రానున్నది కరువు కాటకాలు కానరాని, కన్నీటి జాడలేని మంచికాలం! పల్లెలిప్పుడు పకపకా నవ్వుతాయి. చేతినిండా పనితో ప్రతి లోగిలి కళకళలాడుతుంది. పాడిపంటలతో, పశుసంపదతో ప్రతి లోగిలి కళకళాలాడుతుంది, గ్రామస్వరాజ్యం వెల్లివిరుస్తుంది. మునుపుచూసిన పల్లె సౌందర్యం మళ్ళీ కళ్ళముందు నిలుస్తుంది.
భారత రాజ్యాంగంలోని ప్రియాంబుల్‌లోనే సామ్యవాద లక్ష్యాన్ని నిర్దేశించుకొన్న నేపథ్యంలో ప్రజల జీవితాల్లో అంతరాలను తొలిగించి, అభివృద్ధి ఫలాలను అందరికీ సమానంగా పంచడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల ప్రథమ ప్రాథమ్యం కావాలి. కానీ, ప్రజలందించిన అధికారం, వారి అభ్యున్నతి కోసం కాకుండా, పాలకులు, వారి తాబేదారు లు అందలాలెక్కేందుకు ఉపయోగించుకోవడం వల్లనే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి డెబ్భై ఏండ్లు కావస్తున్నా ప్రజలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నారు. జాతి సంపదలో సింహభాగం పిడికెడుమంది పెట్టుబడిదారుల చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నది. బడ్జెట్ అంటే ఇప్పటివరకు కార్పొరేట్ వర్గాల కనుసన్న ల్లో, రూపాయి రాకపోకల లెక్కలుగా, ఆదాయ వ్యయాల అంకెల గారడీగా మాత్రమే ఉండేది. కానీ, తెలంగాణ సాధించుకున్న పిదప, బడ్జెట్ అంటే ఎంత పవిత్రమైనదో, ప్రజల జీవితాల్లో ఎంత గుణాత్మకమైన మార్పును తీసుకువస్తుందో గత, ప్రస్తుత బడ్జెట్ల ద్వారా ప్రజల అనుభవంలోకి వచ్చింది.
ప్రజలకు సంక్షేమాన్నందించడమే మహోన్నత న్యాయం అని అంటారు ప్రఖ్యాత రోమన్ ఫిలాసఫర్ సిసిరో! ఈ మాటలకు దగ్గరగా కేసీఆర్ ఆలోచనలుంటాయి. అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందజేస్తూ, సమాజంలోని బలహీనవర్గాల వారందరినీ ఆర్థిక స్వావలంబనవైపు మళ్ళించడమే గొప్ప న్యాయంగా, అదే పాలకుడిగా తన కర్తవ్యంగా, నిరంతరం భావిస్తుంటారు సీఎం కేసీఆర్. బడ్జెట్ ప్రవేశానంతరం సీఎం కేసీఆర్ సంపద సృష్టి జరుగాలి, అది పేదవాళ్ళకు పంపిణీ కావాలి అన్న మాటలు గొప్ప దార్శనికతతో కూడుకున్నవి. అనాదిగా సమాజ సంపదకు మూలకారకులు ఉత్పత్తి కులాలవారే! తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంతో పాటుగా అనేక అనుబంధ వృత్తుల ఆధారంగా స్వయంపోషక స్థితిలో ఉండేది. కానీ, ప్రపంచీకరణ విష ప్రభావంతో పాటుగా, సమైక్య పాలకుల వివక్షాపూరిత విధానాల వల్ల కులవృత్తులన్ని ఛిన్నాభిన్నమైపోయి, తెలంగాణ జన జీవితం వలసలుగా, ఆత్మహత్యలుగా విధ్వంసకర పరిస్థితుల్లోకి నెట్టబడింది.
కులవృత్తులు, చేతివృత్తులు, వ్యవసాయాధారిత వృత్తులు అభివృద్ధి చెందినప్పుడే, ఆ దేశం భౌతికంగా, మేధోపరంగా అభివృద్ధి చెందగలుగుతుంది అన్న మహాత్మాగాంధీ మాటల్ని నిజం చేస్తూ, ఏయే కులవృత్తులకు ఎలాంటి ఆదరణ అందిస్తే వారు స్వయం పోషకంగా ఎదిగి సంపద సృష్టిలో భాగస్వాములవుతారో ఒక లోతైన అధ్యయనంతో, వివేకంతో, సాహసోపేతంగా, మానవీయ కోణంలో ప్రవేశపెట్టినదే ఈ బడ్జెట్! తెలంగాణ గ్రామీణ జీవితం ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని కలిగియున్నది. ప్రతి వృత్తి మరొక వృత్తిని ప్రభావితం చేస్తూ పరస్పర పూరకాలుగా పనిచేస్తున్నాయి. అవి ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా తమ బలమైన ముద్రను ప్రకటిస్తున్నాయి. ఒకవైపు ఐటీ, పారిశ్రామికరంగాన్ని ప్రపంచస్థాయిలో గుర్తింపును సాధించడంతో పాటు కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న అన్నివర్గాల ప్రజల సమగ్ర వికాసమే అసలైన అభివృద్ధి నమూనాగా కేసీఆర్ భావిస్తున్నారు. అయితే, సత్యాన్ని గ్రహించలేని కొందరు, ఎప్పటికీ గొల్లకుర్మలు గొర్రెలు కాసుకుంటా, కుమ్మరోల్లు కుండలు చేసుకుంటా, మాదిగలు చెప్పులు కుట్టుకుంటూ ఆయా వృత్తులకే పరిమితం కావాల్నా? వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పెద్ద చదువులు చదువకూడదా? కులవృత్తులను ప్రోత్సహించడమంటే కులవ్యవస్థను ప్రోత్సహించినట్లు కాదా? అని ఆరోపణ చేస్తున్నారు. నిజానికి భారతీయ సమాజం కులాల సమాహారం.
ఇక్కడ ఒక్కో కులానికి ఒక్కో వృత్తి అనుసం ధానమై ఉన్నది. ఇట్టి పరిస్థితుల్లో అన్నివృత్తులకు ఆర్థిక సహాయం అందించి, అభివృద్ధి వైపు పయనించేలా చేయూతనివ్వడం కులవ్యవస్థను ప్రోత్సహించ డం ఎంతమాత్రం కాదు. కులవృత్తులపై ఆధారపడ్డ వారు ఆర్థికంగా బలోపేతమైనప్పుడే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత చదువులు చదివి మెయిన్ స్ట్రీవ్‌ులోకి రాగలుగుతారు. కాన్షీరాం చెప్పినట్లు కులాలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుల నిర్మూలన జరిగే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే సీఎం కేసీఆర్ వృత్తులను నమ్ముకున్న వారికి వృత్తులను లాభసాటిగా మార్చుతూనే, ప్రత్యామ్నాయమార్గాల్లో అభివృద్ధి లక్ష్యాలను ఎంచుకొనే వారికోసం విద్య ప్రధాన వనరుగా ఉంటుందన్న భావనతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వందలాది గురుకులాలను ఏర్పాటుచేసి కేజీ టు పీజీ ద్వారా నాణ్యమైన ఉచిత విద్యను అందించి వారు ఎంతవరకైనా ఎదిగే అవకాశాలను కల్పిస్తున్నారు. విదేశాల్లో చదువుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 20 లక్షలు ఆర్థిక సహాయం అందించడమంటే, అట్టడుగు వర్గాల ప్రజలు ఆకాశమంత ఎత్తుకు ఎదుగడానికి మిగతా వర్గాలతో సమానంగా అత్యున్నత ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఊతంగా నిలిచే అద్భుత ప్రణాళికలివి!
ప్రజల నుంచి వచ్చిన డబ్బును ప్రజల కోసం ఖర్చు చేయడంలో సహేతుకత లేకుంటే అది అభ్యుదయ బడ్జెట్ అనిపించుకోదు. దు:ఖిత సమాజమొకటి మనముందే కనిపిస్తున్నా, ఆకలి, అప్పులతో నిలువెత్తు మనిషి నిట్టనిలువునా కూలిపోతున్నా, బతుకు వేటలో, వలసబాటలో బంధుత్వాలు, పేగుబంధాలు తెగిపోతున్నా, ఇంకా అనేక సమస్యలతో అతలాకుతలమైన తెలంగాణ ప్రజల కష్టాలను కడతేర్చే శాశ్వత పరిష్కార మార్గాలవైపు గత పాలకులు ఏనాడూ దృష్టిసారించలేదు. కానీ, తెలంగాణ సాధించుకుంటే ఏం చేయాలో, ఏం చేయొచ్చో అన్ని తెలిసిన కేసీఆర్, ప్రజలు తమకిచ్చిన ఐదేళ్ళ అధికారంలో రెండున్నరేండ్లలోనే చిత్తశుద్ధి ఉంటే పరిష్కరించలేని సమస్యలంటూ ఏవీ ఉండవని నిరూపిస్తూ అద్భుతాలను సృష్టించారు. అందులో భాగమే ఇంతవరకూ ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వంచే ప్రశంసలతో పాటు అనేక సంస్థలచే అవార్డులు కూడా అందుకున్న పథకాలు.
ఆర్థిక అంతరాలు అంతం చేయడానికి తెలంగాణలో జరిగిన ప్రతిఘటన పోరాటాలు మనం చూసాం. ఇక ఇప్పుడు పేదరికాన్ని దూరంచేసి, సమన్యాయం, సమాన అభివృద్ధికి దోహదం చేసే మరెన్నో పథకాల రూపకల్పన కోసం నిరంతరం కొంగ్రొత్త ఆలోచనలు చేస్తున్నారు సీఎం కేసీఆర్. రానున్నది కరువు కాటకాలు కానరాని, కన్నీటి జాడలేని మంచికాలం! పల్లెలిప్పుడు పకపకా నవ్వుతాయి. చేతినిండా పనితో ప్రతి లోగిలి కళకళలాడుతుంది. పాడిపంటలతో, పశుసంపదతో ప్రతి లోగిలి కళకళాలాడుతుంది, గ్రామస్వరాజ్యం వెల్లివిరుస్తుంది. మునుపుచూసిన పల్లె సౌందర్యం మళ్ళీ కళ్ళముందు నిలుస్తుంది. పడావుపడ్డ పల్లె తిరిగి ప్రాణం పోసుకోబోతున్నది. చేతికందిన అధికారం చేయాల్సిన పని ఇదే కదా! అధికారాన్నందుకున్న పాలకుడు పరితపించాల్సింది ప్రజల కోసమే కదా! సంక్షేమ పథకాల వెలుగులో సంతృప్తిగా జీవిస్తున్న ప్రతి పేద కుటుంబం కేసీఆర్ తమ పెద్ద కొడుకు అని చెబుతున్నాయంటే, ఇది రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పిన, ప్రగతికి కొత్తబాటలు వేసిన కేసీఆర్ అమోఘమైన ఆలోచనా సరళికి, పేదల పట్ల గల అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం కాదా..? (వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు)