ప్రజల అవసరాలకు.. పరిష్కారాలకు మధ్య పరుగులు తీసేదే పరిపాలన. ప్రజల నమ్మకాన్ని ఎన్నికల గణాంకాల్లోకి అనువదిస్తే కనిపించేదే విజయం. ఆయన ప్రజలను నమ్ముకొన్నారు. ప్రజలు ఆయనను నమ్ముకొన్నారు. పరస్పర నమ్మకాల అప్రతిహత విజయ పరంపర. కొత్తగా ఏర్పడిన తొలి హయాంలో అనూహ్య ఫలితాలు సాధించిన కేసీఆర్ ప్రభుత్వం.. మలి హయాంలో అసాధారణంగా తిరుగులేని విజయాలు సాధిస్తున్నది. ఎన్నిక ఏదైనా ఎదురులేని విధంగా ముందుకుసాగుతున్నది. మొన్నటికి మొన్న జరిగిన జెడ్పీ ఎన్నికల్లో.. నిన్న జరిగిన పురపాలక ఎన్నికల్లో.. తాజాగా జరిగిన సహకార ఎన్నికల్లో 100% గెలుపును నమోదుచేసి తెలంగాణ ప్రజల అచంచలమైన విశ్వాసాన్ని చూరగొన్నది. సంప్రదాయానికి భిన్నంగా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవుల్లో ఈసారి ఉద్యమకారులు సహా అన్ని సామాజికవర్గాలకు అవకాశం కల్పించారు. నలుగురు రెడ్లు, ఇద్దరు వెలమలకు అవకాశమిచ్చారు. డీసీఎంఎస్ చైర్మన్‌గా లింగాయత్ల్లో ఒకరికి.. యాదవ, మున్నూరుకాపు, పెరిక, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక్కొక్కరికి అవకాశమిచ్చారు. ముగ్గురు రెడ్డిలకు, ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి చైర్మన్ పదవులు దక్కాయి. డీసీసీబీ, డీసీఎంఎస్‌ల చైర్మన్ పదవుల్లో మొత్తంగా 18 పదవుల్లో 45% బీసీలకే ఇచ్చారు. సహకార ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలకు ఇలా అవకాశం ఇవ్వడం బహుశా ఇదే మొదటిసారి.

-ఎన్నిక ఏదైనా గులాబీ పరిమళమే -డీసీసీబీ, డీసీఎంఎస్‌లన్నీ టీఆర్ఎస్కే -మొత్తం 18 పదవులూ కారుకే ఖరారు -45 శాతం చైర్మన్ పదవులు బడుగులకే అప్పగింత -ఉద్యమకారులకు పెద్దపీట.. మహబూబ్‌నగర్ డీసీసీబీ చైర్మన్‌గా పాషా -ఆదిలాబాద్‌లో కాంబ్లే నామ్‌దేవ్‌కు చాన్స్ -వరంగల్ డీసీఎంఎస్‌లో గుగులోతు నాయక్ -గల్లీ నుంచి ఢిల్లీదాక కారుదే సవారీ..! -ఓట్లు, సీట్లు పెంచుతూ సంపూర్ణ విశ్వాసం -చరిత్రను తిరగరాస్తూ ఎన్నికల్లో అఖండ విజయాలు
ఎన్నిక ఏదైనా.. ఒక వర్గానికో.. ఒక కులానికో ప్రాధాన్యమివ్వకుండా సామాజిక సమతూకాన్ని పాటిస్తూ .. పీడిత వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన నాయకుడిగా సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారు. సంతులన, సానుకూల రాజకీయాలకు చుక్కానిగా నిలిచారు. దేశ రాజకీయాల్లో తెలంగాణ ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. తెలంగాణ ఏర్పాటునాటి నుంచి నేటివరకు రాష్ట్రంలో జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ ఓటర్లంతా ఇంటిపార్టీ టీఆర్ఎస్వైపే ఉన్నామంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నాయకత్వమే శ్రీరామరక్ష అని.. ఆయనతోనే అభివృద్ధి సాధ్యమన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఓట్లు, సీట్లు దాదాపు ఏకపక్షంగా ఇస్తూ వస్తున్నారు. ఎన్నికలు బ్యాలెట్ ద్వారానైనా, ఈవీఎంల ద్వారానైనా.. పార్టీ గుర్తుపై అయినా, మద్దతుదారులుగా పోటీచేసినా గెలుపుమాత్రం టీఆర్ఎస్దే అని చాటిచెప్పారు. అధికారంలో ఉన్న పార్టీపై సహజంగానే కొంత వ్యతిరేకత రావడం సహజం. దీంతో సీట్లు, ఓట్లు తగ్గుతూ వస్తాయి.. కానీ తెలంగాణలో అందుకు భిన్నంగా ఎన్నిక జరిగిన ప్రతిసారి కేసీఆర్‌పై నమ్మకం, విశ్వాసం ఓట్ల రూపంలో పెరుగుతూ వస్తున్నది.
చరిత్రను తిరగరాస్తూ.. 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని ఉప ఎన్నికలు, పంచాయతీ, పరిషత్, మున్సిపల్, జీహెచ్ఎంసీ సహా తాజాగా జరిగిన సహకారఎన్నికల వరకు టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టంకడుతూ వచ్చారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 63 స్థానాల్లో 52.94 శాతం సీట్లలో టీఆర్ఎస్ను గెలిపిస్తే.. 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ ఓటుబ్యాంకు తిరుగులేనివిధంగా పెరిగి 88 స్థానాలను గెలుచుకొన్నది. 2016లో గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ఏకంగా 99 స్థానాలను దక్కించుకుని.. ఏ పార్టీ మద్దతు లేకుండానే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్రమోదీ హవా, బీజేపీ ప్రభావం కనిపించినా తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగింది. 17 లోక్‌సభ స్థానాల్లో 41.71 శాతం ఓట్లు సాధించి 9 స్థానాలు గెలుచుకున్నది. 2014లో పరిషత్ ఎన్నికల్లో 538 జెడ్పీటీసీ స్థానాలకు 191 చోట్ల (35.50 శాతం), 5,816 ఎంపీటీసీల్లో 1,860 చోట్ల (31.98శాతం) టీఆర్ఎస్ గెలిచింది. 2019లో పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జాతీయ రికార్డు నమోదు చేసింది. మొత్తం 32 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను గెలుచుకున్నది. 538 జెడ్పీటీసీలకు 449 స్థానాలు (83.45 శాతం సీట్లు), 5,816 ఎంపీటీసీలకు 3,571 స్థానాలు (61.39 శాతంఓట్లు) దక్కించుకుని రికార్డు సృష్టించింది. మొత్తం 537 ఎంపీపీలలో టీఆర్ఎస్ 431 మండలాలలో పాగావేసింది.
52.94 శాతం సీట్లను గెలచుకుంది. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీల సీట్లు కలిసిన టీఆర్ఎస్ పార్టీ కంటే తక్కువగానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 29.79 శాతం ఓట్లతో 3 స్థానాలు, బీజేపీ 19.65 శాతం ఓట్లతో 4 స్థానాలు, ఎంఐఎం 2.8 శాతం ఓట్లతో ఒక సీటు గెలిచింది.
ఉప ఎన్నికల్లో తిరుగులేని గులాబీ తెలంగాణ ఏర్పడిననాటినుంచి జరిగిన అన్ని ఉపఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అద్భుతమైన విజయాలు సాధించింది. సీఎం కేసీఆర్ రాజీనామాతో ఖాళీఅయిన మెదక్ లోక్‌సభ స్థానానికి 2014 చివర్లో జరిగిన ఉపఎన్నికలో కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారు. తర్వాత కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీఅయిన వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ రికార్డుస్థాయి మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్‌సహా ఏ పార్టీకి డిపాజిట్ దక్కలేదు. కాంగ్రెస్ సభ్యుల మరణాలతో ఖాళీఅయినా నారాయణ్‌ఖేడ్, పాలేరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీమెజార్టీతో గెలుపొందారు. హూజూర్‌నగర్ ఉపఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన సతిమణీని బరిలో నిలిపినా టీఆర్ఎస్ను 43వేల మెజార్టీతో గెలిపించారు.
మున్సిపల్ ఎన్నికల్లోనూ భిన్నమైన వాతావారణం ఉండే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 42.5శాతం ఓట్లు సాధించింది. 120 మున్సిపాలిటీల్లో 112 మున్సిపాలిటీలను కైసవసం చేసుకొని 93.33 శాతం చైర్మన్ స్థానాలను దక్కించుకున్నది. 10 కార్పొరేషన్లలో పదింటినీ గెలిపించుకున్నది. పార్టీ అభ్యర్థులు గెలువడమే కాకుండా ఈసారి భారీ సంఖ్యలో కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భీంగల్, మరిపెడ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అన్ని స్థానాలను కైసవం చేసుకొని క్లీన్‌స్వీప్ చేసింది.
సం‘క్షేమ’రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి పరిపాలన ప్రారంభించినప్పటినుంచి పేదల సంక్షేమమే లక్ష్యంగా చాలా పథకాలను ప్రవేశపెట్టారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, రుణమాఫీ, కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులు, వ్యవసాయానికి ఉచితవిద్యుత్, రెసిడెన్షియల్ స్కూళ్లు, టీఎస్ఐపాస్ తదితర పథకాలు, పాలసీలతో టీఆర్ఎస్ను ప్రజలకు మరింత చేరువచేశారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయి. దేశవ్యాప్తంగా కేసీఆర్ పథకాలు పేర్లు మార్చి అమలుచేస్తున్నారు. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, మున్సిపాలిటీలు ఏర్పాటుతో పాలన వికేంద్రీకరణ జరిగి దాని ఫలాలు ప్రజలకు చేరడం మొదలయింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండటంతోపాటు, 24గంటల నిరంతర విద్యుత్ ద్వారా అనేక ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఇక్కడ తమ యూనిట్లను ఏర్పాటుచేస్తున్నాయి.