ఆగస్టు 6 వతేదీ ఆచార్య జయశంకర్ గారి జయంతి. ఉదయమే లేచి నియోజకవర్గ కేంద్రం సిద్దిపేటకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాను. అంతలోనే, ఏ వార్తయితే వినకూడదని గత పదిహేను రోజులుగా భగవంతుని ప్రార్థిస్తూవున్నానో అదే వార్త అశనిపాతంలా వినాల్సి వచ్చింది. ఆప్తమిత్రుడు, నిగర్వి, నిరాడంబరుడు, నిబద్ధత కలిగిన ప్రజానాయకుడు సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూసాడనే వార్త వినటంతోనే నిలువెల్లా ఒక అంతులేని ఆవేదన ఆవరించింది. దుఃఖంతో కండ్లు చెమ్మగిల్లుతుంటే నిగ్రహించుకోవటం కోసం నిల్చున్న వాడినల్లా కొద్దిసేపు అట్లా కూర్చుండిపోయాను. ఆత్మవిశ్వాసం నిండిన ముఖం, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరితోనైనా నిర్భయంగా, నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా మాట్లాడే లింగన్న రూపం కండ్లల్ల ఆడుతున్నది. పాత్రికేయునిగా మొదలైన వారి అక్షర ప్రస్థానం.. తెలంగాణ సాధనతో లక్ష్యాన్నిచేరుకుంది. ఆంతలోనే 58 ఏళ్లకే… వారు దూరం కావడం మహావిషాదం.
లింగన్నకు ఉగ్గుపాలతోనే ఉద్యమ పాఠాలు నూరిపోసిన ఊరు చిట్టాపూరు. తను పుట్టి పెరిగిన ఊరు. అక్కడ అణువణువు లింగన్న ధైర్య సాహసాలను తలపోస్తున్నది. చైతన్యానికి మారుపేరైన లింగన్నను ఫ్రీజర్‌లో విగతజీవిగా అచేతనంగా చూడాల్సిరావటం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. నిరంతర ఉద్యమకారుడిగా, శాసనసభ్యుడిగా ప్రజలతో పెనవేసుకున్న లింగన్న జీవితంలోని కష్టనష్టాలన్నిటినీ పంచుకుంటూ సంసారాన్ని దిద్దుకుంటూ, విసుగూ విరామం లేకుండా వచ్చిపోయే వాళ్ళను అరుసుకునే రామలింగన్న భార్య , కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సుజాతక్కకు ఏమిచెప్పి ఓదార్చాలో అర్థం కాని ఆవేదన ఇంకా బాధ పెట్టింది. ఎంతటి అటుపోట్లనయినా చిరునవ్వుతో ఎదుర్కొన్న లింగన్న అనారోగ్యంతో మాత్రం పోరాడలేక ఓడిపోయాడు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న మనిషి కాలికి కురుపై చితికిపోతే ఇన్ఫెక్షన్కు దారి తీసేదాకా అలక్ష్యం చేసిండు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చేర్పించి ప్రతి నిత్యం ఆరోగ్యం గురించి వాకబు చేస్తూనే ఉన్న. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నా, జయించి వస్తాడనే ఒక ఆశ. నేనేకాదు, ఆయన కుటుంబమే కాదు, దుబ్బాక నియోజక వర్గ మంతా అదే ఆశతో ఎదురు చూసింది. కానీ అందరి ఆశలు అడియాసలె అయ్యాయి. లింగన్నను మృత్యువు బలితీసుకుంది.
సిద్దిపేట దుబ్బాక పక్క పక్క నియోజక వర్గాలు, మేమిద్దరం జంట ఎమ్మెల్యేలం. ఆయన నియోజక వర్గ కార్యక్రమాల్లో నేను. సిద్దిపేట నియోజక వర్గాల కార్యక్రమాల్లో తను భాగం పంచుకోవటం మా ఇద్దరికీ పరిపాటి. దుబ్బాక పూర్తిగా గ్రామీణ నియోజక వర్గం. ఆ నియోజక వర్గ ప్రజలు సిద్దిపేటకు రోజూ వచ్చిపోతుంటరు. సాధారణంగా ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో నివసిస్తూ నియోజకవర్గానికి వచ్చిపొతుంటారు. లింగన్న అందుకు మినహాయింపు. తను పాత్రికేయుడిగా ఉన్నప్పుడు, సిద్దిపేట జర్నలిస్టు కాలనీలో ఆనాడు రవాణాశాఖామంత్రిగా కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన స్థలంలోనే కట్టుకున్న సాధారణమైన ఇంట్లోనే చివరిదాకా జీవించాడు. అసెంబ్లీ సమావేశాలో మరేదైనా ముఖ్యమైన పనో ఉంటే తప్ప హైదరాబాద్‌కు వచ్చే వాడు కాడు. అట్లా వచ్చినప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండేవాడు తప్ప తనకు హైదరాబాద్‌లో నివాసమే లేదు. ఉదయం లేచింది మొదలు నియోజకవర్గ ప్రజల ఆపతి, సంపతి అర్సుకోవడం తప్ప తనకు వేరేలోకం లేదు. ఎప్పుడన్నా ఏదన్నా సభకో, జిల్లా సమావేశాలకో రావాలంటే నియోజకవర్గంలో ఎవరిదో చావో, పెండ్లో హాజరు కావాల్సిఉందని రాకుండా వెళ్ళిపోయేది. ప్రజల కోసం పనిచేయటం తన జీవన విధానం, చేసిన పనికి పచారం రావాలని కోరుకునే రకం కూడా కాదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉద్యమం బలపడటానికి, పార్టీ పటిష్టం కావడానికి నియోజక వర్గాలలో అభివృద్ధిని సాధించడానికి మేము జంటగా చేసిన కృషి ఎంతగానో ఉపయోగపడ్డది. మామధ్య ఎన్నడు హెచ్చుతగ్గుల భావన కానీ, వేరే ఏరకమైన అరమరికలు కానీ చోటు చేసుకోలేదు. అందుకే లింగన్న మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఒక మంచి స్నేహితున్ని, ప్రజలకు నిత్యం చేరువగా ఉండే సహచర శాసనసభ్యుణ్ణి కోల్పోవటం నాకు ఒకింత బలం చేజారిపోయినట్టు ఉంది.
1999 నుండీ రామలింగారెడ్డి ఒక జర్నలిస్టుగా నాకు తెలుసు. సిద్దిపేట నియోజక వర్గం ఎన్నికల ఇంచార్జ్‌గా నేను ఉన్నపుడు మొదట తనను కలుసుకున్నాను. జర్నలిస్టు సంఘం నాయకుడిగా, ఉద్యమ కారునిగా అప్పటికే ఆయనకు చాలా గుర్తింపు ఉంది. విద్యార్థిగా ఉన్నప్పుడు రాడికల్ విద్యార్థి సంఘం రాజకీయాలతో ప్రభావితమైన రామలింగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలో వామ పక్ష విప్లవ ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం, మహిళా హక్కుల ఉద్యమం, మద్యపాన వ్యతిరేక ఉద్యమం బలపడటంలో కీలక భూమిక పోషించాడు. అన్యాయం అణచివేతలకు వ్యతిరేకంగా జరిగే అన్ని కార్యక్రమాలలో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆయన ప్రమేయం ఉండేది. జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, మంజీరా రచయితల సంఘం మొదలైన సంస్థల నిర్మాణంలో ఆయనది ప్రముఖ పాత్ర. డివిజన్ స్థాయి జర్నలిస్టుగా ఆయన రాసే వార్తలు తరచుగా ఆయా పత్రికల బ్యానర్ పేజీ వార్తలయ్యేవి. అయితే సంచలనం కోసం కాకుండా ప్రజల హక్కులకోసం ధైర్యంతో వార్తలు రాయటమే ఆయన నైజం. జర్నలిస్టుగా రామలింగారెడ్డి ఆరోజులలో జిల్లాలోని మిగతా పాత్రికేయులకు ఒక రోల్ మోడల్. జర్నలిస్టుల హక్కుల కోసం సాహసోపేతంగా పోరాడిన చరిత్ర తనది. ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటిసారి టాడా చట్టాన్ని ప్రయోగించింది, పాత్రికేయుడిగా ఉన్న రామలింగారెడ్డి మీదనే. అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడమే కాక జర్నలిస్టుల ఉద్యమానికి దారితీసింది. నిత్యం పోలీసులతో సంఘర్షించిన రామలింగారెడ్డి ఎమ్మెల్యే అయినా ఆ స్వభావాన్ని వదులుకోలేదు. పోలీసుల ప్రవర్తన పట్ల కంప్లయింటుతోనే ఉండేవాడు.
రామలింగారెడ్డి మరణ వార్త తెలియగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హుటాహుటిన చిట్టాపూర్ చేరుకున్నారు. రామలింగారెడ్డి మృతదేహం మీద పుష్పగుచ్చాన్ని పెడుతూ ఒక్కసారిగా విచలితులయ్యారు. ఆయన కండ్ల వెంబడి కన్నీరు జారింది. రామలింగారెడ్డిని, లింగం అని ఆత్మీయంగా పిలిచేది ఒక్క కేసీఆర్ గారే. జర్నలిస్టు సంఘం నాయకుడిగా రామలింగారెడ్డి పూనిక వల్లనే అప్పుడు రవాణా శాఖా మంత్రిగా ఉన్న కేసీఆర్ గారు జర్నలిస్టులకు ఫ్రీ బస్ పాసులు మంజూరు చేశారు. సుదీర్ఘకాలంగా ఉన్న అనుబంధం, ఆత్మీయత, తెలంగాణ పోరాట సందర్భంలోని రామలింగారెడ్డితో తనకు ఉన్న జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కళ్ళు వర్షించాయి.
2001లో టిఆర్ఎస్ ఆవిర్భావం నాటికి రామలింగారెడ్డి పాత్రికేయుడిగానే ఉన్నాడు. ఆయనలోని ఉద్యమ స్వభావం ఆయనను టిఆర్ఎస్కు దగ్గర చేసింది. జర్నలిస్టుగా ఉంటూ తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో భాగం పంచుకున్నాడు. అప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న నాయకులతో, అధికారులతో ఘర్షణపడ్డడు. పోలీసుల జులుంను ఎదిరించిండు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నిర్మాణాన్ని ప్రారంభిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వల్ల సిద్దిపేటకు ఉపఎన్నిక ఏర్పడింది. జర్నలిస్టుగా ఉన్న రామలింగారెడ్డి ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను, అక్రమ డబ్బు పంపిణీ మొదలైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాడు. అంతేకాదు తెలంగాణ పట్ల పచ్చి వ్యతిరేకతతో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్దిపేటలో ప్రచారసభ పెడితే, జనం చెప్పులు కోడిగుడ్లు విసిరి తిరగబడేలా చేశాడు ఈ తిరుగుబాటులో తను స్వయంగా ప్రధానపాత్ర పోషించాడు. రామలింగారెడ్డిలో ఉన్న నాయకత్వ లక్షణాలను గుర్తించిన ఉద్యమ నాయకులు కేసీఆర్ 2004 ఎన్నికల్లో ఆయనను అప్పటి దొమ్మాట నియోజకవర్గం (ఇప్పుడు దుబ్బాక ) అభ్యర్థిగా పోటీలోకి దించారు. ఆనాడు, 2004లో లింగన్న దొమ్మాట ఎమ్మెల్యేగా చారిత్రాత్మక విషయాన్ని నమోదు చేశారు. అప్పటి నుంచి మరణించే వరకు ప్రతీ ఎన్నికలో తనదైన ముద్రవేసుకున్నారు. నాలుగుసార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
కేసీఆర్ గారు కేంద్రమంత్రి అయిన నేపథ్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి మరోసారి రాజీనామా చేయటంతో అప్పుడు మళ్ళీ ఏర్పడ్డ ఉపఎన్నికలో టిఆర్ఎస్ పక్షాన నేను బరిలో నిలిచాను. ఆ ఎన్నికలో తన భార్య సుజాతతో కలిసి ప్రచారం చేసిన లింగన్న నా గెలుపు కోసం పాటుపడ్డడు. అక్కడి నుంచీ శాసనసభ్యులుగా మా సాహచర్యం మరింత బలోపేతమైంది. తెలంగాణ ఉద్యమంలోని అనేక కీలక ఘటనలలో ఇద్దరం కలిసి పనిచేశాం. మెదక్, పరకాల, బాన్సువాడ, స్టేషన్ ఘనపూర్ ఉపఎన్నిక మొదలుకొని మొన్నటి నారాయణ ఖేడ్ ఉపఎన్నిక దాకా కలిసి పార్టీని విజయపథంలో నడిపించాం. నేను ఇంచార్జ్‌గా ఉన్న ప్రతి ఉపఎన్నిక సందర్భంలో ఇల్లు, సంసారం విడిచి నెలల కొద్దీ రోజులు ఎన్నికలు జరిగే చోటనే నాతోపాటు కలిసి ఉన్నడు. ఎదుటి వాళ్ళను ఏదైనా చేసి ఒప్పించటంలో లింగన్న అందె వేసిన చేయి. తన నైపుణ్యం ఆ నియోజక వర్గ నాయకులను ఒప్పించి కన్విన్స్ చేసి పార్టీలోకి తీసుకురావడానికి ఉపయోగపడ్డది.
తెలంగాణా ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన మానుకోట ఘటనలో లింగన్న ప్రత్యక్ష భాగస్వామి. నేను లింగన్న దేశపతి సీనన్న ఒకరోజు ముందే బయలుదేరి, పోలీసులకు చిక్కకుండా వరంగల్ దగ్గర చింతగట్టు క్యాంపులో పండుకున్నం. తెల్లవారకముందే లేచి మానుకోట చేరుకున్నాం. అందరూ పాటలు పాడుతూ మాట్లాడుతూ రైల్వే స్టేషన్ దగ్గర కూచుంటే, లింగన్న ఒక ట్రాక్టర్ సంపాయించి, దానిమీద నిలబడి, ఒక కమ్మ కత్తి పట్టుకొని, సమైక్యవాద పార్టీల జండాలు, తోరణాలు కోసి పారేసే పని పెట్టుకున్నడు. మానుకోట బజారులలో ఉన్న సమస్త సమైక్యవాద పార్టీల తోరణాలు కోసి కుప్ప పెట్టిండు. మానుకోట కాల్పులలో గాయపడిన విద్యార్థులను నేను లింగన్న ఇద్దరం మోసుకొచ్చి లింగన్న కార్లనే హాస్పిటల్ కు పంపినం. కారు విద్యార్థుల నెత్తుటితో తడిసింది. ఆ నెత్తురు చూసి ఆవేశపడ్డడు, దుఖపడ్డడు.
ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పెట్టిన ప్రలోభాలకు లింగన్న లొంగలేదు. నిఖార్సయిన ఉద్యమకారుడిగా నిటారుగా నిలబడ్డడు. డబ్బుకు పేదను కావచ్చు, కానీ గుణానికి పేదను కాదని ముఖం మీద గుద్దినట్టు చెప్పిండు. ఉద్యమ ద్రోహులను ఎండగట్టడంలోనూ లింగన్న శైలి చాలా పదునైంది. విభిన్నమైన తన పదజాలంతో లింగన్న విరుచుకు పడితే, ద్రోహుల గుండెల్లో గునపాలు దించినట్లు ఉండేది.
2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన లింగన్న పునర్నిర్మాణ యజ్ఞంలోనూ చిత్తశుద్ధితో మమేకమయిండు. తన నియోజక వర్గంలో మిషన్ భగీరథ పనులను వేగంగా పూర్తి చేసిండు. దుబ్బాక పట్టణాన్ని కేసీఆర్ గారు చదువుకున్న పాఠశాలను గొప్పగా తీర్చిదిద్దిండు. 800 డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేశాడు. వీటిని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించాలని కలలు కన్నాడు. అంతేకాదు, మిషన్ కాకతీయ పథకం ద్వారా జరిగిన కృషి రికార్డు కావాలని వర్దెల్లి వెంకటేశ్వర్లు అనే పాత్రికేయున్ని పురమాయించి పుస్తకం రాయించిండు. ప్రజల మధ్య నీళ్ళల్లో చేప వలే ఉంటూ ఇటు ప్రజల మెప్పును, అటు ముఖ్యమంత్రిగారి మెప్పును సంపాదించిండు. దుబ్బాక నియోజక వర్గంలో ఎదురులేని నాయకునిగా ప్రజల గుండెల్లో స్థిరమైన స్థానం సంపాదించుకున్నడు.
జీవితంలో వామపక్ష రాజకీయలనుంచి స్వీకరించిన విలువలను కొనసాగిస్తూ వచ్చాడు. తాను ఎట్లా అయితే సంప్రదాయ పద్ధతికి భిన్నంగా, ప్రజాకవి కాళోజీ, కేసీఆర్ గార్ల చేతుల మీదుగా సభావివాహం చేసుకున్నాడో… తన బిడ్డకు, కొడుకుకు అదే విధంగా కేసీఆర్ గారి చేతుల మీద సభావివాహాలనే జరిపించాడు. ప్రజా ఉద్యమాల ప్రభావాల లోంచి లింగన్న వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది. తెలంగాణ సృష్టించిన ఒక చైతన్యవంతమైన తరానికి ప్రతినిధి లింగన్న. అవినీతి, అక్రమార్జనలకు దూరంగా ఉంటూ, సామాన్యుల వైపు నిలబడే లింగన్న లాంటి నాయకులు మళ్ళీ తయారవాలంటే, ఆ చైతన్య బీజాలు మొలకెత్తే వాతావరణాన్ని సమాజంలో కాపాడాలి.
కరోనా భయాన్ని పక్కన పెట్టి వేలాదిమంది ప్రజలు రామలింగారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన అంతిమ యాత్రకు భుజం కాసి నేను, మెదక్ ఎం పి ప్రభాకర్ రెడ్డి ఇద్దరం ఆయన పట్ల మాకున్న గౌరవాన్ని ప్రకటించుకున్నాం. జీవితమంతా ప్రజలకోసం సంఘర్షించిన లింగన్న, ప్రజాక్షేత్రంలో ఎగిసిపడిన ప్రతి ఉద్యమానికి ప్రతిస్పందించి భాగం పంచుకున్న లింగన్న, ప్రాణం మీదికి వచ్చినా సరే, ప్రతిఘటన మాత్రం మానని లింగన్న, తెలంగాణ పోరాటానికి పెన్నుదన్నుగా, వెన్నుదన్నుగా నిలిచినా లింగన్న, శాసన సభ్యునిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన లింగన్న అరవై ఏండ్లు కూడా నిండకముందే అర్ధాయుష్కుడిగానే తన జీవన ప్రయాణం ముగించాడనే నిజం మాత్రం మింగుడు పడటం లేదు. ఏమో ఎప్పటిలాగే తనదైన చెదరని చిరునవ్వుతో ఆత్మీయంగా ఎదురొస్తాడనే అనిపిస్తున్నది.
(నేడు రామలింగారెడ్డి దశదినకర్మ)
వ్యాసకర్త: శ్రీ తన్నీరు హరీశ్ రావు, ఆర్ధికశాఖ మంత్రి వర్యులు