Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణ పథకాలు భేష్

-ప్రశంసించిన కేరళ ముఖ్యమంత్రి విజయన్ – ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ – సులభ వాణిజ్య విధానం, శాంతిభద్రతలు, ఐటీ, పర్యాటక రంగాలపై చర్చ

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ప్రభుత్వం అమలుపరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభినందించారు. సులభ వాణిజ్య విధానంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలువడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారులకు శిక్షణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ రికార్డుల నిర్వహణ తీరుపై ఆసక్తి ప్రదర్శించారు. టీఎస్ ఐపాస్, సంక్షేమ పథకాల గురించి సీఎం కేసీఆర్ ఆయనకు వివరించారు. శబరిమలలో తెలంగాణ అతిథిగృహానికి భూకేటాయింపు అంశం గురించి గుర్తుచేశారు. ఐటీపై ఒప్పందం కుదుర్చుకోవాల్సిందిగా మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసించారు. సులభ వాణిజ్య విధానంలో మొదటిస్థానం సంపాదించుకోవడాన్ని అభినందించారు. సీపీఎం మహా పాదయాత్ర ముగింపు సమావేశంలో పాల్గొనేందుకు శనివారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన విజయన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. సులభ వాణిజ్యం, శాంతిభద్రతలు, తెలంగాణ సంక్షేమ పథకాలు, పర్యాటకం, వైద్యారోగ్యం, కేరళ ప్రకృతి అందాలు, ఐటీ.. తదితర అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కేరళ సీఎం కొనియాడారు. ఈ సందర్భంగా భూ రికార్డులపై విజయన్ ఆసక్తి చూపించారు. రాష్ట్రంలో అధికారులకు ఇచ్చే శిక్షణ వివరాలపై ఆరా తీశారు. ఐటీ మంత్రి కేటీఆర్ తమ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకోవాల్సిందిగా కోరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో సీనియర్ అధికారులు నర్సింగరావు, శాంతికుమారి, స్మితాసబర్వాల్, భూపాల్‌రెడ్డి తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు.

శబరిమల భూకేటాయింపు ప్రస్తావన భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. కేరళలోని శబరిమలలో అతిథిగృహానికి భూకేటాయింపు అంశాన్ని ఆ రాష్ట్ర సీఎం విజయన్‌తోప్రస్తావించారు. ప్రతి ఏటా తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళుతున్న దరిమిలా అక్కడ వారి సౌకర్యార్థం అతిథిగృహాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ గతంలోనే నిర్ణయించారు. ఈ మేరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కూడా పూర్తయింది. ప్రస్తుతం ఈ అంశం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వద్ద పెండింగులో ఉంది. కేరళ సీఎంతో భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశాన్ని గుర్తుచేశారు. తెలంగాణ నుంచి లక్షల మంది భక్తులు శబరిమలకు వెళుతున్నందున అతిథిగృహానికి సంబంధించి పెండింగులో ఉన్న భూ కేటాయింపును వేగవంతం చేయాల్సిందిగా కోరారు. టీఎస్ ఐపాస్‌ను వివరించిన సీఎం కేసీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రుల చర్చల్లో భాగంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రస్తావన రావడంతో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలువడాన్ని కేరళ సీఎం విజయన్ అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ రూపంలో ప్రవేశపెట్టిన ఇండస్ట్రియల్ పాలసీ గురించి సీఎం కేసీఆర్ వివరించారు. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా వైవిధ్యంగా, సరళీకృతంగా ఉన్న ఇండస్ట్రియల్ పాలసీతో పరిశ్రమలు ఎలా వస్తున్నాయనే వివరాలను కేరళ సీఎం ముందుంచారు. ముఖ్యంగా సింగిల్ విండో విధానంతో పరిశ్రమల ఏర్పాటుకు త్వరితగతిన, సులభతరంగా అనుమతులు ఇచ్చే ప్రక్రియతోపాటు ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ విధానాల వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక రంగం గణనీయమైన అభివృద్ధిని సాధించినట్లు చెప్పారు. దీంతోపాటు వివిధ రంగాల్లో పెట్టుబడులను ఎలా ఆకర్షిస్తున్నామనే వివరాలను కూడా సీఎం కేసీఆర్ కేరళ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ బుక్‌లెట్‌ను కేరళ సీఎంకు అందించారు.

భూ రికార్డులపై ఆసక్తి చూపిన విజయన్ తెలంగాణ రాష్ట్రంలో భూ సంస్కరణలు, భూముల రికార్డుల నిర్వహణ తీరు ఎలా ఉందనేదానిపై కేరళ ముఖ్యమంత్రి విజయన్ చాలా ఆసక్తి కనబరిచారు. దీంతో సీఎం కేసీఆర్ ఆ వివరాలను సమగ్రంగా ఆయన ముందుంచారు. సాలార్‌జంగ్, నిజాం కాలం నుంచి ఉన్న భూముల వివరాల నిర్వహణ వ్యవస్థ, భూ సంస్కరణలను వివరించారు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు పక్కాగా అప్‌డేట్ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ప్రజలు ఒకరిపై ఒకరికి ఉన్న అపారమైన నమ్మకంతో భూలావాదేవీలను కేవలం తెల్ల కాగితాలపై రాసుకున్నారని, తెలంగాణ ప్రభుత్వం అలాంటి సాదా బైనామాలను భూ రికార్డుల్లో నమోదుకు అనుమతించిందని చెప్పారు. ఈ క్రమంలో సాదా బైనామాలకు సంబంధించి 11.5 లక్షల దరఖాస్తులు రాగా వాటి నమోదు ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. ఐటీపై ఒప్పందానికి ఆహ్వానించిన కేటీఆర్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఐటీ, ఐటీ అనుబంధ సేవారంగాల్లో సాధించిన గణనీయమైన వృద్ధిని కేరళ సీఎంకు వివరించారు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్ వంటి ఐదు ప్రధాన ఐటీ కంపెనీలు తమ ప్రధాన కేంద్రాలను హైదరాబాద్ నగరంలో నెలకొల్పిన విషయాన్ని తెలిపారు. హైదరాబాద్ జంటనగరాల్లో ఏడాది పొడవునా ఉండే వాతావరణ అనుకూలతలు, పటిష్ఠమైన శాంతిభద్రతలు, భూకంపాలపరంగా సురక్షితమైన ప్రాంతం కావడం వంటి పలు కారణాలరీత్యా ఐటీ కంపెనీలు హైదరాబాద్ వైపు మొగ్గుచూపుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని.. అన్ని ప్రధాన ఐటీ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ బ్యాక్-ఆఫీస్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం తాము దేశంలోనే బెంగళూరు తర్వాత స్థానంలో ఉన్నామని, త్వరలో బెంగళూరును ఓవర్‌టేక్ చేస్తామని చెప్పారు. కాగా ఐటీ విజ్ఞానాన్ని పంచుకునేందుకుగాను ఇప్పటికే గోవా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంతో ఎంవోయూ కుదుర్చుకుందని, కేరళ కూడా ఆ తరహా ఒప్పందాన్ని చేసుకోవచ్చని మంత్రి కేటీఆర్ కేరళ సీఎంకు సూచించారు. కేరళ.. ప్రకృతి వరప్రసాదం.. భేటీలో భాగంగా ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు రాష్ర్టాల్లోని పర్యాటకం, సాంస్కృతిక రంగాలపైనా చర్చించుకున్నారు. దేశంలో కేరళ ఒక అందమైన రాష్ట్రంగా సీఎం కేసీఆర్ అభివర్ణించారు. అది ప్రకృతి అందించిన ఓ వరప్రసాదమని చెప్పారు. కేరళ అనేది భగవంతుడు నడయాడిన ప్రాంతమని ప్రజలు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి రెండోసారి ఎన్నికైన సమయంలో తాను గురువాయూర్, కన్యాకుమారి ప్రాంతాలను సందర్శించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రపంచంలోనే కేరళలోని ఆయుర్వేద వైద్యవ్యవస్థ, ఆయుర్వేద మందులు ప్రసిద్ధి చెందిన విషయాన్ని ప్రస్తావించిన కేరళ సీఎం.. తమ రాష్ట్రంలోని వైద్యారోగ్యం, వైద్యశాలల నిర్వహణపై మాట్లాడారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు శిక్షణ ఎలా ఇస్తారనే అంశంపై ఆయన అడిగి తెలుసుకున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రభుత్వ అధికారులకు రెగ్యులర్‌గా శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని సీఎం కేసీఆర్ చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పేరిట ఏర్పడిన ఈ కేంద్రం గొప్ప శిక్షణ కార్యక్రమాలు, మూల్యాంకనాలకు దేశంలోనే ప్రాచుర్యం పొందిందన్నారు. ఇతర రాష్ర్టాల అధికారులకు కూడా తెలంగాణ అధికారులు ఇదే కేంద్రంలో శిక్షణ ఇచ్చే విషయాన్ని కూడా సీఎం కేసీఆర్ చెప్పారు. ఆ క్యాంపస్‌లో కొనసాగుతున్న గుడ్ గవర్నెన్స్‌పై కూడా వివరించారు. కేరళ రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థల పనితీరు గురించి ఆ రాష్ట్ర సీఎం విజయన్ తెలిపారు. ఈ అంశంలో తమ రాష్ట్రం చాలా ముందంజలో ఉందని చెప్పారు. పటిష్ఠంగా శాంతిభద్రతలు రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నట్లు సీఎం కేసీఆర్ కేరళ ముఖ్యమంత్రికి తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో 15వేల సీసీ కెమెరాలతో కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందని, సీసీ కెమెరాల సంఖ్యను లక్షకు పెంచనున్నట్లు చెప్పారు. అదేవిధంగా షీ టీమ్స్ ఏర్పాటు, కమ్యూనిటీ పోలీసింగ్ పనితీరును వివరించిన సీఎం కేసీఆర్.. తాను సింగపూర్ వెళ్ళినపుడు గమనించిన అద్భుతమైన శాంతిభద్రతల వ్యవస్థ, ప్రధానంగా సమీప ప్రాంతాల రక్షణ వ్యవస్థ నిర్వహణ తీరును గుర్తుచేసుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను కేరళ ముఖ్యమంత్రికి వివరించారు. వీటిల్లో కొన్నింటిని దేశంలోనే మొదటగా తాము అమలు చేశామని చెప్పారు. సంక్షేమ రంగానికి ప్రభుత్వం ఏటా రూ.36వేల కోట్లను ఖర్చు చేస్తుందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద నిరుపేద కుటుంబంలోని బాలికల వివాహానికి రూ.75,116 ఇస్తున్నామని, ఇప్పటికే రాష్ట్రంలో రెండు లక్షల మంది బాలికలు లబ్ధి పొందారని పేర్కొన్నారు. అదేవిధంగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు, ఆసరా పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం నెలకొల్పిన గురుకుల పాఠశాలల వివరాలను కూడా తెలిపారు. ఆయా పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో వివరించారు. భేటీ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ను సీఎం కేసీఆర్ ఇక్కత్ శాలువా, చార్మినార్ మెమెంటోతో సత్కరించారు. చార్మినార్ అనేది మతసామరస్యానికి చిహ్నమని తెలిపారు. తన కార్యాలయ వ్యక్తిగత సిబ్బందిని సీఎం కేసీఆర్ స్వయంగా కేరళ ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. కేరళ ముఖ్యమంత్రి వెంట ఆయన వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.