Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పండుగలా ప్రారంభోత్సవం

-పంప్‌హౌస్‌లు, బరాజ్‌లకు శ్రీకారంచుట్టిన మంత్రులు
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకమైన మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంప్‌హౌస్‌లను సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించగా, అదే సమయానికి మేడిగడ్డకు ఎగువన వివిధ ప్రాంతాల్లో నిర్మించిన పంప్‌హౌస్‌లు, బరాజ్‌లను మంత్రులు పూజలు చేసి ప్రారంభించారు. హోంమంత్రి మహమూద్‌అలీ, సహకారశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారం పంప్‌హౌస్, సుందిళ్ల బరాజ్‌ను వేర్వేర్వుగా ప్రారంభించిన అనంతరం సుందిళ్ల పంప్‌హౌస్‌ను కలిసి ప్రారంభించారు. అన్నారం బరాజ్‌ను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, నందిమేడారం భూగర్భ పంప్‌హౌస్‌ను కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ ఎనిమిదో ప్యాకేజీలో విద్యాశాఖమంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేకపూజలు నిర్వహించారు.

అన్నారం పంప్‌హౌస్
పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేట వద్ద నిర్మించిన అన్నారం పంప్‌హౌస్‌ను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఉదయం 10:10 గంటలకు అన్నారం పంప్‌హౌస్ వద్దకు చేరుకున్న హోంమంత్రికి పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన, మంథని ఆర్డీవో స్వాగతం పలికారు. అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం పంప్‌హౌస్‌ను ప్రారంభించారు. పంపుహౌస్‌లోని మోటర్లను, విద్యుత్ సరఫరా విభాగాలు, కాల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్దాల దారిద్య్రాన్ని దూరంచేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిందే కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పారు. CMKCR4 అన్నారం బరాజ్ అన్నారం బరాజ్ వద్ద వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జలపూజ, యంత్రపూజ నిర్వహించారు. వేదమంత్రోచ్చరణల నడుమ స్విచ్చాన్‌చేసి మధ్య గేట్‌ను ఎత్తి బరాజ్‌ను ప్రారంభించారు. అనంతరం గోదావరి మాతకు జల పూజలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా అహర్నిశలు కృషిచేయడంతోనే రికార్డు స్థాయిలో అతి తక్కువ సమయంలో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిందని తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఆర్డీవో వెంకటాచారి, భూపాలపల్లి డీఎస్పీ కిరణ్, ఆఫ్కాన్ ప్రతినిధులు మల్లికార్జున్‌రావు, సభాపతి, భార్గవ్ ఉన్నారు.

సుందిల్ల బరాజ్ మంథని మండలంలోని సిరిపురం వద్ద నిర్మిస్తున్న సుందిల్ల బరాజ్ వద్ద సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక పూజలుచేశారు. ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు, జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్‌తో కలిసి బరాజ్‌వద్దకు చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం బరాజ్‌కి మంచిర్యాల వైపు నుంచి ఉన్న మొదటి గేటు వద్ద గోదావరి తల్లికి పూజలు చేసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రసాధన తర్వాత ఒక అపూర్వమైన ఘట్టాన్ని పూర్తి చేసుకున్నామని కొప్పుల ఈశ్వర్ తెలిపారు.

సుందిల్ల పంప్‌హౌస్ అంతర్గాం మండలంలోని గోలివాడ వద్ద నిర్మించిన సుందిల్ల పంప్‌హౌస్‌ను హోంమంత్రి ముహమూద్ అలీ, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కలిసి ప్రారంభించారు. మధ్యాహ్నం 1:20 గంటలకు అంతర్గాం మండలంలోని గోలివాడ పంప్‌హౌస్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కలెక్టర్ శ్రీదేవసేనతో కలిసి గోదావరి తల్లికి ప్రత్యేక పూజలుచేసిన అనంతరం పంప్‌హౌస్‌ను ప్రారంభించారు. CMKCR3 నందిమేడారం ఆరో ప్యాకేజీలో భాగంగా ధర్మారం మండలంలోని నందిమేడారం వద్ద నిర్మించిన భూగర్భ పంప్‌హౌస్‌ను కార్మికశాఖమంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. మంత్రి తొలుత పాలకుర్తి మండలంలోని వేంనూర్‌లో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నందిమేడారం అండర్ టన్నెల్‌కు వచ్చే గేట్లను పరిశీలించారు. అక్కడినుంచి నందిమేడారం అండర్ టన్నెల్ చేరుకొని పంప్‌హౌస్, సర్జ్‌పూల్, జీఐఎస్ సబ్‌స్టేషన్‌ను పరిశీలించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం పంప్‌హౌస్‌ను ప్రారంభించారు. తెలంగాణ బీళ్లకు నీరందించే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును స్వప్నించి పూర్తిచేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందని మల్లారెడ్డి పేర్కొన్నారు.

లక్ష్మీపూర్ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీలో విద్యాశాఖమంత్రి జగదీశ్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం పది గంటలకు ఎనిమిదో ప్యాకేజీకి చేరుకున్న మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వాహనాల్లో భూ ఉపరితలానికి సుమారు వంద మీటర్ల లోతులోఉన్న సర్వీస్ బేకు చేరుకున్నారు. అక్కడి నుంచి మరో 20 మీటర్లు మెట్లద్వారా కాలినడకన కిందికి దిగి పంపుహౌస్‌లోని మోటర్‌ఫ్లోర్ యూనిట్-2లో ప్రత్యేక పూజలు చేశారు. యూనిట్-2లోని బాహుబలి మోటర్‌కు కూడా పూజలు నిర్వహించారు. రాష్ట్రం వస్తే ఏమొస్తదని భావించామో.. ఈ రోజు ఆ ఫలితాలను సీఎం కేసీఆర్ ఒకదాని వెంట ఒకటిగా రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సీపీ కమలాసన్‌రెడ్డి ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.