Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పట్టణాలకు ఐటీ

-నల్లగొండ, రామగుండం, సిద్దిపేటలో ఐటీ ట‌వ‌ర్లు
-సీఎం కేసీఆర్‌ దక్షతతోనే పెట్టుబడులు
-ఎన్నికలున్నా లేకున్నా అభివృద్ధే లక్ష్యం
-ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్
‌ -ఖమ్మంలో రూ.423 కోట్లతో
-అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

హైదరాబాద్‌ నగరానికే పరిమితమైన ఐటీరంగాన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకూ విస్తరిస్తున్నామని పురపాలక, ఐటీశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. ఒకప్పుడు వరంగల్‌కు ఒక హబ్‌ మంజూరయితే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోనూ ఐటీ హబ్‌లు వచ్చాయని తెలిపారు.

త్వరలో నల్లగొండ, రామగుండం, సిద్దిపేటలోనూ ఇదే రకమైన భవనాలను ఏర్పాటు చేసుకోబోతున్నామని ప్రకటించారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి కేటీఆర్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.36 కోట్లతో రెండోదశ ఐటీ హబ్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఖమ్మంలో రూ.25 కోతో నిర్మించిన అత్యాధునిక బస్టాండ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన బహిరంగసభల్లో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు.

ఆయన మాటల్లోనే.. ‘ఖమ్మంలో ఐటీ హబ్‌, మోడల్‌ మార్కెట్లు, వైకుంఠధామాలు, అత్యాధునిక హంగులతో బస్టాండ్‌ నిర్మించి మంత్రి అజయ్‌ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అజయ్‌ పట్టుదల నాకు తెలుసు. ఏడాదిలోనే ఐటీహబ్‌-2వ దశను పూర్తిచేసి, నియామకాలతో మళ్లీ పిలుస్తారనిఆశిస్తున్నా. అద్భుతంగా తీర్చిదిద్దుకున్న ఖమ్మం బస్టాండ్‌ రాష్ట్రంలోనే 2వ అతిపెద్దది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వంటి సమర్థుడు, దక్షత కలిగిన నాయకుడు ఉంటే ఏరకంగా పెట్టుబడులు సాధించవచ్చో దానికి తెలంగాణ ఐటీ రంగమే ఒక ఉదాహరణ. దక్షత కలిగిన సీఎం, స్థిరమైన ప్రభుత్వంతో దేశ వృద్ధి రేటుకంటే రెట్టింపు వేగంతో తెలంగాణలో ఐటీరంగం అభివృద్ధి చెందుతుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2013-14లో మన ఐటీ ఎగుమతులు కేవలం 56 వేల కోట్లు ఉండేవి. 2021వ సంవత్సరానికి లక్ష నలబై వేల కోట్లకు ఎగబాకింది. అంటే దానికి కారణం సీఎం కేసీఆర్‌ నాయకత్వమే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు టీఎస్‌ ఐపాస్‌, అవినీతిరహిత పరిపాలన అందించడంతోపాటు ఐటీరంగానికి అనువైన వాతావరణం ఉండటంతోనే అంతర్జాతీయస్థాయి కంపెనీలు హైదరాబాద్‌కు వస్తున్నాయి. అన్నింటికి మించి రాష్ట్రంలో ఉన్న చురుకైన యువత వల్లే తెలంగాణకు, హైదరాబాద్‌కు పెద్దఎత్తున్న పరిశ్రమలు వస్తున్నాయి.

ప్రతి ఇంటికీ బ్రాడ్‌ బ్యాండ్
‌ చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు రావడం చాలా సంతోషంగా ఉన్నదని విద్యార్థుల చెప్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం కూడా అదే. అం దరూ హైదరాబాద్‌, బెంగళూరుకు పోయే అవసరం లేకుండా ఎక్కడికక్కడ ఉపా ధి అవకాశాలు సృష్టించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ అందరికీ ఒక కార్యాచరణ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ ఇవ్వబోతున్నాం. తద్వారా డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్ట్రక్చర్‌ను, డిజిటల్‌ లిటరసీ పెంచుకోవడం, ద్వితీయశ్రేణి పట్టణాల్లోనూ ఇలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది.

తెలంగాణకు కేంద్రం సహకరించడం లేదు
తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతమాత్రం సహకరించడం లేదు. తెలంగాణ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలూ అమలుచేయడం లేదు. జీఎస్టీ బకాయిలను తిరిగి ఇవ్వడం లేదు. కేంద్రానికి తీసుకోవడమే తప్ప తిరిగి ఇవ్వడం తెలియదు. సీఎం కేసీఆర్‌ ముందుచూపు వల్లే తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. ఎన్నికలు ఉన్నా.. లేకున్నా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతాం. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని, నాయకులను ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూస్తారు. ముఖ్యమంత్రి ఆలోచనలతోనే కష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించారు. కార్గో వంటి వినూత్న సేవల ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత ఏర్పడింది.

ఖమ్మం ఆదర్శం : మంత్రి వేముల
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ పథకం తీసుకువచ్చినా అత్యధిక లాభం పొందేది ఖమ్మం ప్రజలేనని, దానికి కారణం మంత్రి అజయ్‌కుమార్‌ అని రహదారులు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ఏ పట్టణంలో జరుగని అభివృద్ధి ఖమ్మంలో జరగడం అభినందనీయమని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శకంలో యువనేత కేటీఆర్‌ ఆలోచన ఫలితంగానే నగరాలు, పట్టణాలు ఆధునీకరించబడుతున్నాయని పేర్కొన్నారు.

ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు
మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ఖమ్మం నగరంలో విస్తృతంగా పర్యటించారు. మంత్రులు వేముల, పువ్వాడతో కలిసి రూ.36 కోట్లతో నిర్మించనున్న ఐటీ హబ్‌ రెండో దశ పనులకు, రూ.30 కోట్ల (ఎస్‌డీఎఫ్‌) నిధులతో సీసీ రోడ్లకు, రూ.35 కోట్లతో శ్రీశ్రీ సర్కిల్‌ నుంచి వీ వెంకటాయపాలెం వరకు నిర్మించనున్న నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.60.20 కోట్లతో టేకులపల్లిలో నిర్మించిన 1004 డబుల్‌ బెడ్‌రూం కేసీఆర్‌ గృహసముదాయాలను, మిషన్‌భగీరథలో భాగంగా రూ.229.95 కోట్లతో చేపట్టిన 45 వేల కనెక్షన్ల మంచినీటి సరఫరాను ప్రారంభించారు. ఏడు ఎకరాల విస్తీర్ణంలో రూ.25 కోట్లతో నిర్మించిన అత్యాధునిక బస్టాండ్‌ను, 2 కోట్లతో ఆధునీకరించిన కాల్వొడ్డు వైకుంఠధామానినికి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం హెలికాప్టర్‌లో సత్తుపల్లికి వెళ్లి.. పురపాలక సంఘ భవనాన్ని ప్రారంభించారు. వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సత్తుపల్లిలో మంత్రి కేటీఆర్‌కు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తదితరులు స్వాగతం పలికారు.

ఆహా.. ఏమి రుచి
మిషన్‌ భగీరథ ద్వారా ప్రజలకు అందే మంచినీటి నాణ్యతను మంత్రి కేటీఆర్‌ స్వయంగా పరిశీలించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఖమ్మం అర్బన్‌ మండ లం టేకులపల్లిలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించిన కేటీఆర్‌.. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఒక ఇం ట్లోకి వెళ్లారు. కిచెన్‌లో నల్లా నీటిని పట్టుకుని తాగి చూశారు. మంచినీళ్లు అద్భుతంగా ఉన్నాయని, మరో రెండుసార్లు అరచేతిలో నీరు పట్టుకుని తాగి సంతృప్తి వ్యక్తంచేశారు.

హైదరాబాద్‌ తర్వాత ఖమ్మమే: మంత్రి పువ్వాడ
మంత్రి కేటీఆర్‌ విశేషకృషితో హైదరాబాద్‌ దేశ ఐటీ రాజధానిగా కాబోతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఐటీ రంగంలో, అభివృద్ధిలో హైదరాబాద్‌ తర్వాత ఖమ్మమే ఉన్నదని చెప్పారు. 2016లో ఐటీ హబ్‌ ఫేజ్‌-1 శంకుస్థాపన చేశామని, 2020 డిసెంబర్‌ 7న ప్రారంభించుకున్నామని తెలిపారు. ఖమ్మం ఐటీ హబ్‌లో 19 కంపెనీలతో 350 మందికి పైగా ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. 2వ దశ ఐటీహబ్‌లో 30కి పైగా కంపెనీలు భాగస్వామ్యం కానున్నాయని పేర్కొన్నారు. వివిధ అభివృద్ధి పనులతో ఖమ్మాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చదిద్దినట్టు వివరించారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.40 వేలకోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, లావుడ్యా రాముల్‌నాయక్‌, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, ఆర్టీసీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీల్‌శర్మ, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.