-20 వేల మందితో నేడు సీఎం వీడియో కాన్ఫరెన్స్
-రాష్ట్రస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు..
-అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం
-నియంత్రిత పంటలసాగుపై వారికి దిశానిర్దేశం
-32 కలెక్టరేట్లు.. అన్ని మండల కేంద్రాలు సహా
-600 సెంటర్లలో పాల్గొననున్న ప్రతినిధులు
-మంత్రుల నుంచి.. ఏఈవోల వరకు హాజరు
-దేశంలోనే తొలిసారి భారీ వీడియో కాన్ఫరెన్స్
-మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ నుంచి..
దేశంలోనే మునుపెన్నడూ జరుగని విధంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది అధికారులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. పరిపాలనావ్యవస్థకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సమస్త అధికార యంత్రాంగంతో ఒక ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇదే తొలిసారి. మొత్తం 32 జిల్లా కలెక్టరేట్లతోపాటు మొత్తం 600 కేంద్రాల నుంచి ఒకేసారి అందరు అధికారులు, సిబ్బంది ముఖ్యమంత్రితో సంభాషించే అరుదైన సందర్భమిది. దాదాపు 20 వేలమంది ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనబోతున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ నుంచి జరిగే ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలను సాగుచేయాల్సిన అవసరం.. చేసే విధానంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశంచేస్తారు. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాలశాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయా శాఖల కార్యదర్శులు, అధికారులు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఈ సమావేశంలో పాల్గొంటారు. అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, విత్తనాభివృద్ధి కార్పొరేషన్ అధికారి, వ్యవసాయ విస్తరణాధికారులు పాల్గొంటారు. వీరితోపాటు జిల్లా, మండల, గ్రామస్థాయి రైతుబంధు సమితుల అధ్యక్షులు, కోఆర్డినేటర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు.
గ్రామీణస్థాయిలో పరిస్థితులపై అధికారులు ఇచ్చే సమాచారం ఆధారంగా సీఎం కేసీఆర్ తగిన సూచనలు చేస్తారు. సాగునీటి ప్రాజెక్టుల సత్వర నిర్మాణం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత కార్యక్రమాల ద్వారా తెలంగాణ బీడు భూములను సాగులోకి తీసుకొచ్చారు. ఫలితంగా ఈ యాసంగిలో భారీగా వరి పంట వచ్చింది. రాష్ట్రంలో సాగుభూమి విస్తీర్ణం 1.10 కోట్ల ఎకరాలకు పైగా చేరడంతో రైతులకు లాభాలు వచ్చేలా చేయడంపై ముఖ్యమంత్రి కసరత్తు మొదలుపెట్టారు. రైతులంతా ఒకే పంట వేస్తే డిమాండ్ ఉండదని, మూస పద్ధతిలో వ్యవసాయంచేసే విధానానికి స్వస్తి పలుకాలని సీఎం భావిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో సాగయ్యే భూమిలో 50 లక్షల ఎకరాల్లో వరి, మరో 50 లక్షల ఎకరాల్లో పత్తి, మరో 10 లక్షల ఎకరాల్లో కంది పంట పండించాలని నిర్ణయించారు. నగరం, పట్టణాలకు సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లో కూరగాయలు పండించాలని నిర్ణయించారు. వరిలో కూడ సన్నాలు ఎక్కువగా పండించాలని భావిస్తున్నారు. ఇలా ఏ భూమిలో ఏ పంట పండించాలన్న దానిపై సీఎం కేసీఆర్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో విస్తృతంగా చర్చిస్తారు.
రైతుల మేలుకే నియంత్రిత సాగు: పల్లా రైతుల మేలుకోసమే ప్రభుత్వం నియంత్రిత పంటల సాగు విధానాన్ని తీసుకురానున్నట్టు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారంనాటి వీడియో కాన్ఫరెన్స్‌కు అన్ని జిల్లాలనుంచి రైతుబంధు సమితి అధ్యక్షులు పాల్గొంటారని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ చేసే సూచనలు, సలహాలను అవగాహనచేసుకొని రైతులను ఆ దిశగా చైతన్యవంతంచేయాలన్నారు.
రైస్ మిల్లర్లతో సీఎం సమావేశం రాష్ట్ర రైస్ మిల్లుల యజమానుల సంఘం ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వరిసాగు పెరుగుతున్న నేపథ్యంలో ధాన్యం, బియ్యం మార్కెటింగ్‌కోసం తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. రైస్‌మిల్లుల సామర్థ్యం పెంపు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం పై అడిగి తెలుసుకున్నారు.