Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బాబు అహంభావి!

-కేసీఆర్ తనకింద పనిచేశారనటమే అందుకు నిదర్శనం
-మంత్రివర్గంలో అంతా సమానమేననే ఇంగితం ఆయనకు లేదు
-ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోం.. ఆసక్తీ లేదు: కేటీఆర్
-గుణాత్మక మార్పుకోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం ఫలిస్తే సంతోషం..లేదంటే ప్రయత్నాలు కొనసాగిస్తాం
-బాబును ఇంటికి పంపటానికి అక్కడి ప్రజలు సిద్ధం
-అవకాశమొస్తే బాబు మళ్లీ మోదీ కాళ్ల మీద పడుతారు
-ఒకే వేదికపైకి నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పార్టీలు
-మీడియాతో ఇష్టాగోష్ఠిలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఏపీ సీఎం చంద్రబాబు అహంభావి అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. కేసీఆర్ తనకింద పనిచేశారని బాబు అనటంలోనే అహంభావం ఉన్నదన్నారు. ఏపీ రాజకీయాలపై తమకు ఎలాంటి ఆసక్తిలేదన్న కేటీఆర్.. ఏపీ ఎన్నికల్లో జోక్యంచేసుకోబోమని స్పష్టంచేశారు. చెప్పుకోవటానికి చేసిందేమీలేక.. చంద్రబాబు తమపై పడి ఏడుస్తున్నాడని విమర్శించారు. సోమవారం తెలంగాణభవన్‌లో మీడియాతో కేటీఆర్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాలపై స్పందించారు. ఏపీ ప్రజలు చంద్రబాబును ఇంటికి పంపటం ఖాయమని తమకు సమాచారం ఉన్నదన్నారు. టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికపై ఆ పార్టీ నాయకులు గొంతు చించుకోవటాన్ని విమర్శించిన కేటీఆర్.. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను కాంగ్రెస్‌లో చేర్చుకున్నప్పుడు వారి నీతి ఏమైందని నిలదీశారు. వివిధ అంశాలపై కేటీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

చంద్రబాబుకు ఇంగితం లేదు
కేసీఆర్ తనకింద పనిచేశారని ఏపీ సీఎం చంద్రబాబు అనటంలోనే అహంభావం ఉన్నది. ఎవరూ ఎవరికీ బానిసలు కాదు. మనది ప్రజాస్వామ్యం. సీఎం కింద మంత్రులు పనిచేయరు.. సీఎంతో కలిసే మంత్రిమండలి పనిచేస్తుంది. ఆ ఇంగితం లేకపోతే ఆయన ఖర్మ. గత మూడునెలల్లో చంద్రబాబు ఎన్టీఆర్ కంటే కేసీఆర్ పేరునే ఎక్కువ తలుచుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెప్పిమరీ 103 సీట్లలో డిపాజిట్లు గల్లంతుచేశాం. మళ్లీ ఎన్డీయే పంచన చేరబోనని చంద్రబాబు గట్టిగా చెప్పగలరా? ఆ ధైర్యం ఆయనకు ఉన్నదా? అవకాశమొస్తే మోదీకాళ్ల మీద మొదట పడేది చంద్రబాబే. ఆయనకంటే పచ్చి అవకాశవాది, పచ్చి స్వార్థపరుడు ప్రపంచంలో ఎక్కడా లేరు. మామను చంపి, ఆయన ఫొటో పెట్టుకుని ఊరేగింది ఆయనే. చంద్రబాబు కాంగ్రెస్ సీఎంల కింద పనిచేయలేదా? అదే కాంగ్రెస్‌ను ఇప్పుడు తిడుతలేడా? టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడా చంద్రబాబు? ఒక ప్రశ్న అడిగితే పది ప్రశ్నలు అడగాల్సి వస్తుంది. ఆయన దగ్గర ఉక్రోషం తప్ప సమాధానం ఉండదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు, ఇక్కడి సీమాంధ్రులు ఎలాగైతే చంద్రబాబు వాదనను తిరస్కరించారో.. ఏపీ ప్రజలు కూడా అదేవిధంగా తిరస్కరించబోతున్నారు. ఆయన కూడా రెడీగా ఉంటే మంచిది.

ఏపీ రాజకీయాలపై ఆసక్తిలేదు
ముఖం బాగోలేకపోతే అద్దం పగులగొట్టుకోవడం బాబు విధానం. ఆయన చేసింది ఏదో అక్కడి ప్రజలకు చెప్పుకోవాలి. జగన్మోహన్‌రెడ్డి ఫ్యాన్‌కు స్విచ్, ఫ్యూజ్ ఎక్కడున్నాయో ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు తేలుస్తారు. చంద్రబాబు సైకిల్‌కు గాలి కొట్టేవారు ఎక్కడున్నారు? ఆయన సైకిల్ టైర్లు ఎక్కడినుంచి వస్తున్నాయి? అందులో గాలి ఎక్కడినుంచి వస్తున్నది? అదికూడా చెప్పేవాళ్లు ఉంటారు. ఏపీలో స్థానిక నాయకత్వానికి జరుగుతున్న ఎన్నికలవి. అక్కడ ఎవరు గెలువాలనేది ఆంధ్ర ప్రజలు నిర్ణయిస్తారు. అందులో మా పాత్ర ఏమీలేదు.. ఉండదు.. ఉండబోదు కూడా. మాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబును అక్కడి ప్రజలు ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఏపీతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ కూడా మనకు సరిహద్దు రాష్ట్రాలు. రాజకీయ నాయకులుగా ఆయా రాష్ర్టాల ఎన్నికలపై ఏ విధంగా ఆసక్తి ఉంటుందో ఏపీపై కూడా అలాంటి ఆసక్తి మాత్రమే ఉన్నది. లివ్.. లెట్ లివ్, లవ్ నైబర్స్ అని కేసీఆర్ ఎప్పుడూ చెప్తుంటారు. జనసేన మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌లో పోటీచేస్తున్నది. పవన్‌కల్యాణ్ ఇక్కడ ప్రచారంచేసుకున్నా మాకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు గత ఎన్నికల్లో వచ్చారు. ప్రచారంచేశారు. మేం వద్దన్నామా? ఆయన కాలికి బలపం కట్టుకొని తిరిగారు.. ఏమైంది?

ఒకే వేదికపైకి నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పార్టీలు
దేశంలో బీఎస్పీ, ఎస్పీ, బీజేడీ, టీఎంసీ, వైసీపీ.. ఇలా నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పార్టీలు చాలా ఉన్నాయి. ఇతరులకు శక్తినిస్తూ, ఊపిరిలూదుతూ ఉండటం కాకుండా.. మనమే ఒక జట్టుకడితే తప్పేంటి? అని వాటన్నింటికీ కేసీఆర్ చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే 150 సీట్లు, యూపీఏ 110 సీట్లు దాటవనుకున్నప్పుడు.. రేపు ఏం జరుగుతుందో ఏం తెలుసు? నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పార్టీలు ఒక దగ్గరికి వస్తే, సముహంగా ఉంటే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దేశ ప్రయోజనాలకు, రైతులకు, రాష్ట్రాల బలోపేతానికి, స్థానిక ప్రభుత్వాలకు అధికార వికేంద్రీకరణ, అధికారాల బదలాయింపునకు సంబంధించి కేంద్రం స్థాయిలో చర్చ వస్తే మంచిది కదా! కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు కూడా 99% మంది ఫలించదనుకున్నారు. ఒక్క శాతం మాత్రమే నమ్మినారు. దేశంలో అతి పెద్ద 12వ రాష్ట్రంగా ఒక ప్రయత్నం ప్రారంభిస్తానని కేసీఆర్ చెప్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఫెడరల్ ఫ్రంట్, జాతీయపార్టీ అనేది ఒకదానితో ఒకటి ముడిపడినది. పార్లమెంట్ ఎన్నికల తరువాత కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఒక వేదికమీదకు తీసుకొచ్చే ప్రయత్నంచేస్తాం. ఫలిస్తే సంతోషం. ఫలించకపోతే జాతీయ పార్టీ ప్రయత్నాలు కొనసాగుతాయి. దీనికి టైం రావాలి.

గుణాత్మక మార్పుకోసం కేసీఆర్ కసరత్తు
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం కేసీఆర్ కసరత్తుచేస్తున్నారు. అశోక్‌గులాటి సహా చాలామంది ఆర్థికవేత్తలతో మాట్లాడారు. దేశ ఆర్థికవ్యవస్థలో చిన్నచిన్న మార్పులవల్ల దేశసంపదను ఏ రకంగా పెంచగలుగుతాం.. పెంచిన సంపదను పేదలకు ఎలా పంచాలి? ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో కేసీఆర్ వెళ్తున్నారు. దేశంలో కూడా ఇదే స్ఫూర్తితో వెళ్తాం. మిషన్ భగీరథ, నదుల అనుసంధానం కావాలంటే కేసీఆర్ చెప్పే పథకాలపై చర్చ జరుగాలి. రైతుబంధు, మిషన్ కాకతీయ వంటివి దేశవ్యాప్తంగా అమలుకావాలనే దిశగా ప్రయత్నిస్తున్నాం.

ఇక్కడే ఉంటూ జాతీయ రాజకీయాలు
జాతీయ పార్టీ ఏర్పడితే ఢిల్లీ నుంచే కాదు.. ఇక్కడి నుంచి కూడా రాజకీయాలు నడిపించవచ్చు. కేసీఆర్ సీఎంగా ఉంటూ ఆదర్శనీయ పాలనతో కేంద్రాన్ని ప్రభావితంచేశారు. అందుకే కేంద్రంస్థాయిలో కిసాన్‌సమ్మాన్ నిధి పేరిట తెలంగాణ రైతుబంధు పథకం వచ్చింది. అంతకంటే మంచి విధానాలతో దేశాన్ని ప్రభావితం చేయొచ్చుకదా! అందుకు ఢిల్లీలోనే కూర్చోవాల్సిన అవసరంలేదు.

ఏ గుర్రాన్ని ఎప్పుడు దౌడ్ తీయించాలో కేసీఆర్‌కు తెలుసు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించాలో కేసీఆర్ నిర్ణయిస్తారు. ఏ గుర్రాన్ని ఎప్పుడు దౌడ్ పెట్టించాలో ఆయనకు తెలుసు. కాంగ్రెస్ వారికే కాదు మాకూ వ్యూహాలుంటాయి. అవసరమైనచోట ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రచారంచేస్తారు. ఆయన ఇప్పటికే రాష్ట్రంలో 16 సీట్లలో టీఆర్‌ఎస్ గెలుస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ సభలు 15-16 ఉండొచ్చు. సికింద్రాబాద్ లాంటి పట్టణ ప్రాంతంలో కేసీఆర్ ప్రచారం ఉండకపోవచ్చు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాల పరిధిలోని నియోజకవర్గాల్లో రోడ్‌షోలతోపాటు ప్రచారం చేస్తాను. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేసిన విధంగానే ప్రచారం చేస్తా.

దేశంలో ఏకపార్టీ వ్యవస్థలేదు
దేశంలో ప్రస్తుతం ఏకపార్టీ వ్యవస్థలేదు. యూపీఏ, ఎన్డీయే కూడా కూటములే. ఫెడరల్ ఫ్రంట్ అయినా కూటమే. ఇది సంకీర్ణాలకాలం. ఫెడరల్ ఫ్రంట్‌కు ఏ సూత్రం వర్తిస్తుందో.. ఎన్టీయేకు, యూపీఏకు అదే సూత్రం వర్తిస్తుంది. ఎవరైనా సంకీర్ణాలే. బీజేపీలో అందరూ మోదీ నాయకత్వాన్నే కోరుకుంటున్నారా? కొందరు గడ్కరీ అంటున్నారు.. ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? కాంగ్రెస్‌లో కూడా రాహుల్ ప్రధాని అని చెప్పారా? ప్రియాంక కూడా కావచ్చు.

కాంగ్రెస్‌లో మా నాయకులను చేర్చుకున్నప్పుడు ఏమైంది?
అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బాబుమోహన్, బొడిగె శోభ బీజేపీలో చేరారు. ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారు. మేం ఆనాడు ప్రజాస్వామ్యానికి నల్లదినం, ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన దినం అని గొంతు చించుకున్నామా? నాయకులు పార్టీలు మారడమనేది ఎన్నికల సందర్భంలో జరిగేదే. ఎమ్మెల్యేలు, ఎంపీలే పార్టీలు మారుతున్నారా? కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరెపల్లి మోహన్, అధికార ప్రతినిధి క్రిశాంక్ పార్టీ మారారు. కిందిస్థాయిలో లక్షల సంఖ్యలో పార్టీ మారుతున్నారు. కాంగ్రెస్ ఎవరిని నిందిస్తుంది? మీరు ఎంతకు కొన్నారంటే సమాధానం చెప్పరు. ఢిల్లీలో రాహుల్, అమిత్‌షా రోజూ కండువాలు కప్పుతున్నారు. మాట్లాడేటప్పుడు ఆలోచన, అవగాహనతో మాట్లాడితే మంచిది. వాళ్ల క్యాడర్‌లో జోష్‌లేదని వాళ్ల ఎమ్మెల్యేలే చెప్తుంటే మేమేం చేయాలి? కాంగ్రెస్ నాయకత్వంపై ఆ పార్టీ క్షేత్రస్థాయిలోనే ఎందుకు విశ్వాసం లేదు? ఎందుకు కాంగ్రెస్ పునాదులు కదిలిపోతున్నాయి? ఈ విషయాలపై ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి.

మా పార్టీ నుంచి కాంగ్రెస్‌కు పోతే సంసా రం అయితది.. వాళ్ల పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వస్తే వ్యభిచారం అవుతుందా? ఈరోజు అరుస్తున్న గొంతులు.. మా పార్టీ వారిని చేర్చుకున్నప్పుడు ఎక్కడికిపోయా యి? కాంగ్రెస్‌లో చేరిన టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించారా? మా పార్టీ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌ను రాహుల్ దగ్గరకు తీసుకుపోయారు. మీకో నీతి… మాకో నీతా? బస్సుయాత్రలు చేస్తారట! ఏం చెప్తారు ప్రజలకు? మేం చాలా పత్తిత్తులమని చెప్తారా? మీరు ఇటుకతో కొడితే మేం రాయితో కొడుతాం. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరినవారు అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని చెప్పారు. కానీ టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినవారు కనీ సం ఆ మాటైనా చెప్పారా? ఒక్కరైనా రాజీనామా చేశారా? వారికి ఆ దమ్ముందా? టీడీపీలో నుంచి కాంగ్రెస్‌లో చేరినవాళ్లు రాజీనామాలు చేశారా? నైతిక సూత్రాలు మా ఒక్కరికే కానీ వారికి ఉండవా? దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ అని చెప్పుకొనే మీకు నీతి, నైతిక సూత్రాలు ఉం డొద్దా? కాంగ్రెస్‌కు తెలంగాణలో భవిష్యత్ లేదని, అందుకే టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నామని వాళ్ల ఎమ్మెల్యేలే చెప్తున్నారు. రాజకీయ భవిష్యత్ దృష్ట్యా వస్తున్నారు. తప్పేం ఉంది. పేపర్ టైగర్లు, ైఫ్లెక్సీ టైగర్లతో ఏమీకాదు. కేసీఆర్ మీద పిచ్చికుక్క లెక్క మాట్లాడితే మీడియా వాళ్లు రాస్తారు.. కేసీఆర్‌ను ఎంత తిడితే మీడియాకు అంత గొప్ప లీడర్ అన్నట్టు ఉన్నారు.

సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు
సీపీఐ, సీపీఎం జాతీయపార్టీలు. వాటి కంటే టీఆర్‌ఎస్‌కు ఎక్కువ లోక్‌సభ సీట్లు వస్తాయి. అవసరమైతే, సందర్భాన్నిబట్టి జాతీయ పార్టీ పెట్టడానికి వెనుకాడబోనని కేసీఆర్ చెప్పారు. సాంకేతికంగా మాత్రమే చేయాల్సి ఉంటుంది. జాతీయ పార్టీ అంటే ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా పోటీచేయడం లేదా ప్రజల ఆదరణకోసం ప్రయత్నంచేయడం. ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కేసీఆరే ప్రతిచోట అభ్యర్థి. కేసీఆర్‌ను చూసి, ఆయన అమలుచేస్తున్న పథకాలు, విధానాలు చూసి ఓటేయాలని అడుగుతాం. సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు ఇదే మా నినాదం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.