Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దేశానికి తోవచూపుతాం

-భారత్‌ను సింగపూర్‌గా మార్చేసత్తా కేసీఆర్‌కు ఉంది
-నిజామాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత

70 ఏండ్లుగా దేశాన్ని పాలించిన నాయకులెవరికి ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధిపై చిత్తశుద్ధిలేదని నిజామాబాద్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. దేశాన్ని సింగపూర్‌లా మార్చాలంటే పట్టుదల ఉన్న నాయకుడు కావాలని, సీఎం కేసీఆర్‌తో అది సాధ్యమవుతుందని చెప్పారు. ఐదేండ్లలో రాష్ట్రానికి సంక్షేమం, అభివృద్ధి విషయంలో ఓ తోవ చూపామని, ఇదే తోవను దేశానికి కూడా చూపుతామన్నారు. శుక్రవారం రాత్రి నిజామాబాద్ నగరంలోని ఆర్‌ఆర్‌చౌరస్తాలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన భారీబహిరంగ సభనుద్దేశించి ఆమె ప్రసంగించారు. నిజామాబాద్ కోడలిగా జిల్లాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేశానని తెలిపారు. ఐదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పునాదులు వేసిందని, ఇప్పుడు భవనాలు నిర్మించే పనిఉన్నదన్నారు. సమైక్యరాష్ట్రంలో పుట్టుకను గౌరవించలేదని, చావును గౌరవించలేదని అన్నా రు.

జిల్లా కేంద్ర దవాఖాన రూపురేఖలు మార్చానని, దవాఖానలో ప్రవసమైన మహిళలకు రూ.13వేల ఆర్థికసాయంతోపాటు కేసీఆర్ కిట్‌ను అందిస్తున్నామని, ఈ పథకం కేసీఆర్ దుఃఖంలోంచి పుట్టిందని తెలిపారు. ఎలక్షన్ల కోసం మాటలుచెప్పే పార్టీ టీఆర్‌ఎస్ కాదని, పదవి ఉన్నా లేకున్నా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం నిరంతరం సేవచేస్తామన్నారు. ఐదేండ్లలో సీఎం కేసీఆర్ సంపద సృష్టించి పేదలకు పంచారని, సమైక్యపాలనతో పోలిస్తే ఇప్పుడెంతో మార్పు జరిగిందన్నారు. మే ఒకటి నుంచి పెంచిన పింఛన్లను ఇస్తామని, వృద్ధాప్య పింఛన్ 57 ఏండ్లకు కుదించి అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని భరోసా ఇచ్చారు. సొంతింటి కల ప్రతి ఆడబిడ్డకు ఉంటుందని, కిరాయి ఇంట్లో కష్టా లు తనకు తెలుసునని చెప్పారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తే ఒకరి జీతం కిరాయికే పోతుందని, డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలతో పేదల సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు. ఒకరికి వెనుక, మరొకరికి ముందు అందరికీ ఇండ్లు వస్తాయని ఆ పూచీ తనదని హామీ ఇచ్చారు. తెలంగాణకు ప్రతి ఒక్కరూ ఆత్మబంధువులేనని, ప్రజల కోసం పుట్టిన పార్టీ టీఆర్‌ఎస్ అని పేర్కొన్నారు.

పార్లమెంటులో గళాన్ని వినిపించి నిజామాబాద్ పేరు ను నిలబెట్టానని, గతంలో ఎంపీలు ఎవరైనా ఢిల్లీలో మాట్లాడిన దాఖాలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అసత్యాలు మాట్లాడడంలో బీజేపీ నంబర్ వన్ అని ఎద్దేవాచేశారు. రాష్ట్రమిచ్చే ఆసరా పింఛన్లలో రూ.800 తామే ఇస్తున్నామంటూ అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారని, కేంద్రం ఇచ్చేది 4లక్షల మందికి రూ.200 చొప్పున మాత్రమేనని అన్నారు. ఎన్నికలవేళ బీజేపీ నాయకులు మళ్లీ మోసం చేసేందుకు ఇంటింటికి తిరుగుతూ అకౌంట్, ఆధార్ నంబర్లను తీసుకొని ఖాతాలో డబ్బు లు జమ చేస్తామని ఆశ చూపుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ఎనగందుల మురళి, కార్పొరేటర్లు రంగు అపర్ణ, సిర్ప సువర్ణ, గంగామణి, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, రెడ్‌కో చైర్మన్ ఎస్‌ఏ అలీం, టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు న్యాలం కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీకి ము న్నూరుకాపు సంఘం, రజక సేవా సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, మున్నూరు కాపు దుర్కితర్ప తదితర సంఘాలు తమ మద్దతును ప్రకటించాయి.

కోమటిరెడ్డి బ్రదర్స్‌తో లాభంలేదు
-భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్

కోమటిరెడ్డి బ్రదర్స్‌తో సమాజానికి ఎలాంటి లాభంలేదని భువనగిరి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు. ట్వంటీ ఇయర్స్ ఇన్ ఇండ్రస్టీ అని సినిమా డైలాగు చెప్పుకోవడానికి తప్ప అభివృద్ధి శూన్యమని ఎద్దేవాచేశారు. శుక్రవారం రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి చండూరు మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మునుగోడు ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని, బూర నర్సయ్యగౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ బడుగుల పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి బ్రద ర్స్ రాహు.. కేతువులని కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. ప్రచారంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు జెల్లా మార్కండేయులు, మునగాల నారాయణరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుర్రం వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పెద్దగోని వెంకన్న, మునుగోడు జెడ్పీటీసీ సభ్యుడు జాజుల అంజయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
-హోంశాఖ మంత్రి మహమూద్ అలీ
-జోరుగా సికింద్రాబాద్ అభ్యర్థి సాయికిరణ్‌యాదవ్ ఎన్నికల ప్రచారం

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీటవేసిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి సాయికిరణ్‌యాదవ్‌తో కలిసి శుక్రవారం మధ్యాహ్నం నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని మల్లేపల్లి బడేమియా మసీదులో ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను కలిసి మద్దతు కోరారు. ప్రచారంలో ఎమ్మెల్సీ ప్రభాకర్, నియోజకవర్గ ఇంచార్జి ఆనంద్‌గౌడ్ పాల్గొన్నారు.

జోరుగా సాయికిరణ్ ఎన్నికల ప్రచారం
సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌యాదవ్ తన ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతంచేశారు. శుక్రవారం ఉదయం ఖైరతాబాద్‌లోని కేబీఆర్‌పార్కులో వాకర్స్‌ను కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలుచేస్తూ అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎల్లప్పుడూ తాను అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. మీ బిడ్డగా ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తిచేశారు. అనంతరం సాయికిరణ్‌యాదవ్ ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెలే క్వార్టర్స్ నుంచి ఎల్బీస్టేడియం వరకు బైక్‌ర్యాలీని ప్రారంభించారు.

ప్రచారంలో బీబీ పాటిల్‌దూకుడు

జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ శుక్రవారం సంగారెడ్డి జిల్లాలోని అందోలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని అందోలు-జోగిపేట మున్సిపాల్టీ, పుల్కల్ మండలం తాడ్‌దాన్‌పల్లి చౌరస్తా నుంచి సింగూర్ వరకు బైకు ర్యాలీ చేపట్టి, పుల్కల్‌లో సమావేశం నిర్వహించారు. మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. జోగిపేటలో మహిళలు బతుకమ్మలతో ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ను ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి పనులు జరిగాయని, సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. ఆయనతోపాటు అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ పీ జైపాల్‌రెడ్డి, జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.