Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మరో ఆధునిక దేవాలయం

-సాంకేతిక అద్భుతం కాళేశ్వరం -రూపుదిద్దుకుంటున్న మహా జలసాధన వ్యవస్థ

ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అన్నారు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నాగార్జునసాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తూ. ఇప్పటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలే కాదు, ఆధునిక సాంకేతిక, నిర్మాణ అద్భుతాలు. లోకం అబ్బురపడే మహానిర్మాణాలు. ఒకటిన్నర కిలోమీటర్ల సొరంగం తర్వాత, సుమారు 22 అంతస్తుల భవంతిని (60 మీటర్ల ఎత్తు) తలదన్నే ఒక అపూర్వ భూగృహం నిర్మించి, అందులో ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం కలిగిన మోటర్లు, పంపులు, అతిపెద్ద జలాశయం, రిమోట్‌తో పనిచేసే మహాయంత్ర భూతాలు ఏర్పాటుచేస్తే అది మరో యాత్రాస్థలం కాక ఏమవుతుంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు యాత్రాస్థలి అయ్యింది. మనిషి ఊహకందని నిర్మాణం అది. నూట ముప్ఫై తొమ్మిది మెగావాట్ల సామర్థ్యం కలిగిన మోటర్లు ఒక్కొక్కటి మూడువేల క్యూసెక్కుల చొప్పున, ఆరుమోటర్లతో రోజుకు రెండు టీఎంసీల నీటిని పంపింగ్ చేసే మహాజలసాధన వ్యవస్థ అది.

తెలంగాణ జలయజ్ఞానికి ముఖద్వారం ఆ భూగృహంలోని ఎగ్జిట్ టన్నెల్. అక్కడి నుంచే మిడ్ మానేరుతో మొదలై అనంతసాగర్, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్‌లకు నీరు వచ్చేది. మల్లన్నసాగర్ నుంచే ఇటు గంధమల్ల, బస్వాపూర్‌లకు, అటు సింగూరు, నిజాంసాగర్‌లకు నీరందించేది. శ్రీరాంసాగర్‌కు గోదావరి నీరు సరిగా రాక ఒట్టిపోయిన ఉత్తరతెలంగాణకు పునర్జీవమిచ్చే ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పరంపర ఇది. నదులు, ఉపనదులు, వాగులు, వంకలకు జలమాల వేసే బృహత్ ప్రయత్నమిది. ఒకప్పుడు ఒక ప్రా జెక్టు కట్టడమంటే మూడు నాలుగు పంచవర్ష ప్రణాళికలు గడచిపోయేవి. తెలంగాణ ప్రభుత్వం మొదటి ఐదేండ్లు దాటకుండానే తెలంగాణకు జలధారలను మళ్లించే విధంగా ప్రాజెక్టుల నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తున్నది. భూమికి అంత లోతున పైనించి చూస్తే వందల మంది యువకులు చీమల దండులాగా ఎవరిపని వారు చేస్తున్నారు.

సరిహద్దులో యుద్ధం చేస్తున్నవారిలా కనిపించారు. ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారన్నది పట్టించుకునే పరిస్థితిలో వారు లేరు. పని ఒక్కటే పరమార్థం. ఇరవైనాలుగు గంటలూ పనిజరుగుతున్నది. ఒక షిఫ్టు సిబ్బంది డ్యూటీ దిగగానే మరో షిఫ్టు సిబ్బంది పనిలోకి ఎక్కుతారు. ఏ రోజూ పని ఆపలేదు. కేవలం మూడేండ్ల వ్యవధిలో ఇంత నిర్మాణం చేయగలిగాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా మంత్రి హరీశ్‌రావుగారల రోజువారీ సమీక్షలు, ప్రత్యక్ష పర్యవేక్షణతో మావాళ్లంతా మరింత హుషారుగా, అప్రమత్తంగా పనిచేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా నీళ్లివ్వాలన్నది అం దరి తపన అని రామడుగు భూగృహంలో పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీర్ చెప్పారు. హైదరాబాద్‌లో మనం ఏమేమో మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రాజెక్టులపై వివాదాలు, రాజకీయాలు, కేసుల గోల వినిపిస్తుంటుంది. కానీ అంతటి భూగర్భంలో అన్ని వందలమంది తదేక దీక్షతో ఎవరిపని వారు చేసుకుపోతుంటే ఆశ్చర్యం అనిపించింది. వారెవరూ ఈ జలాలతో ప్రయోజనం పొందేవారు కాదు. బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికులు.

తెలంగాణ ఉద్యమ కాలంలో, ఆ తర్వాత ప్రభుత్వంలో నీళ్లకోసం, ప్రాజెక్టులకోసం ఆరాటపడిన తెలంగాణ ఇంజినీర్లు, జలయజ్ఞం అంటే ధనయజ్ఞం కాదని, ఆధునిక దేవాలయాల నిర్మాణమని, కోట్లాది మంది జీవితాల్లో జలసిరులు కురిపించే యజ్ఞమని భావించే నిర్మాణసంస్థల సిబ్బంది. అలా అనుకోకపోతే అన్నారం బరాజ్ కేవలం 14 మాసాల వ్యవధిలో నీళ్లు నిలుపగలస్థితికి నిర్మాణం పూర్తయ్యేది కాదు. గోదావరి జలధారలను మళ్లించే కన్నెపల్లి పంపుహౌస్, ప్రధాన కాలువ ఆగమేఘాలపై నిర్మాణం జరిగి తుదిదశకు చేరుకునేది కాదు. మేడిగడ్డ బరాజ్ పూర్తికావడానికి మరి రెండేండ్లు పట్టవచ్చు, కానీ, మేడిగడ్డ బ్యాక్‌వాటర్ నుంచి నీళ్లు తీసుకోవడం మాత్రం మరో రెండుమూడు మాసాల్లో ఎట్టిపరిస్థితుల్లో ప్రారంభిస్తామని ఇంజినీర్లు ధీమాగా చెప్తున్నారు.

తవ్విపోసిన మట్టి గుట్టలు, అద్భుతమనదగిన పంపుహౌస్‌లు, సర్జ్‌పూళ్లు, గేట్ల నిర్మాణం, కిలోమీటర్ల పొడవునా సాగిపోయే కాలువలు, మొత్తంగా అక్కడ జరిగిన పని పరిమాణం, అందుకు మన ఇంజినీర్లు, నిర్మాణ సిబ్బంది తీసుకున్న సమయం చూస్తే, మనుషులేనా, మనవాళ్లేనా ఈ పనిచేసింది అనే ఆశ్చర్యం కలుగుతుంది. నిర్మాణ విభాగం, యంత్ర విభాగం, విద్యుత్ విభాగం, ప్రణాళికా విభాగం- ఏ శాఖకు ఆ శాఖ ఇంజినీర్లు ఏకకాలంలో అన్ని పనులను వేగంగా, నాణ్యంగా పూర్తి చేస్తున్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని పనులు ఏకకాలంలో ఏకరీతిన, నాణ్యంగా, త్వరితంగా ముందుకు సాగుతుండటం సంతృప్తికరంగా ఉంది అని కేంద్ర జలసంఘం అదనపు కార్యదర్శి వైకే శర్మ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల వ్యవస్థ నుంచి 270 టీఎంసీల నీటిని తెలంగాణ భూములకు మళ్లించుకునే అవకాశం ఉంది. కానీ, ప్రస్తుతానికి 180 టీఎంసీలను మాత్రమే తరలించుకునే విధంగా మెకానికల్, ఎలక్ట్రికల్ పనులు జరుగుతున్నాయి అని ఈఎన్సీ మురళీధర్ చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద కాళేశ్వరం నుంచి ఇటు యాదగిరిగుట్ట సమీపంలోని బస్వాపూర్ వరకు, అటు భూంపల్లి వరకు 20 రిజర్వాయర్లలో 147 టీఎంసీల నీటిని నిల్వచేసే ఒక అద్భుతమై ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఒక్క సీజనులోనయినా సరే 147 టీఎంసీల నీరు తెలంగాణ గడ్డపై నిల్వ ఉంచినా, పొలాలకు పారించినా తెలంగాణ నేల ఎంతగా పులకించిపోతుందో, భూగర్భ జలాలు ఎలా పెరుగుతాయో, చెట్టు చేమ, పశుపక్షాదులు ఎలా ఎదుగుతాయో అర్థం చేసుకోవచ్చు.

ఏకకాలంలో ఇన్ని బరాజ్‌లు, పంపుహౌస్‌లు, టన్నెళ్లు, కాలువలు, ఇంతపెద్ద లిఫ్టింగ్ వ్యవస్థను నిర్మించిన చరిత్ర దేశంలో మరే రాష్ర్టానికి లేదు. దేశం సృష్టించుకున్న అద్భుతాల్లో ఇదొకటి అవుతుంది అని కాళేశ్వరం ఈఎన్సీ హరిరాం చెప్పారు. కొత్తగా 18.25 లక్షల ఆయకట్టుకు నీరందించడంతోపాటు, మరో 18.75 లక్షల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించడం (శ్రీరాంసాగర్, నిజాంసాగర్, ఇతర ప్రాజెక్టుల కింద నీళ్లు అందని ఆయకట్టుకు నీళ్లివ్వడం) కాళేశ్వరం ప్రాజెక్టు అంతిమ లక్ష్యం. మొత్తం 37 లక్షల ఎకరాలకు నీళ్లొస్తే ప్రజల జీవితాల్లో ఎంత మార్పు వస్తుందో ఊహించండి అని ఆయన అన్నారు. మా వాళ్లంతా ఎంతో టీమ్ స్పిరిట్‌తో పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వాములు కావడం, పూర్తిచేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం అని చీఫ్ ఇంజినీరు వెంకటేశ్వర్లు తెలిపారు. వాటర్ ఈజ్ కింగ్. వాటర్ ఈజ్ ఎవ్రీథింగ్. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఎ మార్వెల్ అని అన్నారు పాత్రికేయ మిత్రుడు, టైమ్స్ ఆఫ్ ఇండియా రెసిడెంట్ ఎడిటర్ కేఆర్ శ్రీనివాస్.

ప్రాజెక్టులపై కొందరు కావాలని వివాదం సృష్టిస్తున్నారు. వాళ్లకు ఇంకా తెలంగాణ ఏమి కోరుకుంటున్నదో అర్థం కావడం లేదు. ఎక్కడైనా గొడవపడండి. ప్రాజెక్టుల జోలికి రావద్దు. ఇప్పుడు నోరుపెట్టుకుని గోలచేస్తున్న వాళ్లంతా ఈ ప్రాజెక్టులు పూర్తయిన రోజున నోరు విప్పలేరు. కనీసం తలెత్తుకు తిరుగలేరు అన్నారు నీటిపారుదల ఇంజినీరింగ్ సలహాదారు పెంటారెడ్డి. అది నీటికి ఉన్న శక్తి. నీటి విలువ తెలిసిన మనుషులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. తెలంగాణ ఆరు దశాబ్దాలుగా నష్టపోయింది సాగునీరు లేకనే.. కట్టా శేఖర్ రెడ్డి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.