Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బీజేపీపై ధర్మయుద్ధం.. ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే

-వికృత రాజకీయాన్ని దేశం నుంచి తరమాల్సిందే
-బీజేపీకి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే: సీఎం కేసీఆర్‌
-తెలంగాణ నుంచే మరో మహోద్యమం
-సమరానికి పార్టీ శ్రేణులన్నీ సిద్ధమవ్వాలి
-విస్తృతస్థాయి భేటీలో ఏకగీవ్ర తీర్మానం
-సరెండర్‌ అవుదామా? కొట్లాడుదామా?
-పార్టీ కార్యవర్గానికి సీఎం కేసీఆర్‌ ప్రశ్న
-ముక్తకంఠంతో కొట్లాటేనన్న నాయకులు
-కూల్చివేత కుట్రదారులను వదలిపెట్టం
-పార్టీ మారాలని వచ్చే బీజేపీ బ్రోకర్లను చెప్పుతో కొడ్తామనాలి: సీఎం కేసీఆర్‌

-ముందస్తు ఎన్నికల్లేవ్‌.. షెడ్యూల్‌ ప్రకారమే
-సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇస్తాం
-వచ్చే 10 నెలలు నియోజకవర్గాల్లోనే ఉండాలి
-ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పాలి
-నియోజకవర్గ అభివృద్ధి కార్డు సిద్ధంచేయాలి
-పది గ్రామాలకు ఒక ఆత్మీయ సమ్మేళనం
-రాజకీయ అంశాలపై చర్చ కూడా పెట్టాలి
-త్వరలో జిల్లాల పర్యటన: సీఎం కేసీఆర్‌

-సరెండరవుదామా? కొట్లాడుదామా?..
-ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్న
-కొట్లాడుదాం.. కొట్లాడుదాం..
-ముక్తకంఠంతో కార్యవర్గం ప్రతిస్పందన ఇది
-కేసీఆర్‌ కేసీఆర్‌ వి ఆర్‌ విత్‌ యూ కేసీఆర్‌..
-ఇది టీఆర్‌ఎస్‌ కార్యవర్గంలో ప్రతిధ్వనించిన నినాదం

దేనికైనా సిద్ధం
‘దేశానికి పట్టిన బీజేపీ చెదలను వదిలించాలి. దేశాన్ని రక్షించుకోవాలి. ఇందుకోసం ఎంతవరకైనా సరే రాజీలేకుండా పోరాడాల్సిందే’ అని టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పిలుపునకు పార్టీ ఒక్క గొంతుకై నినదించింది. బీజేపీ వికృత రాజకీయ క్రీడను దేశం ముందు నిలబెట్టాలని.. మీ వెంటే మేము నడుస్తామని అధినేతకు దన్నుగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేసిన ఏ ఒక్కరినీ, ఎంతవారైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని టీఆర్‌ఎస్‌ కార్యవర్గం ముక్తకంఠంతో విజ్ఞప్తి చేసింది.

తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన బ్రోకర్ల ముఠా దొరికిన వెంటనే బీజేపీ ఎందుకు సుప్రీంకు వెళ్లింది? వీరిపక్షాన ఎందుకు వకాల్తా పుచ్చుకున్నది? ఎందుకు కేసు వివరాలు చెప్పవద్దని అంటున్నది? ఎమ్మెల్యేలకు ఎరలో బీజేపీ పెద్ద తలకాయల పాత్ర ఉన్నదని సమాచారం. బలమైన ఆధారాలున్నాయి. చచ్చినా కేసు నుంచి తప్పించుకోలేరు. ఈ కేసు విషయంలో రాజీపడం.

దేశానికి బీజేపీ చెదలు పట్టినట్టు పట్టింది. దీని నుంచి దేశాన్ని రక్షించుకుందాం. భగత్‌సింగ్‌, గాంధీ వంటివారు పోరాటాలు చేయకపోయి ఉంటే స్వాతంత్య్రమే వచ్చేది కాదు. తెలంగాణను సాధించుకున్న మనకు పోరాటాలు కొత్త కాదు. బీజేపీ హీనరాజకీయాలను దేశం ముందు నిలబెడదాం. దీని కోసం ఎంతవరకైనా పోరాటం చేద్దాం. రాజీలేని పోరాటాన్ని సాగించేందుకు కదులుదాం.
– ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

మంగళవారం తెలంగాణభవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు. చిత్రంలో పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు, మంత్రి హరీశ్‌రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, నాయకులు

తెలంగాణ గడ్డ మరో పోరాటానికి వేదిక కావాలని.. తన వికృత చేష్టలతో దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంతో సంబంధమున్న ఎవ్వరినీ ఊపేక్షించవద్దని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) పార్టీ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ, రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వాన్ని కోరాయి. బీజేపీ ఆడుతున్న ఈ వికృత రాజకీయ క్రీడను దేశం ముందు నిలబెట్టి, తరిమికొట్టేందుకు అనుగుణంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్యాచరణ చేపట్టాలని విజ్ఞప్తిచేశాయి. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీలు ‘వీ ఆర్‌ విత్‌ యూ కేసీఆర్‌’ అంటూ ముక్తకంఠంతో నినదించాయి. బీజేపీ విషయంలో ఎంతవరకైనా పోవాల్సిందేనని, ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంతో సంబంధం ఉండి, తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేసిన ఏ ఒక్కరినీ, ఎంత వారైనా సరే వదిలిపెట్టవద్దని పార్టీ కోరింది. మంగళవారమిక్కడ తెలంగాణభవన్‌లో పార్టీ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ, రాష్ట్ర కార్యవర్గాల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాజా రాజకీయ పరిణామాలపై కార్యవర్గానికి దిశానిర్దేశం చేశారు.

‘దేశానికి బీజేపీ చెదలు పట్టినట్టు పట్టింది. ఈ చెదలు మంచిది కాదు. దీని నుంచి మనం దేశాన్ని రక్షించుకొందాం. భగత్‌సింగ్‌, మహాత్మా గాంధీ వంటివారు పోరాటాలు చేయకపోయి ఉంటే ఈ రోజు స్వాతంత్య్రమే వచ్చేది కాదు. అదే స్ఫూర్తితో మనం తెలంగాణను సాధించుకొన్నాం. మనకు పోరాటాలు కొత్త కాదు. ఇప్పుడు దేశానికి ఉపశమనం కలిగించిన ఘనత తెలంగాణకు దక్కబోతున్నది. బీజేపీ వికృత, హీనమైన రాజకీయాలను దేశం ముందు నిలబెట్టుదాం. దీనికోసం ఎంతవరకైనా పోరాటం చేద్దాం. రాజీలేని పోరాటాన్ని సాగించేందుకు కదలుదాం’ అని కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

తెలంగాణ ఉద్యమం అనేక పోరాటాలను నేర్పించిందని తెలిపారు. బీజేపీ కుట్రలను చీల్చిచెండాడేందుకు ఇదే స్ఫూర్తితో మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేసిన వారెవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, రాజీ లేకుండా ఈ వ్యవహారంపై విచారణ చేయిస్తామని తేల్చిచెప్పారు. న్యాయస్థానాలు ఇచ్చే ఆదేశాలను పాటిస్తూనే.. న్యాయబద్ధంగా కేసును ప్రజాక్షేత్రంలో వివరిస్తామని విస్పష్టంచేశారు.

దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను బీజేపీ ఇప్పటికే కూల్చివేసిందని, దొడ్డిదారిన, డబ్బులతో అధికారాన్ని చెరబట్టిందని, ఇది ఏమాత్రం క్షమార్హం కాదని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, బీజేపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని, ప్రతి ఒక్కరూ ఒక కేసీఆర్‌లా కొట్లాడాలని పిలుపునిచ్చారు.

బీజేపీ ఖర్మ బాగాలేక మనకు చిక్కారు
బీజేపీ గోబెల్స్‌ ప్రచారం మామూలుగా ఉండదని సీఎం కేసీఆర్‌ అన్నారు. బీజేపీ నిజస్వరూపాన్ని వివరిస్తూ సీనియర్‌ జర్నలిస్టు టంకశాల అశోక్‌ ‘నమస్తే తెలంగాణ’లో ఒక ఆర్టికల్‌ రాశారని, అత్యంత హీనమైన పార్టీగా బీజేపీ చరిత్రలో మిగిలిపోతుందని, ఆ పార్టీది జుగుప్సాకరమైన ప్రవర్తన అని వివరించిన ఆ వ్యాసాన్ని పార్టీ నేతలు చదవాలని సూచించారు. బీజేపీ ఉన్మాదం, అహంకారంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నదని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఎలాంటి తప్పు చేయకుండా నిటారుగా ఉండేవారు బీజేపీ బెదిరింపులకు భయపడబోరని, టీఆర్‌ఎస్‌.. బీజేపీ బెదిరింపులకు భయపడే పార్టీ కాదని పునరుద్ఘాటించారు. బీజేపీ ఐఏఎస్‌, ఐపీఎస్‌లను, జడ్జీలను కూడా బెదిరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలోని 8 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూలగొట్టిన బీజేపీ తెలంగాణలో అడ్డంగా దొరికిపోయిందని వెల్లడించారు. ‘ఈ వ్యవహారంతో సంబంధం లేకపోతే బ్రోకర్ల ముఠా దొరికిన వెంటనే సుప్రీంకోర్టు వరకు బీజేపీ ఎందుకు వెళ్లింది? వాళ్ల పక్షాన ఎందుకు వకాల్తా పుచ్చుకొన్నది? ఎందుకు కేసు వివరాలు చెప్పవద్దని బీజేపీ అడుగుతున్నది?’ అని సీఎం నిలదీశారు. లేని కార్యక్రమాన్ని ముందరేసుకొని ప్రధానమంత్రి ఇక్కడికి ఎందుకు వచ్చారో సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు.

ఈడీ, ఐటీ వంటివాటి పేర్లు చెప్పి విపక్ష పార్టీల నాయకులను లొంగదీసుకొనే ప్రయత్నం బీజేపీ చేస్తున్నదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. చివరికి స్వయంగా ముఖ్యమంత్రుల కొడుకులు, బిడ్డలను కూడా దర్యాప్తు సంస్థల బూచి చూపి భయపెట్టేందుకు బీజేపీ పన్నాగం పన్నుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘అంతెందుకు నా కూతురు, ఎమ్మెల్సీ కవితను కూడా బీజేపీలోకి చేరాల్సిందిగా ఒత్తిడి తెచ్చారంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు’ అని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

బీజేపీ పెద్దలకు అహంకారం పూర్తిగా తలకెక్కిందని, అందుకు ఇదే నిదర్శనమని మండిపడ్డారు. ఈడీ, ఐటీ దాడుల పేరుతో ఎవరిని భయపెట్టాలని చూస్తున్నారని నిలదీశారు. గతంలో విచారణలకు పిలిచిన చాలామందిని పార్టీ మారాలంటూ అధికారులతో అడిగించిన చరిత్ర బీజేపీదని కేసీఆర్‌ దుయ్యబట్టారు.

సచ్చినా తప్పించుకోలేరు..
ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీలోని పెద్ద పెద్ద తలకాయల ప్రమేయం ఉన్నదని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. తనకున్న సమాచారం మేరకు ఈ కేసులో గట్టి, బలమైన ఆధారాలున్నాయని, బీజేపీ పెద్దలు సచ్చినా కేసు నుంచి తప్పించుకోలేరని, ఈ కేసు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని విస్పష్టంగా తేల్చి చెప్పారు. అతి త్వరలోనే కొందరిని అరెస్టు చేసే అవకాశమున్నదని కూడా స్పష్టంగా చెప్పారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో మీరంతా చూస్తారని పేర్కొన్నారు. బీజేపీ కుట్ర రాజకీయాలపై తిరుగులేని పోరాటం చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ‘సరెండర్‌ అవుదామా? కొట్లాడుదామా?’ అని సీఎం కేసీఆర్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రశ్నపై కార్యవర్గం ముక్తకంఠంతో, ఏకగ్రీవంగా స్పందిస్తూ.. ‘కొట్లాడుదాం.. కొట్లాడుదాం’ అని నినదించింది.

బ్రోకర్లను చెప్పుతో కొడ్తామని చెప్పండి..
బీజేపీ బ్రోకర్లు ఎవరైనా పార్టీ మారాలని అడిగితే ఆ బ్రోకర్లను చెప్పుతో కొడ్తామని చెప్పాలని సీఎం కేసీఆర్‌ తీవ్ర స్వరంతో ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. పైలట్‌ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగ కాంతారావు వ్యవహరించిన తీరు భేష్‌ అని సీఎం మెచ్చుకొన్నారు. వారిని సమావేశంలో వేదిక వద్దకు పిలిపించారు. రోహిత్‌రెడ్డి ఇచ్చిన సమాచారంతో వ్యవహారం బయటకు వచ్చిందని వివరించారు. చాలా సమయస్ఫూర్తితో ఎమ్మెల్యేలు వ్యవహరించారని, ఇలాంటి వాళ్లే హీరోలు అని సీఎం చెప్పారు.

ఏపీలో కూడా కుట్ర
ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి పెద్ద పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన సహాయాన్ని బీజేపీ, కేంద్రం మొదట్నుంచీ తీసుకొంటున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. కానీ, ఇప్పుడు జగన్‌ పార్టీకి చెందిన 70 మంది ఎమ్మెల్యేలను గుంజాలని స్కెచ్‌ వేసిన బీజేపీ వాళ్లను ఏమనాలని ఆవేదనతో ప్రశ్నించారు.

రాహుల్‌ గాంధీ జోడోయాత్ర ఎందుకు చేస్తున్నారో ఆయనకు కూడా తెల్సినట్టు లేదన్నారు. ‘ఎన్నికలు జరుగుతున్న మునుగోడుకు రాలేదు.. గుజరాత్‌కు వెళ్తలేడు! అదేం యాత్రనో ఏందో!’ అని వ్యాఖ్యానించారు.

మునుగోడులో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని సీఎం వేదిక ముందుకు పిలిచి అభినందించారు. కూసుకుంట్ల విజయానికి సహకరించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇతర కార్యకర్తలు, నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. కుటుంబాలను వదిలిపెట్టి హోరాహోరీగా కొట్లాడారంటూ అభినందించారు.

రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో రూ.470 కోట్లు ఖర్చుచేశారని చెప్తున్నారని, కానీ.. బీజేపీ చేతిలో ఆయన బకరా అయ్యారని, ఇప్పుడేం చేస్తాడని ప్రశ్నించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.