-దసరానుంచి పింఛన్లు: ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్
రైతు రుణమాఫీపై ఆందోళన అవసరం లేదని, మార్చి 2014 లోపు రూ.లక్ష లోపు ఉన్న వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్ ఆవరణలో రెడ్డి సంక్షేమసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వచ్చే దసరా నుంచి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం వృద్ధులకు, వితంతువులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 పెన్షన్ అందచేస్తామని, ఐదేండ్లలో తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.
ఎంపీ బీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ ఉత్పత్తి పెరగాలని, వ్యవసాయ ఉత్పత్తితో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఉద్యమస్ఫూర్తితో 24 గంటలు పనిచేసి బంగారు తెలంగాణ సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పరిష్కారం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే బొడిగ శోభ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడి,ఎంపీపీ గుర్రం భూంరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు, రెడ్డి సంఘం నాయకులు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.