Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

111సీట్లూ మనవే

-ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్ ప్రభంజనం -బీజేపీ, టీడీపీలకు సున్నా.. టీఆర్‌ఎస్ సర్వే వివరాలు ప్రకటించిన సీఎం కేసీఆర్ -ఎమ్మెల్యేల్లో 98 శాతంతో సీఎం కేసీఆర్‌కు ప్రథమస్థానం.. రెండో స్థానంలో కేటీఆర్, మూడో స్థానంలో హరీశ్‌రావు -ప్రజాదరణ పొందిన ప్రభుత్వ పథకాలు: సాదా బైనామా, గొర్రెల పెంపకం, ఎకరానికి రూ.8వేలు, కేసీఆర్ కిట్స్ -ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపరుచుకోవాలి -ఆందోళన వద్దు.. సిట్టింగ్‌లందరికీ టికెట్లు -ఎన్నికల ఖర్చుపై బేఫికర్.. పార్టీయే ఇస్తుంది -త్వరలో జిల్లాలవారీగా ఎమ్మెల్యేలతో భేటీ అవుతా -జూలైలో నియోజకవర్గాల పునర్విభజన -ప్రక్రియ మొదలయ్యే అవకాశం -వచ్చే ఎన్నికల్లో మోదీ హవా ఉండకపోవచ్చు -టీఆర్‌ఎస్ పార్లమెంటరీ, శాసనసభా పక్ష సమావేశంలో -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడి -ఇక మండల స్థాయిలో పార్టీ కుటుంబ సమ్మేళనాలు -పది రోజులకోసారి జిల్లాస్థాయిలో పార్టీ ముఖ్యుల భేటీలు -రాష్ట్రపతి ఎన్నికపై నిర్ణయాధికారం కేసీఆర్‌కే ఇస్తూ తీర్మానం

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్ పార్టీకి 111 సీట్లు వస్తాయని టీఆర్‌ఎస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైందని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఎమ్మెల్యేలు, పార్టీ పనితీరుపై పార్టీ ఇటీవల జరిపించిన సర్వే వివరాలను ఆయన శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ, శాసనసభా పక్ష సమావేశంలో ప్రకటించారు. సర్వే ఫలితాలను బట్టి వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు కేవలం ఎనిమిది సీట్లకే పరిమితమవుతాయని, ఎంఐఎం ఆరు, కాంగ్రెస్ రెండు సీట్లలో గెలిచే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారు. బీజేపీ, టీడీపీ తదితర పక్షాలకు ఒక్కసీటు రాదని స్పష్టం చేశారు. సర్వేలో పార్టీ ఎమ్మెల్యేల పనితీరు, వారికి లభించిన ప్రజాదరణ వివరాలను కూడా కేసీఆర్ తెలియచేశారు. ఇందులో అత్యధిక ప్రజాదరణ పొందిన ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ నిలిచారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో 98 శాతం ప్రజాదరణ ఉన్నట్లుగా సర్వేలో వెల్లడైంది. తరువాతి స్థానంలో సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ 91 శాతంతో ఉన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు 88 శాతంతో మూడవ స్థా నంలో ఉండగా 86 శాతంతో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్య నాలుగో స్థానంలో నిలిచారు.

త్వరలో ఎమ్మెల్యేలతో భేటీలు సర్వే ప్రకారం పార్టీ ప్రతినిధులందరి పనితీరు బాగానే ఉందని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు తమ పనితీరును, ప్రజాదరణను ఇంకా పెంచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలందరిని పేరుపేరున పిలిచి జిల్లాల వారీగా సర్వేలో ఎమ్మెల్యేల వ్యక్తిగత పనితీరు, పార్టీతీరుపై వచ్చిన ఫలితాలను తెలియచేశారు. త్వరలోనే జిల్లాలవారీగా ఎమ్మెల్యేలతో భేటీలు జరుపుతామని ఆయన చెప్పారు. ఒక్కొక్క రోజు 2-3 జిల్లాల నేతలతో భేటీ అవుతానని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెల్సింది. ఎక్కడైనా పార్టీ బలహీనంగా ఉన్నట్లయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని, ఆయా నియోజకవర్గాల్లో పర్యటనలు కూడా జరుపుతానని సీఎం తెలిపారు.

సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు.. రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తామని, ఎమ్మెల్యేలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కేసీఆర్ తెలిపారు. సర్వేలో వెనుకబడిన ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం కావాలని, బాగా కష్టపడాలని ఉద్బోధించారు. జూలై నెలలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కేంద్రం ప్రారంభించే అవకాశం ఉన్నదన్నారు. మరో 34 అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నందున నియోజకవర్గ స్థాయి నేతలను రాబోయే నియోజకవర్గాల్లో సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉన్నదన్నారు.

మీ ఎన్నికల ఖర్చు పార్టీదే.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు చిత్తశుద్ధితో, అవినీతిరహితంగా పనిచేయాలని కేసీఆర్ సూచించారు. ప్రజలు మనపై విశ్వాసంతో ఉన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి. వచ్చే ఎన్నికల విషయం పార్టీకి వదిలేసి నిశ్చింతగా ఉండండి. అభ్యర్థుల ఎన్నికల ఖర్చును పార్టీయే చూసుకుంటుంది. పార్టీ సభ్యత్వం బ్రహ్మాండంగా జరిగింది. సుమారు రూ.24-25కోట్లు వచ్చింది. గతంతో పోలిస్తే ఇది సుమారు 150 శాతం అదనం అని ముఖ్యమంత్రి చెప్పారు.

రాష్ట్రపతి ఎన్నికపై కేసీఆర్‌కే నిర్ణయం త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావుకే అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ, శాసనసభ పక్ష సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పార్టీకి, రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని సీఎంను కోరుతూ తీర్మానం చేశారు.

మండలస్థాయిలో కుటుంబ సమ్మేళనాలు.. మండల స్థాయిలో టీఆర్‌ఎస్ పార్టీ కుటుంబ సమ్మేళనాలను నిర్వహించాలని కేసీఆర్ పార్టీ నాయకులకు సూచించారు. ప్రతి మండలంలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలని అన్నారు. సంబంధిత ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు విధిగా హాజరై పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వ కార్యక్రమాలను కార్యకర్తలకు వివరించాలని, కార్యకర్తలతో కలిసి భోజనం చేయాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అన్ని మండలాల్లో సమ్మేళనాలు ఉండే విధంగా తేదీలను ఖరారు చేయనున్నామని తెలిపారు.

పదిరోజులకోసారి జిల్లా ముఖ్యల మీటింగ్… ఇకపై జిల్లా ముఖ్యనాయకులంతా ప్రతి పది రోజులకు ఒకసారి సమావేశం కావాలని కేసీఆర్ సూచించారు. ఈ సమావేశాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనాయకులు పాల్గొనాలని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంపీ లాడ్స్ నిధుల వినియోగంపై సమన్వయంతో పనిచేసుకోవాలని చెప్పారు.

సర్వే ఫలితాలు… టీఆర్‌ఎస్ నిర్వహించిన సర్వేలో రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ప్రజల్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమాలుగా సాదా బైనామా, గొర్రెల పెంపకం, రైతులకు ఎకరానికి రూ.8వేల సాయం, కేసీఆర్ కిట్స్ నిలిచాయి. రైతులకు ఎకరానికి రూ.8వేల సాయం పథకానికి భారీ స్పందన వచ్చింది. రాష్ట్రంలోని రైతులందరూ టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నామని సర్వేలో చెప్పారు.

ఏ ఎమ్మెల్యేకు ఎంత ఆదరణ..? ఇక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు, పార్టీకి ఎంత ఆదరణ ఉంది అనే విషయంలో విడిగా సర్వే చేశారు. దీని ప్రకారం వరంగల్ జిల్లా ములుగులో ఎమ్మెల్యేకు 57 శాతం, పార్టీకి 57 శాతం ప్రజాదరణ కనిపించింది. ఇదే విధంగా భూపాలపల్లిలో ఎమ్మెల్యేకు 71.6 శాతం, పార్టీకి 63.5 శాతం, పరకాలలో ఎమ్మెల్యేకు 65 శాతం, పార్టీకి 47.1 శాతం, మహబూబాబాద్ లో ఎమ్మెల్యేకు 54.8 శాతం, పార్టీకి 62.5 శాతం, వర్ధన్నపేటలో ఎమ్మెల్యేకు 70.3 శాతం, పార్టీకి 70.6 శాతం, వరంగల్ ఈస్ట్‌లో ఎమ్మెల్యేకు 68.1శాతం, పార్టీకి 56.8 శాతం, పాలకుర్తిలో ఎమ్మెల్యేకు 63 శాతం, పార్టీకి 59.4 శాతం, డోర్నకల్‌లో ఎమ్మెల్యేకు 60.6 శాతం, పార్టీకి 61.6 శాతం, స్టేషన్ ఘన్‌పూర్ లో ఎమ్మెల్యేకు 86 శాతం, పార్టీకి 63.9 శాతం, వరంగల్ వెస్ట్ లో ఎమ్మెల్యే కు 71.3 శాతం, పార్టీకి 71.1 శాతం, జనగామలో ఎమ్మెల్యేకు 51 శాతం, పార్టీకి 61.3 శాతం అదరణ ఉన్నట్లుగా సర్వేలో తెలింది. ఇక నర్సంపేటలో పార్టీకి 53 శాతం, నాగార్జున సాగర్‌లో 38 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని సర్వేలో తెలింది. ఈ నియోజకవర్గాల్లో గతానికంటే ఓట్ల శాతం పెరిగిందని తేలింది. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు 46 శాతం, పార్టీకి 54 శాతం, అలేరులో ఎమ్మెల్యేకు 54 శాతం, పార్టీకి 58 శాతం ఆదరణ ఉన్నట్లుగా తేలింది. భువనగిరి, మునుగోడు, దేవరకొండల్లో 80 శాతం ఆదరణ ఉందని సర్వేలో తెలింది.

పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులంతా భాగస్వామ్యం కావాలని సీఎం కేసీఆర్ కోరారు. గొల్ల, కుర్మలకు గొర్రెల పంపిణి, నాయీ బ్రాహ్మణులకు సెలూన్ల ఏర్పాటు, చెరువుల్లో చేపల పెంపకం, రజకు లకు వాషింగ్ మిషన్ల పంపిణి, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణి, రైతులకు సంవత్సరానికి ఎకరానికి రూ.8వేల నగదు, ఎంబీ సీల కోసం చేపడుతున్న కార్యక్రమాలు, రైతు రుణమాఫీ లాంటి కార్యక్రమాలన్నింటిని అమలు చేయడంలో నాయకులు ప్రముఖ పాత్ర వహించాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో వివక్ష కనపరుస్తున్నారనే భావన కలుగకుండా పారదర్శకంగా జరుపా లన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. 31 జిల్లాల్లో 30 మంది ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఎగురవేస్తారని… మరో జిల్లాలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జెండా ఎగురవేస్తారని తెలిపారు.

తెలంగాణ భవన్ సుందరీకరణను పరిశీలించిన కేసీఆర్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ భవన్‌లో ఇటీవల చేసిన సుందరీకరణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. తెలంగాణ భవన్‌కు కొత్త హంగులు సమకూర్చే పనులు కొద్దిరోజులుగా జరుగుతున్నాయి. భవన్ అవరణలో పచ్చదనం ఉట్టిపడేలా మొక్కల పెంపకం, గోడలపై అందమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రభుత్వ పథకాలు తెలిపేలా పెయింటింగ్స్ వేయించారు. తెలంగాణ భవన్‌లో ఆహ్లదకరమైన వాతావరణం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. కొత్తగా ఏర్పాటు చేసిన చిత్రపటాలను కేసీఆర్ తిలకించారు. భవన్‌లో చేపట్టిన పనులను హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎంకు వివరించారు. పనులపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

సీఎం భద్రతాసిబ్బందికి శిక్షణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భద్రతను పటిష్టం చేశారు. ప్రస్తుతం సెక్యూరిటీ విభాగంలో ఉన్నవారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి ఆయన భద్రతాబృందంలో చేర్చారు. ముఖ్యమంత్రికి భద్రతను కల్పించే ఇంటెలిజెన్స్ సెక్యూరిటి వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ) ఆధ్వర్యంలో 18 మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సీఎంకు భద్రత కల్పించే సమయంలో ధరించేందుకు వారికి బుల్లెట్‌ఫ్రూప్ జాకెట్‌లను సమకూర్చారు. ఆలివ్‌గ్రీన్ ప్రత్యేక యూనిఫాంలో వారు విధులు నిర్వర్తిస్తారు. వారంరోజుల క్రితమే వారు విధుల్లో చేరారు. శనివారం సీఎం కేసీఆర్ వెంట తెలంగాణ భవన్‌కు వచ్చిన భద్రతాసిబ్బందిని అందరు ఆసక్తిగా చూశారు.

అందరికీ బ్యాగులు పంపిణీ శనివారం జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరైన సభ్యులకు ట్రావెల్ బ్యాగులు పంపిణీ చేశారు. సమావేశం ముగిసిన తరువాత పేరుపేరునా ఒక్కొక్కరికి బ్యాగులను అందజేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బ్యాగులు పట్టుకొని సమావేశం నుంచి బయటకు వస్తుంటే పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆసక్తిగా చూశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.