Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దొంగే దొంగ అన్నట్టున్నది

-డిపాజిట్‌ దక్కదనే బీజేపీ కొత్త నాటకాలు
-మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శ

దుబ్బాక ఉప ఎన్నికల్లో డిపాజిట్‌ దక్కదన్న భయంతోనే బీజేపీ నాయకులు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని ఆర్థికమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. డబ్బులతో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయినప్పటికీ.. పోలీసులే డబ్బులు తెచ్చారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి సోమవారం రాత్రి సిద్దిపేటలోని తన నివాసంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం నిధులున్నాయని, ఈఎస్‌ఐ దవాఖానను గజ్వేల్‌కు తరలించారని, పాలిటెక్నిక్‌ కళాశాలను సిద్దిపేటకు తీసుకెళ్లారని బీజేపీ నాయకులు చేసిన గోబెల్స్‌ ప్రచారన్ని గట్టిగా తిప్పికొట్టడంతో ఇప్పుడు మరో నాటకానికి తెరలేపారని విమర్శించారు.

ప్రజల దృష్టి మరల్చి లబ్ధి పొందేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు వారు వెళ్లి సదరు ఇంట్లో సోదాలు చేశారని, అక్కడ డబ్బులు దొరికాయని పోలీస్‌ కమిషనర్‌ స్వయంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చారని మంత్రి చెప్పారు. నాలుగు చోట్ల పోలీసులు రెయిడ్‌ చేస్తే అందులో రెండు టీఆర్‌ఎస్‌, రెండు బీజేపీ నేతల ఇండ్లు ఉన్నాయని తెలిపారు. సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు ఇంట్లో సోదాలు చేస్తే తాము సహకరించామని చెప్పారు. అలాగే చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేశారన్నారు.

బీజేపీ నేతల ఇండ్లలో సోదాలు చేస్తే ఒక చోట డబ్బులు దొరకాయని పోలీస్‌ కమిషనర్‌ చెప్పారన్నారు. బీజేపీ నాయకులు డబ్బులతో పట్టుబడి దొంగే దొంగ అన్నట్టుగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సిద్దిపేటలో డబ్బులు దొరికిన ఇంటి యజమాని.. అవి బీజేపీ అభ్యర్థివే అని పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చారని హరీశ్‌రావు చెప్పారు. బీజేపీ నాయకులు ఏమాత్రం రెచ్చగొట్టినా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రెచ్చిపోవద్దని.. సంయవనం పాటించాలని హరీశ్‌రావు విజ్ఞప్తిచేశారు. అంతకుముందు దుబ్బాక వైశ్య సదనంలో బతుకమ్మ, దసరా సందర్భంగా వైశ్య సంఘం ఆధ్వర్యంలో అలయ్‌ బలయ్‌లో ఆయన మాట్లాడుతూ అంజన్‌రావు ఇంటివద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు గూండాల్లా వ్యవహరించారని మండిపడ్డారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.