Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దేశానికి దిక్సూచి తెలంగాణ

-దేశమంతా తెలంగాణ మోడల్‌పైనే చర్చ..
-సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి
-ఎన్నికల హామీ మేరకు కొత్త కార్యక్రమాలు..
-కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాక రాష్ట్రంలోనూ సమగ్రంగా..
-ఈ వానకాలంలోనే కాళేశ్వరం జలాలు..
-ఏప్రిల్‌కల్లా మిషన్ భగీరథ పనులు పూర్తి
-ఓటాన్ అకౌంట్ ప్రసంగంలో సీఎం కేసీఆర్..
-ఎన్నికల హామీల అమలుకు కేటాయింపులు

దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అనతికాలంలోనే దేశానికే తలమానికంగా నిలిచిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. అనేక ప్రతికూలతలను అధిగమించి.. సామాజిక, ఆర్థిక పునాదిని పటిష్ఠం చేసుకుం టూ దేశానికే ఆదర్శంగా నిలువడం అద్భుతమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ య థా తథంగా కొనసాగిస్తూనే, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ప్రభుత్వం తదేక దీక్షతో తపస్సు వలె పనిచేయడం వల్లనే ప్రజలు గత ఎన్నికల్లో తమ నిండుదీవెనలను అందించారు. రాబోయే కాలంలోనూ, ప్రజల ఆకాంక్షలే ప్రాతిపదికగా, ప్రభుత్వం వినూత్న పథకాలతో ముందుకు సాగుతుంది అని ఉద్ఘాటించారు. పచ్చని పంటలతో తులతూగుతూ, అన్నివర్గాల ప్రజలు సమాన అభివృద్ధిని పొందే బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మనసా, వాచా, కర్మణా వునరంకితమవుతామని ప్రకటించారు. శాసనసభలో శుక్రవారం రూ.1,82,017 కోట్లతో భారీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. తన ప్రసంగంలో తెలంగాణ ప్రగతిప్రస్థానాన్ని ఆవిష్కరించారు. ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. ఉదయం 12.13 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం.. దాదాపు గంటపాటు ఏకబిగిన కొనసాగించారు.

రాష్ట్రం ఏర్పడినప్పుడు అన్నీ సవాళ్లే
2014లో రాష్ట్రం ఏర్పడినపుడు అన్నిరంగాల్లో వెనుకబాటుతనం ఆవహించి ఉన్నదని, ఎటుచూసినా సవాళ్లే స్వాగతం పలికాయని సీఎం గుర్తుచేశారు. సమైక్యపాలన దుష్పరిణామాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వేధించాయన్నారు. తీవ్రమైన కరంటు కొరతతో, పారిశ్రామికప్రగతిలో ప్రతికూల పరిస్థితి నెలకొందని, వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. రైతుల ఆత్మహత్యలు, చిన్నాభిన్నమైన గ్రామీణార్థిక వ్యవస్థ, ముందుకుసాగని నీటిపారుదల ప్రాజెక్టులు, చెదిరిపోయిన చెరువులు, వరుస కరువులు, వలసలు, గుక్కెడు నీటికోసం అలమటించడం.. ఇదీ రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణ సామాజిక ముఖచిత్రం అని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు పట్టుదలతో ప్రయత్నాలు ప్రారంభించామని, తెలంగాణ పునర్నిర్మాణానికి సాగిన ప్రయాణంలో భగవంతుడి దీవెనలు, ప్రకృతి అనుకూలతలతోపాటు ప్రజల నుంచి సంపూర్ణ సహకారం లభించిందన్నారు. మొదటి నాలుగున్నరేండ్లలో తలపెట్టిన కార్యక్రమాలు అనుకున్న పంథాలో సాగి, అద్భుత విజయాలు సాధించాయని చెప్పారు. విద్యుత్‌సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించుకుని, అన్నిరంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసుకోగలుగుతున్నామని తెలిపారు. వ్యవసాయరంగ సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ, రైతాంగంలో నైరాశ్యాన్ని తొలిగించుకోగలిగామన్నారు. బలహీనవర్గాలకు ప్రత్యేక ఆర్థికప్రేరణ ఇవ్వడం ద్వారా వారిలో కొత్త ఉత్సాహాన్ని నిం పామని చెప్పారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం ద్వారా వచ్చే ఆనందం ప్రభుత్వ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు.

ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టేలా పురోగతి..
సమైక్యపాలన చివరి రెండేండ్లలో తెలంగాణ ప్రాంత రాష్ట్ర స్థూలఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధిరేటు దేశసగటు కన్నా తక్కువ ఉండేదని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018-19లో వృద్ధిరేటు రెండురెట్ల కన్నా ఎక్కువగా (10.6%) నమోదైందని, 2016-17లో 14.2% ఉంటే 2017-18లో 14.3 శాతానికి పెరిగిందని తెలిపారు. ఈ ధోరణి కొనసాగిస్తూ, 2018-19లో 15% వృద్ధి సాధించనున్నదన్నారు. ఇది దేశ అభివృద్ధి రేటు 12.3% కన్నా ఎక్కువని చెప్పారు. 2018-19లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.8,66,875 కోట్లుగా అంచనా వేస్తున్నామన్నారు. 2018-19లో ప్రస్తుత ధరల్లో జీఎస్డీపీ ప్రాథమికరంగం 10.9% వృద్ధి రేటును నమోదుచేస్తుందని తెలిపారు. 2018-19లో ప్రస్తుత ధరల్లో పెరుగుదల రేటు 14.9% నమోదయ్యే అవకాశం ఉన్నదన్నారు. సేవారంగంలో 15.5 శాతంగా చెప్పుకోదగిన పెరుగుదల నమోదవుతుందని ఆకాక్షించారు. 2017-18లో రూ.1,81,102గాఉన్న తలసరి ఆదాయం 2018-19లో రూ.2,06,107కు (13.8%) చేరుకోనున్నదన్నారు. ఇది జాతీయసగటు 8.6% కంటే ఎక్కువని చెప్పారు.

1.25 కోట్ల ఎకరాల సస్యశ్యామలమే లక్ష్యంగా..
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు కృష్ణా, గోదావరి జలాల్లో 1350 టీఎంసీల వాటా ఉన్నా వాడుకునేందుకు ప్రాజెక్టులు నిర్మించలేదని సీఎం కేసీఆర్ చెప్పారు. స్వరాష్ట్రంలో నీటివాటాను సమర్థంగా వినియోగించుకొని 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని, నాలుగేండ్లలోనే దాదాపు 90% నిర్మాణం పూర్తయ్యాయని తెలిపారు. కాళేశ్వరంప్రాజెక్టు ద్వారా ఈ వానకాలంలోనే సాగునీరందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నా రు. నీటిపారుదలశాఖకు రూ.22,500 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. సమైక్య పాలనలో చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించే దిశగా చర్యలు చేపట్టామన్న సీఎం.. వివిధ కులవృత్తులకు తగిన ఆర్థికప్రేరణ అందించి, వాటికి పునరుత్తేజం కలిగించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామన్నారు. సంచార జాతులు, అత్యంత వెనుకబడిన కులాలవారిని ఆదుకునేందుకు ఏర్పాటుచేసిన ఎంబీసీ కార్పొరేషన్‌కు ఈ బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. మిషన్ భగీరథ పనులు ఏప్రిల్‌కల్లా పూర్తవుతాయని చెప్పారు.

గ్రామ పంచాయతీలకు నిధులు
గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత రానీయకుండా అటు ఫైనాన్స్ కమిషన్, ఇటు నరేగా ద్వారా వచ్చే నిధులను కలిపి రాబోయే ఐదేండ్లలో ఖర్చుచేయాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్ చెప్పారు. కేంద్ర ఆర్థిక సంఘం రాష్ర్టానికి రూ.1,628 కోట్లు ఇస్తున్నందున, రాష్ట్రం తరుఫున కూడా అంతే మొత్తంలో ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రకటించారు.

స్థిరమైన ఆదాయాభివృద్ధి సాధిస్తున్నాం
దేశంలో తెలంగాణ స్థిరమైన ఆదాయాభివృద్ధి రేటును సాధిస్తున్నదని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక నాలుగేండ్లలో స్వీయ ఆదాయంలో 17.17%వార్షిక సగటువృద్ధి సాధించి, దేశంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కఠినఆర్థిక క్రమశిక్షణ, అవినీతి నిరోధానికి పటిష్ఠ విధానాలతోనే సాధ్యమవుతున్నదని చెప్పారు.

ఓటాన్ అకౌంట్ ఎందుకంటే..
ఈసారి కేంద్రం ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయి? ఏయేరంగాలకు కేటాయింపులు ఎంత ఉంటాయి? వారి ప్రాధమ్యాలేంటి? కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎలా ఉండబోతున్నాయి? తదితరాలపై స్పష్టతలేదని సీఎం కేసీఆర్ చెప్పారు. కేంద్రం పూర్తిబడ్జెట్ ప్రవేశపెడితేనే, రాష్ర్టానికి ఏ రంగంలో ఎంతమేర ఆర్థిక సహకారం అందుతుందో స్పష్టత వస్తుందని, అందుకే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ ప్రవేశపెడుతున్నదని వివరించారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, రాష్ట్రప్రభుత్వం కూడా పూర్తిస్థాయి బడ్జెట్‌ను సంపూర్ణ స్పష్టతతో ప్రవేశపెడుతుందని వెల్లడించారు.

దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ
నిన్నటిదాకా గుజరాత్, కేరళలాంటి రాష్ర్టాల అభివృద్ధి నమూనా గురించే చర్చ జరుగుతుండేది. నేడు, వాటి స్థానంలో తెలంగాణ మోడల్ గురించి చర్చ జరుగుతున్నదంటే మనందరి హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. మ్యానిఫెస్టోలో పేర్కొన్నవాటికే పరిమితంకాకుండా, పేర్కొనని అనేక కార్యక్రమాల అమలుతో రికార్డులు నెలకొల్పాం. ఇవాళ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రగతి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందుకోని కుటుంబమేదీ రాష్ట్రంలో లేదనడం అతిశయోక్తి కాదు. ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ను భారీమెజార్టీతో మళ్లీ గెలిపించి, ప్రభుత్వంపై అచంచల విశ్వాసాన్ని వేనోళ్ల చాటారు.

మూలధన వ్యయంలో అగ్రస్థానం
మొత్తం వ్యయంలో మూలధన వ్యయ శాతం (క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్) పరంగా చూస్తే దేశంలోనే తెలంగాణ ప్రథమస్థానంలో నిలుస్తున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. 2016-17 లెక్కల ప్రకారం రాష్ట్ర మొత్తం వ్యయంలో మూలధన వ్యయం 28.2% ఉన్నదన్నారు. ఉమ్మడి ఏపీలో మొత్తం 23 జిల్లాలకు కలిపి 2004-05 నుంచి 2014 వరకు మూలధన వ్యయం రూ.1,29,683 కోట్లుంటే.. తెలంగాణలోని పది జిల్లాలకు చేసినది రూ.54,052 కోట్లు మాత్రమేనన్నారు. కానీ 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో రూ.1,68,913 కోట్ల మూలధన వ్యయం చేసినట్టు చెప్పారు. ఇది ప్రభుత్వం సాధించిన ప్రగతికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండేండ్లలో స్థిర ధరల వద్ద జీఎస్డీపీ వృద్ధిరేటు 4.2 శాతంగా ఉంది. 2017-18 నాటికి ఇది రెండు రెట్లు మించి 10.4 శాతంగా నమోదైనట్టు స్వయాన కేంద్ర గణాంక సంస్థ వెల్లడించిందని సీఎం తెలిపారు.

ఎన్నికల హామీల అమలుకు..
ఎన్నికల ప్రచారంలో అన్నిరకాల పింఛన్లను రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించిన సీఎం.. వీటికోసం బడ్జెట్లో రూ.12,067 కోట్లు ప్రతిపాదించారు. బియ్యం సబ్సిడీ కోసం రూ.2,744 కోట్లు కేటాయించా రు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి రూ.1,450కోట్లు, నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు ప్రతిపాదించారు. ఎస్సీ, ఎస్టీల ప్రగతినిధులకు వరుసగా రూ.16,581 కోట్లు, రూ.9,827 కోట్లు కేటాయించారు. మైనార్టీల అభివృద్ధికి రూ.2,004 కోట్లు ప్రతిపాదించారు. వ్యవసాయరంగ సమస్యల పరిష్కారం లో తెలంగాణ.. దేశానికే దిక్సూచిగా నిలిచిందని సీఎం చెప్పారు. వ్యవసాయాభివృద్ధి, రైతుసంక్షేమానికి తెలంగాణ చేస్తు న్న ఖర్చును చూసి యావత్ దేశం ప్రశంసిస్తున్నదన్నారు. గత టర్మ్‌లో 35.29 లక్షల రైతుల రూ.16,124 కోట్ల వ్యవసాయ రుణాలను ప్రభుత్వం మాఫీచేసిందని చెప్పారు. ఈసారి కూడా 2018 డిసెంబర్ 11వరకు రైతులకు ఉన్న రూ. లక్ష లోపు రుణాలను మాఫీ చేయనున్నట్టు ప్రకటించిన సీఎం.. అందుకు బడ్జెట్‌లో రూ.6వేల కోట్లు కేటాయించారు. రైతుబంధు అమలుకు రూ.12 వేల కో ట్లు, రైతుబీమా పథకానికి రూ.650 కోట్లు కేటాయించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.