Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రభుత్వ దవాఖానల్లోనే వంద శాతం ప్రసవాలు : సీఎం కేసీఆర్

ప్రభుత్వ దవాఖానల్లోనే వంద శాతం ప్రసవాలు ఆ దిశగా ప్రజలను చైతన్యం చేయాలి: సీఎం కేసీఆర్

cmkcr

కాన్పు కోసం ప్రైవేటు దవాఖానకు వెళ్లి వేలకువేలు ఇచ్చుకోలేని పేదింటి గర్భవతులకు సర్కార్ దవాఖానలు అండగా నిలువాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. గర్భవతికి పౌష్టికాహారం అందించటం, ప్రసవం కోసం దవాఖానకు తీసుకురావటం దగ్గరి నుంచి పుట్టిన శిశువుకు అవసరమైన సామాన్లతో కూడిన కిట్లను అందజేయటం వరకూ… వైద్యారోగ్య సిబ్బంది వెన్నంటి ఉండాలని సూచించారు.

పేద కుటుంబాలకు చెందిన గర్భిణులు ప్రసవం కోసం ప్రభుత్వ దవాఖానలకు వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ వైద్యరంగాన్ని మరింత మెరుగుపర్చాలని అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వచ్చే బడ్జెట్లో వైద్యారోగ్య రంగానికి నిధుల కేటాయింపును పెంచడంతోపాటు, ఆ నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆర్థికశాఖకు సీఎం చెప్పారు. వైద్యారోగ్యశాఖలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్‌లో కేసీఆర్ సోమవారం సమీక్ష జరిపారు.

పేద కుటుంబాలకు చెందిన గర్భిణులు ప్రసూతి సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కాన్పు కోసం ప్రైవేట్ దవాఖానల్లో చేరి వేలాది రూపాయల బిల్లులు చెల్లించడం వారికి చాలా కష్టమన్నారు. కొన్ని ప్రైవేట్ దవాఖానల్లో అవసరం లేకున్నా ఆపరేషన్లు చేయటం వారిని మరింత ఇబ్బందులపాలు చేస్తున్నదన్నారు. ఈ సమస్యల బారి నుంచి వారిని ప్రభుత్వ దవాఖానలే కాపాడాలని, కాన్పు కోసం గర్భిణులు ప్రభుత్వ హాస్పి టళ్లకే వచ్చేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికా రులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో అవసరమైన సిబ్బందితోపాటు పరికరాలు, మందులను సిద్ధంగా ఉంచాలని, ఏర్పాట్లు బాగా ఉన్నాయనే నమ్మకాన్ని పేదల్లో పెంపొందించాలన్నారు. గర్భిణిలను దవాఖానకు తీసుకొచ్చే బాధ్యతను కూడా చేపట్టాలన్నారు. పేదలు, ఆదివాసీ, గిరిజన మహిళలు ఇప్పటికీ ఇండ్లలోనే ప్రసవిస్తున్నారు. ఇది ప్రమాదకరం. తల్లీ బిడ్డలకు ఏ మాత్రం క్షేమం కాదు. ఈ విషయంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టాలి. సాంస్కృతిక సారథి ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ విషయంలో మీడియా సహకారం కూడా తీసుకోవాలి అని ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. రెండున్నరేండ్లుగా వైద్యారోగ్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని సీఎం చెప్పారు. అమ్మ ఒడి పేరుతో గర్భవతులను దవాఖానకు తీసుకురావడం, ఇంటికి తీసుకెళ్లటం జరుగుతున్నదని గుర్తుచేశారు.

ప్రోత్సాహకాలను అందించాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అయ్యే మహిళలకు మంచి ప్రోత్సాహకాలు అందించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. పేదింటి మహిళ గర్భిణిగా ఉన్న సమయంలో కూలీ, వ్యవసాయం ఇతరత్రా పనులు చేసుకోలేరు. అంతేగాక వారు మంచి ఆహారం కూడా తీసుకోవాలి. దీనివల్ల పేద కుటుంబాలపై ఆర్థికంగా భారం పడుతుంది. ఈ భారాన్ని తగ్గించటం కోసం పేద గర్భిణిలకు తగినంత ఆర్థిక సహాయం అందించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణీలకు ఒకపూట పౌష్టికాహారం అందిస్తున్నప్పటికీ, వారికి మరింత సహాయం అవసరం. ఈ దిశగా చర్యలు చేపట్టాలి. కాన్పు జరిగిన తర్వాత తల్లీబిడ్డల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి. బిడ్డకు మూడోనెల వచ్చేవరకు కావాల్సిన వస్తువులను ప్రభుత్వమే ఒక కిట్ రూపంలో బహుమానంగా అందించాలి. వీటి కోసం వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. ఈ కిట్ల కోసం 2017-18 బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తాం. ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసూతి సమయంలో మాతాశిశు మరణాల రేటు సున్నా స్థాయికి రావాలి. వందకు వందశాతం పేద కుటుంబాలకు చెందిన గర్భిణిలు కాన్పుకోసం ప్రభుత్వ దవాఖానలకు వచ్చేలా చూడాలి. అదే లక్ష్యంతో పనిచేయాలి అని సీఎం కేసీఆర్ తెలియజేశారు.

మారుమూల వైద్యుల వేతనాల సవరణ! వైద్యారోగ్య శాఖలో సంస్కరణలు తీసుకొస్తూ గత బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపును భారీగా పెంచామని సీఎం చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ వైద్యసేవల్లో, మందుల పంపిణీల్లో గణనీయమైన మార్పు వచ్చిందని… ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగుల సంఖ్య కూడా భారీగా పెరిగిందన్నారు. పేదలకు వైద్యం అందిస్తున్న ప్రభుత్వ వైద్యుల జీతాలను ఈసారి బడ్జెట్లో సవరించాలనే యోచన ఉందని… మారుమూల, గిరిజన ప్రాంతాల్లో సేవలందించే వైద్యులకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని అన్నారు. ఢిల్లీలో అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొహల్లా క్లినిక్ తరహాలో రాష్ట్రంలోని పట్టణాల్లో వైద్యసేవలను విస్తరింపజేయాలని, హైదరాబాద్, వరంగల్‌తోపాటు ఇతర కార్పొరేషన్లలో కూడా ఇలాంటి ప్రయత్నం చేయాలన్నారు. ఈ అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వివిధ రాష్ట్రాల్లో పేదలకు అందుతున్న వైద్య సేవలను అధ్యయనం చేస్తున్న అధికారుల బృందం ఇప్పటికే తమిళనాడు వెళ్లి వచ్చిందని, ఇదే క్రమంలో ఇతర రాష్ట్రాలకు, ఢిల్లీకి కూడా వెళ్లి అధ్యయనం చేసి రావాలని సీఎం కేసీఆర్ సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, కమిషనర్ వాకాటి కరుణ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, అధికారులు స్మితాసబర్వాల్, రాజశేఖర్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్, డాక్టర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.