Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

16 సీట్లే టార్గెట్

-దేశానికి తీరని నష్టంచేసిన కాంగ్రెస్, బీజేపీ
-టీఆర్‌ఎస్‌లో చేరిన వంటేరు ప్రతాప్‌రెడ్డి
-ఢిల్లీలో నిర్ణయాత్మక శక్తిగా టీఆర్‌ఎస్ ఎదగాలి..
-ఆ దిశగా పార్టీ శ్రేణులు కృషిచేయాలి
-బీజేపీ.. బిల్డప్ జాతీయ పార్టీగా మారింది..
-మోదీది పైన పటారం.. లోన లొటారం..
-కాంగ్రెస్, బీజేపీ కలిసినా 273 సీట్లు రావు
-ఏపీ అభివృద్ధికి టీఆర్‌ఎస్ వ్యతిరేకం కాదు
-చెప్పుకొనేందుకు ఏమీలేకే చంద్రబాబు కొత్త నాటకం
-చాతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్‌పై విమర్శలు
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

రాష్ట్రంలో 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు రాబోయే మూడునాలుగునెలలు పనిచేయాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. అప్పుడే ఢిల్లీలో నిర్ణయాత్మక శక్తిగా టీఆర్‌ఎస్ ఎదుగుతుందని చెప్పారు. దేశానికి కాంగ్రెస్, బీజేపీ తీరని నష్టంచేశాయని కేటీఆర్ విమర్శించారు. జాతీయస్థాయిలో కూడా నరేంద్రమోదీ పరిస్థితి బాగాలేదని, పైన పటారం లోన లొటారంలా ఉందని అన్నారు. దేశంమొత్తంలో యూపీఏ కూటమికి 100-110 సీట్లు, ఎన్డీయే కూటమికి 150-160 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదని, కాంగ్రెస్, బీజేపీ కలిస్తే కూడా మ్యాజిక్ ఫిగర్ 273 స్థానాలకు చేరుకునే పరిస్థితి లేదని కేటీఆర్ విశ్లేషించారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ ఒక్కటై, ఓట్ల చీలికను నివారించే దిశగా ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌కు దూరంగా ఉంటామని ఎస్పీ, బీఎస్పీ ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా బీజేపీ, కాంగ్రెస్‌ను ఒకేగాటన కడుతున్నామన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ కూడా అదే మాట చెప్తున్నారని, ప్రజాస్వామిక సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను బలోపేతంచేసే దిశగా సంవత్సరం కాలంగా కృషిచేస్తున్నారని చెప్పారు. ఎవరెన్ని అనుకున్నా 16 సీట్లలో టీఆర్‌ఎస్ గెలిచే విధంగా ముందుకుపోదామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీయేతర శక్తులను కలుపుకొంటూ జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయాన్ని నిర్మించి, దేశాన్ని, దేశ రాజకీయ వ్యవస్థను శాసించేలా కదులుదామని పిలుపునిచ్చారు. గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో ఎన్డీయే, యూపీఏ రెండింటి పరిస్థితి బాగోలేదని చెప్పారు. టీఆర్‌ఎస్ అంచనావేసిన విధంగానే రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్‌లో ఇది మరింత వేగవంతమై, ఢిల్లీలో టీఆర్‌ఎస్ నిర్ణయాత్మక, కీలక శక్తిగా ఉండే రోజు ఎంతో దూరం లేదన్నారు. ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని కలిశామని, ఆయన కూడా కాంగ్రెస్ కాదు.. బీజేపీ కాదు.. ఢిల్లీని శాసించే దిశగా ఉండాలే తప్ప యాచించవద్దు అన్నారని తెలిపారు. ఐక్యతతో రెండు రాష్ట్రాల ప్రజలు ఆశీర్వదిస్తే ఢిల్లీని శాసించే దిశగా పోదామని చెప్పారని పేర్కొన్నారు.

అక్కసుతోనే చంద్రబాబు విమర్శలు
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పోవాలని, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు రావాలని సమాఖ్య స్ఫూర్తితో సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు అక్కసుతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. గద్దల్లా వచ్చి ఆంధ్రప్రదేశ్‌ను కుళ్లబొడిచే ప్రయత్నం చేస్తున్నారని బాబు అంటున్నారన్న కేటీఆర్.. ఎవరు గద్ద? అని ప్రశ్నించారు. మోదీతో టీఆర్‌ఎస్‌కు ఏదో ఒప్పందం ఉంద ని చంద్రబాబు మాట్లాడుతున్నారని, అసలు నాలుగున్నరేండ్లు మోదీతో సంసారం చేసింది ఎవరని నిలదీశారు. గత ఐదేండ్లలో ఏం చేశామో చెప్పుకొనేందుకు ఏమీ లేకే చంద్రబాబు కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. తాము ఇటీవలి ఎన్నికల్లో బీజేపీకి 103 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యేలా చిత్తుచిత్తుగా ఓడించిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు తన అసమర్థత, చాతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రధానమంత్రిని ఒక బూచిగా, ఇంకొకరిని మరో బూచిగా చూపించి ఆంధ్ర ప్రజలను ఆయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. ఒకప్పుడు సోనియాగాంధీని అనరాని మాటలు అన్న చంద్రబాబు.. అన్నీ వదిలేసి 36 ఏండ్ల వైరమున్న కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రయత్నించారని గుర్తుచేశారు.

ఏపీ అభివృద్ధిని ఎన్నడూ వ్యతిరేకించలేదు
ప్రాంతాలుగా విడిపోయినా, ప్రజలుగా కలిసే ఉంటామని మొదటినుంచీ టీఆర్‌ఎస్ చెప్తున్నదని కేటీఆర్ గుర్తుచేశారు. అన్నదమ్ముల్లాగా విడిపోదాం.. అభివృద్ధిలో పోటీపడుదామని చెప్పామన్నారు. ఎక్కడా ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ మాట్లాడలేదని స్పష్టంచేశారు. ఉద్యమ సమయంలో సహజంగానే ఆవేశకావేశాల్లో ఒక మాట అన్నా.. తామే పది మాటలు పడ్డామని చెప్పారు. హైదరాబాద్‌లో, తెలంగాణలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్న సీమాంధ్ర మిత్రులందరు రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ నాయకత్వానికి జై కొట్టి, టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించారంటేనే టీఆర్‌ఎస్ పరిపాలన ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు
గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులని, నాలుగున్నర సంవత్సరాల్లో నియోజకవర్గ రూపురేఖలు మారాయని కేటీఆర్ చెప్పారు. నిధుల వరద పారుతున్నదన్నారు. రైతులు మూడు పంటలు పండించుకోవడానికి అద్భుతమైన మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే స్వప్నం త్వరలో సాకారం కాబోతున్నదన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో తిరుగులేని, ఎదురులేని శక్తిగా టీఆర్‌ఎస్ మారుతుందని, ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో చేసుకున్న విమర్శలు మరిచిపోయి పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికల సమయంలో ఎన్నో మాట్లాడుకుంటామన్న కేటీఆర్.. తెలంగాణలో కోపమొచ్చినా ఆగదు.. సంతోషం వచ్చినా ఆగదని చెప్పారు. రాష్ట్రాన్ని ఆశించినంత వేగంగా అభివృద్ధి చేసుకోవాలంటే, రెండు సంవత్సరాల్లో ప్రజలకు ఫలితాలు అందాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని శాసించాల్సిన అవసరముందన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్‌ను కలిసిన వంటేరు
టీఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రగతిభవన్‌కు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ప్రతాప్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో చేరినందుకు ప్రతాప్‌రెడ్డిని అభినందించిన కేసీఆర్.. బంగారు తెలంగాణ కోసం కలిసి పనిచేద్దామన్నారు. కేసీఆర్‌ను కలిసినవారిలో పలువురు గజ్వేల్ నియోజకవర్గ నాయకులున్నారు.

నేరుగా లబ్ధిదారులకు కేసీఆర్ పథకాలు
కేసీఆర్ అమలుచేసిన సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరాయని వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 88 స్థానాలు గెలుచుకోవడానికి సంక్షేమ పథకాలు ఎంతగానో దోహదం చేశాయని చెప్పారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టు రైతుల కోసం తాను పోరాడానని, లాఠీ దెబ్బలు తిన్నానని, జైలుకు వెళ్లానని, ప్రజలు మాత్రం ప్రాజెక్టులను నిర్మించాలనే సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారని చెప్పారు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు కూడా కేసీఆర్‌కే ఓట్లు వేశారని అన్నారు. ఇకపై కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పీ భూపతిరెడ్డి, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.