Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వడ్డీతో సహా రుణమాఫీ

రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని పూర్తిగా నెరవేరుస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. మిగిలిన నాలుగోవిడత రుణమాఫీకి కూడా త్వరలోనే నిధులను మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈలోపు రైతుల నుంచి బ్యాంకులు వడ్డీలను వసూలు చేస్తే… ఆ వడ్డీలను కూడా చెల్లిస్తామన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పూర్తిస్థాయిలో తెరిపించే అంశంపై సీఎం స్పందిస్తూ.. ఫ్యాక్టరీని నిర్వహించటానికి రైతులు ముందుకొస్తే ప్రభుత్వం.. నిధులతోపాటు పూర్తి సహకారం అందిస్తుందని ప్రకటించారు.

మాట ఇస్తే వెనక్కి పోం. రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ ఓర్వడం లేదు. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో లేదు. కాంగ్రెస్ పార్టీయే సంక్షోభంలో ఉంది. 35 లక్షల మంది రైతులకు రుణాలను మాఫీ చేస్తున్నం. రూ.17 వేల కోట్ల రుణమాఫీని ప్రకటించిన రాష్ట్రప్రభుత్వం దేశ చరిత్రలోనే లేదు. దీంట్లో ఇప్పటికే మూడు వంతుల మొత్తాన్ని ఇచ్చేశాం. ఇంకా ఒక్కవంతు మాత్రమే మిగిలి ఉన్నది. ఈ క్రమంలో రైతుల నుంచి ఎక్కడైనా వడ్డీ వసూలు చేస్తున్నట్లు తేలితే ఆ వడ్డీని కూడా మేమే చెల్లిస్తాం. దానికి అవసరమైన రూ.100-200 కోట్లు ఇస్తాం అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రుణమాఫీని నాలుగు విడతల్లో చేస్తామని తెలిపారు. ఇంత పెద్ద కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు ఉంటే ఉంటాయని, ఎక్కడ సమస్య ఉన్నా దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ప్రతిపక్షాలకు సూచించారు. అసెంబ్లీలో వ్యవసాయం అంశంపై బుధవారం జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. రుణమాఫీ గురించి సమగ్రంగా వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

ఆ సాహసం చేసింది మేమే! ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 0.5 శాతం పెరిగితే, కమర్షియల్ ట్యాక్స్ బకాయిలు వస్తే, అమ్మకానికి పెట్టిన భూముల విక్రయం జరిగితే… ఆ డబ్బులతో ఒకేసారి రుణమాఫీ చేస్తాం అని చెప్పాం. కానీ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు సంవత్సరాంతంలో జరిగింది. అయినప్పటికీ, దాని ద్వారా వచ్చిన డబ్బును కూడా రుణమాఫీకే మళ్లించాం. మరోవైపు, కమర్షియల్ ట్యా క్స్ బకాయిలు రాలేదు. భూములు అమ్మలే దు. కాబట్టే దఫాలుగా రుణమాఫీ చేస్తున్నాం. వాస్తవానికి, ఏకమొత్తంలో రుణమాఫీ చేయడం అనేది మా విధానం కానేకాదు. నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తామన్నాం. ప్రభుత్వ వెసులుబాటును దృష్టిలో పెట్టుకుని దానిని అమలు చేస్తున్నాం. ఇప్పటికే 75 శాతం అయిపోయింది. ఇంకా 25 శాతమే ఉంది. దానికి కూడా ఫిబ్రవరిలో బడ్జెట్ పెడతాం. దాంట్లో ఇచ్చేస్తం. రుణమాఫీ అన్నది బ్రహ్మపదార్థం అన్నట్టుగా, దాన్ని మించి ఇంకో పదార్థమే లేనట్టుగా, మేమేదో ఫెయిల్ అయినట్టుగా ప్రతిపక్షాలు చెప్తున్న్నాయి. cm_kcr భారతదేశ చరిత్రలో 17 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా? మేం ఆ సాహసం చేశాం. మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పిన మన పక్కరాష్ట్రం వాళ్లు రూ.11 వేల కోట్లు ఇస్తే… మేం ఇప్పటికే రూ.12 వేల కోట్లు ఇచ్చినం. అయినా కూడా మేం తప్పు చేసినట్టు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఇదెక్కడి న్యాయం? మీ దృష్టికి ఎక్కడైనా సమస్య వస్తే మాకు చెప్పండి. మూడో విడత రుణమాఫీ నిధులు రూ.నాలుగువేల కోట్లు బ్యాంకులకు ఇప్పటికే వెళ్లిపోయాయి. నాలుగో విడత రుణమాఫీ జరిగిన తర్వాత అర్థికమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి కలిసి రుణమాఫీ పథకం వర్తించే రైతుల నుంచి ఎక్కడ వడ్డీ వసూలు చేశారనే దానిపై సమీక్షిస్తారు. వడ్డీ ఎవరైనా కడితే దాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అన్ని అయిపోయినంక సమగ్రమైన స్థాయిలో సమీక్ష జరుపుతాం. రుణమాఫీ 100 శాతం అయినంక నేనే రైతులకు లేఖ రాస్తా.

నిధుల సర్దుబాట్లు సర్వసాధారణం ఇన్‌పుట్ సబ్సిడీ, కరువు సహాయ చర్యలకు సంబంధించి రూ.మూడు వేల కోట్లు ఇవ్వమని కేంద్రాన్ని అడిగితే ఒకసారి రూ.900 కోట్లకన్నా కొంచెం ఎక్కువ, మరోసారి రూ.90 కోట్లు ఇచ్చారు. ఎండాకాలంలో తాగునీటికి రూ.1000 కోట్లు అడిగితే రూ.180 కోట్లు వచ్చాయి. ఆ సమయంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండె. దాంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం రూ.500 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి రూ.200 కోట్లు ఇచ్చాం. ప్రజలను కాపాడుకునేందుకు కొంతమొత్తాన్ని ఆ విధంగా వాడుకున్నాం. దీనిపై అప్పట్లో నేను ప్రధాన కార్యదర్శితో సమీక్ష జరిపాను. ఏప్రిల్ నెలలో రైతులకు డబ్బులు ఇచ్చినా అవసరానికి పనికిరావు కాబట్టి రైతులకు అవసరం ఉన్నప్పుడు ఇద్దాం అని చెప్పా. ఈ విధంగా వచ్చిన దాంట్లోనే సర్దుబాటు చేసుకున్నాం. ఇన్‌పుట్ సబ్సిడీ కోసం రూ.703 కోట్లు ఇవ్వటానికి ఆదేశాలు ఇప్పటికే జారీ చేశాం. దీంట్లోంచి రూ.350-400 కోట్ల డబ్బులు విడుదలయ్యాయి కూడా. అప్పుడు ఇవ్వలేదు, ఇప్పు డు ఇచ్చాం. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వచ్చిన డబ్బును సర్దుబాటు చేస్తారు. ప్రతిపక్షనేత జానారెడ్డికి ఈ విషయం తెలుసు. ఆయన ఎన్నో శాఖలకు మంత్రిగా పని చేశారు. అనేక కారణాల రీత్యా కేంద్రప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బు మనకు రాలేదు. గత నెలలో ఇవ్వాల్సింది ఇస్తూ, మరో 500 కోట్లు ఎక్కువ ఇచ్చారు. ప్రతి నెల ఒకటో తారీఖున రూ.995 కోట్లు కేంద్రం నుంచి మనకు అందుతాయి. కొన్నిసార్లు కాస్త తక్కువ వస్తది. అప్పుడు సర్దుబాటు చేస్తుంటాం.

నిజాం ఫ్యాక్టరీకి రైతులు సిద్ధమైతే ఎంత ఖర్చయినా సరే నిజాం షుగర్ ఫ్యాక్టరీని రైతులు స్వయంగా నడుపుతామంటే ఎంత ఖర్చైనా పెట్టి దాన్ని సిద్ధం చేస్తాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టినప్పుడు చంద్రబాబు క్యాబినెట్‌లో నేను మంత్రిగా ఉన్నా. అమ్మకం ప్రతిపాదనను నేను, పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యతిరేకించినం. అయినా ఆగలేదు. అనేకసార్లు దీనిపై మాట్లాడినం. బోధన్‌లో సభ పెట్టినం. 2004లో కాంగ్రెస్-టీఆర్‌ఎస్ కలిసి పోటీచేసి గెలిచాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయినంక ఫ్యాక్టరీని తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరినం. సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌లను కూడా కలిసి వివరించినం. అనంతరం ఒక కమిటీ వేశారు. ఫ్యాక్టరీని తెరువాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. కానీ, పదేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయలేదు. ఆసియాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ ఇది. రైతుల పొలాల్లోకి రైలు పట్టాలు ఇంకా ఉన్నాయి. మీరు దీన్ని తెరిపించకపోగా మాపై నిందలు వేస్తారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తే… క్రషింగ్‌కు 10 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు అవసరం అవుతుంది. కానీ, ఫ్యాక్టరీ మూతపడిన తరువాత మెదక్, నిజామాబాద్, జహీరాబాద్ ప్రాంత రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఫ్యాక్టరీలో మూడు యూనిట్లలో కలిపి లక్ష మెట్రిక్ టన్నుల చెరుకు కూడా క్రషింగ్ కావటం లేదు. మేం ఎన్నికల ప్రణాళికలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలనే ఆలోచన ఉందని చెప్పాంకానీ హామీ ఇవ్వలేదు. ఈ ఫ్యాక్టరీని రైతులు నిర్వహించుకుంటామంటే సరే. మహారాష్ట్రలో రైతులు సహకార పద్ధతిలో ఫ్యాక్టరీలను నడుపుతున్నారు. అక్కడ ఒక్క ఎకరాకు 100-130 టన్నుల చెరుకు పండిస్తారు. మనవారు 30-35 టన్నులే పండిస్తున్నారు. ఈ విషయం తెలిసి ఆ మాత్రం దానికి మీరెందుకు చెరుకు వేస్తారని మహారాష్ట్ర రైతులు అన్నారట.

వారి సహకార వ్యవసాయ పద్ధతుల్ని పరిశీలించేందుకు వ్యవసాయశాఖ మంత్రి పోచారం 400 మంది రైతులను తీసుకుని అక్కడికి వెళ్లివచ్చారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి పూర్తిస్థాయిలో సిద్ధం చేసేందుకు రూ.400-450 కోైట్లెనా ఇస్తామని చెప్పాం. అయినా కూడా మేం నడుపం… ప్రభుత్వమే నడపాలని రైతులన్నారు. రైతుల్లోనే ఆసక్తి లేనప్పుడు క్రషింగ్‌కు చెరుకును ఎక్కడి నుంచి తీసుకొస్తం? అందువల్ల నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు మేం సిద్ధంగా లేం. రైతులు ముందుకొచ్చి నడుపుతామంటే మాత్రం టిప్‌టాప్ చేసి, ఓవరాయిలింగ్ చేసి అందిస్తాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీని రైతులు నడిపించుకోవడానికి సిద్ధంగా లేరు. వారందరితో జీవన్‌రెడ్డి మాట్లాడి ఒప్పిస్తే ఆయన్నే దానికి చైర్మన్‌ను చేస్తాం (ఫ్యాక్టరీని నడిపించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యకు సమాధానంగా సీఎం కేసీఆర్ ఇలా చెప్పారు). మా ఉద్దేశం కూడా ఫ్యాక్టరీని తెరిపించాలనే. ఆంధ్రాబ్యాంక్ వారిని ఇరిగేషన్ కోసం లోన్ అడిగాం. వారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ లోన్ రూ.130 కోట్లు ఉందని, అది కట్టాలని చెప్పారు. ఈ లెక్కన నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంశం తేలితే అన్నీ పరిష్కారం అవుతాయి. ఆ ఫ్యాక్టరీ పరిధిలోని ఎమ్మెల్యేలతో జీవన్‌రెడ్డి మాట్లాడొచ్చు. ప్రభుత్వానికి గుదిబండ కాకుండా దీన్ని చూసుకోవాలి. దీన్ని ప్రారంభించేలోపు మంచి విత్తనాలతో చెరుకు సాగును పెంచాలి. రైతులకు కావాల్సిన లోన్లను వ్యవసాయ శాఖ ఇప్పిస్తుంది. అవసరమైతే ఆల్‌పార్టీ మీటింగ్ పెట్టుకుందాం అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ సమయంలోనే ప్రతిపక్షనేత జానారెడ్డి మాట్లాడుతూ… నాలుగో విడత రుణామాఫీని ఈ సంవత్సరమే చేయాలని, నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరిపించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సీడీఎఫ్ నిధులను ఎమ్మెల్యేలకు ఇవ్వకున్నా ఫర్వాలేదుగానీ రైతులకు రుణమాఫీ చేయాలని అన్నారు. ఏకమొత్తంలో రుణమాఫీ చేయనందుకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.

వినే ఓపిక లేకపోతే ఎట్లా? వ్యవసాయ ఆధునికీకరణ, పంట రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపు అంశాలపై చర్చలో భాగంగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇస్తున్న సమాధానికి కాంగ్రెస్‌సభ్యులు పదేపదే అడ్డుతగలడంపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రుణమాఫీ బకాయిలపై కాంగ్రెస్‌పార్టీ వైఖరి పాడిందే పాటరా పాసుపండ్ల దాసరి అన్న చందంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేసిన పాత బకాయిలు, ఇన్‌పుట్ సబ్సిడీ వివరాలను మంత్రిగారు చెప్పారు. అందులో తప్పేముంది? ఏకకాలంలో రుణమాఫీ అంశాన్ని పట్టుకుని ఖమ్మంలో ఎడ్లబండ్లు పెట్టి రైతు భరోసా యాత్ర అని ఊరేగింపులు చేసిండ్రు. మీ యాత్ర తర్వాతనే ఉప ఎన్నికలు జరిగాయి. ప్రజలు తీర్పు కూడా చెప్పినరు. ప్రభుత్వం చెప్పే సమాధానం వినే ఓపిక లేకపోతే ఎట్లా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు లక్షా 96 డిమాండ్లుంటాయని, వాటన్నింటినీ పూర్తి చేయలేమన్నారు. మరోవైపు, నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం గురించి సీఎం మాట్లాడుతూ… నోట్లరద్దు వల్ల ఏర్పడే ఆర్థికమాంద్యం దెబ్బ జనవరిలో తెలుస్తుందని చెప్పారు.

ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేసిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దానికంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తాము చేపట్టామన్నారు. మైక్రోఇరిగేషన్‌లో ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ ఇస్తున్నామని, బీసీలకు 90 శాతం, పెద్ద రైతులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. పాలీహౌజ్‌లకు కాంగ్రెస్ హయాంలో కేంద్రం ఇచ్చే సబ్సిడీనే ఇచ్చేవారని, తమ ప్రభుత్వంలో 75 శాతం సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరం చుట్టూ 1,000 ఎకరాల్లో పాలీహౌజ్‌లున్నాయని తెలిపారు. మరోవైపు, 40 కోట్ల చేపపిల్లలను చెరువుల్లో వదిలామని, దీనికి రూ.100 కోట్లు ఖర్చయ్యిందని వెల్లడించారు. మిషన్ కాకతీయతో చెరువులన్నీ నిండుకుండల్లా మారాయని సీఎం హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్‌పార్టీ విమర్శలు చేస్తుందన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.