-చెరువులతోనే గ్రామాల అభివృద్ధి -దీక్షలా మిషన్ కాకతీయ పనులు సాగాలి -భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు -చెరువుల పరీరక్షణ బాధ్యత అందరిదీ -రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి

చెరువులు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి. గ్రామాలు బాగుంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారు. ప్రజల సంక్షేమం, చెరువుల బాగుకోసమే ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పనులు ఉద్యమంగా జరుగుతున్నాయి. చెరువు పూడిక తీత పనులను కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు పారదర్శకంగా చేపట్టాలి. చేసే పనిలో నాణ్యత పాటించాలి అని భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం మెదక్ జిల్లా చిన్నకోడూరు, గుర్రాలగొంది, పుల్లూరు గ్రామాల్లో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మిషన్ కాకతీయ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సీమాంధ్ర పాలనలో చెరువులను నిర్లక్ష్యం చేయడంతో నేడు నీళ్లు నిలువని దుస్థితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. స్వరాష్ట్రంలో నేడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం చెరువులన్నింటికీ పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నదన్నారు. చెరువు పునరుద్ధరణ పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై నమ్మకం ఉంచి చెరువుల పూడిక తీత పనులను అప్పగించారన్నారు.
నమ్మకాన్ని వమ్ము చేయకుండా అయ్యప్ప, హనుమాన్ దీక్ష చేపట్టినట్లు రాత్రి అనక పగలు అనక గ్రామాలు తిరుగుతూ పనులను ముందుకు తీసుకుపోతున్నానన్నారు. చేసిన పనిలో తేడాలోస్తే మాత్రం కాంట్రాక్టర్లను, ఇంజినీర్లను కూడా వదిలి పెట్టెది లేదని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం మల్లంపేట కత్వ చెరువు, గాగిల్లాపూర్ కూతనేరు, దుండిగల్ గ్రామంలోని పెద్ద చెరువు పనులను రవాణాశాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.
కన్నతల్లి లాంటి చెరువును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదన్నారు. పూడికతీత ద్వారా పుష్కలంగా వర్షపు నీరు నిలిచి సాగు, తాగునీటి ఎద్దడి తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి శంభీపూర్ రాజు, ఎంపీపీ సన్న కవిత శ్రీశైలంయాదవ్, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, సర్పంచులు అర్కల అనంత స్వామి, శ్రీనివాస్‌నాయక్, కావలి గణేశ్, ఎంపీటీసీ సభ్యులు నర్సింగ్‌రావు, సునీతా సంజీవరెడ్డి, జక్కుల లక్ష్మి, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.