Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

10 లక్షల మందితో తెలంగాణ విజయగర్జన విపక్షాలకు రీసౌండ్‌

-హుజూరాబాద్‌లో గెలిచేది మనమే
-రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను కొట్టే శక్తి ఎవరికీ లేదు
-దేశంలో ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలు
-మనల్ని చూసి పాఠాలు నేర్చుకొంటున్న దేశం
-మనం చేసిన పనులు ప్రజలకు చెప్పుకోవాలె
-ముందస్తు ఆలోచనే లేదు కేంద్రంలో మనమే కీలకంగా మారుతాం
-ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉన్నది
-మిగిలిన పనులు ఈలోపు చేసుకొందాం
-ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం టీఆర్‌ఎస్‌
-విజయగర్జన సభ విజయవంతానికి రోజూ
-20 నియోజకవర్గాల్లో సన్నాహక భేటీలు
-ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీలో కేసీఆర్‌
-26 లేదా 27న హుజూరాబాద్‌కు సీఎం!

ఇక ఓపిక పట్టేది లేదు..
ఇష్టారీతిగా పిచ్చిప్రేలాపనలు పేలుతున్నవారికి ఎక్కడికక్కడ గట్టిసమాధానాలు చెప్పాలి. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా, రాష్ట్రం అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలవాలన్న తపనతో మనం పనిచేసుకుంటూ పోతున్నాం. అందుకే ఇప్పటి దాకా కొంత సహనం.. ఓపికతో ఉన్నాం. మనం ఓపికతో ఉన్నాం కదా అని ఎవడు పడితే వాడు.. ఏది పడితే అది మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఇక ఓపిక పట్టాల్సిన అవసరం లేదు. అన్ని స్థాయిల్లో వాటికి దీటుగా సమాధానం చెప్పాలి. ఆ సమాధానం రీ సౌండ్‌ వచ్చేలా ఉండాలి. మరోసారి ఎవరైనా మనల్ని వేలెత్తి చూపాలంటే జంకు రావాలి. ఆ విధంగా మనం మన శ్రేణుల్ని సమాయత్తం చేయాలి.

ముందస్తుకు వెళ్లేది లేదు..
గతంలో మాదిరిగా అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు. ప్రభుత్వానికి ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉన్నది. ఈలోపు మనం చేయాల్సిన పనులుఉన్నాయి. వీటిని పూర్తి చేసుకుందాం. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో మనమే కీలకపాత్ర పోషించేస్థాయికి ఎదుగుతాం. అందులో ఎవరికీ అనుమానం అక్కరలేదు. గతంలో అక్కడక్కడా చిన్నచిన్న పొరపాట్లు జరగడం వల్ల కొన్ని సీట్లు కోల్పోయాం. ఈసారి ఆ ప్రసక్తే ఉత్పన్నం -ఎంపీలు, ఎమ్మెల్యేల ఉమ్మడి భేటీలో టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌

టీఆర్‌ఎస్‌ పార్టీ ద్వి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వచ్చే నెల 15వ తేదీన వరంగల్‌లో పది లక్షల మందితో తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహిస్తామని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. విపక్షాలకు దిమ్మతిరిగేలా సభను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. 20 ఏండ్లలో టీఆర్‌ఎస్‌ సాధించిన విజయాలను ఈ సభ నుంచే ప్రజలకు సగర్వంగా చెప్పుకోవాలని అన్నారు. ఇష్టారీతిగా పిచ్చిప్రేలాపనలు పేలుతున్నవారికి ఎక్కడిక్కడ గట్టిసమాధానాలు చెప్పాలన్న సీఎం.. ఆ సమాధానం ప్రతిపక్షాలకు రీ సౌండ్‌ వచ్చేలా ఉండాలని చెప్పారు. ఈ సారి ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని స్పష్టంచేశారు.

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉన్నందున చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసుకొందామని పార్టీ చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం కేసీఆర్‌ ఉమ్మడి సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంతగా 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీగా టీఆర్‌ఎస్‌ ఎదిగిందని సీఎం చెప్పారు. ఇప్పటికే ఒకదశలో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయిందని, మిగిలిన అధ్యక్ష ఎన్నికలు, ఈ నెల 25న నిర్వహించే ప్లీనరీ, వచ్చే నెల 15న వరంగల్‌లో నిర్వహించే తెలంగాణ విజయగర్జన బహిరంగ సభ ఏర్పాట్లు, చేయాల్సిన కసరత్తుపై పార్టీ శ్రేణులకు వివరించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సీఎం కేసీఆర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

అద్భుత ఫలితాలు సాధించాం
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఏర్పడిన టీఆర్‌ఎస్‌పై ప్రజల విశ్వాసం రోజురోజుకు పెరుగుతున్నది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీలోని ప్రతీ ఒక్కరిపై ఉన్నది. అనేక ఆటుపోట్లు, సవాళ్లను ఎదుర్కొని రాష్ర్టాన్ని సాధించుకున్నాం. కష్టపడి సాధించుకున్న రాష్ర్టాన్ని పట్టుబట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. మిగతా రాజకీయ పార్టీలకు అధికారమే పరమావధి.. టీఆర్‌ఎస్‌కు మాత్రం మన ప్రజలను, రాష్ర్టాన్ని బాగుపరుచుకోవటమే గురుతర బాధ్యత. రాష్ట్రం సాధించిన ఏడేండ్లలో అన్ని రంగాల్లో అద్భుత ఫలితాలు సాధిస్తున్నాం. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి. వ్యవసాయ రంగంలో ఇప్పటికే సుస్థిరత సాధించాం. ఆర్థికంగా పురోగమిస్తున్నాం. గ్రామాల్లో బతుకుదెరువు లేక పట్టణాలకు వలస వెళ్లిన ప్రజలు ఇప్పుడు వ్యవసాయ సుస్థిరత సాధించటం వల్ల గ్రామాలకు మళ్లీ సంబురంగా వెళ్తున్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలను అమలు చేసుకొంటున్నాం. తెలంగాణ సాధించిన ఈ అద్భుత విజయాలను దేశం ఆసక్తిగా గమనిస్తున్నది. గతంలో చేర్యాల, బచ్చన్నపేట వంటి అనేక ప్రాంతాల్లో ఇండ్లల్లో ముసలివాళ్లు మాత్రమే ఉండేవారు. మిగతావాళ్లంతా బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వచ్చేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారింది. నీళ్ల సమస్య తీరింది. కరెంటు సమస్య తీరింది. చెరువులు పునరుద్ధరించుకొని, సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసుకొని పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. హైదరాబాద్‌ సహా దేశంలో ఎక్కడెక్కడో ఉన్న మన బిడ్డలు వారి సొంత ఊళ్లకు వచ్చి మంచిగా ఫాం హౌజ్‌లు కట్టుకొని సంతోషంగా ఉండే వాతావరణాన్ని ఏర్పాటుచేసుకొన్నాం. ఇది మనందరికీ గర్వకారణం.

విపక్షాలకు రీ సౌండ్‌ రావాలె..
రాష్ట్రంలో కొన్ని పార్టీల నేతలు ఇష్టారీతిగా పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. వారికి ఎక్కడికక్కడ గట్టిగా సమాధానాలు చెప్పాలి. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా మనం పనిచేస్తూ పోతున్నాం. రాష్ట్రం అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలవాలన్న తపనతో పనిచేస్తున్నాం. అందుకే ఇప్పటిదాకా కొంత సహనం, ఓపికతో ఉన్నాం. మనం ఓపికతో ఉన్నాం కదా అని ఎవడు పడితే వాడు. ఏది పడితే అది మాట్లాడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇక మనం ఓపిక పట్టాల్సిన అవసరంలేదు. అన్ని స్థాయిల్లో వారికి దీటుగా సమాధానం చెప్పాలి. ఆ సమాధానం రీ సౌండ్‌ వచ్చేలా ఉండాలి. మరోసారి ఎవరైనా మనల్ని వేలెత్తి చూపాలంటే జంకు రావాలి. ఆ విధంగా మనం మన శ్రేణులను సమాయత్తం చేయాలి. ప్రభుత్వం, నాయకులపై కుక్కలు. నక్కలు మొరిగినట్టు మొరిగేవాళ్ల నోళ్లు మూయించాలి.

విపక్షాలకు దిమ్మతిరిగేలా విజయగర్జన..
వచ్చే నెల 15న వరంగల్‌లో తెలంగాణ విజయగర్జన సభను అద్భుతంగా నిర్వహించుకుందాం. దీని కోసం ఎక్కడిక్కడ నాయకులు, కార్యకర్తలు కథానాయకులై పనిచేయాలి. 14 ఏండ్ల తెలంగాణ పోరాటం, ఏడేండ్లలో రాష్ట్రం సాధించిన ఘన విజయాలను ఈ సభ ద్వారా ప్రజల ముందు ఉంచేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించుకోవాలి.

గ్రామ పార్టీ అధ్యక్షులు, ఆ గ్రామసర్పంచ్‌ నేతృత్వంలో ప్రతీ గ్రామం నుంచి వాహనాలను సమకూర్చుకొని.. గ్రామ బ్యానర్‌తో విజయగర్జన సభకు తరలివచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. మన విజయాలను చూసి పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల ప్రజలు తాము కూడా తెలంగాణలో కలుస్తామని బాహాటంగా ప్రకటిస్తున్నారు. ‘పార్టీ బీ-ఫాం ఇవ్వండి చాలు.. గెలిచి వస్తాం’ అంటున్నారు. అటువంటి ఘనతను టీఆర్‌ఎస్‌ సాధించామని ప్రతి గులాబీ సైనికుడూ సంతోషంగా చెప్పుకొనే స్థితికి చేరాం.

నిరంతర శిక్షణా శిబిరాలు..
విజయగర్జన సభ తర్వాత జిల్లా పార్టీ కార్యాలయాలను ప్రారంభించి, అన్నిస్థాయిల్లో పార్టీ శ్రేణులకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తాం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా అన్ని స్థాయిల నేతలు శిక్షణలో పాల్గొని పార్టీని పటిష్ఠం చేసుకోవటానికి చర్యలు తీసుకోవాలి.

కేంద్రంలో మనదే కీలక పాత్ర
గతంలో మాదిరిగా అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు వెళ్లే ఆలోచన లేదు. మన ప్రభుత్వానికి ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉన్నది. ఈలోపు మనం చేయాల్సిన పనులున్నాయి. వీటిని పూర్తి చేసుకుందాం. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో మనమే కీలకపాత్ర పోషించేస్థాయికి ఎదుగుతాం. అందులో ఎవరికీ అనుమానం అక్కరలేదు. గతంలో అక్కడక్కడా చిన్నచిన్న పొరపాట్లు జరగడం వల్ల కొన్ని సీట్లు కోల్పోయాం. ఈసారి ఆ ప్రసక్తే ఉత్పన్నం కానివ్వం. అనేక కష్టాలు పడి, అవమానాలు ఎదుర్కొని, ఇవాళ ఈ స్థాయికి వచ్చాం. ప్రజల దీవెనలతో దీన్ని ఇలాగే కాపాడుకొంటూ ముందుకు సాగుదాం. మనల్ని కొట్టే శక్తి ఎవరికీ లేదు. దేశమే ఇవాళ తెలంగాణను అనుకరించే పరిస్థితిని సృష్టించుకొన్నాం. దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో సంతోషం తొణికిసలాడుతున్నది. భవిష్యత్తులో అన్ని వర్గాలకు ఇది విస్తరించే అవకాశాలున్నాయని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నట్టు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

రోజుకో 20 నియోజకవర్గాల
నేతలతో సన్నాహక సమావేశాలు తెలంగాణ విజయగర్జన సభను విజయవంతం చేయటానికి అన్ని నియోజకవర్గాల నేతలు సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ సభ ఏర్పాట్లను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పర్యవేక్షిస్తారని చెప్పారు. కేటీఆర్‌ సారథ్యంలో సోమవారం నుంచి తెలంగాణ భవన్‌లో రోజుకో 20 నియోజకవర్గాల నేతలతో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

ఆరువేల మందితో ప్లీనరీ
ఈ నెల 25న హైదరాబాద్‌లో నిర్వహించే టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఆరువేల మందితో జరిగే ఈ సభకు ఆహ్వానాలు ఉన్న నేతలే హాజరవుతారని చెప్పారు. అదేరోజు పార్టీ అధ్యక్ష ఎన్నిక కూడా ఉన్నందున ఎలక్ట్రోరల్‌లో సభ్యులుగా ఉన్నవారే ఈ సభకు హాజరు అవుతారని, ఆహ్వానాలు లేనివారు రారని తెలిపారు. ప్లీనరీ ఏర్పాట్లలో ఏ లోటు రాకుండా చూడాలని నేతలకు సూచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, రైతు బంధు సమితుల అధ్యక్షులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు.. ఇలా ప్రతి నియోజకవర్గం నుంచి 20 నుంచి 25 మంది హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

హుజూరాబాద్‌లో మనదే విజయం
హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీయే గెలుస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇప్పటికే అనేక సర్వేలు టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు తేల్చిచెప్తున్నాయని వెల్లడించారు. అన్ని సర్వేల్లోనూ టీఆర్‌ఎస్‌కు గెలుపు అవకాశాలు 13 శాతం ఎక్కువగా ఉన్నాయని తేలినట్టు చెప్పారు. ఎవరెన్ని చెప్పినా అక్కడ ఎగిరేది గులాబీ జెండాయేనని ధీమా వ్యక్తంచేశారు. పరిస్థితులను బట్టి అవసరమైతే ఈ నెల 26 లేదా 27 తేదీల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గంతో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.