Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణలో గ్రామ స్వరాజ్యం

-విప్లవాత్మకంగా కొత్త పంచాయతీరాజ్ చట్టం -రూపకల్పన బాధ్యత సీఎం కేసీఆర్‌కు అప్పగింత -న్యాయకోవిదులతో సంప్రదించనున్న ముఖ్యమంత్రి -మున్సిపాలిటీలకు కూడా నూతన చట్టం -కొత్తగా మరికొన్ని గ్రామ పంచాయతీల ఏర్పాటు -పంచాయతీలుగా తండాలు, గూడేలు, చెంచు పల్లెలు -నిర్దిష్ట గడువులోనే పంచాయతీలకు ఎన్నికలు -గ్రామ సర్పంచ్‌లకు మరికొన్ని బాధ్యతలు -నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగంపై కఠిన చర్యలు -రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్ణయాలు -8 గంటలపాటు సుదీర్ఘంగా సమావేశం -పలు ఆర్డినెన్సులు, బిల్లులు, కొత్త పోస్టులకు ఆమోదం -రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై.. -రైతు సమితుల ద్వారా గిట్టుబాటు ధరల కల్పనపై..రెండు మంత్రివర్గ ఉపసంఘాల ఏర్పాటు.

రాష్ట్రంలో గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. తండాలు, గూడేలు, చెంచు పల్లెలను పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించింది. కొత్తగా మరిన్ని పంచాయతీలను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటుచేసే క్రమంలో ప్రధాన గ్రామానికున్న దూరాన్ని, శివారు పల్లెల జనాభాను, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోనున్నారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటుచేసినప్పుడు వ్యవహరించినట్లుగానే కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటుచేసేటప్పుడు కూడా ఉదారంగానే ఉండాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకురావాలని తీర్మానించింది. కొత్తగా తెచ్చే ఈ చట్టం విప్లవాత్మకంగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. గ్రామ పంచాయతీ చట్టం తెచ్చిన తర్వాత ప్రజలకు బాగా సేవలందించే విధంగా మున్సిపాలిటీలను మార్చడానికి కొత్త మున్సిపల్ చట్టం కూడా తేవాలని సీఎం ప్రతిపాదించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామాల్లో అద్భుతమైన, గుణాత్మకమైన మార్పు రావాలని సీఎం ఆకాక్షించారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రారంభమైన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం సుదీర్ఘంగా దాదాపు ఎనిమిది గంటలపాటు సాగింది. ఇందులో ప్రధానంగా పంచాయతీలు, గ్రామ స్వరాజ్యంపై లోతైన చర్చ జరిగింది. ముఖ్యమంత్రి దీనిపై సుదీర్ఘ కసరత్తు చేశారు. మంత్రులు, అధికారుల అభిప్రాయాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలు సమర్ధవంతంగా విధులు నిర్వర్తించే విధంగా చట్టాన్ని రూపొందించాలని సూచించారు.

రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. తండాలను పంచాయతీలు చేయాలనే దానిపై చర్చించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం సూచించారు. దీనితోపాటు సర్పంచ్‌లకు మరికొన్ని బాధ్యతలు అప్పగించాలని, విధుల్లో నిర్లక్ష్యం చేసినవారిపైన, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పరిపాలనారంగంలో విశేష అనుభవం గడించిన అధికారులు, న్యాయ కోవిదులతో సంప్రదించి కొత్త చట్టానికి రూపకల్పన చేసే అధికారాన్ని మంత్రివర్గం ముఖ్యమంత్రికి అప్పగించింది. గిరిజన తండాలను, కోయగూడేలను, గోండు గూడేలను , చెంచు పల్లెలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని, ప్రధాన గ్రామానికి దూరంగా ఉన్న పల్లెలను, శివారు గూడేలను కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది. కొత్త చట్టంతో గ్రామపంచాయతీలకు నిధులతోపాటు వారు నిర్వహించే విధుల విషయంలో కూడా సృష్టత వస్తుందని సీఎం ప్రతిపాదించారు. విధులను సక్రమంగా నిర్వర్తించని పంచాయితీలపై చర్యలు తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉండేలా చట్టంలో నిబంధనలు పొందుపరిచి, అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని అన్నారు. దీనికి మంత్రివర్గ సభ్యులు ఆమోదించారు.

పలు ఆర్డినెన్సులకు ఆమోదం సమావేశం పారంభమైన తర్వాత మొదట ఇటీవల ప్రభుత్వం జారీచేసిన పలు ఆర్డినెన్సులకు, శాసనసభలో ప్రవేశపెట్టనున్న బిల్లులకు, కొత్త పోస్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశంలో తొలుత బిల్లులు, ఆర్డినెన్స్‌లపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో రెండు మంత్రివర్గ ఉపసంఘాలను ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సారథ్యంలో ఒక ఉపసంఘాన్ని, వ్యవసాయ అధికారుల సేవలను సమర్థంగా వినియోగించుకోవడం, రైతు సమన్వయ సమితుల ద్వారా గిట్టుబాటు ధరలను ఏ విధంగా కల్పించాలనే విషయంపై వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో మరో ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సాయంత్రం 5.30గంటల నుంచి రాత్రి 11గంటల వరకు పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ఠం చేయడంపై సుదీర్ఘ చర్చ జరిగింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ సమావేశానికి ఆబ్కారీ మంత్రి పద్మారావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ హాజరుకాలేదు.

గ్రామ పంచాయతీలకు నిధులు.. అభివృద్ధి ఇలా.. 1.రాష్ట్ర బడ్జెట్లో పంచాయతీలకు నిధులు కేటాయిస్తారు. గ్రామ జనాభానుబట్టి ఏ గ్రామానికి ఎంత అని నిర్థారిస్తారు. 2.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) లాంటి కేంద్ర పథకాల ద్వారా కూడా గ్రామాలకు నిధులు సమకూరుతాయి. 3.గ్రామ పంచాయతీకి పన్నుల ద్వారా నిధులు వస్తాయి. 4.ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు వస్తాయి. 5.శ్రమదానం ద్వారా కొన్ని పనులు చేసుకోవాలి. 6.విరాళాలద్వారా నిధులు సమకూర్చే కార్యక్రమానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. 7.సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ సంస్థలు నిధులు సమకూరుస్తాయి. ఇలా సమకూరిన డబ్బులతో గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.