Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జానపద పాట.. ఉద్యమ ఆట..ధూంధాం

ఇదో పాట పయనం.. అంటరాని బతుకులో జానపదమై.. పంట చేలల్లో గానమై.. పాట ఉరకలెత్తింది. జీతగాని గాయపడ్డ రాగమై.. ఉద్యమ కెరటమై దగాపడిన నేలమీద హోరెత్తింది. తెలంగాణ నాగేటి చాల్లల్లో.. చేను చెల్కల్లో వికసించి పోరాట చైతన్యాన్ని ఊరూరా వెదజల్లింది. ఆ పాటను భుజాన మోస్తూ.. ధూంధాంగా జన ప్రభంజనాన్ని సృష్టించి.. రగిలించి పిడికిళ్లెత్తించిన వాళ్లలో రసమయి బాలకిషన్ ముఖ్యుడు. జీవితమే గానమై.. పాటకు పట్టం కట్టి, పల్లకిలో ఊరేగిస్తున్న రసమయితో ఆత్మీయ సంభాషణ..

పాటంటూ లేకుంటే.. చెప్పుకోవటానికి ఏమీ లేని బతుకు నాది. ఆ పూటకు కనా కష్టం గా ఎల్లదీసిన బతుకులకు రక్తమూ, చెమట ధారపోయటం తప్ప ఏం ఉంటుంది? అట్లాంటి మెతుకులేని మెదక్ జిల్లా నాది. పుట్టినూరు రావురూకుల. ఇప్పుడు.. సిద్దిపేట జిల్లా. మా అయ్య డప్పు కొట్టటంలో మొనగాడు. బాగోతంల రాజేశం కట్టేటోడు. అవ్వ బాగ పాటలు పాడేది. అవ్వ ఎంత మంచిగ పాటలు పాడేదంటే.. అవ్వ వెంటే మిగతా అమ్మలక్కలు కూలికి ఎగబడి పోయేటోళ్లు. అవ్వ పాటలంటే ఇష్టం. ఆ పాటలే నేనూ పాడేటోన్ని. అట్ల అవ్వ ఉగ్గుపాలతోనే పాటలు కూడా నాకు తాపింది. అట్ల చిన్నప్పటి నుంచే నేను పాటగాడినైన. అయ్యపేరు రాజయ్య. అవ్వపేరు మైసమ్మ. ముగ్గు రు అన్నలు, ఇద్దరు చెల్లెండ్లు. నేను చిన్నోన్ని. పెద్దన్న నారాయణరావు దొర దగ్గర, చిన్నన్న బండి నర్సయ్య దొర దగ్గర జీతమున్నరు. అయ్యకూడా దొరదగ్గరే పనిచేసేటోడు. చిన్నోన్ని అయిన నన్ను చేతికందేదాకా ఒట్టిగుంచుడెందుకని బడికి పంపిండ్రు. చిలుంపట్టిన రేకుపల్క పట్టుకుని బడికి పోయేటోన్ని.

మా ఊర్ల చదువుకుంటున్నప్పుడే మూడో తరగతికి మూడింది. మా చిన్నన్న జీతం ఉన్నకాడ ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి బొంబాయి పారిపోయిండు. జీతం ఉంచుకున్న దొరొచ్చి ఇంటిదగ్గర పెద్ద పంచాయితీ పెట్టిండు. కొడుకును జీతం ఉంచుతనని అప్పుతీసుకున్నవ్. నా అప్పన్న కట్టు, లేకపోతే.. మీ చిన్నోన్ని జీతంలకు పంపు అన్నడు. దాంతో.. మా అయ్య నన్ను బడి మాన్పించి మా అన్న జోరబొంత చేతికిచ్చిండు. అట్ల నా మూడో తరగతి సదువు ముగిసింది. బడి మానేసి దొర పసులకాడికి పోయిన. అట్ల రెండేండ్లు దొరకాడ జీతమున్న. దొర పసులను చెల్కలల్ల మేపుతున్నప్పుడు ఎవరైన సార్లు కనిపిస్తే.. శాన సిగ్గనిపించేది. సార్లు కనపడంగనే పొదలసాటుకు ఉరికి దాసుకునేటో న్ని. ఓ రోజు పసుల కాడ ఉన్నప్పుడు పొదలసాటుకు దాసుకున్న నన్ను భూమయ్యసారు చూసిండు.

నా దగ్గరికొచ్చి ఎందుకు దాసుకుంటున్నవని అడిగిండు. సదువు కోవాల్నని ఉంది సార్. కని దొర దగ్గర జీతం ఎవరుంటరు సార్ అన్న. నిన్ను హాస్టళ్ల ఏస్త సదువుకుంటవ అన్నడు. సదువుకుంట సార్ అన్న. ఎండకాలం అయిపోయినంక మళ్లీ బళ్లు తెరిచేటప్పుడు నన్ను భూమయ్య సార్ సిద్దిపేట హాస్టళ్ల ఐదో తరగతిల ఏసిండు. అట్ల భూమ య్య సారు చేసిన సాయం నా జీవితంలో వెలుగులు నింపింది. సిద్దిపేట హాస్టళ్లో మల్లయ్యసార్ నన్ను మంచిగ చూసుకునేటోడు.

హాస్టళ్లో ఉండి చదువుకునేటప్పుడు సెలవులు వచ్చినయంటే.. ఇంటికి పది పన్నెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేటోన్ని. బస్సెక్కి పోవటానికి పైసలుండేవి కావు. రోడ్డెంట నడుచుకుంటూ పోయేటప్పుడు బస్సు వస్తుందంటే.. మా ఊరోళ్లు చూస్తరని రోడ్డుపక్కన చెట్టుసాటుకు దాసుకునేటోన్ని. ఆదివారం ఇంటికి వచ్చినంక అమ్మెంట పొలం పనికి నాట్లేయ, కలుపు కలువ పోయేటోన్ని. వరికోతకు కూలికి పోతే.. అమ్మ నన్ను ఒరం మీద కూసో బెట్టి.. నా వంతు మునుం కూడా అమ్మే కోసేది. అమ్మకు బారాణ కూలి, నాకు చారాణ. దసరా, సంక్రాంతి సెలవులు వస్తే రోడ్డు పనికి, బావులు తొవ్వటానికి కూలికి పోయేటోన్ని. నేను చిన్నోన్ని కదా.. నాకు ఆడోళ్ల కూలి ఏసేటోళ్లు.

నేను ఏడో తరగతి చదువుతున్న. దసరా సెలవులల్ల ఇంటికి పోయిన. అప్పుడు.. మెదక్ జిల్లాల్లోని ఊర్లన్నీ ఉద్యమరాజకీయాలతో కదలబారుతున్న రోజులు. ఒక నాడు.. బక్కపల్చగ ఉన్న ఒకతను ఊర్లోకొచ్చిండు. సదువుకునే పోరగాళ్లతో ప్రేమతో మాట్లాడిండు. అతని స్వచ్ఛమైన నవ్వు.., కరచాలనంలోని ప్రేమ.. అతని కరస్పర్శ నుంచి మాలోకి ఓ నూతన శక్తి ప్రసరించిన అనుభూతి. తర్వాత తెలిసింది..అతనే శాఖమూరి అప్పారావు అట. మెదక్ జిల్లా పీపుల్స్‌వార్ నాయకుడట. ఆయన ఎన్నో విషయాలు చెప్పిండు. దేశ రాజకీయాలు, పాలకుల విధానాలు పూసగుచ్చినట్టు చెప్పిండు. సాంఘిక అసమానతలు, కులవివక్షలు పోవాలన్నడు. పాటలు నేర్పిండు. కలుపు చేన్లల్ల అమ్మ పాడిన పాటలకన్నా.., ఉద్యమ పాటలు కడగొట్టు జీవుల జీవితాల గురించి, కష్టాలు, కన్నీళ్ల గురించి ఉండటంతో అవి సహజంగానే నన్ను ఆకర్షించినై. ఆలోచింపజేసినై.

దొరపెత్తనం, అంటరాని తనం, రెండు గ్లాసుల పద్ధతితో అన్ని రకాల వివక్ష, అణచివేతలకు నెలవులుగా ఉన్న గ్రామాల్లో మెల్లగా ఉద్యమ రాజకీయాల ప్రవేశంతో కొత్త శక్తి వచ్చింది. దసరానాడు.. విద్యార్థి యువకులమంతా కలిసి జననాట్యమండలి పాటలు పాడుతూ జమ్మిచెట్టుకు పోయినం. మా పాటలు విన్న పోలీస్ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేసిండు. పోలీసులొచ్చి అందర్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు జీపుల ఏసుకుపోయిండ్రు. పోలీసులు లాఠీలతో అందర్ని చితకబాదిండ్రు. అందరిలో నేను చిన్నగ ఉన్న. అందుకోసం నన్ను కొట్టలె.. ఎస్సై గోడకుర్చీ ఏపిచ్చిండు. నన్ను పోలీస్ స్టేషన్ల పెట్టేసరికి.. మా అయ్య స్టేషన్‌కొచ్చి ఎవరెవరినో పైరవీ పట్టి నన్ను ఇడిపిచ్చిండు.

నా తర్వాత అందరి తల్లిదండ్రులను పోలీసులు పిలిపిచ్చి మల్ల ఎప్పుడూ పాటలు పాడబోమని రాపిచ్చుకుని హెచ్చరించి వదిలి పెట్టిండ్రు. అయినా మా ఊరు పాత ఊరుగా లేదు. పండుగ పబ్బాలల్ల జేఎన్‌ఎం పాటలే మోగేవి. ఆ చైతన్యమే కొనసాగి.. చివరికి మా అయ్య కూడా మా ఊరికి సర్పంచి అయ్యిండు. అమ్మ పాటలకు ఉద్యమ పాటలు కొత్త జవజీవాలు పోసినై, అవగాహన పెంచినై. ఎక్కడ పోయినా, ఏ మీటింగ్, ఫంక్షన్ అయినా నన్ను పాటలు పాడమని అడిగేటోళ్లు.

పదో తరగతి తర్వాత ఇంటర్ దుబ్బాక జూనియర్ కాలేజీలో చేరిన. కాలేజీల కూడా ఉద్యమ వాతావరణం జోరుగ ఉండె. అప్పుడప్పుడు హాస్టల్, కాలేజీ విద్యార్థుల మీటింగులల్ల పాడేటోన్ని. అట్ల కాలేజీల నాకు మంచి గుర్తింపు వచ్చింది. మొట్టమొదటి సారి స్థానిక విద్యార్థి కాకుండా.., నేను దుబ్బాక కాలేజీ చైర్మన్‌గా ఎన్నికైన. ఉరుకులు, పరుగులతో ఇంటర్ అయిపోవచ్చింది. సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తున్న సమయంలోనే నన్ను, మరో మిత్రున్ని అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చిండ్రు. లెక్చరర్లు మాకు పోలీసులు వచ్చిన విషయం చెప్పి, పరీక్ష అయిపోయిన తర్వాత ఎలా తప్పించుకు పోవాల్నో చెప్పిండ్రు. అలా నా మిత్రుడు పరీక్ష రాసి పరుగెత్తుతుంటే.. పోలీసులు అతని వెంటపడ్డరు. అదే అదనుగా నేను కూడా ఇన్విజిలేటర్‌వైపు నా పేపర్ ఇసిరేసి పరారైన. ఎండా కాలం సెలవులు. ఈ క్రమంలోనే కాలేజీలో పరిచయమైన రజియా ఇంటికాడి పరిస్థితి దయనీయంగా తయారైంది.

అనివార్య పరిస్థితుల్లో రజియా, నేను ప్రేమ వివాహం చేసుకున్నం. కానీ.. వాళ్లు ముస్లింలు. దాడులు చేయొచ్చు, హిందూ ముస్లిం గొడవలు లేపొచ్చు అని.. మమ్మల్ని నా మిత్రులు అక్కడ ఉండనీయలే. పెళ్లి అయితే చేసుకున్నం కానీ.., నిలువ నీడ లేదు. రోజు గడువటమే కష్టంగా మారింది. చేతిలో చిల్లిగవ్వలేదు. దీనికితోడు.. అటు రజియా కుటుంబం తరఫున, ఇటు పోలీసుల నుంచి నిత్యం అభద్రత. ఈ పరిస్థితుల్లో ఓ మిత్రుని ఆహ్వానం.. సలహా మేరకు హన్మకొండ చేరుకున్న.

రజియా వరంగల్‌లో నర్సింగ్ కోర్సులో చేరింది. నేను సీకేఎం కాలేజీలో డిగ్రీలో చేరిన. కాలేజీకి మా రూము ఐదు కిలోమీటర్ల దూరం. రోజు నడుసుకుంట కాలేజీకి పోయేటప్పుడు రోడ్డుపై ఓ గుడిసె హోటల్ దగ్గర ఆగి పేపర్ చదివేటోన్ని. ఎప్పటినుంచి నన్ను మఫ్టీ పోలీసులు ఫాలో అవుతున్నరో ఏమో.. ఒక రోజు అకస్మాత్తుగా మీదపడి కళ్లకు గంతలు కట్టి జీపులో వేసుకుని పోయిండ్రు. ఏవేవో పేర్లు అడిగిండ్రు. ఆర్గనైజేషన్ చేయటానికే వరంగల్ వచ్చినవని, ఎవరు కలుస్తరో చెప్పమని కొట్టుడు మొదలు పెట్టిండ్రు. నాకేమీ తెలియదు మొర్రో.. అని ఎంత మొత్తుకు న్నా.. వినలే. ఎంత కొట్టినా, ఎన్నిరకాల చిత్రహింసలకు గురిచేసినా.., చివరికి పద్మాక్షమ్మ గుట్ట కాడికి తీసుకొచ్చి ఎన్‌కౌంటర్ చేస్తమని నిలబెట్టి గన్నులు గురిపెట్టినప్పుడు కూడా నాకేమీ తెలి యదని, చంపేసుకుంటే చంపేసుకోండి అని అన్న. చివరికి నేను పాటగాడినే అని.. వదిలిపెట్టిండ్రు.

హన్మకొండకు పోవటం.. నా విషయంలో తుంట ఇడిసి మొద్దు ఎత్తుకున్నట్లయ్యింది. ఇక హన్మకొండకోదండం పెట్టి.. మళ్లీ సిద్దిపేటకు బయలుదేరిన. డిగ్రీ సెంకడ్ ఇయర్ సిద్దిపేట కాలేజీలో చేరిన. ఇదంతా ఓ కథ. అయితే నాకు కేసీఆర్‌తో ఉన్న అనుబంధం సుదీర్ఘమైనది, ఆత్మీయమైనది.1983లో సిద్దిపేటలో కేసీఆర్ తరఫున నేను, మల్లయ్య, సత్యనారాయణ కలిసి ప్రచారం చేసినం. నేను మంచిగ పాటలు పాడుతనని ఎవరిద్వారా తెలుసుకున్నరో ఏమో.. కేసీఆర్ నన్ను పిలిపించుకుని పాటలు రాసి పాడించుకున్నరు. అది మొదలు నా అనుబంధం కేసీఆర్‌తో విడదీయరానిది. ఓ ప్రజాప్రతినిధిగా.. కేసీఆర్‌దీ వినూత్న రీతి. ఎల్లప్పుడు ఏదో వినూత్న కార్యక్రమం తో ప్రజలకు సేవ చేయాల్నని ఆలోచిస్తరు. సిద్దిపేటలో 92లో హరితహారం కార్యక్రమం చేపట్టి.. మొక్కల పరిరక్షణ, పచ్చదనం ప్రాధాన్యం గురించి నాతో పాటలు రాయించి నియోజకవర్గమంతా ప్రోగ్రాంలు ఇప్పించిండ్రు.

ఆ నేపథ్యంలోనే.. తన నియోజక వర్గంలో దళిత చైతన్య జ్యోతికార్యక్రమం చేపట్టిండ్రు. దీనికోసం నేను రాసి పాడిన పాటలు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందినై. ప్రజలు, మేధావుల మన్ననలు పొందినై. ఈ కార్యక్రమంలో భాగంగానే తన సొంత ఊరు చింతమడకలో కేసీఆర్ తన సొంత భూమిని దళితులకు పంచిపెట్టిండ్రు. ఈ క్రమంలోనే మంజీరా రచయితల సంఘం పరిచయమై నన్ను అనేక విధాలుగా తీర్చిదిద్దింది. 2000 సంవత్సరంలో కేసీఆర్ పిలిచి తెలంగాణపై పాటలు రాయమన్నరు. రాయాల్సిన సబ్జెక్టులు, చర్చించాల్సిన, చెప్పాల్సిన విషయాలు నాకు వివరించి పాటలు రాయించిండ్రు. అలా కేసీఆర్ పనిగట్టుకుని నాతో రాయించిన పాటలే తెలంగాణ జయభేరి పేరుతో క్యాసెట్ రూపంలో వచ్చినై. విస్తృత ప్రజాదరణ పొందినై.

ఆ తర్వాత కాలంలో టీఆర్‌ఎస్ పార్టీ స్థాపన.., కరీంనగర్‌లో 2001, మే17న జరిగిన సింహగర్జన సభ నాకు పాటగానిగానే గాక, లక్షలాది జనాన్ని లేవకుండా కూచోపెట్టగల శక్తి, నైపుణ్యాలున్నాయని తెలియజెప్పింది. సభకు కేసీఆర్ ఐదు గంటలు ఆలస్యంగా వస్తే.. అప్పటిదాకా ఐదు గంటలపాటు ఏకబిగిన పాటలు పాడుతూ లక్షలాది మందిని లేవకుంట కూసోపెట్టిన. కేసీఆర్ కూడా నా ప్రదర్శన చూసి భుజం తట్టిండ్రు. ఆ క్రమంలోనే ఆణిముత్యాలు పాటల క్యాసెట్ తీసిన. అన్నింటికీ తలమానికంగా 2002, సెప్టెంబర్ 30న నిజామాబాద్ కామారెడ్డిలో నిర్వహించిన జానపద జాతర ధూంధాంచరిత్రాత్మకమైనది. మొదటి సారి తెలంగాణ జానపద కళారూపాలు, బోనాలు, బతుకమ్మ, పీర్లు, శివసత్తులు స్టేజీపై ప్రదర్శనలకు నోచుకోవటమే కాదు, ప్రజలను విశేషంగా ఆకర్షించినై.

అది మొదలు.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ధూంధాం నిర్వహించిన పాత్ర, అందులో పాత్రధారులుగా ఉన్న తెలంగాణ గ్రామగ్రామాన ఉన్న వేలాది మంది కళాకారులు సాంస్కృతిక సైన్యంగా ఎంతటి ప్రభావం కలుగజేశారో అందరికీ తెలిసిందే.తెలంగాణలో ప్రఖ్యాతులైన గద్దర్, గూడ అంజన్న, అందెశ్రీ, గోరటి వెంకన్న తదితరులందరితో ధూంధాం కోసం పాటలు రాయించిన, పాడిన. ఈ మొత్తం క్రమంలో నా కృషిని గుర్తించి.., నన్ను సాంస్కృతిక సారథిగా నియమించటం కేసీఆర్‌కు కళా, సంస్కృతులపట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం. దీంతో.. రాష్ట్రసాధన ఉద్యమంలో పాలుపంచుకున్న కళాకారులందరికీ 25వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వడం కూడా పాటకు దక్కిన గౌరవమే.

ఊరుగాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతల నన్ను కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నరు. ఎన్నికలప్పుడు స్థానికేతరుడవని, గెలువటం కష్టమని కొంతమంది భయపెట్టిండ్రు. నేను ఊరూరు తిరిగిన. అందరిలా పైసలు ఇచ్చుకోలేనని మీ పేదింటి బిడ్డగా ఓట్లేయండని ప్రజలను వేడు కున్న. ప్రజలు పైసలేమోద్దు.. పాట పాడు బిడ్డా.. ఓట్లేస్తం అన్నరు. అన్నట్టే ఓట్లే సిండ్రు. ఎన్నుకున్నరు. ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిండ్రు.

జీతగానిగ దొర సేవలతో మొదలైన నా జీవితం.. ఇవ్వాళ ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా, ప్రజలకు సేవకుడిగా ప్రజలు నన్ను చేసుకున్నరు. నేను ఇప్పుడు ప్రజలకు జీతగాన్ని. నా శక్తులన్నీ ధారపోసి ప్రజలకు సేవచేస్తా. వారు చూపిన ప్రేమకు రుణం తీర్చుకుంటా. -(ఇంటర్వ్యూ: ఎస్.మల్లారెడ్డి, గడ్డం సతీష్)

అంబటాల్లకు పొయ్యిల బూడిది.. బడికి ప్రార్థన కాకముందే రావాల్నని సార్లు అనేటోళ్లు. రానోళ్లకు దెబ్బలు పడేవి. నాకు అందరిలా ప్రార్థనకు పోవాల్నని ఉండేది. కానీ అవ్వ పొద్దున లేవంగనే మా ఇంట్ల పనిచేయక పోయేది. దొరింట్ల ఊకి, చల్లి, అన్ని పనులు చేసినంకనే మా ఇంట్ల పొయ్యిల బూడిది ఎత్తేది. అట్ల ఆదరబాదర గట్క వండి పెట్టేసరికి రోజూ బడికి లేట్ అయ్యేది. అవ్వమీద కోపమొచ్చేది. అవ్వ అట్ల దొరింట్లకే మొదట ఎందుకు పనికి పోతదో తెల్వకపొయ్యేది.

పాటే వెంటాడింది.. కాపాడింది… హన్మకొండలో సీకేఎం కాలేజీకి పోయేటప్పుడు కళ్లకు గంతలు కట్టి ఎత్తుకు పోయిన పోలీసులు తీవ్ర చిత్రహింసలకు గురిచేసిండ్రు. చేతులకు తాడు కట్టి గోడకు వేలాడేసిండ్రు. దాంతో.. చేతులకు రక్తప్రసరణ నిలిచిపోయి చేతులు మొద్దుబారిపోయినై.అదొక చిత్రహింసల కొలిమి. కళ్లకు గంతలు కట్టి నర్సంపేటలోని ఓ గుడిసె హోటల్‌కు తీసుకుపోయిండ్రు. అందులోంచి ఎవరో వచ్చి నన్ను చూసి, కాదని పోలీసులకు సైగ చేసి వెళ్లిపోయిండు. వాడు పోలీస్ ఇన్‌ఫార్మర్ అనుకుంట. మరి ఎందుకొచ్చినవ్ వరంగల్‌కు.. అని అడిగిండ్రు. నా ప్రేమ వివాహం, కేవలం పాటలు మాత్ర మే పాడుతనని చెప్పిన. అయితే ఒక పాట పాడు అన్నరు. పాడిన. అంతే.. వీడు పాటగాడేలే.. అని ఎంజీఎం దగ్గర వదిలేసి జేబులో యాభై రూపాయిలు పెట్టి.. వైద్యం చేయించుకో అని చెప్పి వెళ్లిపోయిండ్రు పోలీసులు.

ధూంధాం ఓ మైలు రాయి.. ప్రపంచ చరిత్రలో ఒక సాంస్కృతిక ప్రదర్శన, పాట ఆ సమాజాన్ని ముందుండి నడిపించిన దాఖలాలు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రసాధనోద్యమంలో ధూంధాం, తెలంగాణ పాట ప్రజలను చైతన్యపర్చి ముందుకు నడిపించటంలో నిర్వహించిన పాత్ర చరిత్రకే ఓ మేళవింపు. సమకాలీన చరిత్రకు ఓ మార్గం.

మంచినీళ్లతోనే కడుపు నింపుకునేది.. దసరా, సంక్రాంతి సెలవులల్ల.. బావులు తొవ్వటానికి, రోడ్డు పనికి పోయినప్పుడు..అందరూ సద్దులు తెచ్చుకుని తినేటోళ్లు. మా ఇంట్ల గట్కనే కదా. గట్క సద్ది కట్టుకు పోవటానికి సిగ్గేసి.. సద్ది తీసుకుపోయేవాణ్ని కాదు. అందరూ అన్నం తింటుంటే.., నేను మంచినీళ్లతోనే కడుపు నింపుకొనేటోణ్ని.

అవ్వను ఊరంత తిప్పిన.. తొంబై ఏడులో బీఈడీ అయిపోయిన తర్వాత టీచరైన. కాని పదిహేను వందలే జీతం వచ్చేది.ఆ జీతం పైసలల్లనే మిగిలిచ్చి ఓ పాత నర్మదస్కూటర్ కొని, అమ్మను వెనక ఎక్కించుకుని ఊరంత తిప్పిన. మైసమ్మ కూడా అందరిలా తలెత్తుకుని తిరగాల్నని కోరుకున్న.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.