Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రాష్ట్రంలో స్వర్ణయుగం

-స్ఫూర్తిదాయకంగా సంక్షేమ పథకాలు -ఏడాదిలో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టి తీరుతాం -కోటి ఎకరాల మాగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం -రాజధాని శివారు పర్యటనలో మంత్రి కేటీఆర్ -183 ఔటర్ లోపలి గ్రామాల్లో తాగునీటి పథకం ప్రారంభం -డీ పోచంపల్లిలో 1600డబుల్ బెడ్ రూం ఇండ్లకు శంకుస్థాపన -అధికారం దక్కలేదన్న బాధలో కాంగ్రెస్ -అందుకే నోటికొచ్చినట్టు మాటలు -మేం ప్రజలకే జవాబుదారీ.. ప్రతిపక్షాలకు కాదు -మా బాసులు ఢిల్లీలో లేరు.. మీరే మా బాసులు

సంక్షేమ రంగంలో భారతదేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణయుగం నడుస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారక రామారావు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా బాగుపడిందని, ఇక మంచినీటి సరఫరా కూడా మెరుగుపడనుందని అన్నారు. మరోవైపు రహదారులు బాగు చేసుకుంటున్నామని చెప్పారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, పరిమితి లేకుండా పేదవారి కోసం తలా ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం, హాస్టళ్ల విద్యార్థులకు సన్నబియ్యం, ఒక్కో విద్యార్థికి రూ.25వేలు ఖర్చుచేస్తూ గురుకుల పాఠశాలల ఏర్పాటు.. ఇలా అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కుల వృత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. నగరంలో బుధవారం మంత్రి మహేందర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీలు మల్లారెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, వివేకానంద, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి మంత్రి కేటీఆర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనచేశారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, రూ.628 కోట్లతో ఔటర్ లోపలి గ్రామాల తాగునీటి పథకం పనులకు సంబంధించిన పైలాన్‌ను కొంపల్లిలో ఆవిష్కరించారు. అనంతరం డీ పోచంపల్లిలో 1600 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి షాపూర్‌నగర్‌లో 6 మిలియన్ గ్యాలన్ల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్బ్భై ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి ఆలోచించని రీతిలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు దూసుకుపోతున్నాయని చెప్పారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా ఇంటింటికీ నల్లాద్వారా సురక్షిత మంచినీరు అందిస్తున్నామన్నారు. సామాన్య, దిగువ మధ్య తరగతి ప్రజలకు ఏ అవసరాలు ఉంటాయో వాటన్నింటినీ తీర్చుతున్నామని చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నాయకుడు కాబట్టే సీఎం కేసీఆర్ ప్రజా అవసరాల మేరకు బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.

ప్రతి గడపకు తాగునీరు ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఇంటింటికీ తాగునీరందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగబోమని ప్రకటించిన ఏకైక సీఎం కేసీఆరేనని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో విలీనమైన 12 మున్సిపాల్టీల్లో రూ.1900కోట్లు ఖర్చు పెట్టి రికార్డు సమయంలో ఆ పనులను పూర్తిచేశామని కేటీఆర్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో 158 కిలోమీటర్ల మేర ఔటర్ లోపలి గ్రామాలకు తాగునీరందించేందుకు పట్టణ భగీరథ పథకం కింద రూ.628 కోట్లతో పనులు చేపట్టినట్టు వివరించారు. మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 183 గ్రామాలు, ఏడు మున్సిపాల్టీల్లో 285 కిలోమీటర్లు ట్రంక్‌మెయిన్స్, 1200 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ పైపులైన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఏడాదిలో ఈ పనులను పూర్తిచేసి, ప్రతి మనిషికి 135 లీటర్ల తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ఈ గ్రామాలలో ప్రస్తుతం రోజూ సరఫరా అవుతున్న ఏడు మిలియన్ గ్యాలన్ల నీటి స్థానంలో 33 మిలియన్ గ్యాలన్ల నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా అందించడంతోపాటు అదనంగా 1.50 లక్షల మందికి కొత్తగా నల్లా కనెక్షన్లు మంజూరు చేస్తామన్నారు. ఈ పథకం పూర్తయితే 10 లక్షల జనాభాకు లబ్ధి కలుగుతుందని కేటీఆర్ తెలిపారు. సురక్షిత మంచినీరు అందించగలిగితే పేద ప్రజలు వైద్యం మీద పెడుతున్న ఖర్చు 70-80శాతం తగ్గిపోతుందని చెప్పారు.

కేశవపూర్‌లో భారీ రిజర్వాయర్ హైదరాబాద్ రోజురోజుకు ఎదుగుతున్న మహా నగరమని కేటీఆర్ అన్నారు. శివారు ప్రాంతాలు, ఔటర్ రింగు రోడ్డు లోపలి గ్రామాలను కలుపుకొంటే కోటి పైచిలుకు జనాభా ఉంటుందన్నారు. రాష్ట్రంలో మూడో వంతు జనాభా కలిగిన ఈ ప్రాంత మంచినీటి అవసరాలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని కేటీఆర్ విమర్శించారు. నాగార్జునసాగర్, ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేయాల్సి వస్తున్నదన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో వర్షాలు సరిగ్గా లేకపోయినా, ఎల్లపల్లికి నీరు రాకపోయినా, వందల కిలోమీటర్ల పొడవైన పైపులైన్‌లో ఏదైనా ఇబ్బంది తలెత్తినా హైదరాబాద్ తాగునీటి వ్యవస్థ అతలాకుతలం అవుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే కరువు వచ్చి, రెండు మూడేండ్లు ఇబ్బంది కలిగినా నగర తాగునీటికి ఎలాంటి ఢోకా ఉండొద్దన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ సాగునీటికి సంబంధం లేకుండా భారీ రిజర్వాయర్‌కు శ్రీకారం చుట్టారని తెలిపారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం కేశవపూర్‌లో ఏర్పాటుచేయనున్న భారీ రిజర్వాయర్.. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

కోటి ఎకరాల మాగాణే లక్ష్యం నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ప్రజాకవి దాశరథి అంటే.. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ నా తెలంగాణ.. కోటి ఎకరాల మాగాణి కూడా కావాలని చెప్తున్నారని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలోని బీడు భూములకు సాగునీరిందించే ప్రయత్నంచేస్తూనే మరోవైపు ఇంటింటికీ తాగునీరందించేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పేదలు అత్మగౌరవంతో బతుకాలన్న లక్ష్యంతో రూ.18వేల కోట్లతో డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం, రూ.5వేల కోట్లతో గొర్రెల పంపిణీ, రూ.2వేల కోట్లతో మత్స్యకారులకు.. ఇలా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు చేపడుతున్నారని వివరించారు.

ఏడాదిలో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు పేదలు ఆత్మగౌరవంతో నివసించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమని కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలను అద్భుతంగా చేపడుతున్నట్టు చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఒక్క గది కట్టి అందరినీ సంసారం చేయమన్నది. కొన్ని డబ్బులు మేం ఇస్తాం.. కొన్ని డబ్బులు మీరు కట్టాలి.. అంటూ మూడు రంగులు వేసి, వాటిని కేటాయించేందుకు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.8.65లక్షలు ఖర్చు చేస్తున్నది. మార్కెట్లో దీని విలువ రూ.25నుంచి రూ.30 లక్షలు ఉంటుంది అని కేటీఆర్ వివరించారు. ఈ ఇండ్లను పూర్తి ఉచితంగా కట్టించి ఇస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. ఒక్క సంవత్సరంలోనే లక్ష ఇండ్లు కట్టించి తీరుతామని స్పష్టంచేశారు. ఇది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసే కార్యక్రమం కాదని, పేదలందరికీ ఇండ్లు అందే వరకూ కొనసాగుతుందని చెప్పారు.

ఈ సమస్యలన్నింటికీ కాంగ్రెస్ కారణం కాదా? స్వాతంత్య్రం వచ్చి డ్బ్భై ఏండ్లు అవుతున్నా ఇంకా చాలా గ్రామాల్లో కరెంట్, రోడ్లు, ప్రజలకు కనీసం మంచినీళ్లు అందించలేని పరిస్థితులు ఉన్నాయంటే గత పాలకులు ఎంత గొప్పగా పాలించారో అర్థం చేసుకోవచ్చని కేటీఆర్ ఎద్దేవాచేశారు. 50-55 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఈ సమస్యలన్నింటికీ కారణం కాదా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం మూడున్నరేండ్లలోనే ఒకవైపు మౌలిక వసతులు, మంచినీరు, రహదారులు, ఇతర సౌకర్యాలు ఏర్పాటుచేస్తూ, మరోవైపు సంక్షేమ కార్యక్రమాల అమలులో దూసుకుపోతున్నదని అన్నారు. మూడున్నరేండ్ల క్రితం తెలంగాణ ఏర్పడక ముందు చాలా రకాల భయాలు, మనలో మనకే అపోహలు సృష్టించారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ వస్తే ఇక్కడ మొత్తం చీకటి అయితది.. ఉన్న పరిశ్రమలు వెళ్లిపోతాయి.. అని అప్పుడున్న పాలకులు భయపెట్టారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎర్రటి ఎండకాలంలో కూడా ఇండ్లకు, పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్‌దే. కొన్ని జిల్లాల్లో వ్యవసాయానికి కూడా 24 గంటలు కరెంటు ఇస్తున్నం అని కేటీఆర్ తెలిపారు.

మా బాసులు ఢిల్లీలో లేరు.. మీరే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బాసులు ఢిల్లీలో లేరని, ప్రజలే తమ బాసులని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఒకటి తర్వాత ఒకటి బాగుపడుతుంటే కొందరు నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. అధికారం దూరమైపోయిందన్న బాధలో రకరకాలుగా మాట్లాడుతున్నరు.. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాకు ఢిల్లీలోనో.. మరెక్కడనో బాసుల్లేరు. గల్లీల్లో ఉన్న మీరే మాకు బాసులు. మేం మీకే జవాబుదారీ. మీరు తిరస్కరించిన ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన అక్కర లేదు అని కేటీఆర్ అన్నారు. మేం సరిగా పనిచేయకపోతే 2019లో శిక్షించే అధికారం మీకు ఉంటది.. కానీ పనిచేసిన ప్రభుత్వాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మీకు ఉంటది అని కేటీఆర్ చెప్పారు.

ప్రతిపక్షాలకు పనిలేకుండా పోయింది గతంలో శివారు మున్సిపాల్టీల్లో 10 నుంచి 15 రోజులకొకసారి నీటి సరఫరా ఉండేదని కేటీఆర్ గుర్తుచేశారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు పేద మహిళలను వెంటబెట్టుకుని ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయం ముందు ఖాళీ కుండలతో ప్రతిపక్షాలు ధర్నాలు చేసేవని కేటీఆర్ చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చినాక నెత్తిన కుండలు లేవు.. ధర్నాలు లేవు.. అసలు ప్రతిపక్షాలకు పనిలేకుండా పోయింది అని ఎద్దేవాచేశారు. పట్టణంలో సకాలంలో మంచినీటి సరఫరా చేస్తున్నామని, శివార్లలోనూ ఇదే దృశ్యాన్ని ఆవిష్కస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. నాణ్యమైన నీటిని సరఫరా చేస్తూ ఐఎస్‌వో సర్టిఫికెట్ సాధించిన జలమండలిని ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు. శివారులో చాలా కాలనీలు, అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు బాసటగా నిలిచి తాగునీరందించాలని, ఈ బాధ్యత జలమండలి తీసుకుని కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.