Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బంజారాగడ్డపై అస్తిత్వ ప్రతీకలు

-తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వెలుగులు.. -నెరవేరిన గిరిజనుల 60 ఏండ్ల కల -బంజారా, ఆదివాసీ భవనాలకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ -బహిరంగ సభలో గిరిజనులపై వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి

KCR-at-Laying-of-foundation-stone-Banjara-Bhavan

బంజారా గడ్డమీద గిరిజన అస్తిత్వ ప్రతీకలు వెలిశాయి. రాజధాని నడిబొడ్డున గిరిజన పతాకాలు రెపరెపలాడాయి. ఇక్కడ స్థలం అడుగుతారా!?.. అన్న సీమాంధ్ర సర్కార్లకు చెంపపెట్టులా… ఢంకా బజాయించి ఆ గడ్డ మీదే ఒక్కటి కాదు రెండు భవనాలకు శంకుస్థాపన జరిగింది. ఒకనాడు గిరిజనులను గుండెల్లో పెట్టుకున్న బంజారా తల్లి గుట్టల్లో.. రేపటి భవిష్యత్తుకు పథకాలు రూపుదిద్దే కార్యాచరణకు బీజం పడింది. తెలంగాణ రాష్ట్ర సాకారంతో సుందర భవితవ్యం వైపు గిరిజనుల పయనం ప్రారంభమైంది. ఆరవై ఏండ్లుగా నెరవేరని డిమాండ్ ఆరు నెలల కేసీఆర్ పాలనలో సాకారమైంది.

గురువారం బంజారాహిల్స్‌లో బంజారా భవన్, ఆదివాసీ భవన్‌లకు ఆనందోత్సాహాల మధ్య ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గిరిజనుల అభ్యున్నతికి అనేక పథకాలు ప్రకటించారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లపై త్వరలో రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో స్టడీ కమిటీ, వచ్చే సంవత్సరంనుంచి గిరిజనులకు మూడు ఎకరాల భూమి పంపిణీ, పోడు, పట్టా భూముల సమస్యపై గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం, సేవాలాల్ మహరాజ్ జయంతికి జిల్లాకు రూ.10 లక్షలు కేటాయింపు, తండాల రోడ్లకు ప్రత్యేక స్కీము తదితర కార్యక్రమాలు సీఎం ప్రకటనలో చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

-క్యాబినెట్లో త్వరలో గిరిజన మంత్రి -రిజర్వేషన్ల కోసం రిటైర్డ్ హైకోర్టు జడ్జితో స్టడీ కమిటీ – వచ్చే ఏడాది నుంచి గిరిజనులకూ మూడెకరాల భూమి – పోడు, పట్టా భూములపై గిరిజన ప్రజాప్రతినిధులతో భేటీ – తండాల రహదారుల నిర్మాణానికి ప్రత్యేక పథకం – సేవాలాల్ మహరాజ్ ఉత్సవాలకు రూ.90లక్షలు – కోయ, గోండు ఉత్సవాలకు కూడా..

బంజారాలు, ఆదివాసీలు హైదరాబాద్‌లో కమ్యూనిటీ భవనం కోసం చేయని ప్రయత్నాలు లేవు. కానీ గత ప్రభుత్వాలు ఇవ్వలేదు. ఇవాళ వాళ్ల కల నెరవేరింది. తెలంగాణ ఉద్యమంలో జిల్లాలు తిరుగుతున్నప్పుడు మాట ఇచ్చిన. తెలంగాణ వస్తది.. బంజారాహిల్స్‌లోనే బంజారాభవన్‌ను కట్టి తీరుతానన్న. ఇవాళ కొమురం భీం, ఆదివాసీ భవన్‌కు కూడా శంకుస్థాపన చేసిన. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ రాములు నాయక్ సమన్వయంతో పనిచేసి జీవోలు తెచ్చారు. గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానన్న. ఇప్పుడు తొమ్మిది శాతానికిపైగా గిరిజనులున్నారు. కాగిత లంబాడి, లంబ లంబాడీ, వాల్మీకి, బోయ లాంటి కులాలున్నాయి. వాటిని కూడా కలిపితే ఎస్టీల జనాభా 12శాతానికి చేరుతది. ఈ మధ్య నన్ను కొందరు విమర్శించిండ్రు కూడా. 12 శాతం ఎలా చేస్తారని అడిగిండ్రు.

అంటే చెప్పిన. అన్యాయానికి గురైనవారికి న్యాయం జరగాలి. ఇందులో ఎలాంటి అపోహలు అవసరం లేదని అన్న. అన్యాయం జరిగినందుకే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినం. ఈ మధ్యనే సీఎస్‌తో మాట్లాడిన. హైకోర్టు రిటైర్ట్ జడ్జితో స్టడీ కమిటీ వేస్తున్నం. దళితులకు ఎలాగైతే భూములు కొని ఇస్తున్నామో గిరిజనులకు కూడా భూమి పంపిణీ చేస్తం. భూమి ఇచ్చుడే కాదు.. బోరు, మోటారు, ఒక పంట పెట్టుబడి కూడా ఇస్తం. ఇంకా మంచి కార్యక్రమాలు జరగాలి. బంజారాభవన్, ఆదివాసీ భవన్‌కు ఎకరం భూమితో పాటు, 2.5కోట్ల రూపాయలు కూడా ఇచ్చినం. ఇవి సరిపోకపోతే ఇంకా ఇస్తాం. ఇవి కేవలం కమ్యూనిటీ హాల్స్‌గానే ఉండొద్దు. గిరిజనుల సమస్యల పరిష్కార, వ్యూహాల కేంద్రాలుగా తీర్చిదిద్దుదాం. ఇక్కడ మేధావులు మేధోమథనం చేసి గిరిజనుల సమస్యలను ప్రభుత్వానికి చెప్పాలి. అప్పుడే వీటికి సార్థకత.

ఆడపిల్లల అమ్మకాలు ఆగాలి..: ఆడపిల్లలను అమ్ముకునే విషయంమీద మనమంతా ఆలోచించాలి. నేను తండానిద్ర కార్యక్రమంలో మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో పండుకున్నా. నిద్రలేచి యాపపుల్ల నోట్ల వేసుకుని అక్కడున్న ఆడవాళ్లతో ముచ్చటపెడితె ఆడపిల్లల పెండ్లిల్లకు మా దగ్గర కూడా రూ.4-5లక్షల కట్నాలు అడుగుతున్నారని బాధ పడ్డ రు. వారి సమస్యలు విన్నంకనే కల్యాణలక్ష్మి స్కీంను పెట్టిన. ఏ గిరిజన బిడ్డ పెండ్లి చేసుకున్నా రూ.51వేలు అందిస్తం. బాల్య వివాహాలు బంద్ చేయాలి. 18 ఏండ్లు నిండిన తరువాతనే పెండ్లి చేయాలి. సమాజం గ్రహాలు, రాకెట్ల వైపు పరుగులు పెడుతుంటే మనం వెనకుండి పోవద్దు.

త్వరలో గిరిజనుడికి మంత్రి పదవి..: తెలంగాణ ఉద్యమం వైపు బయలుదేరినప్పుడు గీ బక్కోడు ఏం తెలంగాణ తెస్తడు? అన్నరు. ఆ.. ఆంధ్రోళ్లు ఎప్పుడో బొండిగె పిసికేస్తరన్నరు. ఎవ్వరూ ఏం చేయలే. మీరే బొట్టుపెట్టి ఆదరించిండ్రు. రాత్రి పగలు లేదు. అన్నం తిన్నా…: అటుకులు బుక్కినా… 10, 20, 30 లక్షల మందితో సభలు పెట్టుకున్నం. వాటిని మీరు బలోపేతం చేశారు. తెలంగాణలో ఎవరి వాటా వారికి వస్తది. మీ ట్రైబల్ సబ్‌ప్లాన్ నిధులు మీకు అందుతాయి. ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టదు. పార్టీలకు అతీతంగా గిరిజనులను ముందు వరసలోకి తెచ్చేలా చూడాలి. క్యాబినెట్ విస్తరణలో గిరిజనుల మంత్రి పదవి వారికి వస్తది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. అదే నా లక్ష్యం. గిరిజనుల్లో కూడా గొప్పగొప్పవాళ్లు ఉన్నారు. వారిని ఎలా వినియోగించుకోవాలనే దానిపై ఆలోచిస్తాం. గమ్యంవైపు ప్రయాణం సాగించాలి.

అన్ని తండాలకు రోడ్లు… ఎమ్మెల్యే మదన్‌లాల్‌తో మాట్లాడుతుంటే …ఇంకా 220 తండాలకు రోడ్లు లేవని చెప్పిండు. ఇన్నిరోజులు చాలా మంది అన్నీ ఉన్నాయని కంప్యూటర్లల్ల ఒత్తుకుంట చూపిచ్చిండ్రు. కానీ అవ్వి లేవు. వచ్చే మార్చి బడ్జెట్‌లో ఏదో ఒక పేరు పెట్టుకుని అన్ని తండాలకు రోడ్లు వేస్తం. ప్రతి తండాకు రోడ్డు ఉండాలి. దీనికి స్పెషల్ స్కీం పెట్టిస్తం. ప్రభుత్వం మీ వెంట ఉంటుంది. పోడు, పట్టా భూముల సమస్యలు కూడా ఉన్నాయి. గిరిజన ఎమ్మెల్యేలతో ఒక సమావేశం పెట్టి వారి సమస్యలను పరిష్కరిస్తాం.

సేవాలాల్ మహరాజ్ జయంతికి రూ.90లక్షలు సేవాలాల్ మహరాజ్ జయంతికి గతంలో రాష్ట్రం మొత్తం కలిపి రూ.10 లక్షలు ఇచ్చేవారు. కానీ రాష్ట్రంలో 9 జిల్లాలకు జిల్లాకు రూ.10 లక్షల చొప్పున రూ.90లక్షలు అందిస్తాం. ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తది. కోయ, గోండు ఉత్సవాలకు కూడా జిల్లాకు రూ.10 లక్షల చొప్పున ఇస్తాం. గిరిజన, దళిత, బీసీ, మైనార్టీల కళ్లలో కాంతి చూసిన రోజే తెలంగాణ రాష్ట్రం సార్థకమైనట్లు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే. ఎవరూ నోరు మూసుకోవద్దు. సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలి. అన్ని రకాల శక్తులు కలిసి పేదరికంపై అధ్యయనం చేయాలి. వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికీ తాగునీరు ఇవ్వకుంటే ఓట్లు అడుగ అన్న. ఇలా అనడానికి ఎంతో ధైర్యం, నిజాయితీ, చిత్తశుద్ధి కావాలి. అవి మాకున్నాయి. మాపై మాకు పూర్తి విశ్వాసం ఉన్నాయి. మిమ్మల్ని కోరేది ఒక్కటే.. గ్రామస్తులు నిలబడి వారి ఊరికి కనెక్షన్లు ఇప్పించుకోవాలి… అన్నారు.

60 ఏండ్ల కల ఆరు నెలల్లో నెరవేరింది: సీతారాం నాయక్ సభాధ్యక్షత వహించిన ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్లు ఆఫీసుల చుట్టూ స్థలం కోసం తిరిగామని, కానీ 60 ఏండ్లలో సాధ్యం కానిది ఆరు నెలల్లో కేసీఆర్ సుసాధ్యం చేశారని అన్నారు. నిజాం ఇచ్చిన ఫర్మానాలో కూడా బంజారాహిల్స్ ఉందని, కానీ ఇక్కడ బంజారాలకే స్థానం లేకుండా చేశారని అన్నారు. త్వరలోనే 12శాతం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయన్నారు. గిరిజనులంతా టీఆర్‌ఎస్ పార్టీతోనే ఉంటారని, టీఆర్‌ఎస్‌తోనే గిరిజనుల బతుకులు బాగుపడతాయని అన్నారు. ఆదిలాబాద్ ఎంపీ నగేష్ మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో గిరిజనులకు వడ్డించేవారు లేరని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు వరాల మీద వరాలు కురుస్తున్నాయని తెలిపారు.

ఇక్కడ జాగ అడగొద్దు అన్నరు: రాములు నాయక్ ఎమ్మెల్సీ రాములునాయక్ మాట్లాడుతూ బంజారాహిల్స్ బంజారాలదే అయినా భవనం కోసం 500 గజాల స్థలం ఇవ్వలేదని అన్నారు. ఇక్కడ మీరు స్థలం అడగొద్దు… అని అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ రాముడు అయితే తను హనుమంతుడినని, ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టినట్లుగానే భూ పంపిణీ చేస్తున్నదని తెలిపారు. బంజరా అమ్మాయిలు హీరోయిన్ల కంటే కూడా అందంగా ఉంటారని తెలిపారు. సేవాలాల్ మహరాజ్ ఫొటోను ఇండ్లలో పెట్టుకున్నట్లుగానే సీఎం చంద్రశేఖర్‌రావు ఫోటోను కూడా పెట్టుకోవాలని అన్నారు. అందరికీ సీఎం చంద్రశేఖర్‌రావు అయితే తమకు చంద్రశేఖర్‌నాయక్ అని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే చంద్రావతి మాట్లాడుతూ ఆదివాసీ, బంజారాల కోసం బంజారాహిల్స్‌లో భవనాలను నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ జేఏసీ నాయకులు శివాజీ, టీఆర్‌ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రూప్‌సింగ్, ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు రాంచందర్‌నాయక్, లంబాడి హక్కుల పోరాటం సమితి అధ్యక్షుడు భూక్యానాయక్, విద్యార్థి జేఏసీ నాయకులు కరాటేరాజు, నెహ్రూనాయక్, రాజేష్‌నాయక్, సుందర్‌నాయక్, ఆల్ ఇండియా బంజారాసేవాసంఘం జాతీయ అధ్యక్షుడు శంకర్‌నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌నాయక్ మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య, హోంశాఖ మంత్రి నాయిని , ఆర్థిక మంత్రి రాజేందర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగురామన్న, ఎంపీలు బీబీపాటిల్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు మదన్‌లాల్, రెడ్యానాయక్, కనకయ్య, రేఖానాయక్, కోవాలక్ష్మి, చింతల రాంచంద్రారెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, కనకారెడ్డి, హన్మంత్ షిండే, బాబూరావు రాథోడ్, బలాల, ఎమ్మెల్సీలు కర్నెప్రభాకర్, సలీం, మాజీ ఎమ్మెల్యేలు కవిత, సత్యవతి రాథోడ్, కిషన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

నాటు సారా పోవాలి: కేసీఆర్ తండాల్లో నాటుసారా వల్ల చిన్న వయసులోనే మహిళలు భర్తలేని వారు అవుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం లభించాలి. గూడాల్లో నాటుసారా బంద్ కావాలి. అట్లనే అంటురోగాలు వచ్చి చనిపోయే పరిస్థితి ఉంది. ఈ మధ్య హైదరాబాద్‌లోని పెద్దపెద్ద ఆస్పత్రులతో మాట్లాడిన. ఒక ప్రొగ్రాం తీసుకుని 400-500మంది డాక్టర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సాంస్కృతిక వారథి బృందం అందరం కలిసి వెళ్లి గిరిజనులను చైతన్యం చేద్దాం. గిరిజనుల్లో నాటుసారాపై అవగాహన తీసుకురావాల్సి ఉంది. మనం మాటలు తక్కువ-పని ఎక్కువ అన్నట్లుగా చేయాలి. డంబాచారం వద్దు. ఆదిలాబాద్‌లో అంటురోగాలు మాయం కావాలి. తినే తిండిలో విటమిన్లు, కార్పోహైడ్రేట్లు లేకపోవడం వల్ల రోగాలు వస్తున్నాయి. దీనికి మూఢ నమ్మకాలు కూడా తోడవుతున్నాయి. ఇవన్నీ పోవాలి. ఆస్పత్రులకు జనం వెళ్లాలి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.