దేశ రైతాంగ జీవితాలపై, ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే కీలకమైన వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రం ప్రభుత్వం అన్ని నియమాలనూ కాదని నియంతృత్వ ధోరణిని అనుసరించింది. భారత పార్లమెంటు ఎగువసభలో సభ్యుల గౌరవాన్ని,హక్కులను ఏమాత్రం పట్టించుకోలేదు. దేశంలోని పేద రైతాంగం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరం. చట్టసభల సభ్యులతో అర్థవంతమైన చర్చలకు అవకాశమివ్వని ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను చారిత్రాత్మకమైనవని అభివర్ణించడం హాస్యాస్పదం.
సమగ్ర వ్యవసాయం విధానం తీసుకురావాలనేదే నిజంగా కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమైతే ఇప్పటికే కొన్ని రాష్ర్టాల్లో విజయవంతమైన నమూనాలను బిల్లుల్లో చేర్చాల్సింది. వ్యవసాయం వంటి రాష్ర్టాల జాబితాల్లోని అంశాల్లోకి చొరబడేబదులు ఆ పని చేస్తే అది సమాఖ్య విధాన స్ఫూర్తిని ప్రతిఫలించేది. ఉదాహరణకు- తెలంగాణ ప్రభు త్వం రైతులకు మేలు చేకూర్చే పలు పథకాలను విజయవంతంగా అమలుపరుస్తున్నది. రైతుబంధు, రైతుబీమా, నియంత్రిత సాగు వల్ల రైతులు లబ్ధి పొందుతున్నారు. రైతుబంధు పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ.10వేలు ఇన్‌పుట్ సబ్సిడీగా అందుతుంది. బీమా రైతులకు ధీమానిస్తున్నది. నియంత్రిత సాగు విధానంలో మెరుగైన ధరలు లభించేలా ఏ పంటలు వేయాలో రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తారు. అన్నిరకాలుగా విస్తరణ సేవలు లభిస్తాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రైతులకు అన్నివిధాలుగా వసతులు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు. 24 గంటల నాణ్యమైన నిరంతరాయ విద్యుత్తు సరఫరా, సాగుకు నీరు, కోల్డ్ స్టోరేజీ సహా నిల్వకు వసతులు, పకడ్బందీ సేకరణ ప్రక్రియ రైతులకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయి.
వ్యవసాయ బిల్లుల్లో కనీస మద్దతు ధరపై (Minimum Support Price-MSP) హామీ లేకపోవడం ప్రధానంగా లోపించిన అంశం. రైతుల భయాందోళనలను పారదోలడానికి ఇది ముఖ్యం. ప్రభుత్వం రైతులకు మద్దతు ధరను కొనసాగిస్తుందని వ్యవసాయ మంత్రి సభలో చెప్పారుగానీ బిల్లులో ఆ అంశం లేదు. ఇప్పుడు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో అవి చట్టాలుగా రూపొందాయి. కాబట్టి ఆరు నెలల్లోగా పూర్తికావాల్సిన సబార్డినేట్ లెజిస్లేషన్‌లో కొన్ని అంశాలను చేర్చడం అవసరం.
నియంత్రిత ప్రభుత్వ మార్కెట్లు లేని స్థితిలో రైతులకు తగిన గిట్టుబాటు ధర లభించేలా కనీస మద్దతు ధరకు (ఎమ్మెస్పీకి) హామీనిస్తూ చట్టంలో ఒక నిబంధన చేర్చాలి. కనీసం ఐదేండ్ల వరకు.. ప్రస్తుత బిల్లుల ప్రయోజనాలు రైతుకు చేరేవరకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) అవసరాలతో నిమిత్తం లేకుండా ప్రతి రాష్ట్రం కనీస మద్దతు ధరనిచ్చేలా చూడాలి. వ్యవసాయోత్పత్తుల కొనుగోలు పద్ధతి మార్కెట్ కమిటీల నుంచి ప్రైవేటు వాణిజ్యానికి మారే దశలో రైతులు దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ప్రతి ఉత్పత్తికి కనీస నిర్దిష్ట ధరను కూడా నిర్ధారించాలి. రైతుకు రక్షణగా దానిని పాటించనిపక్షంలో శిక్ష ఉం డాలి. బిల్లులో ఇలాంటి నిబంధనను చేర్చాలి. ఈ చిన్నపాటి నిబంధన లేనిపక్షంలో కార్పొరేట్, ప్రైవేటు శక్తులు చెలరేగిపోయి రైతులను దోచుకుంటాయి.
భౌగోళిక పరిస్థితుల రీత్యా భారతదేశం వ్యవసాయ రంగంలో ప్రధాన పాత్ర పోషించగలదు. ఈ రంగం రైతులకు ఆశించిన ఫలితాలను అందించగలుగుతుంది. ఏ రైతు తన ఉత్పత్తిని ఏ కొనుగోలుదారుకు ఎంత ధరకు అమ్మాడన్న వివరాలు ప్రభుత్వానికి అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యం. కనీస ధరలు అమలయ్యాయా లేదా అని చూసి అవసరమైన పక్షంలో జోక్యం చేసుకునేందు కు ఇలా వీలవుతుంది. ఇప్పటికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అమలవుతున్న ఆహార పదార్థాల సరఫరా, అంత్యోదయ పథకం కింద పేదలకు లభిస్తున్న ఆహారభద్రతకు ఎలాంటి ఢోకా లేకుండా చూడాలి. మార్కెట్‌లో ఆహారధాన్యాల ధరలు కనీస మద్దతు ధర కన్నా ఎంతో ఎక్కువ ఉన్నప్పటికీ ఎలాంటి రాజీ లేకుండా చూసేందుకు జాతీయ ఆహార భద్రత చట్టానికి ఒక నిబంధన చేర్చాలి.
(వ్యాసకర్త: చేవెళ్ల పార్లమెంటు సభ్యులు) గడ్డం రంజిత్‌రెడ్డి