సైనిక పురస్కారాలైన పరమవీరచక్ర, అశోకచక్ర కింద ఇప్పటి వరకూ దేశంలో పంజాబ్ రాష్ట్రంలో అత్యధికంగా రూ.2 కోట్లు గౌరవ నగదు అందిస్తున్నారని పేర్కొన్న సీఎం.. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూ.10లక్షలుగా ఉందని చెప్పారు. దీనిని తెలంగాణ రాష్ట్రంలో రూ.2.25 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మహావీరచక్ర, కీర్తిచక్రఅవార్డు గ్రహీతలకు దేశంలో గరిష్ఠంగా కోటి రూపాయలను పంజాబ్ ఇస్తుండగా.. దానిని తెలంగాణలో రూ.1.25 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇతర సైనిక పురస్కారాలకు ఇచ్చే గౌరవ నగదును కూడా భారీగా పెంచుతున్నట్టు సీఎం ప్రకటించారు. వీటితోపాటు సైనిక కుటుంబాల సంక్షేమానికి ఉద్దేశించి ప్రభుత్వం తీసుకోనున్న పలు చర్యలను కూడా ఆయన వెల్లడించారు. సభ్యుల హర్షధ్వానాల మధ్య సీఎం ప్రకటించిన పలు నిర్ణయాలు ఆయన మాటల్లోనే.. భారతదేశ భౌగోళిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు సైనికులు తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. రక్తం గడ్డ కట్టించే చలిలో, దేహాన్ని దహించే ఉష్ణోగ్రతల్లోనైనా, ఆక్సిజన్ సరిగా అందని శిఖరాగ్రాల మీదనైనా.. ఎక్కడైనా సరే, ఎన్నో కష్టాలను భరిస్తూ సాహసంతో సరిహద్దుల్లో సైనికులు కాపలా కాస్తున్నారు. వారి త్యాగనిరతివల్లే దేశ పౌరులు భద్రతతో జీవించగల్గుతున్నారు. తాము పుట్టి పెరిగిన ప్రాంతానికి, తల్లిదండ్రులకు, భార్యబిడ్డలకు దూరంగా ఉంటూ, జీవితంలో ఎక్కువభాగం దేశ రక్షణలోనే నిమగ్నమవుతున్నారు. ఒక్క సరిహద్దుల్లోనే కాదు.. దేశంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా మేమున్నామని సైనికులు రంగంలోకి దూకి, సహాయ చర్యలు చేపడుతున్నారు. వారు తమ ప్రాణం కన్నా, తమ కుటుంబ క్షేమం కన్నా.. దేశాన్ని సంక్షేమంగా ఉంచడమే ప్రధానమని భావించి పరిశ్రమిస్తున్నారు. అటువంటి వారి క్షేమాన్ని, వారి కుటుంబాల క్షేమాన్ని సమాజం తన బాధ్యతగా తీసుకోవాలి. అదే మనం వారికి ఇచ్చే నిజమైన కృతజ్ఞత అవుతుంది. దేశంలోనే ప్రథమంగా సైనిక సంక్షేమ నిధి ఏర్పాటు సైనిక సంక్షేమంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలువాలి. ఇందుకోసం ప్రజా ప్రతినిధులు, ఉద్యోగుల స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని కోరాం. వారి సహకారంతో ఒక సమగ్ర విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. ఈ పథకం ద్వారా విధి నిర్వహణలో కొనసాగుతున్న సైనికులూ, మరణించిన సైనికుల కుటుంబ సభ్యులూ, యుద్ధంలో క్షతగాత్రులైన వారూ, అంగవైకల్యం పొందిన వారూ, మాజీ సైనికులూ ప్రయోజనం పొందుతారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నాం. సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఖర్చు చేస్తాం. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతి ఏటా రూ.25వేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రూ. 10 వేలు సైనిక సంక్షేమ నిధికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని ఈ నిధికి ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. సైనికులపై ఆదరాభిమానాలు ప్రకటించినందుకు ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రెండు పింఛన్లు అందిస్తాం మాజీ సైనికులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. సైనికులెవరైనా రిటైర్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తే డబుల్ పెన్షన్ పొందే వెసులుబాటు ఉంది. అయితే ఈ సదుపాయం మరణించిన మాజీ సైనికుల భార్యలకు వర్తించడం లేదు. కేంద్రం ఇచ్చేది కానీ, రాష్ట్రం ఇచ్చేది కానీ ఏదో ఒక పెన్షన్ మాత్రమే పొందాలనే విధానం అమల్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసిన మాజీ సైనికులు రెండు పెన్షన్లు పొందే వెసులుబాటు కల్పిస్తున్నాం. మాజీ సైనికుడు మరణిస్తే ఆయన భార్య కూడా రెండు పెన్షన్లు పొందే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రం కల్పిస్తుంది.

గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలకు గౌరవ నగదు భారీగా పెంపు యుద్ధంలో శౌర్యప్రతాపాలు ప్రదర్శించినందుకు, ప్రాణ త్యాగం చేసినందుకు గ్యాలంట్రీ అవార్డు పొందిన సైనికులకు కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం గౌరవంగా కొంత నగదు అందిస్తున్నాయి. పరమ వీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర, సేనా మెడల్‌లాంటి అవార్డులు పొందిన వారికి ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న దానికన్నా ఎక్కువ నగదు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పరమవీర చక్ర, అశోకచక్ర అవార్డు పొందిన వారికి పంజాబ్ ప్రభుత్వం గరిష్ఠగా రూ.2కోట్లు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.10 లక్షలు ప్రకటించింది. ఇప్పటి నుంచి పరమవీరచక్ర అవార్డు పొందిన తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రూ.2 కోట్ల 25లక్షలు ఇవ్వాలని నిర్ణయించాం. మహావీర చక్ర, కీర్తిచక్ర అవార్డులు పొందిన వారికి పంజాబ్ ప్రభుత్వం దేశంలోనే గరిష్ఠంగా రూ.కోటి ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దీన్ని రూ.8 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటి నుంచి మహావీరచక్ర, కీర్తిచక్ర అవార్డులు పొందిన తెలంగాణ బిడ్డలకు రాష్ట్రం తరఫున రూ.1.25 కోట్లు ఇవ్వాలని నిర్ణయించాం. వీరచక్ర, శౌర్యచక్ర అవార్డుల కింద పంజాబ్ రాష్ట్రం గరిష్ఠంగా రూ.50 లక్షలు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూ.6లక్షలు ప్రకటించారు. ఇప్పుడు ఈ అవార్డు కింద తెలంగాణ రాష్ట్రంలో రూ.75లక్షలు ఇవ్వాలని నిర్ణయించాం. సేనా మెడల్ గ్యాలంట్రీ అవార్డు పొందిన వారికి హర్యానా ప్రభుత్వం గరిష్ఠంగా రూ.21 లక్షలు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూ.23,500 మాత్రమే ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం సేనా అవార్డులు పొందిన వారికి రూ.30 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. మెన్షన్ ఇన్ డిస్పాచెస్ గ్యాలంట్రీ అవార్డు పొందిన వారికి పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు రూ.10 లక్షలు ఇస్తున్నాయి. ఇదే అవార్డు పొందిన వారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో మెన్షన్ ఇన్ డిస్పాచెస్ గ్యాలంట్రీ అవార్డు పొందిన వారికి రూ.25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించాం. సర్వోత్తమ యుద్ధ సేనా మెడల్ పొందిన వారికి కేరళలో రూ.20 లక్షలు ఇస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూ.లక్షా 27వేలు ఇచ్చేవారు. సర్వోత్తమ యుద్ధ సేవా మెడల్ పొందిన తెలంగాణ రాష్ట్రం తరఫున రూ.25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించాం. ఉత్తమ యుద్ధ సేవా మెడల్ పొందిన వారికి కేరళలో రూ.16లక్షలు ఇస్తున్నారు. ఉమ్మడి ఏపీలో కేవలం రూ.75వేలు ఇచ్చేవారు. దాన్ని రూ.20 లక్షలు ఇవ్వాలని నిర్ణయించాం. యుద్ధ సేవా మెడల్ పొందిన వారికి కేరళలో రూ.2 లక్షలు ఇస్తుండగా, ఉమ్మడి ఏపీలో కేవలం రూ.34వేలుగా నిర్ణయించారు. దీన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో సైనిక సంక్షేమ బోర్డు రాష్ట్రస్థాయిలోనూ, జిల్లాస్థాయిలోనూ ఉన్న సైనిక సంక్షేమ బోర్డులను బలోపేతం చేస్తాం. ప్రస్తుతం పాత పది జిల్లాల్లో బోర్డులున్నాయి. కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల్లోనూ ఈ బోర్డులను ఏర్పాటు చేస్తాం. ఈ బోర్డుల ద్వారానే సైనిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలల ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పిస్తాం. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఇస్తున్నాం. యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాలకు ఏ రకమైన పరిహారం, సదుపాయాలు ఇస్తున్నారో, సర్వీస్‌లో ఉండి అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాల వంటి ఇతర కారణాలతో మరణించిన సైనికుల కుటుంబాలకూ అదే పరిహారం ఇవ్వాలని నిర్ణయించాం. వరంగల్ సైనిక్ స్కూల్‌పై త్వరలోనే ఎంవోయూ తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది. ఈ స్కూల్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే ఎంవోయూ కుదుర్చుకోబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఉద్యోగ రీత్యా సైనికులు దేశంలోని వివిధ ప్రాంతాలకు మారుతుంటారు. జవాన్లు సొంత వాహనాలకు ఒకసారి ఏ రాష్ట్రంలోనైనా లైఫ్ ట్యాక్స్ చెల్లించి ఉంటే ఆ వాహనాలకు తిరిగి తెలంగాణలో ట్యాక్స్ వసూలు చేయవద్దని ఆదేశాలు జారీ చేశాం. సైనికుల ఇండ్లకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు సైనికులు నిర్మించుకునే ఇండ్లకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించాం. సైనికుల భార్యల పేర ఉన్న ఇంటికి సైతం ఈ మినహాయింపులు వర్తిస్తాయి. డబుల్‌బెడ్‌రూం ఇండ్లలో మాజీ సైనికులకు రెండు శాతం కోటా ఇవ్వాలని నిర్ణయించాం. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వీర సైనికులు, వారి భార్యలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.3వేల నుంచి రూ.6వేలకు పెంచాం. రాబోయే రోజుల్లో సైనికుల సంక్షేమంకోసం మరిన్ని చర్యలను చేపట్టేందుకు రాష్ట్రస్థాయిలో సైనిక సంక్షేమ సలహా మండలి ఏర్పాటు చేశాం. తెలంగాణ రాష్ట్రంలోని సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలు సమాజం నుంచి గౌరవాభిమానాలు పొందుతూ, మెరుగైన జీవితం గడిపేందుకు వీలుగా అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపడుతుందని సభకు తెలియజేస్తున్నాను. జై హింద్.. జై జవాన్.. జై తెలంగాణ అని సీఎం కేసీఆర్ అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.