Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దేశమంతా ఉచిత కరెంట్‌

-భారత రైతాంగానికి కేసీఆర్‌ భరోసా
-2024లో ఢిల్లీలో ఎగిరేది బీజేపీయేతర జెండానే
-కార్పొరేట్లకు రైతు భూములను కట్టబెట్టే పన్నాగం
-అన్నదాతల్ని కూలీలుగా మార్చాలన్న కుయుక్తులు
-డీజిల్‌ ధర పెంపు, మోటర్లకు మీటర్లు అందుకే
-మరోవైపు పంటకు మద్దతివ్వకుండా కుతంత్రం
-బీజేపీ ముక్త్‌భారత్‌ కోసం రైతులు ఏకమవ్వాలి
-ఉచితాలొద్దన్న నరేంద్ర మోదీ సర్కారును తరిమికొట్టాలి
-విపక్షాలను చీల్చి సంతలో పశువుల్లా కొనేది రాజకీయమా?
-లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానం దేశానికి కావాలి
-నిజామాబాద్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
-సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయం ప్రారంభం

ఒకనాటి నాయకత్వం చేసిన చిన్న పొరపాటుకు, కొద్దిగా ఒళ్లు మరచిపోయినందుకు బలవంతంగా మనలను ఆంధ్రలో కలిపారు. మళ్లీ మన తెలంగాణ మనం సాధించుకోవడానికి 60 ఏండ్లు కొట్లాడాల్సిన అవసరం పట్టింది. ఎంతో మంది పిల్లలు చచ్చిపోయే పరిస్థితి ఏర్పడ్డది. నేను కూడా చివరికి చావు అంచులోకి పోవాల్సిన పరిస్థితి వచ్చింది.

బీజేపీ ముక్త్‌ భారత్‌ నినాదంతో దేశంలోని రైతులంతా ఒకటి కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. సాగుభూములను లాక్కొని కార్పొరేట్లకు కట్టబెట్టి రైతులను వాళ్ల భూముల్లోనే కూలీలుగా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు కుయుక్తులు పన్నుతున్నదని తెలిపారు. బీజేపీని సాగనంపినప్పుడే దేశం బాగుపడుతుందన్నారు. కేంద్రంలో రాబోయేది బీజేపీయేతర ప్రభుత్వమేనని, అప్పుడు యావత్‌ దేశ రైతాంగానికి ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటించారు. నిజామాబాద్‌ జిల్లాలో నూతన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రారంభించారు. దీంతోపాటు జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

తెలంగాణ మాదిరే యావత్‌ భారత రైతాంగానికి ఉచిత కరెంటు
ఈ నిజామాబాద్‌ గడ్డ లక్ష్మీగడ్డ. ఇక్కడి నుంచి భారత రైతాంగ సోదరులకు ఒక తీయటి మాట అందిస్తున్న. మోదీ ఎన్పీఏల కింద పెద్ద పెద్ద గద్దలకు దోచిపెట్టిన దేశ సంపద రూ.12 లక్షల కోట్లు. మొత్తం భారతదేశంలో రైతులందరూ కలిసి ఇరిగేషన్‌ కోసం వాడుకొనే కరెంటు కేవలం 20.8%. దాని ధర 1.45 లక్షల కోట్లు మాత్రమే. బ్యాంకులు లూటీ చేసినవాళ్ల నుంచి కమీషన్లు తీసుకుని 12 లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీకి రైతులకు 1.45 లక్షల కోట్లు ఇవ్వడానికి చేతులు వస్తలేవా? 2024 లోక్‌సభ ఎన్నికల తరువాత దేశంలో ఎగిరేది నాన్‌ బీజేపీ జెండానే. దిక్కుమాలిన, రైతుల, కార్మికుల, పేదల వ్యతిరేక బీజేపీని సాగనంపడం, ఢిల్లీ గద్దె మీద మన ప్రభుత్వం రావడం ఖాయం.

బీజేపీ ముక్త్‌ భారత్‌ నినాదంతో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. తెలంగాణ మాదిరిగానే యావత్‌ భారత రైతాంగానికి ఉచిత కరెంటు ఇస్తాం. ఈ విషయాన్ని నిజామాబాద్‌ గడ్డ మీదినుంచి ప్రకటిస్తున్న. దేశం కోసం తెలంగాణ నుంచి పోరాటం చేయాలె. ఎవరైతే బాయిల కాడ మీటర్లు పెట్టమంటున్నారో? ఎవరైతే రైతులను ఆత్మహత్యలు చేసుకోమంటున్నరో? రైతుల ఊసురుపోసుకుంటున్నరో? వాళ్లు మన బాయి కాడ మీటరు పెట్టుడు కాదు.. మనందరం ఒక్కటై వాడికే మీటరు పెట్టాలె. అట్లయితేనే బాగుపడతం.

ఆలోచన లేకుంటే దెబ్బతినడం ఖాయం
రాజకీయాల్లో, సమాజంలో ఉండేవాళ్లు ఎప్పకప్పుడు మన చుట్టూ ఏం జరుగుతున్నదో అవగాహన చేసుకోవాలె. అర్థమైనవాళ్లు అర్థంకాని వాళ్లకు చెప్తుండాలె. అప్పుడే సమాజం ముందుకుపోయే అవకాశముంటది. ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుంటూ సాగే సమాజం చాలా ఉజ్వలంగా ముందుకు పోతుంటుంది. లేనివారు చాలా దెబ్బతినిపోతరు. చాలా అల్కగ అర్థమయ్యే మాట చెప్తాను. ఒకనాటి నాయకత్వం చేసిన చిన్న పొరపాటుకు, కొద్దిగా ఒళ్లు మరచిపోయినందుకు బలవంతంగా మనలను ఆంధ్రలో కలిపారు. మళ్లీ మన తెలంగాణ మనం సాధించుకోవడానికి 60 ఏండ్లు కొట్లాడాల్సిన అవసరం పట్టింది. ఎంతో మంది పిల్లలు చచ్చిపోయే పరిస్థితి ఏర్పడ్డది.

నేను కూడా చివరికి చావు అంచులోకి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకనాడు నిజామాబాద్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిజాంసాగర్‌ను నిర్మించుకొన్న ప్రాంతం. కానీ వలస పాలనలో నిజాంసాగర్‌ నీళ్లు మనకు రాకుండా, సింగూరు నీళ్లు హైదరాబాద్‌కే పరిమితం చేస్తే.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నం. ఎన్నోసార్లు బోధన్‌, డిచ్‌పల్లి, రూరల్‌ ప్రాంతాల రైతులు నిజామాబాద్‌ కలెక్టరేట్‌ కాడ ధర్నాలు చేశారు. ఆ ధర్నాలకు నేనూ స్వయంగా వచ్చా. కొద్దిరోజుల్లో కాళేశ్వరం కాల్వలు సింగూరు ప్రాజెక్టు వరకు వస్తున్నాయి. ఒకసారి అవి టచ్‌ అయ్యాయంటే నిజామాబాద్‌లో గుంట భూమి కూడా ఖాళీ లేకుండా ఉంటది. మీ అందరి దీవెనలతోటి తెలంగాణ భారతదేశమే ఆశ్చర్యపోయే పద్ధతుల్లో ముందుకు పోతున్నది.

ఏదో ఒక మాయలో కొట్టుకుపోవద్దు..
మన దగ్గర ఉండే ఒక్క పథకం కూడా భారతదేశంలో లేదు. దేశం మొత్తంలో 24 గంటలపాటు అతి ఉత్తమమైన కరెంటును అందరికీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. తరతరాలుగా అణచివేయడిన దళిత సోదరులు, అణగారిపోయినవాళ్ల కోసం ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకొంటున్న రాష్ట్రం మనదే. గిరిజన బిడ్డలు మా తండాలో మా రాజ్యం కావాలె అని 60 ఏండ్లుగా మొత్తుకున్నా ఏ పార్టీ, ఎవడూ చేయలే. ఇవాళ తెలంగాణలో 3,600 తండాలను పంచాయతీలుగా చేస్తే మన గిరిజన బిడ్డలే సర్పంచ్‌లుగా అద్భుతంగా పని చేస్తున్నరు. అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నం. మన జీఎస్డీపీ పెరిగింది. పర్‌క్యాపిటా పెరిగింది. గతంలో 200 పింఛన్‌ ఇస్తే ఇవాళ రూ.2,000 ఇచ్చుకుంటున్నం. ఎమ్మెల్యేలంతా సీఎంఆర్‌ఎఫ్‌ అని తెచ్చి, ఏ జబ్బు వచ్చినా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కానీ, ఆరోగ్యశ్రీ కానీ బ్రహ్మాండంగా అమలు చేసుకుంటున్నం. నేను చెప్పే మాటలు నిజమా? కాదా? అని అందరూ ఊర్లలో చర్చ చేయాలె. లేకపోతే ఇబ్బంది పడాల్సివస్తది. ఏదో ఒక నిషాలో కొట్టుకుపోయేవాళ్లు ఎవరూ బాగుపడలేదు.

రైతుల భూములు లాక్కొనే కుట్ర
ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతాంగం ముఖం తెలివి వస్తా ఉన్నది. చేతిలో నాలుగు పైసలు కనిపిస్తున్నయి. ప్రభుత్వమే అన్ని సౌలతులు కల్పిస్తున్నది. విత్తనాలు, ఎరువులు ఇస్తున్నది. మన ఎస్సారెస్పీ వరద కాలువకు గతంలో మోటర్లు పెట్టనిచ్చిన్రా? కానీ ఇవాళ రైతు దగ్గరికి ఎవరైనా వచ్చి నువ్‌ ఎంత హెచ్‌పీ పెట్టినవ్‌? ఎన్ని మోటర్లు పెట్టినవ్‌ అని అడుగుతున్నరా? అడుగుతరా? కానీ అడగాల్నట. బోరుకో మీటరు పెట్టాల్నట. ప్రతి ఒక్క మీటర్‌ లెక్క తీయాల్నట. కరెంటు మోటర్లకు మీటర్లు పెట్టాలంటున్నడు మోదీ. దాని వెనకున్న మతలబు ఏంది? మీరు మంచిగ వినాలె. ఇంటికిపోయినాక ఆలోచన చేయాలె.

ఆ మతలబు ఏంది? విమానాలు అమ్మిన్రు. ఓడరేవులు అమ్మిన్రు. రైళ్లు అమ్మిన్రు. కార్ఖానాలు అమ్మిన్రు. బ్యాంకులు అమ్మిన్రు. అన్నీ అయిపోయినయ్‌. ఇక మిగిలింది రైతుల దగ్గరున్న భూమే. ఎరువుల ధర పెంచాలె. డీజిల్‌ ధర పెంచాలె. దున్నుకానికి ధర పెరగాలె. వరికోతకు ధర పెరగాలె. మన పంటకు ధర ఇయ్యొద్దు. మన వడ్లు కొనొద్దు. కరెంటు మీటర్లు పెట్టాలె. చాతకాక మనం ఎవుసం బంద్‌చేయాలె. ఈ కుట్ర అంతా దేనికోసం జరుగుతున్నది? రైతుల దగ్గర ఉన్న భూములను లాక్కోవాలె. మోదీ దోస్తులకు, కార్పొరేట్‌ కంపెనీలకు అప్పజెప్పాలె. అన్ని బిల్లులు పెరిగి, పంటలకు ధరలకు రాక మనం నాశనమైపోయి, నా వల్ల కాదు అని చాలించుకోవాలె. అప్పుడు మన భూములు కొనేటందుకు పెద్ద పెద్ద కార్పొరేట్‌ కంపెనీలు సూట్‌కేసులతో వస్తయి. ‘మన భూములను వాళ్లకు ఇచ్చి, ఆండ్లనే కైకిలి జేసుకోవాలె’ అంటరు. ఇది చాలా ప్రమాదకరమైన కుట్ర.

పథకాలు ఇడ్సిపెట్టుకుందమా?
ఒకనాడు ఖలీల్‌వాడి మైదానంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి తండ్రి వేముల సురేందర్‌రెడ్డి నేతృత్వంలో నేను మోతె గ్రామానికి వచ్చినప్పుడు, యూనానిమస్‌గా తీర్మానం పాస్‌చేస్తే.. నేను ఆనాడు పిడికిలి బిగించి చెప్పిన. ప్రాణం పోయినా సరే తెలంగాణ రాష్ట్రం తెస్తా. వచ్చిన రాష్ర్టాన్ని సక్కగ చేస్తా అని. ఇవాళ కరెంటు, మంచినీళ్లు, సాగునీళ్లు, ఎరువులు, విత్తనాలు, రెసిడెన్షియల్‌ కాలేజీ, కల్యాణలక్ష్మి, పింఛన్లు ఎన్నో ఇచ్చి పేదలను ఆదుకుంటున్నం. ఒక్కో గ్రామానికి లక్షల రూపాయలు వస్తున్నయి. ఈ సౌలత్‌ను పోగొట్టుకుందామా? ఇడ్సిపెట్టుకుందామా? వద్దందామా? వద్దు అనాలె అని మోదీ అంటున్నరు. ఉచితాలట. పనికిమాలిన పథకాలట. ఇదీ కేంద్రం తీరు.

ఒక్క ప్రాజెక్టు కట్టారా? ఒక్క ఫ్యాక్టరీ పెట్టారా?
ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేనటువంటి గొప్ప వరం దేవుడు భారత్‌కు ఇచ్చిండు. దేశం భూభాగంగా 83 కోట్ల ఎకరాలుంటే, సరాసరి సగం 41 కోట్ల ఎకరాలు వ్యవసాయానికి అనుకూలమైన భూమే ఉన్నది. బ్రహ్మాండమైన కృష్ణా, గోదావరి, గంగా, కావేరి, నర్మద నదులున్నాయి. మోదీ వచ్చినంక ఒక్కటి కూడా కొత్త రిజర్వాయర్‌ కట్టలేదు. డంబాచారం చేసుడే తప్ప.. దేశంలో ఒక్క ప్రాజెక్టయినా కట్టారా? కొత్త ఫ్యాక్టరీ పెట్టారా? ఉన్నయి అమ్ముకుదొబ్బుడు తప్ప ఒక్కటి కూడా కొత్తది పెట్టింది లేదు. అన్నీ ఖతం చేసి.. ఇక మోటర్ల కాడ మీటర్లు పెట్టి.. ఆయింత భూములు కూడా గుంజుకుంటే మనం శంకగిరిమాన్యాలు పట్టి కూలిపని చేయాలి. దయచేసి రైతు సంఘాలు, రైతు బిడ్డలు, మీమీ గ్రామాల్లో సమావేశాలు పెట్టి, మాట్లాడి కచ్చితంగా రైతు వ్యతిరేక విధానం ఏ పార్టీ అవలంబించినా తిప్పి కొట్టాలి.

ఆ చైతన్యం మీలో రావాలి. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. రూపాయి పతనమై పోయింది. కేంద్రం ఏ ఒక్క రంగానికి చేసిన మంచి పనిలేదు. ఎవరినీ ఉద్ధరించింది లేదు. దేశం మొత్తం అంతర్జాతీయంగా పరువుపోయే పరిస్థితే తప్ప ఒక్కటి కూడా ఉద్దారం చేసింది లేదు. ప్రతిపక్షాలను చీల్చుకుంటూ గవర్నమెంటులను పడగొట్టుకుంటూ అహంకారంతో, బలుపుతో, మదమెక్కిన విధానంతో ‘మేము ఈ గవర్నమెంటు పడగొడతం, ఆ గవర్నమెంటు పడగొడతం, మిమ్ములను దించేస్తం’ అని మాట్లాడుతున్నరు. నేను ఒక్కటే మాట మనవి చేస్తున్న. అనాడు నేను బయలుదేరిన రోజు ఒక్కడినే. మీరందరూ కలిసి వస్తే ఒక సముద్రమై ఉప్పొంగి తెలంగాణ తెచ్చుకొన్నం.

బీజేపీ ముక్త్‌ భారత్‌ జెండా ఎగరాలి
ఇవాళ ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌, జీవన్‌రెడ్డి, షకీల్‌ కట్టించే కాలువల్లో నిజాంసాగర్‌, సింగూరు నీళ్లు పారాల్నా? లేక మతపిచ్చితో చెలరేగే నెత్తురు పారాల్నా? ఎస్సారెస్పీతో నిజామాబాద్‌ జిల్లా పచ్చని పంటలతో కళకళలాడాల్నా? మతపిచ్చి మంటలతో కాలిపోవాల్నా? ఒక ఇల్లు కట్టాలంటే చాలా కష్టం. సంవత్సరాలు, నెలలు టైం పడతది. ఉన్నదాన్ని కూలగొట్టాలంటే చాలా సులభం. ఒక్కసారి దేశం దెబ్బతింటే వంద సంవత్సరాలైనా మళ్లా కోలుకోదు. గతంలో మనం ఎంత ఆగమైనం, మళ్లీ ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నం.. ఒక్కొక్కటి, ఒక్కొక్కటి చేసుకుంటూ ఎట్ల ముందుకెళుతున్నం. అదే పద్ధతిలో ఈ భారతదేశం బాగుంటేనే మనరాష్ట్రం కూడా బాగుంటుంది. భారతదేశంలో ఉండే ప్రభుత్వం బాగుంటేనే మనం కూడా బాగుంటం.

కాబట్టి.. ఈ మతపిచ్చితో, అప్రజాస్వామిక విధానాలతో, అధికార దురహంకారంతో, లంచగొండి వ్యవహారాలతో, కుంభకోణాలతో, ఎన్పీఏల పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్న ఈ దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి. కచ్చితంగా బీజేపీ ముక్త్‌ భారత్‌ జెండా ఎగరెయ్యాలి. శరీరంలో అన్ని భాగాలు బాగుంటేనే మనం బాగుంటాం. మన దళిత బిడ్డలు కూడా బాగుపడాలి. దళితబంధు అని గొప్ప కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అది మన సామాజిక బాధ్యత. యావత్‌ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అన్ని గ్రామాల్లో ఉండే ప్రజా సంఘాలు, ప్రజా నాయకులు అందరూ కలిసి దళిత బంధును బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లాలి. నన్ను జాతీయ రాజకీయాలకు వెళ్లండంటూ ఆశీర్వదించినందుకు, ఆదేశించినందుకు మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.. అంటూ సీఎం తన ఉపన్యాసం ముగించారు.

ఈ బహిరంగ సభలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు హన్మంత్‌ షిండే, సురేందర్‌, బిగాల గణేశ్‌గుప్తా, షకీల్‌ అహ్మద్‌, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్‌, డీ రాజేశ్వర్‌, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, నిజామాబాద్‌, కామారెడ్డి జడ్పీ చైర్మన్లు దాదన్నగారి విఠల్‌రావు, దఫేదార్‌ శోభతోపాటు టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు రాంకిషన్‌రావు, సుజీత్‌సింగ్‌ ఠాకూర్‌, దఫేదార్‌ రాజు, ఆకుల లలిత, మార గంగారెడ్డి, పోచారం సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

నిజామాబాద్‌ వేదికగా చారిత్రక ఘట్టానికి నాంది
దేశవ్యాప్తంగా కర్షక సమాజం ఒక్కసారిగా ఉత్తేజం పొందిన సందర్భమిది. నల్లచట్టాల రద్దుకోసం.. మద్దతు ధర చట్టబద్ధత కోసం.. ఎరువుల కోసం.. విత్తనాల కోసం కేంద్రంపై పోరాడి పోరాడి అలసిపోయిన అన్నదాతలకు తెలంగాణలో ఉద్యమాల గడ్డ నిజామాబాద్‌ వేదికగా.. పెద్ద ఉపశమనం లభించింది. మోదీ పాలనలో ఛిద్రమైపోయిన దేశ వ్యవసాయరంగానికి నిజమైన రైతు పాలకుడు పచ్చని భరోసా కల్పించారు. కేంద్రంలోని బీజేపీ పరిపాలనలో ఎవుసమంటేనే ఉసూరు మంటున్న రైతు బతుకుల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెలుగు మొలకలు నాటారు. 2024లో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా రైతులందరికీ 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు ఇస్తామని విస్పష్టమైన హామీ ఇచ్చారు.

వజ్రోత్సవ భారతంలో నిజమైన రైతుబంధువు గుండెల నిండుగా రైతులకు ఇచ్చిన ధీమా చరిత్రాత్మకం.. గత ఎనిమిదేండ్లలో ఎవుసాన్ని విచ్ఛిన్నం చేసి.. కర్షక బతుకులను ఛిద్రంచేసిన మోదీ సర్కారు కబంధ హస్తాల నుంచి రైతులకు స్వేచ్ఛను కల్పించడానికి కేసీఆర్‌ దివిటీలా మారారు. మన అధికారం మన చేతికొస్తే.. మన ప్రాంతం మన పాలనలో ఉంటే తెలంగాణ ఏం చేయగలదో చేసి చూపించింది. అదే తెలంగాణ పాలకుడు నిబద్ధతతో దేశంలో 75 శాతం మందికి జీవనాధారమైన వ్యవసాయం గురించి.. రైతు ఆర్థిక పరిస్థితి గురించి తీవ్రంగా ఆలోచించి ఇచ్చిన హామీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్నదాతలకు వరంగా మారబోతున్నది.

28 రాష్ర్టాల రైతులు.. దేశ రాజకీయాల్లోకి రావాలని కోరారు
రైతులు, పేదలను కండ్లలో పెట్టుకొని చూసుకుంటున్నాం. గొర్రె పిల్లలు, చేపలు పెంచుకునేవాళ్లు, చేనేత, గీత కార్మికులు.. ఇలా అందరినీ కాపాడుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇదేవిధంగా దేశం కూడా బాగుపడాలి. ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉంటేనే ఇది సాధ్యమైతది. అహంకారంతో, ప్రతిపక్షాలను చీల్చి చెండాడి, ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుక్కుంటూ ముందుకెళ్లే ప్రభుత్వాలు కాదు. ప్రజాస్వామ్యంతో, ఓపికతో, సహించే గుణంతో, సహనశీల విధానంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే లౌకిక ప్రజాస్వామ్య శక్తుల రాజ్యం రావాలి.

28 రాష్ర్టాల నుంచి రైతు సోదరులు ఇక్కడికి వచ్చారు. ‘కేసీఆర్‌ గారూ.. మీ రాష్ట్రంలో మీరు బాగానే తిప్పలు పడ్డరు. దయచేసి మీరు భారతదేశం గురించి కూడా పిడికిలి బిగించాలి. మేమంతా మీవెంటే ఉంటాం. మీరు రండి’ అని కోరుతున్నరు. నిజామాబాద్‌ గడ్డనుంచే నేను ప్రకటిస్తున్నా. త్వరలోనే మనం జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కూడా బ్రహ్మాండంగా ప్రారంభిద్దాం. ఏ విధంగా తెలంగాణను బాగుచేశామో, అట్లనే దేశాన్ని కూడా బాగుచేసుకుంటూ ముందుకెళదాం.

భారతదేశం బాగుంటేనే మనరాష్ట్రం కూడా బాగుంటుంది. భారతదేశంలో ఉండే ప్రభుత్వం బాగుంటేనే మనం కూడా బాగుంటం. కాబట్టి.. ఈ మతపిచ్చితో, అప్రజాస్వామిక విధానాలతో, అధికార దురహంకారంతో, లంచగొండి వ్యవహారాలతో, కుంభకోణాలతో, ఎన్పీఏల పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్న ఈ దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి. కచ్చితంగా బీజేపీ ముక్త్‌ భారత్‌ జెండా ఎగరెయ్యాలి.
– సీఎం కేసీఆర్‌

మోదీ వచ్చినంక ఒక్కటి కూడా కొత్త రిజర్వాయర్‌ కట్టలేదు. డంబాచారం చేసుడే తప్ప.. దేశంలో ఒక్క ప్రాజెక్టయినా కట్టారా? కొత్త ఫ్యాక్టరీ పెట్టారా? ఉన్నయి అమ్ముకుదొబ్బుడు తప్ప ఒక్కటి కూడా కొత్తది పెట్టింది లేదు.
– సీఎం కేసీఆర్‌

విమానాలు అమ్మిన్రు. ఓడరేవులు అమ్మిన్రు. రైళ్లు అమ్మిన్రు. కార్ఖానాలు అమ్మిన్రు. బ్యాంకులు అమ్మిన్రు. అన్నీ అయిపోయినయ్‌. ఇక మిగిలింది రైతుల దగ్గరున్న భూమే. ఎరువుల ధర పెంచాలె. డీజిల్‌ ధర పెంచాలె. దున్నుకానికి ధర పెరగాలె. వరికోతకు ధర పెరగాలె. మన పంటకు ధర ఇయ్యొద్దు. మన వడ్లు కొనొద్దు. కరెంటు మీటర్లు పెట్టాలె. చాతకాక మన ఎవుసం బంద్‌చేయాలె. ఈ కుట్ర అంతా దేనికోసం జరుగుతున్నది? రైతుల దగ్గర ఉన్న భూములను లాక్కోవాలె. మోదీ దోస్తులకు, కార్పొరేట్‌ కంపెనీలకు అప్పజెప్పాలె. అన్ని బిల్లులు పెరిగి, పంటలకు ధరలు రాక మనం నాశనమై పోయి, నా వల్ల కాదు అని చాలించుకోవాలె. అప్పుడు మన భూములు కొనేటందుకు పెద్ద పెద్ద కార్పొరేట్‌ కంపెనీలు సూట్‌కేసులు వస్తయి. మన భూములను వాళ్లకు ఇచ్చి, ఆండ్లనే కైకిలి జేసుకోవాలె అంటరు. ఇది చాలా ప్రమాదకరమైన కుట్ర.
– ముఖ్యమంత్రి కేసీఆర్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.