కలలు కనేందుకు కూడా సాహసం కావాలి. ఆ కలలు సామూహికమైనవి అయినప్పుడు, అవి సకారాత్మక ఆలోచనలతో నిరంతరం చలనశీలమై ఉండాలి. కలలు నిజం చేసుకునేందుకు బుద్ధికుశలతతో కూడిన కార్యాచరణ ఉండాలి. ఆచరణలో అడుగడుగునా ఎదురయ్యే అడ్డంకులను అధిగమించే ధైర్యసాహసాలూ ఉండాలి. అప్పుడు మాత్రమే అద్భుతమైన కలలు కని, ఆ కలలను సాకారం చేసుకుంటే అది ఓ కొత్త చరిత్రకు అంకురార్పణ అవుతుంది. అది కొందరికే సాధ్యమవుతుంది. ఆ చరిత్ర నిర్మాత కేసీఆర్. ఆయన కలల పంట తెలంగాణ రాష్ట్రం. చీకటిలోనూ వెలుగును వెతకగలిగే దూరదృష్టి, ఓటమి అంచుల్లోనూ గెలుపు పగ్గాలను పట్టుకోలిగే సాహసం కేసీఆర్ సొంతం. తాను విశ్వసించిన దానిని విజయతీరాలకు చేర్చేదాకా విశ్రమించని పరిశ్రమ.. అన్నింటికీ మించి, తనను నమ్మి అధికారమిచ్చిన ప్రజల రుణం తీర్చుకునేందుకు అహర్నిశలు తననుతాను అంకితం చేసుకునే నిబద్ధతే తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానాన్ని పదిలంగా ఉంచుతుంది.
కల కనేందుకు కూడా ఇతరులు సాహసించని కాలంలో కలలోనూ, మెలకువలోనూ తెలంగాణనే స్వప్నించినవాడు కేసీఆర్. అనుకున్నది సాధించి ప్రజలకు కానుకగా ఇచ్చాడు. గొప్ప గొప్ప ఆవిష్కరణలు కూడా, అంతవరకు ఇతరులు ఆలోచించడానికైనా అవకాశం లేని సమయంలో, అసాధారణమైన ఆలోచనలతో ఒక కొత్త ఆవిష్కరణను సాధ్యం చేసిన పిదప, దాని ఫలితాలు అనుభవిస్తున్న వారికి కూడా.. ఆ తర్వాత కాలంలో అది మామూలు విషయంగానే మారిపోతుంది. దానిని సాధించడంలో ఆవిష్కర్త పడ్డ పురిటినొప్పులు, అనుభవించిన కష్టాలు, చేసిన త్యాగాలు అంతగా అందరికి పట్టవు. ఆ ఆవిష్కర్త మాత్రం, తన త్యాగాల చెట్టుకు కాసిన ఫలాలను అనుభవిస్తున్న ప్రజలను చూసి, తన జీవితానికి అది చాలు అన్న సంతృప్తి చెందుతాడు.
అచ్చంగా ఇప్పటి తెలంగాణ పరిస్థితి అలాగే ఉన్నది. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న తెలంగాణ ఉద్యమ వ్యూహరచన, ఎత్తుగడలు, విజయాలు వైఫల్యాలలో పొంగిపోని, కుంగిపోని స్థితప్రజ్ఞతతో కూడిన నాయకత్వ చైతన్యం ఆయనది. కుట్రలన్నింటినీ తుత్తునియలు చేసి అరువై ఏండ్ల కలను సాకారం చేసి, సాధించుకున్న తెలంగాణను కోరుకున్న విధంగా తయారుచేసుకుంటున్న తరుణంలో, చేసిన త్యాగాలన్నింటినీ తక్కువ చేస్తూ, గాయాలేమీ లేకుండానే తెలంగాణ గాల్లోంచి ఊడిపడ్డట్టు, తప్పుడు ప్రచారాలతో స్వార్థపర రాజకీయశక్తులు ప్రజలను నమ్మించే చౌకబారు ప్రయత్నాలు చేస్తున్నాయి. అసత్యానికి అలజడి ఎక్కువే కానీ, సత్యాన్ని తొక్కిపెట్టేంత శక్తి దానికి లేదు.
ప్రజల భవితవ్యాన్ని మార్చలిగే శక్తి రాజకీయ అధికారానికి మాత్రమే ఉంటుంది. అందివచ్చిన అధికారాన్ని ఎందరో స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగిస్తుంటే, కొందరు మాత్రమే ప్రజలిచ్చిన అధికారాన్ని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వినియోగిస్తారు. విజ్డవ్ుతో కూడిన ఒక విజన్‌తో సంపూర్ణ మార్పు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్న వారు కేసీఆర్. ఐదేండ్ల పదవీ కాలాన్ని ఆయన ప్రజల కోసం కంటున్న ప్రతి కలనూ నిజం చేసుకునే మహత్తర అవకాశంగా భావిస్తూ, తెలంగాణ ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత, వర్తమాన, భవిష్యత్‌ల మేళవింపుగా ప్రణాళికలను అమలుచేస్తున్నారు. ప్రజలకు దక్కుతున్న ఫలితాలను చూసి, సంతృప్తి పొందుతున్నారు కేసీఆర్.
ప్రభుత్వ పనితీరుకు గీటురాయి అభివృద్ధి, శాంతిభద్రతలే. అభివృద్ధి ఏ ఒక్క రంగంలోనో కాకుండా అన్నిరంగాల్లో సంపూర్ణ అభివృద్ధి కోసం రాష్ట్ర ఆర్థిక వెసులుబాటుకు లోబడి, ప్రాధాన్య క్రమంలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని అమలుచేస్తున్నారు. వ్యవసాయంప్రధాన రంగమన్నది అందరికీ తెలిసిందే. పైగా కేసీఆర్ రైతు పక్షపాతి. అందుకే వ్యవసాయరంగంలో మునుపెన్నడూ, ఏ ప్రభుత్వాలు అమలుచేయనన్ని గొప్ప పథకాలు కేసీఆర్ అమలుచేస్తున్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు చాలు తెలంగాణ బతుకుచిత్రాన్ని పరి పూర్ణంగా మార్చివేయడానికి. నీళ్లు లేని గోసను, బీడు భూముల దుఃఖాన్ని, వలస కుటుంబాల వేదనలను ఎల్లబోసుకున్నం. ఆ కష్టాలన్నింటికీ శాశ్వత పరిష్కారంగా వ్యవసాయ అభివృద్ధి కోసం సమగ్ర పథకాలను అమలు చేస్తున్నారు. రైతుకు కావలసింది నీళ్లు, కరంటు, పెట్టుబడి సాయం. కాళేశ్వరం ప్రాజెక్టుతో రెండు పంటలకు పుష్కలంగా నీళ్లు అందుతాయి. పాలమూరు రంగారెడ్డి, డిండి ఇతర ప్రాజెక్టులు కూడా పూర్తిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఉచిత కరంటు లభిస్తున్నది. రైతుబంధు పథకం ద్వారా పంట సాయ మూ అందుతున్నది. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే, ఆ కుటుంబం గాల్లోని దీపంలా మారకుండా, వాళ్లకు రక్షణ కవచంలా 5 లక్షల బీమాను వర్తింపజేయడం రైతుల భద్రమైన జీవితానికి ఆధార భూతాలు.
వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగాలైన పాడి,పౌల్ట్రీ పరిశ్రమ, చేపలపెంపకం, మాంసం ఉత్పత్తి మొదలు అన్నిరంగాలకు ప్రత్యేక పథకాలు అమలు చేయడం ద్వారా చేనుకు నీరు, చేతికి పని దొరికి స్వయంపోషకంగా ఎదిగే పరిస్థితి నెలకొన్నది. వలసలు తగ్గిపోయాయి. వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. ఒకప్పుడు వ్యవసాయం దండగ అనుకున్న రైతు నేడు గుండెలపై చేయి వేసుకొని వ్యవసాయాన్ని నమ్ముకొని భద్రంగా ఉంటున్నాడు. ఏ ఆర్థిక,సామాజికవేత్తలు అధ్యయనం చేసినా ఈ వాస్తవ ఫలితాలు వెల్లడవుతాయి. కల్యాణలక్ష్మి ద్వారా అందుకుంటున్న సాయం, కేసీఆర్ కిట్ ద్వారా లభిస్తున్న ఊరట, గురుకులాల ద్వారా తమ పిల్లలకు దక్కుతున్న మెరుగైన విద్య.. లబ్ధి పొందుతున్న గ్రామీణ నిరుపేదలను కదిలించి చూస్తే తెలుస్తుంది. అవి వారి దైనందిన జీవితాల్లో ఎట్లా ఆసరాగా నిలుస్తున్నాయో.
వ్యవసాయం తర్వాత రాష్ట్ర ఆర్థికస్థితికి ఆయువుపట్టయిన పరిశ్రమలు, ఐటీ, ఫార్మా మొదలైన రంగాలకు ప్రత్యేకమైన పాలసీలు రూపొందించి అమలుచేస్తున్న విధానాలు ఇటు కేంద్రప్రభుత్వంతో పాటు, అటు అంతర్జాతీయంగా పలుదేశాల మన్ననలు పొంది, పెట్టుబడులు పెట్టేందుకు దోహదకారిగా మారాయి. గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం సహకార పొదుపు సంఘాల ద్వారా సాధిస్తున్న పురోగతి గణనీయమైనది. రాష్ర్టాలవారీగా చూసినప్పుడు అనేక రంగాలలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిన అధికార గణాంకాలు అద్దంలా మన ముందు కనిపిస్తున్నాయి.
ఇకపోతే, మత సామరస్యం, శాంతిభద్రతల విషయంలో గతంతో పోల్చినప్పుడు ఎంత మెరుగైన స్థితిలో రాష్ట్రం ఉన్నదో అందరికీ తెలిసిన విషయమే. అయినా రంధ్రాన్వేషణ చేసి రాజకీయ లబ్ధికోసం ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలన్న శక్తులు ఎల్లప్పుడు ఉండనే ఉంటాయి. సంక్షేమ పథకాలు అమలుచేసినా, ప్రజలను బిచ్చగాళ్లను చేస్తున్నారని విమర్శిస్తున్న ప్రబుద్ధులున్న కాలం ఇది. నిజానికి దశాబ్దాల వెనుకబాటు తనాన్ని అనుభవించిన తెలంగాణకు తక్షణ లబ్ధిగా పింఛన్లు, దీర్ఘకాలిక ప్రణాళికలుగా ప్రాజెక్టులు ఇతర పథకాలను రూపొందించుకొని, రెండు టర్మ్‌ల పూర్తికాలాన్ని లెక్కలోకి తీసుకున్నా పదేండ్ల అతికొద్ది సమయంలోనే తెలంగాణ అన్నిరంగాల్లోనూ తన స్వీయ అస్తిత్వాన్ని ఘనంగా ప్రకటించుకున్నది.
ఇప్పుడు కొత్త బిచ్చగాళ్ల కాలం మొదలైంది. ఏనాడూ తెలంగాణ కోసం త్యాగాలకు సిద్ధపడనివాళ్లు, తెలంగాణ కోసం నిలబడాల్సిన సమయంలో తూతూ మంత్రంగా స్పందించినవాళ్లు అధికార లాలసతో అవాకులు, చెవాకులు పేలుతున్నారు. అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. కానీ, తెలంగాణతనమంటే నిజాయితీకి నిలువెత్తు అద్దం. తెలంగాణ ప్రజలు పోరాట చైతన్యాన్ని, ధర్మం వైపు నిలబడే తత్వాన్ని కలిగి ఉన్నవాళ్లు. మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకొనే రకం కాదు. ప్రాణత్యాగాలతో, దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న తెలంగాణను ఈనగాచి నక్కలపాలు కానివ్వరు. ఎవరి మానవీయ ఆలోచనలతో అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కుతాయో, ఎవరి రాజకీయ విజ్ఞత తెలంగాణకు రక్షణ కోటగా ఉంటుందో, ఎవరి అంకితభావం రాష్ట్ర రూపురేఖలను మారుస్తుందో ప్రజలకు బాగా తెలుసు.
చీకటిలోనూ వెలుగును వెతకగలిగే దూరదృష్టి, ఓటమి అంచుల్లోనూ గెలుపు పగ్గాలను పట్టుకోలిగే సాహసం కేసీఆర్ సొంతం. తాను విశ్వసించిన దానిని విజయతీరాలకు చేర్చేదాకా విశ్రమించని పరిశ్రమ అన్నింటికీ మించి, తనను నమ్మి అధికారమిచ్చిన ప్రజల రుణం తీర్చుకునేందుకు అహర్నిశలు తననుతాను అంకితం చేసుకునే నిబద్ధతే తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానాన్ని పదిలంగా ఉంచుతుంది. ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే శక్తులు ఏ కాలంలోనైనా పొంచే ఉంటాయి. అయితే ఎవరు ఎన్నిరకాల కుయుక్తులు పన్నినా తన ప్రజలకు ఏం కావాలో కేసీఆర్‌కు తెలుసు. తమ జీవితాలకు భద్రతనిచ్చే నాయకుడెవరో ప్రజలకు తెలుసు. ప్రజల విశ్వాసమే టీఆర్ఎస్కు రక్ష.
(వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు) నారదాసు లక్ష్మణ్‌రావు