Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దగాకోరు బీజేపీని దండించండి

-శిశుపాలుడిలా నూరు తప్పులు చేసిన బీజేపీ
-మునుగోడులో ఆ పార్టీని ఓటుతో శిక్షించాలి
-ప్రతి వర్గాన్నీ గోస పెడుతున్న కాషాయ పార్టీ
-తెలంగాణకు, మునుగోడుకు చేసింది సున్నా
-మునుగోడు ఫ్లోరైడ్‌ గోసను ఏనాడూ వినలేదు
-ఎనిమిదేండ్లలో రూ.100 లక్షల కోట్ల అప్పులు
-మగ్గానికి మరణ శాసనం – చేనేతకు ఉరి
-టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
-బీజేపీ తప్పులపై 21 అంశాలతో చార్జ్‌షీట్‌

తెలంగాణకు బీజేపీ గత ఎనిమిదేండ్లలో ఇచ్చింది ఏమీలేదని, ఇకముందు కూడా ఇవ్వబోయేది కూడా ఏమీ ఉండదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అన్నారు. శిశుపాలుడిలా మారిన బీజేపీని మునుగోడు నియోజకవర్గంలోని మహిళలు, యువత, రైతులు ఉప ఎన్నికల్లో శిక్షించాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఎనిమిదేండ్ల పాలనలో చేయని తప్పు లేదని దుయ్యబట్టారు. దేశంలోని ఏ ఒక్క వర్గాన్నీ ప్రశాంతంగా బతకనీయటంలేదని, పైపెచ్చు గత ప్రభుత్వాలు కల్పించిన వసతులను రద్దుచేస్తూ అష్టకష్టాలు పెడుతున్నదని విమర్శించారు.

చేనేతకు మారుపేరైన దేశంలో అదే చేనేతపై పన్ను వేసిన దుర్మార్గ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. మునుగోడు ప్రజల ఫ్లోరైడ్‌ సమస్యలను బీజేపీ ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ మీడియా సమావేశంలో బీజేపీ తప్పులపై చార్జ్‌షీట్‌ విడుదల చేశారు. బీజేపీతో దేశానికి, రాష్ట్రానికి నష్టమే జరిగింది తప్ప.. ఎలాంటి లాభం లేదని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పతనం, నిరుద్యోగం, రైతులు, మహిళలు అన్ని వర్గాలకు అన్యాయం, నష్టమే జరిగిందని అన్నారు.

దివాళాకోరుతనానికి బ్రాండ్‌..బీజేపీ
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి తాము చెప్తుంటే.. బీజేపీ నేతలు వ్యక్తిగత దూషణలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. ‘మునుగోడు ఉప ఎన్నికలో విచిత్ర, అసాధారణ పరిస్థితి కనిపిస్తున్నది. సాధారణంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నవారైతే మేం ప్రజలకు ఫలానా మేలు చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడగటం పద్ధతి.

ప్రతిపక్షంలో ఉంటే మీరు మాకు ఓటు వేస్తే ఆ పని చేస్తాం.. ఈ పని చేస్తాం అని హామీలు ఇస్తారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఎనిమిదేండ్లు మేం ఏం చేశామో, ఇంకా ఏం చేస్తామో చెప్తూ ఓటు అడుగుతున్నాం. తాగునీరిచ్చాం, సాగునీరిచ్చాం, ఫ్లోరోసిస్‌ను నిర్మూలించాం, సాగునీటి ప్రాజెక్టులు వేగంగా కడుతున్నాం, చర్లగూడెం, శివన్నగూడెం రిజర్వాయర్లు నిర్మిస్తున్నాం, మునుగోడు నేలను సస్యశ్యామలం చేస్తాం, లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం, కరెంటు సమస్యను పరిష్కరించి రైతాంగాన్ని, పరిశ్రమలను ఆదుకొన్నాం అని చెప్తున్నాం.

తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కు దండు మల్కాపురంలో ఏర్పాటు చేశాం, వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నాం. అక్కడి ఎమ్మెల్యే ఆనాథలా వదిలెయ్యడం వల్ల కుంటు పడిపోయాయన్న భావన ఉంటే.. నేను ఆ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని రాబోయే 14 నెలల్లోనే పనులు పరుగులు పెట్టిస్తా అని చెప్తున్నా. ప్రత్యర్థి పార్టీలు కూడా బలహీనవర్గాలకు, గిరిజనులకు, దళితులకు, మైనార్టీలకు ఇది చే శాం, మౌలికమైన సమస్యను పరిష్కరించాం, తాగునీరు, సాగునీరు, పారిశ్రామికీకరణ చే శామని చెప్తారని ఆశించాం. వారు చెప్పక పోగా వ్యక్తిగత నిందారోపణలు, దూషణలకు దిగుతున్నారు.

అదే గొప్ప విషయం అన్నట్టు గా మాట్లాడుతున్నారు. సీఎం కేసీఆర్‌ మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ల దివాళాకోరు రాజకీయాన్ని, భావ దారిద్య్రా న్ని ప్రజల ముందు బహిర్గతం చేయడానికి ఝూటా, జూమ్లా పార్టీ బీజేపీపై చార్జ్‌షీట్‌ను దాఖలు చేస్తున్నాం’ అని తెలిపారు. కార్యక్రమంలో పీయూసీ చైర్మన్‌ ఏ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌, టీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు దాసోజు శ్రవణ్‌, టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.