Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పల్లె బతుకులకు భరోసా

అన్నార్తులు, అనాథలుండని ఆ నవయుగం అదెంత దూరం? కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడు? సుమారు 65 ఏండ్ల కిందట మహాకవి దాశరథి రాసిన పాట! పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. నా తల్లీ బందీ అయిపోయిందో కనిపించని కుట్రల. వృత్తులు పాయే ఉపాధి పాయే, ప్రత్యామ్నాయం లేకనెపాయె కూలిన బతుకులు నిలుపుటకైనా ఈ ప్రభుత్వాలు పనిచేయవా? అంటూ నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ప్రజాకవి గోరటి వెంకన్న సంధించిన పాట. గత పాలకుల వల్ల జరిగిన తెలంగాణ పల్లె బతుకుల విధ్వంసాన్ని ప్రపంచానికి చూపింది.

యాభై ఎనిమిదేండ్లు కళ్లముందే గ్రామీణ తెలంగాణ జీవిక విధ్వంసం, ఊరు, చెరువు, చేతి, కులవృ త్తులు, ఎవుసం ధ్వంసమై గ్రామ సీమలు అంపశయ్యపైకెక్కిన సందర్భంలో తెలంగాణ రగల్ జెండా ఎగరేసి స్వరాష్ట్ర ఉద్యమానికి 2001లో కేసీఆర్ శ్రీకారం చుట్టారు. తెలంగాణ తలరాత మారాలంటే రాష్ట్రంగా ఏర్పడాలని, తద్వారానే తెలంగాణ పల్లెల్లో చీకటిని తరిమికొట్టి వెలుగులు నింపొచ్చని ఉద్యమ నేతగా నాడు కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలోని ప్రతి పల్లె పిడికిలెత్తి కదిలింది. ఊరు ఎవరికైనా అందమైన జ్ఞాపకమే! కానీ ఇన్నా ళ్ల వలస పాలక వర్గాల నిర్లక్ష్యం దాన్నొక కన్నీటి గుర్తుగా మిగిల్చింది!

ఇప్పుడా చీకట్లను చీల్చే సమయం వచ్చింది. ఆ దుఃఖం ఎడబాసే రోజొచ్చింది. తెలంగాణ వస్తే ఏమొస్తదని ఎగతాళి చేసిన నోళ్లకు కుట్లు పడ్డాయి. పాలనంటే మీకేం తెలుసనే అహంకారపు మాటలకు దిమ్మతిరిగే సమాధా నం వచ్చింది. ఈ మూడేండ్లలోనే నైరాశ్యపు నీలినీడలు తొలిగిపోయాయి. అధికార వికేంద్రీకరణ నుంచి పారిశ్రామిక ప్రగతి వరకు ప్రభుత్వం నిర్ణయాత్మక అడుగులు వేస్తున్నది. బంగారు తెలంగాణ సాధనలో కీలక అడుగు 2017-18 బడ్జెట్ రూపంలో ముందుకుపడింది.

విచ్ఛిన్నమైన తెలంగాణ పల్లెల జీవవైవిధ్యాన్ని విస్తరిలా కుడుతున్న సీఎం కేసీఆర్‌ను చూస్తుంటే హస్త కళానిపుణుడు, సమస్త కళా నైపుణ్యుడూ కళ్లముందు కనిపిస్తున్నాడు. నిర్జీవమైన గ్రామాలకు జవసత్వాలు నింపే మహత్తర యజ్ఞాన్ని భుజాలకెత్తుకున్నారు. అలవికాని నీటి లెక్కలను అలవోకగా అశుకవిత్వంలా చెప్పగలిగే ముఖ్యమంత్రికి తెలంగాణ వేదన, యాత న, కన్నీళ్లు కష్టాలు తెలియనివి కావు. తుమ్మలు మొలిచిన చెరువుల్లో, కన్నీళ్లు మాత్రమే పారిన కాలువల్లో, ఏళ్లకేళ్లు బీళ్లుగా మారిన పొలాల్లో, దిగులు తప్ప రాబడే లేని రైతుల్లో చిరునవ్వులు నింపే మహత్తర యజ్ఞం సాగుతు న్నది. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ కోసం సీఎం అహోరాత్రులు శ్రమిస్తున్న తీరు, నిబద్ధత, చిత్తశుద్ధిని చూస్తుంటే బంగారు తెలంగాణ స్వాప్నికుడి అంతరంగం అంత సులువుగా అర్థం కాదు.

గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు వ్యవసాయాన్ని దండుగన్నాయి. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతును చిన్నచూపు చూసినయి. బకాయిలు చెల్లించ మంటే లాఠీఛార్జీలు చేసినయి. విత్తనాలు, ఎరువులు కావాలని అడిగిన పాపానికి వీపుల మీద ఖాకీ లాఠీల మోతలు మోగించినయి. పెంచిన కరెం టు ఛార్జీలు తగ్గించమంటే కాల్పులు జరిపినయి. ఒకప్పుడు చిమ్మచీకట్లు నిండిన తెలంగాణలో ఇప్పుడు రెప్పపాటు కూడా కరెంటు పోకుండా సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికలు రచించారు. స్వరాష్ట్రం నిరంతర విద్యుత్‌తో వెలుగులు విరజిమ్ముతున్నది. అన్నమాట ప్రకారం వ్యవసాయానికి పగటి పూట 9 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్నారు. ఈ వేసవిలో డిమాం డ్‌కు తగినట్టుగా విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం. విద్యుత్ శాఖకు ఈ బడ్జెట్లో రూ.4,203.21 కోట్లు కేటాయించారు.

కోటి ఎకరాలకు సాగు నీరందివ్వడమే లక్ష్యంగా కృష్ణా గోదావరి నదుల పై 23 మేజర్, 13 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. అందులో ఏడు ప్రాజెక్టులు పూర్తి కాగా, మరో 14 ప్రాజెక్టులు పనులు నడుస్తున్నాయి. రాకెట్ వేగంతో భక్తరామదాసు పూర్తిచేయడమే కాకుండా పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచే సి నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగు నీరందించింది. సీఎం కేసీఆర్ రూపొందించిన మిషన్ కాకతీయతో స్వరాష్ట్రంలో చెరువులకు మళ్లీ పూర్వవైభవం వచ్చింది. వాన నీటితో చెరువులన్నీ అలుగు పోస్తున్నాయి. ఇందు లో భాగంగానే ఈ బడ్జెట్‌లో కూడా మిషన్ కాకతీయకు 3 వేల కోట్లు కేటాయించారు. సాగునీటి రంగానికి మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభు త్వం ఈ సారి కూడా ఆ రంగానికి 25 వేల కోట్లు కేటాయించింది. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ హామీని వందశాతం నెరవేర్చింది ప్రభు త్వం. నాలుగో దఫా కోసం కూడా 4 వేల కోట్లు కూడా విడుదల చేసింది.

కాల పరీక్ష తట్టుకొని నిలబడ్డ కులవృత్తులను గుర్తించడంలోనే సీఎం కేసీఆర్ ముందుచూపు విభిన్నమైంది. లాభసాటి కులవృత్తుల ద్వారా ఆదాయం సమకూరే మార్గాన్ని సుగమం చేశారు. ఆ ఆలోచనల్లో భాగంగానే వచ్చే రెండేండ్లలో 4 లక్షల యాదవ కుటుంబాలకు 84 లక్షల గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయించారు. అర్హత గల ప్రతీ కుటుంబానికి 20 గొర్రెలు, ఒక పోతును 75 శాతం సబ్సిడీతో ఇవ్వాలని ముందుకువచ్చారు. చేపల వేటపై ఆధారపడ్డ గంగపుత్ర, ముదిరాజుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సర్కారు నడుంకట్టింది. లక్షలాది మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయూతనందిస్తున్నది. చేపల పెంపకాన్ని ఒక పరిశ్రమ తరహాలో నిర్వహించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలాష.నాయీ బ్రాహ్మణులు, రజకులకు ప్రత్యేక తోడ్పాటునందించేలా బడ్జెట్లో కేటాయింపులు చేయడం హర్షనీయం. అత్యాధునిక సెలూన్ షాపుల కోసం ప్రభుత్వమే పెట్టుబడి భరించబోతున్నది. రజకుల వృత్తిని ఆధునికీకరించే విధంగా వాషింగ్ మెషీన్లు, డ్రయ్యర్లను, ఇస్త్రీ పెట్టెలను అందించాలని నిర్ణయించింది. వారి కోసం రూ.500 కోట్లను ప్రతిపాదించింది సర్కారు.

చితికిపోయిన చేనేత కార్మికుల ఇళ్లలో వెలుగులు నింపేందుకు సర్కారు పెద్ద మనసుతో ముందుకువచ్చింది. వీరికి పూర్వవైభవం తెచ్చేందుకు నడుం బిగించింది. దానికోసం మూడు దశలుగా ప్లాన్లు సిద్ధం చేసింది. 1. చేనేత వస్ర్తాలను ప్రభుత్వమే కొనుగోలు చేయడం. 2.నూలు, కెమికల్స్ రాయితీ మీద ఇవ్వడం. 3. మార్కెటింగ్ సదుపాయం కల్పించడం. పెద్ద సంఖ్యలో పవర్ లూమ్లను ఆధునీకరించేలా చర్యలు తీసుకుంటున్నది. ప్రతీ కార్మికుడికి నెలకు 15 వేలు వచ్చేలా పవర్‌లూమ్ యాజమాన్యాలను ప్రభు త్వం ఒప్పించింది. ఈసారి బడ్జెట్లో కూడా నేతన్నల కోసం రూ.1200 కోట్లు కేటాయించింది.

బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో వారి కోసం రూ.5070 కోట్లు కేటాయించింది. దానికితోడు బీసీ హాస్టళ్లకు సన్నబియ్యం, విద్యుత్ సబ్సిడీ, రుణమాఫీ, విద్య, వైద్య సదుపాయాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నది. తాగునీటి కోసం మైళ్లకు మైళ్లు నడుస్తున్న తెలంగాణ ఆడపడుచుల కన్నీళ్లు తుడిచేందుకు మిషన్ భగీరథ నిరాటంకంగా కొనసాగుతున్నది. దానికోసం బడ్జెట్‌లో 3 వేల కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో పేద ఆడబిడ్డలను తన బిడ్డలుగా భావించి పెళ్లి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ పెద్దమనసుతో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని 51 నుంచి 75 వేలకు పెంచారు. ఇది సీఎం నిండుమనసుకు నిదర్శనం. మహిళా శిశు సంక్షేమమే రాష్ట్ర సంక్షేమంగా భావించి ఏ గర్భస్థ శిశువు కూడా పురిట్లోనే కన్నుమూయకుండా ఉండాలని ప్రభుత్వం తపన పడు తున్నది.

ఇందులో భాగంగానే గర్భిణీల ప్రసవం కోసం దవాఖానలో చేరిన వెంటనే కనీసావసరాల కోసం రూ.4 వేలు, ప్రసూతి తర్వాత డిశ్చార్జి అయ్యే సమయంలో మరో 4 వేలు, పుట్టిన బిడ్డకు టీకా వేయించే సమయంలో ఇంకో 4 వేలు.. ఇలా మూడు విడతల్లో 12 వేలు ఇవ్వాలని, అంతే కాకుం డా ఆడపిల్లకు జన్మినిస్తే అదనంగా మరో వెయ్యి ఇవ్వాలని సర్కారు ముం దుకువచ్చింది. ప్రసవం సందర్భంగా పేద మహిళలు వేజ్ లాస్ కాకుండా ఆ మాతృమూర్తులను కుటుంబాలు భారంగా చూడకుండా ఈ రకమైన ఆర్థిక సహాయం చేయడం మనసున్న ముఖ్యమంత్రి మానవీయ ఆలోచనకు అద్దం పడుతున్నది. పుట్టిన బిడ్డ సంరక్షణ కోసం నెల రోజుల పాటు ఉపయోగపడే 16 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ ఇవ్వడం మరో మంచి నిర్ణయం. అంగన్వాడీ వర్కర్ల దయనీయ స్థితిని అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వారి జీతం పెంచి వారికి గౌరవం తెచ్చారు. ఒంటరి మహిళకు పింఛన్ అందజేస్తూ తండ్రిగా నిలబడే మమతల ప్రభుత్వమని నిరూపి స్తున్నారు. మహిళా సంక్షేమానికి ఈ సారి 1731 కోట్లు ప్రతిపాదించారు.

వ్యవసాయంపై ఆధారపడ్డ దళిత కుటుంబాలకు మూడెకరాల సాగుభూమి, యువతకు నైపుణ్యాభివృద్ధి, 130 గురుకులాలు, స్టడీ సర్కిళ్లు, కల్యాణలక్ష్మి పథకం, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్, ఇంటికి యాభై యూని ట్ల ఉచిత కరెంటు.. ఇలా చెప్పుకుంటూ పోతే 14 వేల కోట్లకు పైచిలుకు నిధులు ఎస్సీల సంక్షేమం కోసం కేటాయించడం చూస్తుంటే వారిపట్ల ప్రభుత్వం కనబరిచే చిత్తశుద్ధి తేటతెల్లమవుతున్నది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కు బదులుగా ఆయావర్గాలకు జనాభా నిష్పత్తికి అనుగుణంగా నిధులు కేటాయించాలనే లక్ష్యంతో స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కేటాయించారు. వ్యవసాయంపై ఆధారపడ్డ ఎస్సీలకు మూడెకరాల భూ పంపిణీ పథకం అమలులో భాగంగా గతేడాది రూ.450 కోట్లు ఖర్చుచేసి 3671 మంది లబ్ధిదారులకు 9664 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఎస్టీల సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేసింది. 51 గురుకులాలను ఇప్పటికే ప్రారంభించింది. జనాభాకనుగుణంగా జిల్లాల్లో కొత్త స్టడీసర్కిళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తమ్మీద ఎస్టీ సంక్షేమానికి రూ.8165 కోట్లు ప్రతిపాదించింది. ఇన్నాళ్లూ చీకట్లో బతుకును వెళ్లదీసిన ఎంబీసీలకు అండ దొరికింది. వారికోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వెయ్యి కోట్ల నిధి కేటాయించడం చూస్తుంటే వారి అభ్యున్నతిని కాంక్షించే పాలకుడు కేసీఆర్ అనడంలో అతిశయోక్తిలేదు.

ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా చితికిపోయిన మైనార్టీల బతుకుల్లో ఒక భరోసాను నింపే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. వారికోసం 201 గురుకుల పాఠశాలలను మంజూరు చేశారు. ఇందులో భాగంగానే వారికి ఈ బడ్జెట్‌లో 1250 కోట్లు కేటాయించారు.వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆసరా పిం ఛన్లు ఇచ్చి వాళ్లకు గౌరవప్రదమైన బతుకునిచ్చిందీ ప్రభుత్వం. ఈ బడ్జెట్ లో ఆసరా పింఛన్లకు 5,330 కోట్ల రూపాయలు కేటాయించింది. బలహీనవర్గాలు ఆత్మగౌరవంతో బతుకడానికి అనువైన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ఈ ప్రభుత్వం చేపట్టింది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం ఈ బడ్జెట్లో పెద్దఎత్తున నిధులు కేటాయించింది. సబ్బండ వర్ణాలను కలుపుకొని తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి రథాన్ని సీఎం కేసీఆర్ ముందుండి నడిపిస్తున్నారు. మూగజీవాలే ప్రపంచంగా బతికిన యాదవుల ఆత్మగౌరవం రెక్కవిప్పుతున్నది. దీనంగా బతుకీడుస్తున్న గంగపుత్రుల జీవితాల్లో చేపపిల్ల దుంకులాటలు కనిపిస్తున్నాయి. దగాపడ్డ దళితుల బతుకులు, వారి వెతలు తీరుతున్నాయి. గిరిజన గోండు లంబాడా ఆదివాసీల గూడేల్లో, తండాల్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. క్రిస్టియన్, ముస్లిం మైనార్టీల మొఖాల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నది. బీడు భూముల్లో దిగాలుపడ్డ రైతన్న ముఖం మీద చిరునవ్వు కనిపిస్తున్నది.

భారత జాతిపిత మహాత్మా గాంధీ దేశానికి పల్లెలే పట్టుగొమ్మలన్నాడు, గ్రామ స్వరాజ్యం కోసం కలలుగన్నాడు. పేదల సంక్షేమమే పరమావధిగా, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రూపకల్పన చేసిన ఈ బడ్జెట్ తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు కరదీపిక లాంటిది. కూలిన జీవితాలను నిలబెట్టిన పద్దు. తెలంగాణ పల్లెల్లో కొత్త పొద్దు. శ్రమైక జీవన సౌందర్యాన్ని బడ్జె ట్లో ఆవిష్కరించిన ప్రభుత్వం, పల్లె వికాసానికి బాటలు పరిచింది. ఒకప్పు డు బడ్జెట్ అంటే ఏదో అంకెల గారడీ అని, అదేదో శ్రీమంతుల, వ్యాపార స్తుల లెక్కలనే భావన సమాజంలో ఉండేది. కానీ ఒక కొత్త ఒరవడి సృష్టించి సరికొత్త పంథాలో నడిపించి బడ్జెట్ అంటే అంకెల గారడీ కాదు, సామాన్యుడి బతుకుకు భరోసానిచ్చేదని తెలంగాణ ప్రభుత్వం దేశానికి చాటింది. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తెలంగాణ జాతిపిత, తెలంగాణ గాంధీ కేసీఆర్ అక్షరాల ఆచరణలో నిరూపిస్తున్నారు. -(వ్యాసకర్త: పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.