Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రేపే గులాబీ పండుగ

-టీఆర్‌ఎస్ ప్లీనరీకి ప్రగతి ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తి
-ప్లీనరీ పరిసర ప్రాంతాలు గులాబీమయం
-నగరం నలువైపులా స్వాగత తోరణాలు
-సభాప్రాంగణంలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు
-ప్రతినిధుల సేవలో 2 వేల మంది వలంటీర్లు
-హైదరాబాద్ చేరిన ఎన్నారై ప్రతినిధులు
-ప్లీనరీతో క్యాడర్‌లో నూతనోత్సాహం: మంత్రి ఈటల రాజేందర్
-దేశానికి దిశానిర్దేశం చేయనున్న ప్లీనరీ: మంత్రి తలసాని
-దేశ రాజకీయాల్లో మార్పునకు పునాది: ఎంపీ సంతోష్‌కుమార్
 
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) 17వ ప్లీనరీ సమావేశాలకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 27న హైదరాబాద్ శివారు కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్‌లో ప్లీనరీ నిర్వహిస్తున్న ప్రాంతానికి ప్రగతి ప్రాంగణంగా నామకరణంచేశారు. 90 శాతం ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల నుంచి దాదాపు 13 వేల మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రతినిధులకు సేవలందించేందుకు దాదాపు రెండువేల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. వీరిలో అత్యధికులు టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నుంచే ఉండటం విశేషం. మేడ్చల్ జిల్లా నుంచి కూడా గణనీయ సంఖ్యలో వలంటీర్లుగా వచ్చారు. వీరికి గత రెండురోజులుగా సభా ప్రాంగణం సమీపంలోనే శిక్షణనిస్తున్నారు. వారి శిక్షణను డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌తోపాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద్ పర్యవేక్షిస్తున్నారు. దేశంలో గుణాత్మక మార్పు దిశగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రయత్నాలను ఈ ప్లీనరీలో ప్రధానంగా చర్చించే అవకాశముంది. జాతీయ రాజకీయాలు, వ్యవసాయం, సంక్షేమం, పరిపాలన సంస్కరణలు, మైనార్టీ సంక్షేమం, మౌలిక సదుపాయాలు.. ఈ ఆరు ప్రధాన అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. దీనిపై ప్రతినిధులు చర్చించి, ఆమోదం తెలుపనున్నారు. ఎన్నికల ముందు జరిగే పార్టీ ముఖ్య ప్రతినిధుల సమావేశం కావటంతో రాబోయే ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేసే దిశగా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తున్నది.
 
హైదరాబాద్‌కు గులాబీ హంగులు
ప్లీనరీ కోసం హైదరాబాద్ గులాబీమయమైంది. పార్టీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ నగరం,శివార్లలో పెద్దఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు. ప్రభు త్వ పథకాలను తెలియజేస్తూ హోర్డింగులు నెలకొల్పారు. మెట్రో పిల్లర్లపై కేసీఆర్ ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. వీటిపై.. తెలంగాణలో గుడిసె గుడిసెనా గులాబీ జెండా-పేదలకు అదే అండ, నిరంతర విద్యుత్‌తో పల్లెపల్లెన వెలుగు జిలుగులు, తెలంగాణ కల నెరవేర్చిన నాయకుడు-బంగారు తెలంగాణను నిర్మిస్తున్న సేవకుడు, మన స్వప్నం-మన లక్ష్యం బం గారు తెలంగాణ.. వంటి నినాదాలతో నగరాన్ని గులా బీ వర్ణంగా మార్చారు. ప్లీనరీ ప్రాంగణంలో చివరి ప్రతినిధికి కూడా వేదికపై ఉన్నవారు, ప్రసంగించేవారు కనపడేలా దాదాపు పది ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేస్తున్నారు. వేసవిదృష్ట్యా లక్ష చల్ల ప్యాకెట్లు, అంబలి, చల్లటి మంచినీటిని అందుబాటులో ఉంచుతున్నారు. ప్రాంగణం చల్లగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లుచేశారు.
 
ప్లీనరీ ప్రతినిధులకు 12 రకాల పాస్‌లు
ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు 12 రకాల పాస్‌లను సిద్ధంచేశారు. పాస్ పైభాగంలోని తెలంగాణ పటంలో సీఎం కేసీఆర్ ఫొటో, ఆకుపచ్చని పొలాలు, లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలను అందిస్తున్న ఫొటోను, తెలంగాణ తల్లిని ముద్రించారు. కింది భాగంలో ఎగురుతున్న టీఆర్‌ఎస్ జెండా కనిపించేలా ఏర్పాటుచేశారు. కుడివైపు ప్రతినిధుల పేర్లు, హోదా ఉంటాయి. నమోదు సమయంలో వీటిని అందిస్తారు. పార్టీ ప్రతినిధులకు అందించే పాస్‌లను గులాబీ రంగులో ముద్రించారు. వీవీఐపీ పాస్‌లను ఆకుపచ్చ రంగులో, ఎన్నారైలకు ముదురు గోధుమరంగులో, వీఐపీలకు కాషాయ రంగులో, మీడియా ప్రతినిధుల కోసం నీలంరంగులో, సాంస్కృతిక బృం దానికి పసుపు కాషాయం రంగులో పాస్‌లను, వలంటీర్ల కోసం నాలుగరకాల పాస్‌లను ముద్రించారు.
 
ప్రత్యేక వైద్యబృందం
ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే తక్షణం సేవలందించేందుకు ఎంపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్యబృందాలను ఏర్పాటుచేశారు. నాలుగు అంబులెన్స్‌లు, నలుగురు వైద్యులు, 15 మం ది సిబ్బంది అందుబాటులో ఉంటారు.
 
యావద్దేశం ఎదురుచూస్తున్నది: ఈటల
టీఆర్‌ఎస్ ప్లీనరీకోసం దేశం మొత్తం ఎదురుచూస్తున్నదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధిని దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటుచేస్తున్నారని తెలిపారు. కొంపల్లిలోని బీజీఆర్ గార్డెన్‌లో ప్లీనరీ ఏర్పాట్లను బుధవారం ఈటల రాజేందర్, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీలు జోగినిపల్లి సంతోష్‌కుమార్, బాల్క సుమన్, మల్లారెడ్డి, బండ ప్రకాశ్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొం తు రామ్మోహన్ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, సుధీర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తదితరులు పరిశీలించారు.
 
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఆవిర్భవించినప్పటి నుంచి చేసిన ఉద్యమం, సాధించిన రాష్ట్రం.. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయనే విషయాన్ని అన్ని రాష్ర్టాలు ఆసక్తిగా పరిశీలిస్తున్నాయని చెప్పారు. ప్లీనరీలో అన్ని విషయాలపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇస్తారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా మరోసారి ఎగురబోతున్నదని, కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తంచేశారు. అతి తక్కువ సమయంలో దేశం మొత్తాన్ని తన పరిపాలనతో తెలంగాణ వైపు చూసేలా కేసీఆర్ చేశారని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ ప్లీనరీ సమావేశం దేశానికి దశదిశ నిర్దేశిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. దేశం యావత్తు ప్లీనరీపై అసక్తిగా ఉన్నదన్నారు. కార్యక్రమంలో టీఎస్‌టీఎస్‌సీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, టీఎస్ ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు నాగరాజుయాదవ్, నేతలు కేఎం గౌరీశ్, జెమ్మి దేవేందర్, చింతల దేవేందర్ పాల్గొన్నారు.
 
దేశవ్యాప్తంగా ఆసక్తి: ఎంపీ సుమన్
టీఆర్‌ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ ఇచ్చే సందేశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నదని ఎంపీ బాల్క సుమన్ చెప్పారు. ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్సే అధికారంలోకి రాబోతున్నదన్నారు. అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిన కేసీఆర్‌తో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కూడా సాధ్యమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు.
 
ప్లీనరీ వేదికగా ఎన్నికల శంఖారావం: ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ 
ప్లీనరీ వేదిక నుంచి సీఎం కేసీఆర్ ఎన్నికల సమరశం ఖం పూరించనున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చెప్పారు. టీఆర్‌ఎస్ యువజన విభాగం నాయకుడు కర్నె అరవింద్ ఆధ్వర్యంలో రూపొందించిన టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్‌ను బుధవారం ఆయన నాగోల్ సాయినగర్‌కాలనీలో ఆవిష్కరించారు.
 
24 దేశాల నుంచి ఎన్నారైలు
ప్లీనరీలో పాల్గొనేందుకు 24 దేశాల నుంచి సుమారు 125 మంది పార్టీ ప్రతినిధులు టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల సారథ్యంలో బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళ్లు అర్పించారు. అక్కడి నుంచి ప్లీనరీ జరిగే కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడుతూ.. ప్లీనరీకి అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్, ఆస్ట్రియా, బహ్రేయిన్, న్యూజిలాండ్, డెన్మార్క్, నార్వే, మలేషియా, ఫ్రాన్స్, ఖతార్, ఫిన్‌లాండ్, స్వీడన్, స్విట్జర్లాండ్, జాంబియా, పెరూ, పోలాండ్, సింగపూర్, ఇటలీ, కొలంబియా, పరాగ్వే నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు.
 
MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.