Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నిరంతర విద్యుత్తేజం

-రైతులకు కొత్త సంవత్సర కానుక.. -వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ -డిసెంబర్ 31 అర్ధరాత్రి 12.01గంటలకు ప్రారంభం -సర్వసన్నద్ధంగా విద్యుత్ సంస్థలు -కోతల నుంచి కొరతే లేని దిశగా.. -దేశంలో సాగుకు నిరంతర ఉచిత విద్యుత్ తెలంగాణలోనే -కరంట్ గోస తీరడం సంతోషకరంగా ఉంది -రైతులకు మేలు చేయడం కంటే సంతృప్తి లేదు -కరంట్ కోతలంటే తెలియని రాష్ట్రం మనది -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

ఒక సుదీర్ఘ నిరీక్షణ ముగిసిపోతున్నది. తెలంగాణ ఏర్పడితే అంధకారం తప్ప వెలుగులే ఉండవన్న మూర్ఖుల శాపనార్థాలు వ్యర్థమైపోతున్నాయి. మూడున్నరేండ్ల క్రితం తెలంగాణపై దుగ్ధతో అష్టకష్టాలు పెట్టాలని చూసిన వారికి చెంపపెట్టులా రాష్ట్రం ఆవిర్భవించిన ఆరునెలల్లోనే కోతల్లేని కరంటునిచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఇప్పుడు నిరంతర విద్యుత్ సరఫరాతో వ్యవసాయాన్ని సుసంపన్నం చేయబోతున్నారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన మాటమేరకు కొత్త సంవత్సర కానుకగా జనవరి ఒకటో తేదీ నుంచి 23 లక్షల పంపుసెట్లకు 24గంటలపాటు ఉచితంగా విద్యుత్ అందించనున్నారు. కరెంటు రాక.. నీళ్లు లేక ఎండిపోయిన పంటపొలాలంటూ.. ఇకపై తెలంగాణలో వార్తలుండవు. యావత్‌దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా చేయలేని పనిని సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారు. కొన్ని రాష్ర్టాలు 9గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. మరికొన్ని రాష్ర్టాలు 24గంటలు సరఫరా చేస్తున్నప్పటికీ ఉచితంగా ఇవ్వటంలేదు. ఇప్పుడు తెలంగాణ మాత్రమే వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రంగా చరిత్ర సృష్టించబోతున్నది. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12.01 గంటలనుంచి తెలంగాణ వ్యవసాయరంగానికి నిరంతర విద్యుత్తేజం.. కొత్త భరోసానివ్వబోతున్నది.

సర్వసన్నద్ధమైన విద్యుత్ సంస్థలు రాష్ట్రంలోని మొత్తం 23 లక్షల పంపుసెట్లకు నిరంతరాయ కరంట్ సరఫరాకు సర్వం సన్నద్ధమైంది. సీఎం ఆదేశాలమేరకు రైతాంగానికి కొత్త సంవత్సర కానుక అందించబోతున్నారు. రైతులకు 24 గంటల కరంటుతో ఏర్పడే డిమాండ్‌ను ముందుగానే అంచనావేసిన విద్యుత్ సంస్థలు అందుకు తగినవిధంగా సన్నద్ధమయ్యాయి. నిరంతర విద్యుత్ సరఫరాకు జనవరి 1 గడువు సమీపించడంతో గురువారం విద్యుత్‌సౌధ నుంచి జెన్ కో-ట్రాన్స్ కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు పరిస్థితిని సమీక్షించారు. ట్రాన్స్ కో జేఎండీ శ్రీనివాసరావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావుతో మాట్లాడారు. వ్యవసాయానికి 24 కరంటుతో సాధారణంగా పడే లోడ్‌తోపాటు ఎక్కువ లోడ్ వచ్చినప్పుడు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. నిరంతర సరఫరాతో లోడ్‌లు క్రమంగా పెరుగుతాయని, ఇందుకు తగినట్టుగా విద్యుత్‌ను సమకూర్చుకోవడానికి ఏర్పాట్లు చేశామని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రభాకర్‌రావు తెలిపారు. పంపిణీ, సరఫరా వ్యవస్థలు సక్రమంగా నడిచేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అన్నిస్థాయిల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి, ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలని చెప్పారు. వచ్చే జూన్ నుంచి ఎత్తిపోతల పథకాల పంప్‌హౌస్‌లు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున లోడ్ మరింత పెరుగుతుందని.. అప్పుడు కూడా వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు.

కొత్త చరిత్ర సృష్టిస్తున్న తెలంగాణ వ్యవసాయానికి 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ ఉచితంగా ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని రచించబోతున్నది. కొన్ని రాష్ర్ర్టాలు 9గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాయి. మరికొన్ని రాష్ర్టాల్లో 24 గంటల సరఫరా చేస్తున్నా, ఉచితంగా ఇవ్వడం లేదు. ఉచితంగా 24గంటలపాటు వ్యవసాయానికి కరంటు ఇచ్చేరాష్ట్రం తెలంగాణ మాత్రమే కావడం గమనార్హం. అంతేకాదు.. అన్ని రంగాలకూ 24గంటల విద్యుత్ సరఫరా అందించిన రాష్ట్రం కూడా అవుతుంది. 2017 జూలై నుంచి పాత మెదక్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో వ్యవసాయానికి ప్రయోగాత్మకంగా 24 గంటల విద్యుత్ అందించారు. ఆ తర్వాత 2017 నవంబర్ 6 నుంచి 20వ తేదీ వరకు 15 రోజులపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని 23 లక్షల పంపుసెట్లకు ప్రయోగాత్మకంగా నిరంతర విద్యుత్ సరఫరాచేశారు. తలెత్తే సమస్యలు, లోటుపాట్లను అంచనా వేసుకొని సరిదిద్దుకున్నారు. వ్యవసాయంతోపాటు మిగతా అన్ని వర్గాలకు అందిస్తున్న విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా.. 11వేల మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్‌ను అంచనావేసి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

గ్రిడ్ సమస్యలు తలెత్తకుండా.. వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్‌కోసం రూ.12,610 కోట్లతో జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంయుక్తంగా ఏర్పాట్లుచేశాయి. 2014 జూన్ 2కు ముందు రాష్ట్రంలో 5,240 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ఆరు 400 కేవీ సబ్‌స్టేషన్లు ఉండేవి. అన్నిరంగాలకు 24 గంటల కరెంటు ఇవ్వడానికి దాదాపు 13వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా సామర్థ్యం కలిగిన తొమ్మిది 400 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టింది. సూర్యాపేట, నర్సాపూర్, అసుపాక, డిండి, మహేశ్వరంలో 3980 మెగావాట్లతో ఐదు 400 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తిచేసింది. జూలూరుపాడు, నిర్మల్, కేతిరెడ్డిపల్లి, జనగామల్లో 3705 మెగావాట్ల నాలుగు 400 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణం జరుగుతున్నది. వీటితోపాటు 19 కొత్త 220 కేవీ సబ్‌స్టేషన్లు నిర్మించింది. 35 కొత్త 132 కేవీ సబ్‌స్టేషన్లు, 33/11 కేవీసబ్‌స్టేషన్లు కూడా వందల సంఖ్యలో నిర్మించారు. సబ్ స్టేషన్లతో పాటు 2695.25 కిలోమీటర్ల మేర 400 కేవీ లైన్లు, 6,900 కిలోమీటర్ల 220 కేవీ లైన్లు, 10,321 కిలోమీటర్ల మేర 132 కేవీ లైన్లు కొత్తగా వేశారు. తెలంగాణ వచ్చేనాటికి 2,397 ఉన్న సబ్‌స్టేషన్ల సంఖ్య ఇప్పుడు 2,942కు పెరిగింది. 3,748 వరకు ఉన్న పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు 5,472కు పెరిగాయి. విద్యుత్ లైన్లు తెలంగాణ వచ్చినతర్వాత 19,154 కిలోమీటర్ల మేర వేశారు. దీంతో మొత్తంలైన్లు1,75,961 కి.మీ.కు పెరిగాయి.

కోతల నుంచి కొరతలేని దిశగా.. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం కేవలం 6,574 మెగావాట్లు. చాలినంత కరంటు లేకపోవడంతో పరిశ్రమలకు వారానికి రెండ్రోజులు పవర్ హాలిడేలు ప్రకటించారు. గ్రామాల్లో 6 నుంచి 8 గంటలు, పట్టణాల్లో 4 నుంచి 6గంటలు, హైదరాబాద్ నగరంలో 2 నుంచి 4 గంటలు విద్యుత్ కోతలు అమలయ్యేవి. రాష్ట్రంలో కరంటు కోతలు ఉండవద్దని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. రాష్ట్రం ఏర్పడిన ఐదు నెలల్లోనే నుంచి పరిశ్రమలకు, గృహాలకు, వాణిజ్య సంస్థలకు 24 గంటల విద్యుత్‌ను కరంట్ సంస్థలు అందించాయి. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడంతోపాటు కొత్తగా నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలకు, మిషన్ భగీరథకు, పరిశ్రమలకు అవసరమైన కరంటు సరఫరా కోసం విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. గడిచిన మూడున్నరేండ్లలో ప్రభుత్వం, విద్యుత్ సంస్థల కృషితో అదనంగా 8,271 మెగావాట్ల విద్యుత్‌ను సమకూర్చుకోవడం ద్వారా 14,845 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి వచ్చింది. 13వేల మెగావాట్ల విద్యుత్ సమకూర్చుకోవడం కోసం కొత్త ఉత్పత్తి కేంద్రాలు నిర్మిస్తున్నారు. 2022నాటికి తెలంగాణలో 28వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధమైంది.

కరంటు గోస తీరడం సంతోషం: సీఎం కేసీఆర్ అతితక్కువ సమయంలోనే విద్యుత్ సరఫరాలో తెలంగాణ మెరుగైన ఫలితాలు సాధించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అన్ని వర్గాలకు 24 గంటలనాణ్యమైన విద్యుత్ అందించడంవల్ల తెలంగాణ ఖ్యాతి పెరిగిందని చెప్పారు. దశాబ్దాల తరబడి తెలంగాణ రైతులు కరంట్ గోసలు అనుభవించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడ ఈ కష్టాలు కొనసాగడం అర్థరహితమని భావించాం. అందుకే విద్యుత్ సరఫరా మెరుగుదలకు ప్రాధాన్యం ఇచ్చాం. రైతులకు 24 గంటల కరంటు ఇవ్వడాన్ని గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. రైతులకు మేలుచేయడంకన్నా మించిన సంతృప్తి మరొకటి ఉండదు. రైతులతోపాటు అన్ని వర్గాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించాం. ఇందుకు అనుగుణంగా విద్యుత్ సంస్థలు, ఉద్యోగులు పనిచేశారు. ఫలితంగానే ఇప్పుడు అన్నివర్గాలకు 24 గంటల విద్యుత్ అందించే రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించుకుంటున్నాం. విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది. రైతులకు సాగునీరు, ప్రజలకు మంచినీరు ఇవ్వడం సాధ్యమవుతుంది. విద్యుత్‌తోనే అభివృద్ధి, మెరుగైనజీవితం ఆధారపడి ఉన్నది. అందుకే ప్రస్తుత అవసరాలు తీరడంతోపాటు భవిష్యత్ అవసరాలకు విద్యుత్ ఉత్పత్తిని పెంచుతున్నాం. ఇక ఇప్పుడు తెలంగాణ కరంట్ కోతలంటే ఏమిటో తెలియని రాష్ట్రంగా మారింది అని సీఎం తెలిపారు.

సీఎం కేసీఆర్ దార్శనికత ఫలితమే ఇది: మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతవల్లే రాష్ట్రంలో వ్యవసాయంతోపాటు అన్ని వర్గాలకు నిరంతరాయ విద్యుత్ అందిస్తున్నామని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం ఆవిర్భావం నాటికి అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితిని అధిగమించి, ఇవ్వాళ రైతులకు ఉచితంగా 24 గంటల కరంటు ఇవ్వగలగడానికి సీఎం దృఢ సంకల్పమే కారణమని తెలిపారు. విద్యుత్ రంగంపై కేసీఆర్‌కు 30ఏండ్లుగా ఉన్న లోతైన అవగాహన ఈ విజయానికి కారణమైందన్నారు. సీఎం కేసీఆర్ ప్రణాళిక, మార్గనిర్దేశనం, నిరంతర పర్యవేక్షణవల్లనే ఇంత తక్కువ కాలంలో గొప్పవిజయాన్ని విద్యుత్ సంస్థలు సాధించగలిగాయన్నారు. నూతన సంవత్సర కానుకగా 24గంటల విద్యుత్ అందుకోబోతున్న రైతాంగం పొదుపుగా కరంటును వాడుకొని, భూగర్భజలాలు కాపాడుకొని బంగారు పంటలు పండించుకోవాలని ఆకాంక్షించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.