Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వచ్చే 11 నెలలే కీలకం..

ఇప్పటివరకు 19 ఇన్‌టేక్ వెల్స్‌లో 11 పూర్తయ్యాయి. వివిధ దశల్లో ఉన్న మిగతావి 2017 మార్చి నాటికి పూర్తవుతాయి.50 వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లలో 3 ప్లాంట్లు 100%,10 ప్లాంట్లు 75 శాతానికిపైగా,11 ప్లాంట్లు 50 శాతానికిపైగా, 20 ప్లాంట్లు 25 శాతానికిపైగా పూర్తయ్యాయి. 2017 జూన్ నాటికి అన్ని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు పూర్తవుతాయి.మిషన్ భగీరథ కింద డిసెంబర్‌కల్లా 42.39 లక్షల ఇండ్లకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశమంతా ఆసక్తిగా చూస్తున్న ఈ పథకం నిర్మాణపనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. రానున్న 11 నెలల సమయం చాలా కీలకమని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శం కాబోతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. అనేక రాష్ర్టాలు ఈ పథకం అమలుపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని పేర్కొన్నారు. నిర్దేశిత లక్ష్యం ప్రకారం డిసెంబర్ నాటికి 42,38,980 గృహాలకు తాగునీరు అందిస్తామని సీఎం చెప్పారు. అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు పనుల్లో మరింత వేగం పెంచాలని అదేశించారు. మిషన్ భగీరథకు రూ.30 వేల కోట్ల వరకు ఆర్థిక సంస్థల నుంచి రుణం లభించిందని, క్షేత్రస్థాయిలో పనులు వేగంగా జరుగడమే ఇప్పుడు ప్రధానమని సీఎం అన్నారు. పైప్‌లైన్లకు అనుమతులు, ఇతర అంశాల్లో ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారానికి ఆయా శాఖలతో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో మిషన్ భగీరథ పథకంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

అందరి చూపు మనవైపే.. అన్ని రాష్ట్రాలు మనవైపు చూస్తున్నాయి. ప్రధానమంత్రి స్వయంగా ప్రారంభించారు. 7 రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి అధ్యయనం చేశారు. నీతి ఆయోగ్ ప్రశంసించింది. చాలా రాష్ర్టాలు తమ ప్రజలకు మిషన్ భగీరథ లాంటి పథకం అందించడానికి సిద్ధపడుతున్నాయి. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని అధికారులు చిత్తశుద్ధితో రేయింబవళ్లు కష్టపడి విజయవంతం చేయడానికి కృషిచేయాలి అని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సెగ్మెంట్ల వారీగా పరిస్థితిని సీఎం సమీక్షించారు. ఇన్‌టేక్‌వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, పైప్‌లైన్లు, విద్యుత్ సబ్‌స్టేషన్లు తదితర నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈఎన్సీ నుంచి డీఈల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధికారులతో సీఎం నేరుగా మాట్లాడారు. సమస్యలు తెలుసుకొని వాటికి అప్పటికప్పుడు పరిష్కారాలు సూచించారు.

వర్షాలు పడేలోపే.. మనం ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాం. గ్రామాలకు మంచినీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడుగబోమని ప్రకటించాం. మన అధికారులపై నమ్మకంతో ఇతర ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వకుండా ప్రభుత్వమే ఈ పథకాన్ని అమలుచేస్తున్నది. గ్రామాల్లో అంతర్గత పనులను అధికారులే పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది ఉన్నా పరిష్కరిస్తున్నాం. ఇంత కమిట్‌మెంట్‌తో ఉన్నపుడు 2017 డిసెంబర్ నాటికి అన్ని పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో అందరూ కష్టపడి పని చేయాలి అంటూ సీఎం ఉద్బోధించారు. డిసెంబరు నాటికి పూర్తి చేయాలనేది సాంకేతికమే తప్ప వాస్తవంగా జూన్‌లోగానే పనులు పూర్తి చేయాలి.. ఎందుకంటే వర్షాకాలంలో పనులు అనుకున్నంత వేగంగా జరుగవు. దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అని సీఎం చెప్పారు.

ఇవీ లక్ష్యాలు… మిషన్ భగీరథలో లక్ష్యాలు-అమలు ప్రణాళికను వెల్లడించారు. నిర్దేశిత లక్ష్యం ప్రకారం 2017లో మార్చి నాటికి 3,811 గ్రామాలకు, డిసెంబరు నాటికి మరో 20,366 గ్రామాలకు నీరు చేరుతుంది. మార్చి నాటికి 2,671 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు, డిసెంబర్‌కు 15,602 ఓహెచ్‌ఆర్‌ఎస్‌లు పూర్తవుతాయి. మెయిన్ పైప్‌లైన్ మార్చినాటికి 8,547 కి.మీలు, డిసెంబరు నాటికి 42,780 కి.మీలు పూర్తవుతుంది. మొత్తంగా 2017 మార్చికల్లా 9,79,245 గృహాలకు, డిసెంబరు నాటికి 42,38,980 గృహాలకు తాగునీరు అందుతుంది. ఇంటింటికీ ఇంటర్నెట్‌కింద 2017 డిసెంబరు నాటికి 42,618 కి.మీ మేర ఓఎఫ్‌సీ లైను నిర్మిస్తామని అధికారులు వివరించారు.

ఇదీ ప్రోగ్రెస్.. మిషన్ భగీరథ కింద చేపట్టి పూర్తి చేసిన, వివిధ దశల్లో ఉన్న నిర్మాణ పనుల తీరుతెన్నులను అధికారులు వెల్లడించారు. 19 ఇన్‌టేక్ వెల్స్‌లో 11 పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉండగా అవి 2017 మార్చి నాటికి పూర్తవుతాయి. ఏప్రిల్ నుంచి అన్ని ఇన్‌టేక్ వెల్స్‌నుంచి నీటిని పంప్ చేయగలుగుతామని అధికారులు తెలిపారు. ఇక 50 వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లలో 3 పూర్తయ్యాయి. మరో 10 ప్లాంట్లు 75 శాతానికిపైగా పూర్తయ్యాయి. 11 ప్లాంట్లు 50 శాతానికిపైగా, 20 ప్లాంట్లు 25 శాతానికిపైగా పూర్తయ్యాయి. 2017 జూన్ నాటికి అన్ని డబ్ల్యూటీపీలు పూర్తిచేస్తామని అధికారులు, వర్కింగ్ ఏజెన్సీల వారు సీఎంకు చెప్పారు.

పైప్‌లైన్ పనుల పురోగతి.. మొత్తం 148చోట్ల పైప్‌లైనును నదులమీదుగా దాటించాల్సి ఉంది. 53 చోట్ల పనులు పూర్తి చేయగా వివిధ దశల్లో ఉన్న మిగతా పనులు వేసవిలో పూర్తవుతాయి. 1477 చోట్ల కెనాల్‌లను దాటాల్సి ఉంది. 164 చోట్ల పనులు జరిగాయి. వేసవిలో మిగతా పనులు పూర్తవుతాయి. 237 చోట్ల రైల్వే క్రాసింగ్‌లు ఉండగా 207 చోట్ల అనుమతులు వచ్చాయి. 44 చోట్ల పనులు పూర్తయ్యాయి.

అధికారులతో మాట్లాడండి.. పైప్‌లైన్ల మీద చర్చ సందర్భంగా ఈ నిర్మాణంలో వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవడం చాలా ముఖ్యమని సీఎం చెప్పారు. నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, పీఆర్ రోడ్లు, రైల్వే క్రాసింగ్‌లు, కెనాల్ క్రాసింగ్‌లు, రివర్/రివర్‌లెట్ క్రాసింగ్‌ల విషయంలో ఆయా శాఖలతో సమావేశమై అనుమతులు పొందాలన్నారు. ఫారెస్టు క్లియరెన్సుల విషయంలో జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. క్రాసింగ్‌ల అనుమతులకు ఆయాశాఖల అధికారులతో వెంటనే సమావేశం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు.

విద్యుత్ చాలా అవసరం.. ఈ పథకానికి విద్యుత్ చాలా అవసరమన్న కేసీఆర్, ఎక్కడికక్కడ విద్యుత్ సబ్‌స్టేషన్లు, లైన్ల నిర్మాణం పనులు వేగంగా జరుగాలని నిర్దేశించారు. ఇన్‌టేక్‌వెల్స్, డబ్ల్యూటీపీలకు, మంచినీటి సరఫరాకు నిరంతరం విద్యుత్ సరఫరా అందడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పా రు. వర్కింగ్ ఏజెన్సీలనుద్దేశించి మాట్లాడుతూ పనులు అనుకున్న మేరకు వేగంగా జరుగాలని చెప్పారు. సకాలంలో పూర్తిచేస్తే ఒక శాతం ఇన్సెంటివ్ ఇస్తామని తెలిపారు. వర్కింగ్ చాలా చోట్ల పనులను సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చారన్న సీఎం, సబ్ కాంట్రాక్టర్లతో పనులు సకాలంలో పూర్తిచేయించే బాధ్యత వర్కింగ్ ఏజెన్సీలదేనని స్పష్టంచేశారు.

నిధుల కొరత లేదు.. మిషన్ భగీరథకు నిధుల కొరత లేదని సీఎం స్పష్టంచేశారు. రూ. 30 వేల కోట్ల వరకు ఆర్థిక సంస్థల నుంచి రుణం లభించిందని, క్షేత్రస్థాయిలో పనులు వేగంగా జరుగడమే ఇప్పుడు ప్రధానమని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నదని, వృద్ధిరేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నదని చెప్పిన సీఎం ఈ నేపథ్యంలో పనుల్లో ఆటంకం లేకుండా ఉండేందుకు నిర్ణయాలు వేగంగా తీసుకోవాలన్నారు.

పనులన్ని ఒకేసారి సమాంతరంగా జరుగాలి రాష్ట్రమంతా పనులు ఒకేసారి సమాంతరంగా జరుగాలని సీఎం అన్నారు. ఈ 11 నెలలు అధికారులు సవ్యసాచిలా పనిచేయాల్సి ఉంటుందన్నారు. మంచినీళ్లు గ్రామాలకు చేరడంతోపాటు, చేరిన నీళ్లు ప్రతి ఇంటికి నల్లా ద్వారా అందడం కూడా ప్రధానమని అన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, జెన్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సీఎండీలు, సీఈ, ఎస్‌ఈ, ఈఈ, డీఈలు, వర్కింగ్ ఏజెన్సీల వారు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.