Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నేతన్న రాత మారుస్తాం

-కార్మికుడికి నెలకు రూ.15 వేలు రావాలి: సీఎం కేసీఆర్- తెలంగాణలో ఆత్మహత్యలు ఉండరాదు – ఉద్యమకాలంలో కార్మికుల బాధలు చూసి ఏడ్చిన – రాబోయే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తా – పద్మశాలీల కోసం త్రిముఖ వ్యూహం – నూలు, రసాయనాలకు సబ్సిడీ ఇస్తాం – మగ్గాల వస్ర్తాలన్నీ కొనుగోలు చేస్తాం – పవర్‌లూమ్‌లకు 100కోట్ల రుణం ఇస్తాం – సిరిసిల్లలో అపారెల్‌పార్కు, గోదాములు – నేత కుటుంబాల మహిళలకు రెడీమేడ్ వస్ర్తాల తయారీలో శిక్షణ – ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడి – ప్రగతి భవన్‌లో సిరిసిల్ల చేనేత ప్రతినిధులతో సమావేశం

చేనేత కార్మికుల ఆత్మహత్యల అపప్రథను తెలంగాణ నుంచి తుడిచివేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. చేనేత కార్మికులకు కనీసం రూ.15వేల వేతనం అందేలా చూస్తామని తెలిపారు. పద్మశాలీలను ఆదుకునేందుకు త్రిముఖవ్యూహం అవలంబిస్తామని, చేనేత మగ్గాల వారికి సబ్సిడీలు, పవర్‌లూం ఆధునికీకరణకు రుణాలు, ప్రత్యామ్నాయ ఉపాధికి ప్రోత్సాహకాలు అందచేస్తామని సీఎం ప్రకటించారు. ఇకనుంచి ప్రభుత్వంలో అన్నీ చేనేత వస్ర్తాలే ఉంటాయని స్పష్టం చేశారు.

నేత కార్మికుల జీవితాల నుంచి దుఃఖం పోవాలని, వారి తలరాత మారాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. ఉద్యమ సమయంలో చేనేత కార్మికుల పరిస్థితి స్వయంగా చూసి ఏడ్చానని, ఇకపై తెలంగాణలో నేత కార్మికులు ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. రాబోయే బడ్జెట్‌లో ఇందుకోసం నిధులు కేటాయిస్తామని చెప్పారు. చేనేత రంగంలోని ప్రతి కార్మికుడికి కడుపు నిండాలని, నేతవృత్తిపై బతికే కార్మికులకు నెలకు కనీసం రూ.15-20వేల ఆదాయం రావాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఇందుకోసం పవర్‌లూంలు నడిపే యాజమానులకు అవసరమైన చేయూత అందిస్తామని, పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేలా ఆధునికీకరణకు రూ.100కోట్ల రుణం అందచేస్తామని చెప్పారు.

చేనేత మగ్గాలకు నూలు, రసాయనాలను సబ్సిడీపై అందించడంతో పాటు వారు తయారు చేసిన వస్త్రాలన్నింటినీ కొనుగోలు చేస్తామని చెప్పారు. సిరిసిల్లలో అపారెల్ పార్కు ఏర్పాటు చేస్తామని, నేత కుటుంబాల్లోని మహిళలకు శిక్షణ ఇచ్చి వారిని రెడీమేడ్ దుస్తుల తయారీ రంగంలోకి దింపుతామని అన్నారు. పండుగల సందర్భంగా పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసే బట్టలతో పాటు ప్రభుత్వం కొనుగోలు చేసే అన్ని రకాల వస్త్రాలను రాష్ట్రంలోని నేత పరిశ్రమ నుంచే తీసుకుంటామని చెప్పారు. దేశంలో అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కును వరంగల్‌లో ఏర్పాటుచేసి రాష్ట్రంలోని అన్ని చేనేత కేంద్రాలతో అనుసంధానం చేస్తామని తెలిపారు. నేత కార్మికుల సంక్షేమం, నేత పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. చేనేత, జౌళి, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు వివేక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సీఎంవో అదనపు ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ రవీందర్‌రావు, చేనేత జౌళి శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యార్, సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్‌తో పాటు సిరిసిల్ల నుంచి వచ్చిన 40మంది పవర్ లూమ్ పరిశ్రమ ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. నేత పరిశ్రమకు చెందిన ప్రతినిధులు చెప్పిన అభిప్రాయాలను ముఖ్యమంత్రి సావధానంగా విన్నారు.

ఆత్మహత్యల అపప్రథ పోవాలి.. సిరిసిల్ల, పోచంపల్లిలో నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే అపప్రథ పోవాలని, దానికి బదులు తెలంగాణలో నేత కార్మికులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారనే మాట రావాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ చేనేత పరిశ్రమకు గతంలో ఎంతో గొప్ప పేరుండేదని, అలాంటి నేత కార్మికుల బతుకులు వ్యధాభరితంగా, బాధామయంగా మారడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పోచంపల్లి, నారాయణపేట్, గద్వాల ప్రాంతంలో నేసే పట్టు, ఇక్కత్ చీరలకు ఎంతో ప్రత్యేకత ఉందని గుర్తు చేశారు. ఇలాంటి కళను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

పద్మశాలీల కోసం త్రిముఖ వ్యూహం.. నేత వృత్తిని ఆధారంగా చేసుకుని జీవించే పద్మశాలీల కోసం త్రిముఖ వ్యూహం అనుసరించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. పద్మశాలీలు ప్రధానంగా చేనేత మగ్గాలపై పనిచేస్తున్న వారు, పవర్ లూమ్ కార్ఖానాల్లో కూలీలుగా పనిచేస్తున్న వారు, నేత వృత్తిని వదిలి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకున్న వారు మూడురకాలుగా ఉన్నారన్నారు. వీరిని మూడు భిన్నమార్గాల్లో ఆదుకుంటామని చెప్పారు.

నూలు, రసాయనాలపై సబ్సిడీ.. చేనేత మగ్గాలపై సాధారణ వస్త్రాలు నేసే వారికి నూలు, రసాయనాలను సబ్సిడీపై అందించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అలాగే వారు తయారుచేసిన వస్త్రాలన్నింటినీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్దేశించారు. ప్రతి చేనేత మగ్గాన్ని లెక్కించి ఆ మగ్గం మీద ఆధారపడిన వారిని గుర్తిస్తామని చెప్పారు. చేనేతలో నారాయణపేట, గద్వాల , పోచంపల్లి ప్రాంతాల్లో తయారయ్యే కళాత్మక వస్త్రాలకు అంతర్జాతీయ డిమాండ్ ఉన్నందున వాటిని ప్రోత్సహించడానికి అవసరమైన విధానం రూపొందిస్తామని చెప్పారు.

ప్రత్యామ్నాయ ఉపాధికి ప్రోత్సాహం.. నేత వృత్తినుంచి చాలా మంది పద్మశాలీలు ఇప్పటికే ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకున్నారు. ఇంకా ఎవరైనా పద్మశాలీలు ప్రత్యామ్నాయాలు చూసుకుంటే వారికి అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

పవర్ లూమ్‌ల ఆధునీకరణ.. రాష్ట్రంలో పవర్ లూమ్‌లు పెద్ద సంఖ్యలో ఉండగా వాటిలో అత్యధికం సిరిసిల్లలోనే ఉన్నాయని సీఎం చెప్పారు. ఈ పవర్ లూమ్‌లను రేపియల్ మగ్గాల స్థాయికి ఆధునీకరించాలని యజమానులకు సూచించారు. ఇందుకు ప్రభుత్వం రుణసౌకర్యం కల్పిస్తుందని చెప్పారు. ప్రస్తుతమున్న మరమగ్గాల మీద ఒక రోజు 40 మీటర్ల బట్ట ఉత్పత్తి అయితే, రేపియల్ మగ్గాల ద్వారా 150 మీటర్లకు పైగా తయారవుతుందని, తద్వారా నాణ్యత పెరిగి యజమానులకు లాభాలు వస్తాయని వివరించారు. అయితే దీని ఫలితం మరమగ్గాలపై పనిచేసే కార్మికులకు కూడా దక్కాలని సీఎం స్పష్టం చేశారు.

కార్మికులకు ఇప్పుడు నెలకు రూ.6-8వేలే వస్తున్నాయి. వారికి రూ.15వేలకు తగ్గకుండా వేతనం అందాలి. కార్మికుడి వేతనం బ్యాంకుల ద్వారానే అందాలి. దానితో పాటు కార్మికుల కోసం త్రీఫ్ట్ స్కీమ్ (పొదుపు పథకం) అమలు చేయాలి. కార్మికుడు ఎంత పొదుపు చేస్తాడో అదే నిష్పత్తిలో యజమానులు, ప్రభుత్వం కూడా కార్మికుడి పేరు మీద పొదుపు చేయాలి అని సీఎం చెప్పారు. పవర్ లూమ్‌ల ఆధునీకరణ వల్ల పెద్ద సంఖ్యలో కొత్త పవర్ లూములు కూడా వస్తాయని సీఎం చెప్పారు. అన్ని మగ్గాలు ఒకే రకం వస్త్రాలు కాకుండా వేర్వేరు రకాలు వస్త్రాలు, వేర్వేరు సైజులు, వేర్వేరు డిజైన్లు ఉండేలా వర్గీకరణ చేసుకోవాలని సూచించారు.

ఆ మూడింటి సమాహారంగా వరంగల్ టెక్స్‌టైల్ పార్కు.. షోలాపూర్‌లో చద్దర్లు, సూరత్‌లో చీరలు, తిర్పూరులో ఇతర వస్ర్తాల తయారీ పెద్దఎత్తున జరుగుతున్నదని, ఈ మూడింటి సమాహారంగా వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. మంత్రి కేటీఆర్ బృందం ఇటీవలే తిర్పూరు సందర్శించి వచ్చిందని, వరంగల్ టెక్స్‌టైల్ పార్కు అదే పద్ధతిలో ఉంటుందని చెప్పారు. సిరిసిల్లతో పాటు రాష్ట్రంలోని నేత కార్మికులకు, నేత పరిశ్రమకు వరంగల్ టెక్స్‌టైల్ పార్కుతో మహర్ధశ పడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వంలో ఇక మన చేనేత వస్ర్తాలే.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమయ్యే దుస్తులు, హాస్టళ్లు, హాస్పిటళ్ల దుప్పట్లు, ఇతర యూనిఫారాలు తదితర అన్ని వస్ర్తాలు తెలంగాణ నేత కార్మికులు ఉత్పత్తి చేసినవే వాడుతామని, దీని వల్ల చేనేత మగ్గాలు, మర మగ్గాలకు గిరాకీ ఉంటుందని ఆయన చెప్పారు. నూలు, రసాయనాలపై కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని భరోసా ఇచ్చారు.

ఏ సీఎం కూడా ఇలా స్పందించలేదు.. సమావేశానికి హాజరైన పద్మశాలి సంఘం నాయకులు, నేత పరిశ్రమ ప్రముఖులు ముఖ్యమంత్రి నిర్ణయాలను, స్పందనను స్వాగతించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా తమను ఇలా పిలిచి సమావేశాలు పెట్టలేదని, ఏ ప్రభుత్వం ఇంత ఉదారంగా కూడా ముందుకు రాలేదని వారన్నారు. పవర్‌లూంల ఆధునీకరణకు సహకరిస్తే తాము కార్మికులకు నెలకు రూ.15వేలు తక్కువ కాకుండా వేతనం బ్యాంకులో వేస్తామని యజమానులు ముఖ్యమంత్రి సమక్షంలో అంగీకరించారు. ఈ సందర్భంగా నూలుతో తయారు చేసిన దండను, వస్త్రాలను, చేనేత మగ్గం జ్ఞాపికను ముఖ్యమంత్రికి బహూకరించారు. సమావేశానికి ముందు సీఎం కేసీఆర్ నేత పరిశ్రమ ప్రతినిధులతో కలిసి భోజనం చేశారు. జల్ల మార్కండేయులు, చేనేత జౌళి శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, టెస్కో జీఎం యాదగిరి, చేనేత జౌళి శాఖ జేడీ పూర్ణచందర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సిరిసిల్లలో అపెరల్ పార్కు, గోదాములు.. సిరిసిల్లలో అపెరల్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. నేత కుటుంబాల్లోని మహిళలకు అవసరమైన శిక్షణ ఇచ్చి రెడీమేడ్ దుస్తుల తయారీ రంగంలోకి దింపి, ఆ కుటుంబాలు ఆర్థికంగా బలపడేలా చేస్తామన్నారు. అపెరల్ పార్కు ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌కు సూచించారు. సిరిసిల్లలో ప్రస్తుతమున్న టెక్స్‌టైల్ పార్కులో కొన్ని పరిశ్రమలు వివిధ కారణాలతో మూతపడ్డాయని, వాటిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సిరిసిల్లకు త్వరలో రైల్వే లైను కూడా వస్తున్నందున ఇక్కడ తయారైన వస్త్రాలను అటు వరంగల్ టెక్స్‌టైల్ పార్కుకు లేదా దేశంలో ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి పంపవచ్చని చెప్పారు. అలాగే పవర్ లూమ్ కార్మికులు నూలు, వస్త్రాలను నిలువ చేసుకునేందుకు సిరిసిల్లలో నాలుగు గోదాములు నిర్మిస్తామని, దీనిలో స్టాక్ పెట్టుకునే యజమానులకు సహకార బ్యాంకు ద్వారా రుణ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పారు. ఇందుకోసం మొదటి ఏడాది రూ.100కోట్లు సిద్ధంగా ఉంచాలని సహకార బ్యాంకు అధికారులను సీఎం ఆదేశించారు.

కార్మికుల బాధలు చూసి ఏడ్చిన … తెలంగాణ ఉద్యమ సమయంలో చేనేత కార్మికుల దీనావస్థను చూసి అనేక సార్లు దుఃఖపడ్డానని, రెండుమూడుసార్లయితే కండ్లనీళ్లు ఆపుకోలేకపోయాయని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కరీంనగర్ ఎంపీగా ఉద్యమంలో తిరుగుతున్న సమయంలో ఒకరోజు పేపర్లో సిరిసిల్లలో ఒకేరోజు 11మంది చేనేత కార్మికులు మృతి అనే వార్త వచ్చింది. ఆ వార్తను చూసి మనసు చలించిపోయింది. దుఃఖపడ్డాను. కార్మికులు తిండికి లేక మరణించడం చాలా బాధనిపించింది. ప్రభుత్వం నుంచి సహాయం అందే పరిస్థితి లేదు. అందుకే నేనే పూనుకుని టీఆర్‌ఎస్ పార్టీ తరుఫున రూ.50లక్షలను సిరిసిల్ల కార్మికుల కోసం పంపాను. అక్కడున్న సొసైటీ ఆ డబ్బులను అవసరమున్న వారికిచ్చి ఆదుకుంది. మరో సందర్భంలో పోచంపల్లిలో ఏడుగురు కార్మికులు మరణించినపుడు అక్కడి కార్మికుల బాధలు చూసి ఏడ్చిన. స్వయంగా భిక్షాటన చేసి నాలుగు లక్షలు జమచేసి మరణించిన నేత కార్మికుల కుటుంబాలకు అందచేసిన. అలాంటి బాధ తెలంగాణలో కూడా కొనసాగవద్దనేది నా ఆకాంక్ష. అందుకోసమే ఈ ప్రయత్నం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.